ఉసురు

నెత్తుటి పసి మొగ్గలను చిదిమిన పాపులం మనమే కదా?


నెత్తుటి పసి మొగ్గలను చిదిమిన పాపులం మనమే కదా?

కాన్వెంటు చదువులకాశపడి ఇంత మందిని చేజేతులా చంపుకుంటున్నాం.
రైలు వస్తుందని అరిచి ఏడ్చినా బస్సునాపని డ్రైవర్ ది తప్పా? కాపలా లేని లెవెల్ క్రాసింగులను పట్టించుకోని ప్రభుత్వానిది తప్పా? ఊళ్ళో వున్న సర్కారీ బడులలో కనీసం ప్రాధమిక విద్య వరకైనా చదివించే ఓపిక లేని తల్లిదండ్రులదా? వారి మీద పడి శోకాలు తీసి మూర్చిల్లితే వారు మరల చిగురిస్తారా? ఎక్స్ గ్రేషియా ఎన్ని లక్షలిచ్చినా వారి ఊపిరి మరల పోసుకుంటుందా? ఆ ఇంట చిదిమిన దీపం మరల వెలుగుతుందా? అంతెత్తు ఎగిరిపడి కిలోమీటరుకు పైగా రైలు మహమ్మారి ఈడ్చుకు పోతుంటే వారి ఊపిరి తిత్తులు పగిలి గుండె చిద్రమై నెత్తుటి ముద్దలుగా మారిన ఈ భయ విహ్వల దృశ్యం మన మనసులనుండి చెరిగిపోతుందా? ప్రమాదం జరిగిన ప్రతిసారీ ఇలా జరిగి వుండాల్సింది కాదు, అలా చేసి వుండాల్సింది కాదు అనే ఈ నాయకులను అధికారులను ఎవరమూ నిలదీయలేమా? ఇంత ఘోర దృశ్యాన్ని మరల మరల మనం చూడవలసినదేనా? బతికున్న శవాలుగా ఈడ్వబడాల్సిందేనా?

పిల్లలూ మా తప్పులకు మా నోట్లో ఉచ్చబోయండి…ఏరగండిరా.. అయినా ఏం లాభం….

తొడ చరిచిన విజయనగరం..


clock tower-viziznagaram 1
గత ఆరు రోజులుగా విజయనగరం కడుపులో దాచుకున్న బిడ్డనుకున్న వాడే కాలితో తంతే తొడ చరిచి నిలబడింది ఈ రోజు. కళ్ళ ముందు నీవు ఆక్రమించుకుంటూ పోతున్న తన భాగాలన్నీ పోయినా బాధపడని విజయనగరం నువ్వు పాలు తాగే రొమ్మునే గుద్దుతా వుంటే చూస్తూ వూరుకోలేక మంటలతో సమాధానం చెప్పింది. కావిడితో సారా అమ్ముకొని పెరిగిన బాబు వారసుడు ఈ రోజు ఇంతింతై అంతై రక్కసిలా మీదపడి పీక నులుముతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది. పసివాడని పిల్లలపై కంట్లో కారం చల్లి చావు దెబ్బలు కొట్టిన వాడి పునాదులు పెకిలించే గునపంగా మారింది.

ఇదంతా ఇక్కడ పోలీసు బాసుగా పని చేసి ప్రమోషనిచ్చి పంపి అదుపు చేయమని అంటే వారికి మేమంతా దొంగలుగా, సంఘ విద్రోహ శక్తులుగా కనబడటంలో ఆశ్చర్యం లేదు. గాలిని బంధించి ఊపిరాడకుండా శక్తిని హరించేద్దామని విఱవీగే వాడికి తొడ చరిచి ఎదురొడ్డి సవాల్ విసురుతోంది మా గున్నమ్మ వారసురాలు.

పాలపేకెట్టు 50 రూపాయలు గుడ్డు 10 రూపాయలుకు కొనుక్కునే స్థితికి నెట్టి ఆకలితో మండించి అదుపు చేద్దామని చూస్తున్నాడు.

