పండగ

62 ఏళ్ళ రిపబ్లిక్ – ఓ సవర ఆదివాసీ..


సవర ఆదివాసీ


రిపబ్లిక్ డే రోజు అంతా ఝెండా ఎగరేసే సందడిలో వుండగా, పిల్లలు పాటలతో పాఠశాల ఆవరణంతా సందడిగా వుంది. ఓహ్ అందరిలో ఒక్కసారిగా దేశ భక్తి పెల్లుబుకిపోయి తలా ఒక పది నిమిషాలు ప్రసంగించేసరికి పిల్లలకు అలుపొచ్చీసి ఎప్పుడు చాక్లెట్ లు పంచుతారా ఉడాయిద్దామా అని చూస్తుండగా ఆ వైపుగా భుజాన వంటచెరకు కావిడితో సవర గిరిజనుడు వస్తూ పాఠశాల బోరింగ్ దగ్గర ఆగి మొఖాన ఇన్ని నీళ్ళు చల్లుకొని, మరికొన్ని తాగి కాసేపు ఆయాసం తీర్చుకుందామని ఆగాడు.

ఇంతలో ఓ బడిపిల్లాడు తాతా ఇదిగో మన ఝెండా దోపుకో అని చిన్న పిన్నీసు వున్నది ఇచ్చాడు. ఆయన పైన ఏ ఆచ్చాదనా లేక ఎక్కడ పెట్టుకోవాలో తెలీక పారేస్తే ఏమనుకుంటారోనని తన గోచీకి తగిలించుకుని మరల కావిడి భుజానకెత్తుకొని సాగిపోయాడు..

62 వ గణతంత్ర దినోత్సవం జిందాబాద్..

సిమ్మాద్రి అప్పన్న దేవరా..


సిమ్మాద్రి అప్పన్న తో సీను


సామీ సిమ్మాద్రి అప్పన్నా..
సిమాచలం కొండదేవరా..
తండ్రీ దీవించు తండ్రీ…
కాలు కడిగిన వారు…
బొట్టు పెట్టే వారు…
చిట్టి పెట్టే వారు…
సుకంగా కలకాలం వుండాలని దీవెనలియ్యి దేవరా…

ఇది మా బాడంగి మండలం, పిన్నవలస అల్లు శ్రీను దీవెన..

వీడి రాకతో సంక్రాంతి వచ్చినట్లైంది…

గంగిరెద్దుల వారం బావ్ మేం, మాలోను సదువుకున్నోళ్ళున్నారు, టీసర్లయ్యారు, మిలటరీలోనున్నారు..

మరి నువ్వేం సదువుకోలేదంటే అదోలా సూసి సదువుకోలేదు అని సన్నాయి వాయించుకుంటూ తన కాశీ ఆవును తోలుకుపోయాడు.

కాశీ ఆవు అంటే వీపు మీద, మోర మీద మరో కాలుండేవి. వీటిని సింహాచలం కొండ దగ్గర వదిలేస్తారు. లేకపోతే వీళ్ళకు దానం చేస్తారంట.

(చిట్టంటే మా ప్రాంతంలో పశువులు తినే తౌడన్నమాట)

సాయిబుగారు – ఏకాదశి


ఒకమారు సాయిబు గారు ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ బాగా అలసిపోయి ఓ గ్రామానికి చేరుకొని ఓ ఇంటి అరుగుపై ఆ రాత్రి నిదురపోయారంట.

తెల్లవారిన తరువాత ఆ యింటి యజమానులు ఆయనను ఆదరించి మామూలుగా స్నానాదులయ్యాక ఫలహారమిచ్చి వారి పూజ పనులలో వారుండిపోయారంట. ఇంతగా ఆదరించి ఉండమన్నారు కదా అని, ఈ రోజు ఇక్కడ విశ్రాంతి తీసుకొని మరునాడు వెళ్ళిపోదామనుకొని సాయిబు గారు వుండిపోయారంట..

ఆ రోజంతా ఏకాదశి కావడంతో వ్రతమాచరించి ఉపవాసమున్న ఆ కుటుంబం సాయిబుగారికి ఆ రోజు ప్రసాదంతో సరిపెట్టేసారంట. మొహమాటానికి పోయిన సాయిబు గారు ఆ రోజంతా వాళ్ళతో పాటు తను కడుపుమాడ్చుకొని వుండిపోయారంట.

