Month: సెప్టెంబర్ 2010

నిజం ఒప్పుకున్న అల్లు..


దండుకున్నోడికి దండుకున్నంత


ప్రరాపా పార్టీ పతనానికి మూలవిరాట్టుగా విమర్శలనెదుర్కొన్న అల్లు అరవింద్ నే మరల దిక్కులేక చిరంజీవి ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఈ సందర్భంగా అల్లు మీడియాతో మాటాడుతూ నేను పార్టీ గేట్ కీపర్ ని మాత్రమేనని చెప్పినట్లు వార్త. అంటే ఈయన గారిని దాటి ఎవరూ లోపలికి రాలేరు అనే కదా? ఇంత కాస్ట్లీ గేట్ కీపర్ ని దాటి రావాలంటే సామాన్యులకు చాలా కష్టమైన పనే. అది గత ఎన్నికలలో స్పష్టమైంది. ఏమాత్రం సామాన్య జనాలకు చేరువ కాలేకపోయిన ఈ పార్టీ తన గోతిని తానె తవ్వుకుందన్నది స్పష్టం. బంధుగణ సమూహంగా ఏర్పడి అదే బంధుగణ పీడనతో తెరమరుగైంది. పాపం చిరంజీవని అనగలమా?

వార్త ఆధారంః http://www.teluguone.com/news/2010/09/26/i-m-only-gate-keeper-in-prp-allu-aravind/

పుట్టినూరు సొంతూరు కాదా?


ఇటీవల తెరాస నేత కె.సి.ఆర్. తెలంగాణాలో పుట్టిన వాళ్ళంతా తెలంగాణా వాళ్ళే అన్నదానిపై రాద్ధాంతం జరుగుతోంది. అయినా మన జన్మస్థల ధృవీకరణ పత్రం మనం పుట్టిన వూరి నుంచే కదా తీసుకుంటాం. మరి దీనిపై ఇంత గోల దేనికో?

ముల్కీ నిబంధనలను దొంగ సర్టిఫికేట్లతో వాడుకుంటారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ సర్టిఫికేట్లు ఇచ్చేది మరి ఆ ప్రాంత అధికారులే కదా? వాళ్ళకు చిత్తశుధ్ధి లేదని అనుమానమా? దొంగ సర్టిఫికేట్ల సృష్టి ఎప్పుడూ వున్నదే. దానిని నిలువరించే కృషి వైపు ఆలోచించాలి కానీ ఆ ప్రాంతంలో పుట్టిన వాడికి అక్కడ నివాసముండే హక్కు లేదనడం ఫాసిజమే అవుతుంది కదా? అయినా దోచుకునే వాడికి కుల, మత, ప్రాంతీయ విభేదాలుంటాయా? ఆలోచించండి!
ఈ పాట విందాం..
నా జన్మభూమి

సోంపేట డాక్టర్ గారి ఆసుపత్రిలో బాంబు పేలుడు



సోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలలో చైతన్యాన్ని కలిగించి, పర్యావరణ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీల అండ లేకుండా ప్రజలను కూడగట్టి ఉద్యమాన్ని చేపట్టిన డా.వై.కృష్ణమూర్తిగారి ఆసుపత్రి రెండో అంతస్తులో నిన్న బాంబు పేలుడు సంభవించింది. ఎవరికీ ప్రాణాపాయం లేకపోయినా ఆ సమయంలో డాక్టరుగారు వైద్యం అందిస్తు వున్నారు. ఆ పేలుడువలన ఆసుపత్రి టాయిలెట్స్, ఓ గది దెబ్బతిన్నాయి. యిలా ప్రజలను చైతన్యం చేసే వారిపై దాడి చేయడానికి ఉపక్రమిస్తున్నారంటే వీళ్ళు ఎంతకైనా తెగించి ఫ్యాక్టరీ వాడి కొమ్ము కాస్తున్నారని అర్థమవుతోంది. ప్రజలంతా నేడు స్వచ్చందంగా బంద్ పాటించారు. స్థానిక కాంగ్రెస్ నాయకునిపై అనుమానముందని డాక్టరుగారు రిపోర్ట్ యిచ్చారు. డాక్టరు గారిని భయపెట్టడం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చొచ్చునన్న భ్రమలలో వున్నారు. సోంపేట కాల్పుల సంఘటన జరిగిన రోజు కూడా పోలీసులు, NCC గూండాలు ఆసుపత్రిపై దాడి చేసి, రోగులను కూడా కొట్టారు. ఐనా ప్రజల సహకారంతో డాక్టరుగారు ధైర్యంగా నిలబడ్డారు. ఆయన చేస్తున్న కృషికి, మొక్కవోని ధైర్యానికి మనమంతా చేయూతనివ్వాలని కోరుకుంటూ..

