దాగుడు మూతలు

ఖాళీలను పూరింపుము..


ఇంతకీ ఈ ఆరాట పోరాటమంతా హైదరాబాద్ కే పరిమితమవుతున్నట్టుంది..

రోజుకో లక్ష గళార్చన పేరుతో సాగుతున్న అరణ్య రోదనంతా ఈ ఒక్క తీరని కోరిక కోసమేనా?

క్లారిటీ లేని ఉద్యమ ప్రస్థానం జన దైనందిన జీవితాన్ని సంక్షుభితం చేస్తోంది..

రోజుకో వాయిదాతో నెట్టుకొస్తున్న హైకోర్టు వారినీ మేనేజ్ చేసే శక్తులకు జోహార్లు..

ఈ సూపర్ హీరో చివరి మజిలీ ఏ పార్టీలోకో సూచాయగా తెరముందుకు వస్తోంది..

తిరగడం మరచిన బస్సు టైర్లు చివరికి కాలే కడుపుల రబ్బరు వాసనతో కుదేలవుతున్నాయి..

సర్కారీ బళ్ళకు దూరమైన పలక బలపం మాస్టారి గారి కొడుకు కార్పొరేట్ కాన్సెప్ట్ స్కూళ్ళలో భద్రం..

రాజకీయ తోలుబొమ్మలాటల తైతక్కలతో విమానయాన సర్వీసులకు ఢిల్లీ హోటళ్ళకు గిరాకీ బాగుంది..

సిగ్గులేని ముఖాలను గొట్టాలముందు ఊదరగొట్టే రోజు వారీ పాచి డైలాగులను వినలేక మా టీవీ బంద్..

కాళ్ళు బార్లా చాపుకొని ఈజీ చైర్లో వాలి కళ్ళపై తడి గుడ్డ వేసుకొని రిలాక్సవ్వు తమ్మూ..

మరికాసేపట్లో రక్షణ మంత్రి గారూ గృహమంత్రి గారూ ఆసుపత్రినుంచి రిలీజయి వస్తారు…

జయహో………………… ఖాళీలను పూరింపుము….

రాజు చచ్చిన ఆర్నెల్లకు..


రాజు చచ్చిన ఆర్నెళ్ళకు రాణి ఏడ్చిందన్న సామెతలా వుంది AICC తీసుకున్న నిర్ణయం. జగన్ ను అడ్డుకునేందుకు వేసిన అస్త్రం తప్ప ఈ లక్షరూపాయల పరిహారం ఎందుకు ప్రకటించారో ఇప్పుడు వివరంగా చెపితే బాగుంటుంది. ఇది పార్టీ నిధి నుండి విడుదల చేస్తున్నారా లేక ప్రజల పన్నుల సొమ్మా ముందుగా తేట తెల్లం చేయాలి. ఇది పార్టీ సొమ్మయిన ప్రజలను పిండి వసూలు చేసినదే కదా? మొన్నటి వరకు ఆ చావులన్నీ ఉత్తివే అని అన్న వృద్ధ జంబూకాలు ఇప్పుడు మాట మార్చడం ప్రజల జ్నాపక శక్తిపై వారికున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.

అసలు ఓ నాయకుడు చనిపోతే అంతమంది సామాన్య జనం చనిపోవడం ఈ విశ్వంలోనే ఎక్కడా లేదు. ఇలాంటి జీర్ణించుకోలేని సంఘటనలు జరిగినప్పుడు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం మనకు తమిళ తంబీల నుంచి వచ్చిన ఓ దురాచారం. తరువాత్తరువాత ఇది ఓ ఆయుధంగా మారింది. వేలకోట్ల రూపాయలు సంపాదించుకున్న వారెవరికీ ఆగిపోని గుండె రెండు వందల పించను అందుకున్న ముసలి వారిది కావడం విషాదం. ప్రతి ఇంట్లో ఆ రెండురోజులు ఓ విషాదకర వాతావరణాన్ని నింపి ఇలాంటి సంఘటనలకు ప్రేరేపించిన చానళ్ళను ఏమనాలో తెలీడంలేదు. ఆ తరువాత తమ తమ రాజకీయ ఊసరవెళ్ళితనాన్ని బయటపెట్టుకొని ఎవడి గోడు వాడు వినిపించడం మొదలు పెట్టారు.

