చిగురాశ

మా నేలమ్మ నేడు నిండు చూలాలమ్మ..


పొట్టతో వున్న వరిచేను


సక్కగా కురిసిన వానలతో
పులకరించిన
మా నేలమ్మ నేడు
నిండు చూలాలమ్మ…

పండిన ఈ కడుపు పంట
ఏ వంకర దిష్టీ తగలక
సక్కగా మా గాదె చేరాలని..

ఆ దిక్పాలకులను
కరుణ చూపాలని
బిక్కు బిక్కు మంటు
వేడుకుంటున్నాము…

వీళ్ళు కోచ్ లా? కీచకులా?


ఈ మద్య వెలుగులోకి వస్తున్న వరుస క్రీడల కోచ్ ల కీచక లీలలు ఓ కొద్ది రోజుల న్యూస్ గా మిగిలి తరువాత కనుమరుగై పోవడంతో వారి ఆటలు అలానే సాగుతున్నాయి. మొన్నటికి మొన్న మన రాష్ట్ర క్రికెట్ బోర్డులో కీచకుడి గురించి ఆ అమ్మాయిలు సిగ్గు విడిచి చెప్పినా ఫలితం శూన్యం. వాడు వేసే ఎంగిలి బొమికలకు ఆశపడి ఆ కేసును నీరుగార్చారు. ఇప్పుడు హాకీ వంతు. అలానే మనకున్న ఏకైక ఒలింపిక్ పతక విజేతగా కీర్తించబడ్డ మల్లీశ్వరి నోటి వెంట కూడా ఇలాంటి కీచకుడి పేరు బయటకు వచ్చింది.

వంద కోట్ల జనాభా గల దేశంలో ఒలింపిక్ స్థాయి క్రీడాకారులు వేళ్ళ మీద లెక్కపెట్టగలిగినంత మందే వుండటం, వాళ్ళు కూడా తమ స్వయంకృషితోనో, లేక తమ స్థాన బలిమితోనో వెలుగులోకి రావడం జరిగిందే తప్ప మన కున్న క్రీడా సంస్థలు వెలుగులోకి తెచ్చిన వారెవరూ లేరు. ఈ సంస్థల వెనక సాలెగూడులో దాక్కున్న రాజకీయ దళారుల విషపు కాటుకు బలవుతున్న క్రీడాకారిణులు ఎంతమంది వున్నారో? బయట పెట్టలేక, అదే కెరీర్ గా ఎంచుకొని జీవతంలో స్థిరపడజూడడంతోనో ఇలాంటి దారుణాలకు బలవుతున్న వారు ఎందరో? ఇలాంటి నీచులను ఉరితీసిన నాడే మన క్రీడాకారులకు భవిత, అంతర్జాతీయ వేదికలపై మన కీర్తి పతాక రెపరెపలాడుతుంది. నిజమా? కాదా?

జయహో భారత్..