బావ్ నువ్విప్పుడు మా తూరుపు కాపోడివి కాదురా బావ్. మాకెప్పుడో తెలిసిపోనాది. నీ మూతివీడని ఇసపు నవ్వులో డబ్బు దర్పంతో కాలెగరేసే దొరతనంతో నువ్వో ఇసప్పురుగువని. నువ్వింక నీ నోట్ల కట్టలలో కాలి పోవాలి తప్ప నీకు మా కంట తడి దూరమైపోనాది.

చట్టాలు భయపెడతాయా??


నిన్న మరల ఢిల్లీలో ఐదేళ్ళ బాలికపై దారుణమైన అత్యాచారం జరిగింది.

ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కౌన్సిలింగ్ చేసి తిరిగి వారిని బెదిరించబోయారంట.

మన ప్రధాని గారు బాధ పడ్డారంట.

ఇదీ నిన్నటి వార్త అయిపోయింది అప్పుడే.

నిర్భయ చట్టం తెచ్చాం అని ఆర్భాటంగా ప్రకటనలే తప్ప అందులోనూ తూట్లు పొడిచి తమకనుకూలంగా మార్చుకోగల రాజకీయులు ధనమదాంధులు వున్నారు.

వీళ్ళకి తక్షణ పరిష్కారాలే తప్ప విచారణలు, న్యాయస్థానాలు చట్టాలు భయపెడతాయా??

సంక్షేమం క్షామం అవుతున్నది…


రాష్ట్రంలో గత కొన్నేళ్ళూగా వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అతి దయనీయంగా మారుతున్నది. హాస్టల్ విద్యార్థులకు రోజుకు 17/- లు మాత్రమే భోజనానికి ఇస్తున్నారు. దీనిలో సంక్షేమాధికారుల వాటాలు పోను వారికి కనిష్టంగా పది రూపాయలతోనే పెడుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి కనిష్ట ప్రమాణాలకు దిగజారుతూ ఎంతో మంది విద్యార్థులు మరణాలకు గురవుతున్నారు ప్రతి యేడూ.

గిరిజన ఆశ్రమ విద్యార్థులది మరీ దారుణమైన పరిస్థితి. వీరికి ఎక్కువగా మలేరియా వ్యాధి సోకి అనారోగ్యానికి గురైతే వీరిని ఆసుపత్రులలో చేర్చక తల్లిదండ్రులతో ఇంటికి పంపించి చేతులు దులుపుకుంటారు. దీంతో వీరు కనీస రహదారి సదుపాయం లేని గ్రామాలకు వలసలకు చేరుకొని అక్కడ చావుతో పోరాడి ఓడిపోతున్నారు. ఇలా ప్రతి ఏటా వందలాది విద్యార్థులు మరణిస్తున్నారు. దీనిపై సర్వేలు చేసి ఏవో ప్రకటనలు ఇచ్చి ఆచరణ శూన్యమైన పథకాలతో చేతులు విదిలిస్తున్నారు. వీరికి ప్రాధమికి వైద్యం అందుబాటులో వుండదు. మలేరియా డ్రగ్స్ వాడితే పోషక విలువలువున్న అహారం అవసరం. కానీ అది వీళ్ళకు అందుబాటులో వుండ ఈ మందుల ప్రబావంతో జాండిస్ ఇతర సైడ్ ఎఫెక్ట్సుతో చావుకు లోనవుతున్నారు. ఇటీవల మా ITDA పరిధిలోని గ్రామాల పర్యటన సందర్భంగ నేను గమనించింది ఇది.