వారసత్వంగా అధికారం రాకపోతుందా అని ఆశించి భంగపడ్డ యువనేత తన ఆఖరి అస్త్రంగా ఓదార్పు యాత్ర చేపట్టడంతో పెరుగుతున్న ఆయన ఇమేజిని దెబ్బకొట్టే చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ నాయకత్వం ఈ పేకేజీ ప్రకటించింది. తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మరణించిన వారిపట్ల ఇలాంటి సానుభూతి ఏనాడూ చూపిన దాఖలాలు లేవు. కొన్ని వేలమంది రైతులు మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర విదర్భ ప్రాంతం, యూ.పి.లో, పశ్చిమ బెంగాల్ మొ.న రాష్ట్రాలలో ఆత్మ హత్యలు చేసుకుంటే వారిపట్ల కూడా పార్టీపరంగా ఇటువంటి పేకేజీ ఇవ్వలేదు. ప్రభుత్వ పరంగా వారిని పూర్తిగా ఆదుకున్నదీ లేదు. అలాగే తెలంగాణా కోసం ఆత్మాహుతి చేసుకున్న యువకుల పట్ల కనీసం ఓ సానుభూతి వాక్య తీర్మాణం కూడా చేయలేదు.

మొన్నటికి మొన్న చంద్రబాబు బాబ్లీ అరెస్టు జరిగినప్పుడు రోజూ ఓ పదిమంది చనిపోయిన లిస్టు ఆంధ్రజ్యోతిలో వచ్చేది. కానీ వాళ్ళెవరూ దీని గురించి స్పందించిన దాఖలాలు లేవు. ఇవన్నీ నిజమైనవి అయితే వదిలేస్తారా? ఎందుకో కావాలని ప్రజల మనోభావాలను, మానసిక ధైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలను ఈ మధ్య మీడియా చేస్తోంది.

ఇటువంటి పేకేజీ పలాస్త్రీలు రాజకీయాలను మరింత భ్రష్టు పట్టిస్తాయన్నది సత్యం.

ఇదెప్పుడో చేసుండాల్సింది బాబయ్యా..


గత మూడురోజులుగా బాబ్లీ యాత్ర చేపట్టిన చంద్రబాబు నాయుడు గారు బృందాన్ని బంధించి మహారాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నిబద్ధతను చాటుకోవడంలొ ముందున్నారు. ఒక ప్రక్క రాష్ట్రం మాజీ నేతనే నిర్బంధించడం ద్వారా వాళ్ళు తమ పనిని సమర్థించుకోజూస్తున్నారు. అటు కేంద్రం కానీ, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ విషయంపై అసలు పట్టించుకున్న దాఖలా లేదు. మన సి.ఎం.గారికెంత సేపు తన ముడ్డి కింద కుర్చీ ధ్యాస తప్ప కనీసం వార్తలు కూడా ఎరగనట్లు మాటాడుతుంటారు. ఈ ఎవడి గోల వాడిదిగా వున్న సీజన్లో తెలంగాణాలో ఉప ఎన్నికల నేపథ్యంలోనే మన నాయుడు బాబుకు ఈ విషయం గుర్తొచ్చింది.

ఏ మాటకామాట చెప్పుకోవాల. మన రాజకీయ ఏలికలకు పదవిలో లేనప్పుడే దేశభక్తి, ప్రజల అవసరాలు గుర్తొస్తాయి. సందట్లో సడేమియాలా మన చిరు ప్రధానమంత్రి గారిని 23 న కలిసాక నా ఏడుపేదైనా వుంటే ఏడుస్తానంటారాయె. ఆయన గురించి అప్రస్థుతం లెండి.