మరుసటి రోజు తెలవారగానే కాఫీ ఫలహారాలతో మొదలైన అతిధి మర్యాదలు పిండి వంటలతో షడ్రుచుల భోజనంతో సాయిబుగారిని కదలనివ్వక కడుపునింపి కబుర్లతో ఆయనకు గుక్కతిప్పుకోనివ్వలేదంట..

దీంతో ఉక్కిరిబిక్కిరైన సాయిబు గారు ఆ మరుసటి దినం బయల్దేరుతూన్నప్పుడు ఆ ఇంటి యజమాని కుటుంబ సభ్యులంతా మా లోటుపాట్లేమీ లేవుకదా భాయి అని ఆడిగినప్పుడు ఆయన ఏకాదశి ….ధర్ చోద్, ద్వాదశి బహుత్ అచ్చా అన్నారంట.

ఇది చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన కథ. ఉపవాసం effect ఆయనతో అలా అనిపించిందిరా అనే వారు..

దీపావళి కావాలి రైతు ఇంట ఆనందావళి


Diwali Animated Scraps : Click Here To Forward This Picture To Your Friendz
దీపావళి
మోసుకొస్తోంది
ఓ ‘జల్’ ప్రళయాన్ని!

యిప్పటికే చేను నీటమునిగి
గుండె అంతా చెరువై
కన్నీళ్ళ వరద పర్యంతమైన
రైతు ముంగిట మరో
జల ప్రళయ విధ్వంసపు వార్తలతో
ఎలా విరజిమ్మగలదు
ఈ దీపపు కాంతి!!

కానీ
ఓ మూల దాగిన ప్రమిద
అటూ ఇటూ ఊగుతున్న
తన చిరు దీపపు కాంతితో
ప్రళయాన్ని సైతం
ఆపగలనన్న
హామీనిస్తూన్నట్లు….

మా నేలమ్మ నేడు నిండు చూలాలమ్మ..


పొట్టతో వున్న వరిచేను


సక్కగా కురిసిన వానలతో
పులకరించిన
మా నేలమ్మ నేడు
నిండు చూలాలమ్మ…

పండిన ఈ కడుపు పంట
ఏ వంకర దిష్టీ తగలక
సక్కగా మా గాదె చేరాలని..