డాక్టర్ గారి సెల్ నెం.ః9440347548, H.No.08947 234588

http://ibnlive.in.com/generalnewsfeed/news/bandh-in-sompeta-to-protest-explosion-at-nursing-home/347214.html
http://expressbuzz.com/states/andhrapradesh/blast-rocks-sompeta-whistleblower%E2%80%99s-hospital/209307.html

రేపేమీ జరగకూడదు ప్రభూ…




మాకు ఎవరూ సుద్ధులు చెప్పొద్దు ప్రభూ..
ఎవరికి వారు మా వెన్నులో
పొడుస్తూనే వున్నారు ప్రభూ..
గాయాలు ఇంకా సలపరం పెడుతూనే వున్నాయి ప్రభూ..

అమ్మను కోల్పోయి
నాన్నను పోగొట్టుకొని
బిడ్డను అవిటివాణ్ణి చేసి
కన్న పేగులు తెంచిన
కత్తి మొనపై ఇంకా రక్తపు బొట్టు
కారుతూనే వుంది ప్రభూ..

ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దురా…
సమ్మతమే మన మతంరా..

కాషాయం పచ్చదనం మధ్యనున్న
తెలుపును మర్చిపోయారురా?
ఆ తెలుపు ధగ ధగలలో
మన కీర్తి పతాకను
ఎత్తి పడదాంరా..

(అయోధ్యపై వెలువడనున్న తీర్పు నేపథ్యంలో సామాన్యులు బలిగాకూడదని మనమంతా ముందుగా భారతీయులమనే గుర్తింపుతో అంతా కలసి నిలబడదామనే తీవ్ర ఆకాంక్షతో..)

కరప్షన్ వెల్త్ గేమ్స్ (CWG)..


corruption tiger


కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా వుందో రోజూ చూస్తున్న వార్తలు ద్వారా తెలుస్తూనే వున్నాయి. దీని వలన మన దేశం పరువు పోతున్నదన్న బాధ ఎక్కువగా వుంది. అసలు క్రీడల మంత్రే దీనిని ముందునుండి వ్యతిరేకిస్తున్నాడు. గేమ్స్ జరిగిన రోజుల్లో భారత్ లోనే వుండనన్నాడు. నిన్నటికి నిన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఇప్పటికె 17.2 మేర బిడ్ రేట్ ఎక్కువ చేయబడిందని ఆయన పార్లమెంట్లోనే ప్రకటించారు. అవినీతిలో కూరుకుపోయిందని తీవ్రంగా విమర్శలనెదుర్కొంటున్న ఈ క్రీడల నిర్వహణ మన అవినీతి పతాకను ఆకాశన్నంటినట్లుగా ఎగరవేస్తున్న ప్రయత్నాలలో అంతా తలమునకలై వున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు, నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న సురేష్ కల్మాడీ గార్లు వట్టిదే ఇదంతా అంటూ తమ వాదనతో నెట్టుకు రావడానికి చూస్తున్నా నిన్నటి సంఘటనతో అది తేట తెల్లమైంది. మన బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా కూడా ఏర్పాట్లన్ని అధ్వాన్నంగా వున్నాయని ప్రకటించింది. అయినా పాలక వర్గానికి చీమకుట్టిన్ట్లయినా లేకపోవడం విచారించదగ్గ విషయం. ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ క్రీడల నిర్వహణ చేపట్టి ఏం సాధిస్తారు? తడి ఆరని పునాదులతో ఎవరి ప్రాణాలు తీద్దామని? ఏడేళ్ళుగా పూర్తిగానివి ఇప్పటికిప్పుడు చేస్తే కూలిపోవా?