అసలు మనది ఫెడరల్ రాజ్యాంగ నిర్మాణంగా ప్రకటించుకున్న పాలనలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వీసా అక్కర్లేకుండానే వెళ్ళనొచ్చునని మనం ఇంతకాలం అనుకుంటున్నది తప్పుగా రుజువయ్యిందనుకోవాలా?
అసలు వాళ్ళే తప్పు చేయనప్పుడు ప్రాజెక్టు చూపిస్తే తప్పేంటి?
లేక ఈ క్రెడిట్ తో తెలంగాణా ఉప ఎన్నికలలో బాబు లబ్ధిపొందుతాడేమోనన్న భయంతో సోనియమ్మ ఆదేశంతో ఉభయ రాష్ట్రాల కాంగ్రెస్ పాలకులు కలసికట్టుగా ఈ నాటకం ఆడుతున్నారా?
ఏదేమైనా ఈ పని ఓ పదేళ్ళక్రితమే చేసివుంటే ఫలితం వుండేదేమో? ఆల్మట్టిడాం గురించి ఎప్పుడు గుర్తొస్తుందో? Let us wait and see..

లగడపాటి + చిరు = వ్యాపారవాదం..


లగడపాటి గారు తిరుపతిలో సభలో మాటాడుతూ చిరు తను కలిసి తెలంగాణా ప్రాంతంలో తిరుగుతామని సవాల్ చేస్తున్నారు. ప్రాంతీయవాదంలో పస లేదని సెలవిచ్చారు. తన సమైక్య వాదంలో వున్న పస వ్యాపార పస కాకపోతే ఈయనకు ఈ రాష్ట్ర ప్రజలపై ఇంత ప్రేమ దేనికేడ్చినట్లు. తన సొంత గ్రిడ్ లలో తయారయిన విద్యుత్ ను బయటకు అమ్ముకుంటూ ఇక్కడి వనరులతో వ్యాపారాలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించే యీయన గారికి యిక్కడి వనరుపై ప్రేమా లేక జనంపైనా?

చిరు గారు భారమైన స్టెప్పులు జనం చూడలేకపోతున్నారన్న నిజం తెలిసి మొఖానికి రంగుమాని ప్రజలకు రంగు వేద్దామని బయల్దేరి బామ్మర్థి కోటరీతో సీట్లమ్ముకొని,  తనేదో ఉద్ధరిస్తాడని మోద్దామని బయల్దేరిన మిత్రా, ప్రభాకర్ లాంటి వారు ఈయన గారి లోగుట్టు తెలిసి పారిపోయారు.                                                                  ఏనాడూ పిల్లికి బిచ్చం పెట్టని ఈయన జనాల్ని ఏముద్ధరిస్తాడు అన్నది తొందరగానే గ్రహించిన జనం దూరంగా జరిగారు. దాంతో సొంత గ్రామంలోనే ఓడిపోయి ఏం జేయాలో తెలియక, ఉన్న పరువేదో నిలుపుకుందామని కొత్తగా సమైక్య వాదాన్ని తలకెత్తుకొన్నా ఎవరూ వెంట రాక, ఒంటరిగా అద్దం ముందు నిలబడిపోయాడు.

ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తొడగొడుతున్నారు. ప్రజల మనోభావాలను, ఉద్వేగాలను రెచ్చగొడితే కాళ్ళు విరుగుతాయి తప్ప మరేమీ కాదన్నది తొందర్లోనే ఎరుకవుతుంది. తమ తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు హైదరాబాదునుండి వెల్లగొడతారేమోనన్న భయంతో యిలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు.

రోశయ్య-జగన్ ఎడమొహం పెడమొహం


నిన్నటి కోనేరు రంగారావు గారి సంస్మరణ సభకు హాజరైన జగన్ ముఖ్యమంత్రి రాకముందే సభనుంచి వెళ్ళీపోవడమే కాకుండా విమానాశ్రయంలో కూడా పలుకరించకుండా చెరో దారి లో వెళ్ళారని వార్త.