ఇంకో ముఖ్య విషయం రోజుకు ఖైదీకి భోజన ఖర్చు 50/-లు, ప్రభుత్వాసుపత్రులలో రోగికి 40/-లు (ఇందులో కమీషన్లు పోనూ రోగికి 25/-లు కూడా అందడంలేదన్నది వేరే విషయం) కానీ విద్యార్థికి రోజుకు 17/-లు మాత్రమే మంజూరు చేస్తున్నారు. ఇందులో సంక్షేమాధికారుల వాటా అధికం. ఇలా సరైన పర్యవేక్షణ లేక హాస్టళ్ళలో అతి దారుణ పరిస్థితులలో మగ్గుతూ SC, ST, BC విద్యార్థులు మరో గత్యంతరం లేక చదువులు కొనసాగిస్తున్నారు. కోట్లాది రూపాయలు విద్యకు ఖర్చు చేస్తున్నామని ప్రకటనలకే పరిమితమవుతున్నది ప్రభుత్వం. కింది స్థాయికి వచ్చేసరికి రూపాయికి తక్కువవుతున్న వైనం అందరికీ ఎరుకలో వున్నదే. సంక్షేమం నుండి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ప్రభుత్వం కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ పేదలకు విద్యను అందని ద్రాక్షను చేస్తున్నది. పేద విద్యార్థులు హాస్టళ్ళలో కూడా తమ దారిద్ర్యాన్నే అనుభవిస్తూ అవమానాలు పడుతూ విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో హైస్కూలు విద్యకు వచ్చేవారు సగానికి పైగా తరిగిపోతున్నారు. ఆ తరువాత కొనసాగినా అతి తక్కువ మందే చివరి వరకు ఉంటున్నారు. కూలి కొడుకు మరల కూలిగానే మిగిలిపోతున్నాడు…

కొండ ఫలం


కొండ ఫలం
దళారి ఫలహారం….

వారి స్వచ్చతను
నిలువెల్లా గాయపరుస్తూ
సాగే వ్యాపారం…

ఇది ఏళ్ళుగా సాగుతున్న
శ్రమ దోపిడీవలయం…

షర్మిళకు మద్ధతు తెలుపుదాం


ఈశాన్య రాష్ట్రాలలో అమలు కాబడుతున్న ప్రత్యేక సైనికాధికార చట్టానికి వ్యతిరేకంగా గత పదకొండేళ్ళుగా పోరాడుతున్న ఇరోం షర్మిళకు మద్దతు తెలుపుదాం.. కృత్రిమంగా ఆహారాన్ని సరఫరా చేస్తూ నిర్బంధాన్ని అమలు చేస్తున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా మేధావులు ప్రజాస్వామిక వాదులు విరివిగా కదలి రావాలసిన అవసరముంది. అన్నా హజారే దీక్షకు మద్ధతుగా కదిలిన జనం, రాజకీయ పార్టీలు గత పదకొండేళ్ళూగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న షర్మిళ పట్ల అనాగరికంగా కిమ్మనకుండా వుండటానికి ఓటు బ్యాంకు రాజకీయాలు తో పాటు ఒకే తానులోని గుడ్డలైన రాజకీయ వర్గాలు ఈ విషయంలో మౌనం దాల్చడం నేరం.. కౄరమైన చట్టాలను ప్రయోగిస్తూ పౌరుల హక్కులను హరించి వేస్తున్న పాలక వర్గాలన్నీ ఒకటిగానే కనిపిస్తున్నాయి. దీనికి మీడియాకూడా వంత పాడుతున్నాయి. సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న షర్మిళ పోరాటానికి మద్ధతు తెలుపుదాం.. AFSPA  ను తక్షణమే రద్దు చేయాలని గొంతు కలుపుదాం..

మండుతున్న గుండె


బీడైన నేల

ఆరిన కంటతడి

చూపుకందని మేఘం

మొలకరాని విత్తు

మాటపెగలని గొంతు

మండుతున్న గుండె

ఈ మంట కొద్ది సేపేలేరా???


మళ్ళీ పెరిగిన పెట్రోలు ధర
ఓ రెండు దినాలు ధర్నాల హడావిడి
మేమైతే ఇలా చేసే వాళ్ళం కాదని అలా ఊడబొడిచేసే వాళ్ళమని బండి లాగేవాడొకడు

రంగు రంగుల జెండాల బాండ్ మేలాం గోలలు
దిష్టిబొమ్మల దగ్ధాలతో తృప్తి పడిపోయి
చల్లగా బంకుకు చేరి మూసుకొని పోసుకుపోతాం….

ఇది తెలిసిన గెడ్డం వెనకాల ఓ పిల్లి మీసపు నవ్వు వెక్కిరిస్తూనే వుంటుంది….