అయినా వలస పాలనకు దూరమై షష్ఠి పూర్తయినా ఇంకా బ్రిటిష్ రాజరిక అంశగా మిగిలిన ఈ కామన్ వెల్త్ సభ్యత్వం ద్వారా సాధించేదేమిటి? దాని నుండి తప్పుకుంటే వచ్చే నష్టమేమిటి?

బందెల దొడ్లుగా మారుతున్న బడులు..


ఇటీవల విద్యార్థులపై శారీరకంగా, మానసికంగా పాఠశాలల్లో జరుగుతున్న దాడులు చూస్తుంటే మనం పిల్లలను బడులకు పంపుతున్నామా? బందెల దొడ్లకు తోలుతున్నామా అనిపిస్తోంది. చిన్న చిన్న కారణాలకు కూడా రక్తాలు కారేట్లు కొడుతున్న టీచర్లు, ఆడపిల్లలపై టీచర్ల దాడులు చదువుతుంటే, చూస్తుంటే బాల్యానికి రక్షణలేకుండా పోతూ, వారి భవిష్యత్ పై ఆందోళన కలుగుతోంది. ఇవి ప్రభుత్వ పాఠశాలలో కంటే ప్రైవేటు పాఠశాలల్లోనే ఎక్కువగా జరుగుతున్న వైనం కూడా కనిపిస్తోంది. మారిన పరిస్థితులలో తప్పనిసరై ఏదో ఆశతో ఈ బడులలో చచ్చీ చెడీ చేర్పిస్తే ఇలాంటి దారుణాల బారిన పడాల్సి వస్తోంది. టీచర్లుగా చెలామణీ అవుతున్న వారు అసలు ఎంతమంది ప్రాధమిక విద్యార్హత కలిగి వున్నారో, వారిలో ఎంతమంది సరైన శిక్షణ పొంది వున్నారో అన్నది పరిశీలించకుండా నడుపబడుతున్న స్కూళ్ళ కారణంగా ఇదంతా జరుగుతోంది. వీధికో కాన్వెంట్ వెలసిన ఈ రోజులలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్త పడాల్సిన సమయం. బాల్యాన్ని వారినుంచి దూరం చేయడంలో అంతా నేరస్తులమే. కాదా?

వి.హెచ్.గారూ అద్దంలో చూసుకున్నారా-2?


జనపథ్ భజనపరుల సంఘంలో ముందుండి దొడ్డిదారిన పదవులనుభవిస్తున్న ఈయనగారికి ఎందుకో జగన్ పై ఇంత అక్కసు. వై.ఎస్.బతికున్నంతవరకు తోక కరచుకొని పడుకున్న వీరు మాటి మాటికీ ఏదో ఒక వ్యాఖ్యానంతో టీ.వీ.లముందు వాలిపోయి సోనియా మేడం చూస్తున్నారని బొంగురు గొంతుతో అరుస్తుంటారు. మీ జీవితం మొత్తం ప్రొఫైల్ లో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైనది ఒకే ఒక్కసారి. సామాజిక సేవ నిల్. పోనీ ప్రస్తుతం మీకున్న కమిటీ పదవుల ద్వారానైనా రాష్ట్రానికి చేస్తున్నది నిల్. పోనీ రాజ్యసభలో తన మేథావితనంతో ఊదరగొట్టిన ఉపన్యాసం లేకపోయే. తెలంగాణా గురించి ఏమైనా చేస్తున్నారా అంటే అదీ లేదు. రాజీవ్ బతికున్న కాలంలో మొదలైన భజన కొనసాగిస్తూ ఢిల్లీ గల్లీలలో సేవ చేసుకొని తరించక తమరికి తాజా రాజకీయాలెందుకు సార్. తమరి మొఖం మరో మారు అద్దంలో చూసుకోరాదా? వార్తలేమీ లేకపోయేసరికి ఈ మీడియా వాళ్ళకు తమరే దిక్కులా వుంది. తమ ముందు గొట్టాలతో ఉరికింది చాలక బ్రేకింగ్ న్యూస్ లు మళ్ళీ.