తన జీవితకాలం కాంగ్రెస్ పార్టీకి ధారపోసినవ్యక్తి, ఏనాడు గ్రూపులు కట్టని మనిషి, బలమైన సామాజికవర్గం లేని వారు, ముఖ్యమంత్రి ఎవరైనా విధేయుడుగా వుంటూ శాసన సభలో అధినాయకున్ని బలపరిచే సహచరుడిగా ముద్ర పడ్డ వ్యక్తి, రాజశేఖర రెడ్డి అనేకమార్లు శాసనసభలో తీవ్రమైన పరిస్తితులు ఎదుర్కొన్నప్పుడు ఒంటిచేత్తో అడ్డుకున్న రోశయ్యగారిపట్ల కనీస మర్యాద (ఇచ్చకానికైనా) పాటించకపోవడం జగన్ అహంకారాన్ని, పదవీ వ్యామోహాన్ని తెలియజేస్తోంది.  ఆయన ముఖ్యమంత్రి అయినా సరే రెండు మార్లు జగన్ ను స్వయంగా పలకరించడానికి, ఓదార్చడానికి వెళ్ళీన పెద్దాయన. కాంగ్రెస్ లో ఏదైనా హైకమాండ్ నిర్ణయం మేరకే జరుగుతుంది. మొన్న తాను మాజీ MLAlలు, MLC ల  సభలో మాటాడుతూ త్వరలోనే మీ మధ్య మాజీగా కూచుంటాను అని ఎంతో హుందాగా ప్రకటించిన వ్యక్తి రోశయ్య.  అలా అధికారం పట్ల వ్యామోహం లేని ఉన్నత వ్యక్తిని గౌరవించకపోవడం బాధాకరం.

మా ఊళ్ళో రూపాయల వాన..


ఈ రోజు మధ్యాహ్నం సడన్ గా అప్పటి వరకు చుఱు మనిపించిన సూరీడు మబ్బుల చాటుకు పోవడంతో పక్కనున్న రైతు సోదరులతో ఏమిటిలా మబ్బులు కమ్మినాయి, వర్షమేమైనా వస్తుందా అని అన్నా. వస్తే ఇది రూపాయల వాన బాబూ అన్నారు. అదేంటి రూపాయలు పడతాయా అని అన్నా. పై నుండి కాదు బాబూ, నేలతల్లి ఇస్తుంది, మొన్న భోగి రోజు  కురిసిందే వాన.  తరువాత నువ్వులు జల్లాం. అప్పటి నుంచీ మరల పడలేదు. ఈ రోజు ఎన్ని చినుకులు పడితే అన్ని రూపాయలే బాబు. వేసీ నూలు పంట కదా? తొలకరికి ముందు పంట చేతికి వస్తే, ఉభాలకు మదుపులు చేరుతాయి. కొంత అప్పుల బాధ తీరుతుంది అని చెప్పారు.

వాన కోసం ఆర్తిగా చూస్తున్న వారిని చూస్తుంటే వ్యవసాయం యింకా జూదమే కదా అనిపించింది.

సాయంత్రం వారూహించినట్లుగానే  చిరుజల్లులు పడ్డాయి. చినుకులు చూస్తుంటే ఒక్కోటీ ఒక్కో రూపాయిలా కనబడ్డాయి..

తన ఉనికికోసం కులచిచ్చురేపుతున్న మంద కృష్ణ


తెలంగాణా ఉద్యమంలో ఒకే మాటపై అంతా కలసి కట్టుగా చేస్తున్న ఉద్యమంలో కులచిచ్చు రేపుతున్న మంద కృష్ణ కుట్రను అడ్డుకోవాల్సిన అవసరం వుంది.  యిదంతా తన ఉనికి కోసం, నాయకత్వం కోసం, అవకాశవాద ఎత్తుగడలతో ఉనికిని కోల్పోయిన తన ప్రాభవాన్ని తిరిగి పొందేందుకు చేస్తున్న కుట్రగానే భావిస్తున్నాం. ఒంటెద్దు పోకడలతో  ఎన్నికల రాజకీయాలతో ముడిపెట్టి మాదిగ ఉద్యమాన్ని తన నిరంకుశ నాయకత్వంలో నడిపి భ్రష్టు పట్టించిన తీరునే ఇక్కడకూడా ప్రయోగించాలని చూస్తున్నాడని అర్థమవుతోంది.

