just 4 fun

సాయిబుగారు – ఏకాదశి


ఒకమారు సాయిబు గారు ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ బాగా అలసిపోయి ఓ గ్రామానికి చేరుకొని ఓ ఇంటి అరుగుపై ఆ రాత్రి నిదురపోయారంట.

తెల్లవారిన తరువాత ఆ యింటి యజమానులు ఆయనను ఆదరించి మామూలుగా స్నానాదులయ్యాక ఫలహారమిచ్చి వారి పూజ పనులలో వారుండిపోయారంట. ఇంతగా ఆదరించి ఉండమన్నారు కదా అని, ఈ రోజు ఇక్కడ విశ్రాంతి తీసుకొని మరునాడు వెళ్ళిపోదామనుకొని సాయిబు గారు వుండిపోయారంట..

ఆ రోజంతా ఏకాదశి కావడంతో వ్రతమాచరించి ఉపవాసమున్న ఆ కుటుంబం సాయిబుగారికి ఆ రోజు ప్రసాదంతో సరిపెట్టేసారంట. మొహమాటానికి పోయిన సాయిబు గారు ఆ రోజంతా వాళ్ళతో పాటు తను కడుపుమాడ్చుకొని వుండిపోయారంట.

మరుసటి రోజు తెలవారగానే కాఫీ ఫలహారాలతో మొదలైన అతిధి మర్యాదలు పిండి వంటలతో షడ్రుచుల భోజనంతో సాయిబుగారిని కదలనివ్వక కడుపునింపి కబుర్లతో ఆయనకు గుక్కతిప్పుకోనివ్వలేదంట..

దీంతో ఉక్కిరిబిక్కిరైన సాయిబు గారు ఆ మరుసటి దినం బయల్దేరుతూన్నప్పుడు ఆ ఇంటి యజమాని కుటుంబ సభ్యులంతా మా లోటుపాట్లేమీ లేవుకదా భాయి అని ఆడిగినప్పుడు ఆయన ఏకాదశి ….ధర్ చోద్, ద్వాదశి బహుత్ అచ్చా అన్నారంట.

ఇది చిన్నప్పుడు మా నాన్నగారు చెప్పిన కథ. ఉపవాసం effect ఆయనతో అలా అనిపించిందిరా అనే వారు..

రాజుగోరి వై’భోగం’


సింహాచలం మేడ

మా విజయనగరం పూసపాటివారి పాలనలో అలరారిందని మీకందరికీ ఎరుకేకదా? రాజుల వైభోగం ఎంతలా విరాజిల్లేదో ఈ ఫోటోలోని మేడ చూస్తే తెలుస్తుంది. సింహాచలం అన్న భోగం స్త్రీకి ఈ మేడను అప్పట్లో రాజుగారు కట్టించి ఇచ్చారంటారు. ఇప్పటికీ ఈ మేడను సింహాచలం మేడ అంటారు. ప్రస్తుతం ఇందులో ఓ ప్రభుత్వ వసతి గృహం నడుస్తోంది. కానీ ఈ మేడను చూడగానే రాజుగారి వై ‘భోగం’ గుర్తుకువస్తుందిక్కడి వారికి..