Detailed Profile: Shri V. Hanumantha Rao
http://india.gov.in/govt/rajyasabhampbiodata.php?mpcode=1004

సల్మాన్ ఖాన్ అన్నదాంట్లో తప్పేముంది..



ముంబయి దాడులపై సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ప్రముఖులున్న కేంద్రాలపై దాడులు జరగడం మూలంగానే దానికి అంత ప్రాముఖ్యమిచ్చారని అన్నదాంట్లో తప్పేముంది. సామాన్యులుపై జరిగిన దాడులపై గానీ, ప్రమాదాలను గానీ, అత్యాచారాలను గానీ, హత్యలను గానీ పాలక వర్గం సరిగా స్పందించి చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అదికూడా రాజకీయపరమైన లబ్ధి చేకూర్చేది, ఓట్లను కూడబెట్టేదైతే తప్ప స్పందించేది అతి తక్కువ సార్లు మాత్రమే. ఈ విషయంలో ఆయనను తప్పుపట్టడం తప్పు. ఇంక పాకిస్తాన్ హస్తంపై వ్యాఖ్య దానిపై పాలక వర్గమే గట్టిగా నిలదీయలేకపోతోంది. చక్రవర్తి అమెరికా వారు అక్కడో మాట ఇక్కడికొచ్చాక ఇక్కడో మాట అన్నా ఖండించలేని దౌర్భాగ్యం మనది.

గడ్డికుప్ప దగ్గర కుక్కను కట్టిన చందాన..


అన్నమో రామచంద్రా..


గడ్డికుప్ప దగ్గర కుక్కను కడితే ఆవును మేయానివ్వదు, తాను తినదన్న చందంగా వుంది భారత ఆహార నిల్వ అధికారుల తీరు. సుప్రీంకోర్టు వారు గోదాముల్లో నిల్వ వున్న 25 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని, ఒక్క గింజ కూడా వృధా కాకూడదని ఆదేశిస్తూ ప్రభుత్వ నిర్వాకాన్ని తూర్పారబడితే అధికారులు మాత్రం వాటికి ధరను నిర్ణయించి పంపిణీ చేస్తామని పట్టుబడుతున్నారు. ఏదో విధంగా ప్రజలకు నామ మాత్రపు ధరకైనా విక్రయించే చర్యలయినా చేపడుతున్నారా అంటే అదీ లేదు. ఉచితంగా ఇవ్వడానికి వీరికున్న అభ్యంతరమేమిటో న్యాయస్థానం ముందే పెడితే ఆ సుత్తితో ఏదో ఒకటిచ్చేవారు కదా? దేశంలో ప్రతి యేడాది లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ముక్కిపోతూ పనికి రాకుండా పారబోస్తున్నారు. ఆకలి చావులతో అలమటించే జనం మాత్రం పెరిగిపోతున్నారు. వెనకబడ్డ ప్రాంతాలలోనైనా వీటిని పంపిణీ చేస్తే వలసలను నివారించొచ్చు. ప్రతిరోజూ లక్షలాదిమంది కూలీలు రైళ్ళలో ఉత్తరాదినుండి, ఒరిస్సా, ఉత్తరాంధ్రల నుండి చెన్నై, బెంగళూరు, హైదరాబాదు వంటి నగరాలకు తరలివెళ్తున్నారు. వీరు చూపే జి.డి.పి.రేఖా చిత్రాలు వాళ్ళ నుదుటన కనిపించవు. కనుక ఇకనైనా ఉన్నత న్యాయస్థానం మాట అమలు చేసి నలుగురికి తిండిపెట్టాలని డిమాండ్ చేద్దాం…