ప్రొ.కోదండరాంపై చేస్తున్న విమర్శలు కూడా యిందులో భాగమే. రాజకీయ అవకాశవాదులనుండి దూరంగా ఉద్యమాన్ని కొనసాగించే  వ్యక్తిగా అందరూ ఎన్నుకొన్న వ్యక్తిపై కులముద్ర వేయడం తగనిపని.

తను తెలంగాణా ఉద్యమంలోకి వచ్చి నిండా 2 నెలలు కాకుండానే ఉద్యమం తన కనుసన్నలలో నడవాలని కోరుకోవడం నాయకత్వ దాహం తప్ప మరోటికాదు. కె.సీ.ఆర్.ను ఎంత విమర్శించినా తాను పార్టీ పెట్టిననాటినుండి దళిత వ్యక్తినే తెలంగాణా ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించారు. ఆ మధ్య ఆమరణ దీక్ష ముందో తర్వాతో  T.V.9 లో చర్చా కార్యక్రమంలో పాల్గొంటూ పక్కన వున్న మంద కృష్ణను చూపెడుతూ ఈయనే C.M. కావచ్చునని అన్నారు.

ఈనాటి మంద కృష్ణ డిమాండుల వెనక ఏ నాయకుడి ప్రోద్భలముందో కానీ మొత్తం JAC నిర్మాణాన్ని చీల్చే దిశగా సాగుతున్నారు. కావున తెలంగాణా ప్రజలు, ఉద్యమకారులు యిలాంటి అవకాశవాదులను దూరంగా వుంచకపోతే మొత్తం ఉద్యమం బలహీనపడే ప్రమాదముంది. కుల, మత, వర్గ, వర్ణాలకు, రాజకీయ భేదభావాలకు అతీతంగా కలసికట్టుగా సాగితేనే ఉద్యమం తన బలమైన స్వరాన్ని వినిపించి తెలంగాణా ప్రజల ఆకాంక్షను, కలలను సాకారంచేయగలుగుతుంది. లేకపోతే నాలుగెద్దులు-పులి కథ పునరావృతమై, బలమైన శతృవు చేతచిక్కి నాశనమవుతుంది.

దీనికి తోడుగా  ఈ సాయంత్రం 6 గం.లకు  మంద కృష్ణతో T.V.9 చర్చా కార్యక్రమం పెట్టి ఆయన విపరీత వాయిస్ నే తప్ప ఎదుటివారి సమాధానాలను వినిపించక పోవడం చూస్తుంటే యిదంతా కుట్రలో భాగంగానే జరుగుతున్నదని అనుమానించాల్సివస్తోంది.

కావున తెలంగాణా ఉద్యమకారులూ బహుపరాక్..