పోగాలం దగ్గరబడిందిరా…(పెట్రో ధరలకు నిరసనగా)


ఈళ్ళ సేతులల్ల బెమ్మెజెముడు మొలిసియ్య
ఈళ్ళ బుఱలో పాములు పెరుగుతున్నాయా
జెనాలు ఎలా బతుకీడుస్తున్నారో
ఎలా గోసబెడుతున్నారో
ఏ ఒక్కడికైనా యాదిలో వుందా..
ఈళ్ళ జీతాల్ గీతాల్ పెంచుకు పోతూ
పేదోడి పొట్ట గొట్ట సూస్తున్నారు కదయ్యా…

ఎక్కడా ఎండు కఱ పుల్లైనా దొరక్క
ఎలుగు గ్రూపుల్లో జేరి గొనుక్కున్న
గాస్ పొయ్యి యింక మా నెత్తిన బెట్టుకూరేగాలా?
ఆ ముద్ద వొండుకు తిండానికి కూడా
ఈలు లేకుండా యింత బరువు నెత్తితే
మీ నెత్తిన ఈ బండతో మోదాలిరా…

మీరిచ్చే మూడు గంటల పాటి కరెంటు కూడా ఎలగక
బుడ్డి దీపం ఎలిగించుకుందామన్నా
నువ్విచ్చే రేషన్ దుకాణంలోని
ఆ అర లీటరు కిరోసిన్ నీ కాష్టంలో పోద్దామంతే
మరల పెంచి జచ్చినావు కదరా?

ఈ జేత్తో కూల్డబ్బులిచ్చి
ఆ జేత్తో కొల్లగొట్టేస్తే మేమింక
ఏం దిని బతకాల?
ఏం దిని జావాల?

అటు యిత్తనాలు దొరక్క
ఎరువులు దొరక్క నారు పొయ్యనేక
ఒకైపు ఏడుస్తుంటే
ఈ అర్థరాత్రి ఈ సావు కబురొకటి…
మీ యింట్లో పీనుగెల్ల… 

మీకు పోగాలం దగ్గర పడుతోందిరా..

బీహార్లో ప్రతిఘటన సీను




నిన్న బీహార్లో కామంతో, అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన బీజెపి ఎమ్మెల్యేని ఓ ఉపాధ్యాయురాలు ఒక్క వేటుతో పడగొట్టి కసిదీరా పొడిచి పారేసిందన్న వార్త చదివిన దగ్గర్నుంచి అంతా చదివే వుంటారు కదా అని రాయలేదు. కానీ ఆమె శక్తిగా తిరగబడిన వైనం ఇక్కడ రాయకుండా ఉండలేకపోయేట్టు చేసింది. కొన్ని సంలుగా ఆమె అనుభవిస్తున్న వేదన, నరకంనకు నిన్నటితో ముగింపునిచ్చింది. ప్రతిఘటన సినిమాలోని చంద్రమోహన్ లా వాళ్ళాయన పోలీసు రిపోర్ట్ ను వెనక్కుతీసుకోవడం వలన ఏమీ చేయలేక పోయామన్న సిగ్గుమాలిన ప్రకటనిచ్చిన ఆ డీజీపీ గాడ్ని కూడా వేసేసి వుండాల్సిందన్నంత కోపమొస్తోంది. పనికి మాలిన వాళ్ళుగా తయారయ్యి, అధికారంలోని వారి చంక నాకే ఇలాంటి వాళ్ళ వలన ఆ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఆమెపై తిరిగి నేరారోపణ చేయడం, ఇదంతా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని ప్రకటించడం, ఉపముఖ్యమంత్రిగాడు కుట్ర అనడం ఈ దేశ రాజకీయ వ్యవస్థ పతనానికి గుర్తు.

ఇంతలో మన విజయవాడ డి.సి.పి.గారు పోకిరీలో సి.ఐ.లా అమ్మాయిలకు మెసేజ్ లు పెట్టడం, ఫోన్లు చేసే న్యూస్ వచ్చింది. వాడు సిగ్గులేకుండా ఫోన్ ఇన్లో వాగుతుంటే ఈ వెధవలు అన్నీ వదిలేసి చేరారా అనిపిస్తోంది.