ఆ దిక్పాలకులను
కరుణ చూపాలని
బిక్కు బిక్కు మంటు
వేడుకుంటున్నాము…

కన్నోరింటికి సేరిన సుభధ్ర


మా ఊరి జగన్నాధుని రధం

కళింగాంధ్రకే పరిమితమయిన జగన్నాధ రధయాత్రను ఈ దినం జరుపుకుంటున్నారు మా ప్రాంత ప్రజానీకం. ఈ పండగను ఇక్కడ ఆవిటి అంటారు. ఈ రోజు జగన్నాధునితో పాటు బలరాముడిని తోడుగా సుభద్ర తన  రథంపై ఊరేగింపుగా చేరుకుంటుంది తన కన్నవారింటికి. ఆ ప్రదేశాన్ని గుండిచ మందిరం అంటారు. ఈ రోజునుండి తొమ్మిది దినాలు శ్రీక్రిష్ణుడు దశావతారాలతో భక్తులకు కనువిందు చేసిన అనంతరం మారావిటి అదే మారు రథయాత్ర రోజు తిరిగి రథంపై ఊరేగింపుగా జగన్నాథ దేవాలయానికి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ఇది ఒక ఐదారేళ్ళ క్రితం వరకు అత్యంత వైభవంగా జరిగేది. జనం ఊకపోస్తే రాలనంతగా చేరి రథం లాగుతూ వచ్చి గుండిచ మందిరం చేరేముందు  రథంపైనే పూజలు చేసే వారు. ఈ సమయంలో చాలా సందడితో పండగ వాతావరణం నిండుగా వుండేది. అరటిపళ్ళను పైకి విసురుతూ మొక్కుకునే వారు కొందరు. ఇందులో ఆకతాయి కుఱవాళ్ళు అరటిపళ్ళ మధ్యలో బరువైన నాణాన్ని వుంచి గురిచూసి కొట్టేవారు. అది తగిలిన వాళ్ళు తిట్ల పురాణం లంకించుకునేవారు. అదో  సరదాగా సందడిగా అంతా ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు రథం చుట్టూ జనం చేరేందుకే గంటలు పడుతోంది. రథం సైజు కూడా కుంచించుకు పోయింది. అప్పుడు రెండు ఏనుగులంత రథం వుండేది. ఇప్పుడు గున్న ఏనుగంత అయిపోయింది. అలాగే యాత్ర జరిగే రోజుల్లో వర్షాలతో బురద బురదగా వుండేది. ఈ రోజు వాన తప్పక కురుస్తుందన్న నమ్మకంతో జనం వుండేవారు. కానీ ఈ రోజు ఎక్కడో ఒక చినుకు తప్ప వానలేక మరింత బోసిపోయింది మా సుభద్రక్క. ఆవిటి రోజు ‘ఆరిది’ వండిపెట్టే వాళ్ళే లేకపోయారు. ఆరిది అంటే బియ్యం పిండితో కొబ్బరిముక్కలు, బెల్లం వేసి చేసే ఒకరకమైన పరమాణ్ణం. దాని కమ్మదనం ఈ పోస్టు రాస్తుంటే ముక్కపుటాలకు చిన్నప్పుడు మా బాప్ప (మేనత్త) వండిపెట్టినది ఇప్పటికీ ఎరుకై  మనసు బాధగా మూలుగుతోంది.

ఆంధ్రరాష్ట్రంలో మరెక్కడా ఈ పండగ వుండదు. ఈ మూడు జిల్లాలకే పరిమితమయిన పండగ. దీనికి కారణం ఈ ప్రాంతం ఒరిస్సాకు దగ్గరగా వుండటం, అలాగే ఒడియా బ్రాహ్మణులెక్కువగా వున్న దగ్గర వారి సాంప్రదాయాను సారం ఈ యాత్ర జరుగుతోంది. మా ప్రాంతంలో పార్వతీపురం, కురుపాం, చినమేరంగి, సంగంవలస, సాలూరు జమీందారులు వున్న దగ్గర జగన్నాదస్వామి దేవాలయాలు వారు కట్టించినవి వుండటం, వాటికి వారు సమకూర్చిన ఈనాంలు ఇప్పటికీ ఆయా ఆలయ పూజారుల కింద వుండటం  చేత ఆలయాలు నిర్వహింపబడుతు కొంతమేర ఈ యాత్ర కొనసాగుతున్నాయి.  కొత్త కొత్తగా పుట్టుకొచ్చిన షిరిడీ సాయిబాబా గుడుల మోజులో పాత దేవుళ్ళను పట్టించుకున్న భక్తులు కరవై ఇవి నామ మాత్రంగా సాగుతున్నాయి. ఆలయాలు శిధిలావస్తకు చేరుకుంటున్నాయి. అయినా కళింగాంధ్ర సాంప్రదాయ మేలుకలయికగా ఈ యాత్ర  జరుపుకోవడం ముదావహం.

క్షమించండి..రక్తసిక్త ఉగాదినెలా ఆహ్వానించను


విరోధినామం వెళుతూ వెళుతూ

వేలాది మందిని పొట్టనబెట్టుకుంది!

సామాన్యులు, మాన్యులు అన్న తేడా లేకుండా

సాగిన మారణహోమానికి

బరువెక్కిన మనసుతో

ఈ వికృతినెలా ఆహ్వానించను!


రక్తమంటిన ఈ చేతులు నూతన వికృత శిశు

రూపానికి హడలెత్తుతున్న

కల్లోలమైన మనస్సాగరంలో జనించేది

అమృతం కాదని హాలాహాలమేనన్న

భవిష్యత్ చిత్రపటం కనులముందు కదలాడుతుండగా

పచ్చదనాన్ని హరించే వికృత ఘోషలో

ఈ రక్తసిక్త ఉగాదినెలా ఆహ్వానించను!


క్షమించండి ఆత్మీయులారా

మీ మనసు గాయపడితే..