మొయిలీ ఫత్వా వెనక చిత్రగుప్తుడు


రాష్ట్ర పార్టీ ఇంచార్జిగా వై.ఎస్.బతికున్నంతకాలం ఆయనకు అనుకూలంగా కేంద్రంలో చక్రం తిప్పిన వీరప్ప’న్’ మొయిలీ ఆయన మరణానంతరం ముడుపులందక కొంత తగ్గి మరల ఆయన ఆత్మీయ అనుచరుని అడుగుజాడలలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నంగా జె.ఏ.సీ,నుండి బయటకు రావాలని, కమిటీలపై మాటాడరాదని ఆంతరంగిక మంత్రి గారు సెలవిచ్చిన దానికి భిన్నంగా ఫత్వా జారీ చేసారు. కానీ దాని వెనకున్న కుట్రపూరిత ఆలోచనను గ్రహించిన తెలంగాణా కాంగీయులు కక్కలేక మింగలేక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పటికే తెలంగాణా ఉద్యమం ఏదో ఒక నాయకుడి అరుపులకు లొంగనంత దూరం పోయింది. ప్రజల చేతుల్లోకి పోయిన ఉద్యమం నుండి మధ్యలో వెనక్కు మరలితే రేప్పొద్దున ఓట్ల బిచ్చకు ఏ మొఖం పెట్టుకు వెళ్తాం అన్న ధర్మ సందేహంలో పడిపోయారు అధికార గణం. దాంతో ఫత్వా వేడి నిన్నటికన్నా సాయంత్రానికి చల్లారిపోవడం జరిగింది. ఈ గూడుపుఠానీ వెనక వున్నది చిత్రగుప్తుడే అని అర్థమవుతోంది. వ్యాపార సంబంధాలు ఏ పనైనా చేయిస్తాయి. ప్రజలు అప్రమత్తంగా వుండాలి. వీళ్ళ పిలకబట్టి జాడించాలి.

జరభద్రం కొడకో..


జరభధ్రం కొడకో

కొడకో నా కొమరన్నా జరా భధ్రం కొడకో..

రిక్షా ఎక్కేకాడ దిగేకాడ మల్పుకాడ..

అన్న గద్ద్రరన్న పాట గుర్తొస్తుంది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. రాజకీయ ఊసరవెల్లులు రోజుకో గొంతుతో మాట్లాడుతుంటే వీళ్ళేనా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి, ప్రజల ఆకాంక్షలను, ఆశలను తీర్చేవారా? అని అనిపిస్తోంది. పదవులు వదలడం దేశద్రోహమంటాడు నిన్న మొన్నటివరకు వీధిలో వీరంగమేసిన సర్వేవారు. ఇట్లాంటి వారిని నమ్ముకోవడం అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడం లాంటిదే.

కనుక ప్రజల ఆశలు వమ్ముకాకుండా కాపాడేది మొక్కవోని దీక్షతో ప్రజలమధ్యకు ఉద్యమాన్ని తీసుకుపోవడమే. ఈ నక్క జిత్తుల మాయలలో పడక సరైన కార్యాచరణ ప్రణాలికతో ముందుకు పోవాలని ఆశిస్తూ..

ఆంధ్రజ్యోతి రెండునాల్కల ధోరణి


ఆరోజు మంద కృష్ణ మాదిగ పై బురదజల్లేందుకు తన ఫ్రీపెన్ తో ఇష్టానుసారం రాసేస్తే పత్రికాధిపతిని, ఎడిటర్ ను అరెస్టు చేస్తే పత్రిక చుట్టూరా నల్ల రంగు పులిమి నాలుగో స్తంభం కూలిపోయిందని గగ్గోలు పెట్టారు.  ఒక ఎడిటర్ స్థానంలోని వ్యక్తి ఉద్యమనాయకుని దిష్టిబొమ్మ తగలేయడం ఏ సాంప్రదాయం?  అది ఆ స్థానంలోని వ్యక్తి చేయాల్సిన పనేనా? మరి ఆ రోజు రాష్ట్రంలో జరిగిన అల్లరికి, అశాంతికి వీళ్ళు కారణమయినందునే అరెస్టుచేసారు కదా?

అదే ఈ రోజు TV 5 ఎడిటర్ ని, input Editor లను అరెస్టు చేయడం గురించి ఎఱ అక్షరాలతో రాయడం వీళ్ళ మద్య వున్న ఏ తేడాలకు గుర్తు? రాజకీయ భిన్నాభిప్రాయాలను ఇంత పబ్లిక్ గా చూపించుతున్న వీళ్ళ వార్తలా మనం చూస్తున్నది? చదువుతున్నది? వాటితో మన బుఱలను పాడుచేసుకొని, మనసుల మధ్య ఎడబాటును పెంచుకుంటున్నామా? కాదా?