just 4 fun

మా ఊళ్ళో ఎగిరిన హెలికాప్టర్..


యిమానం


ఈ రోజు మధ్యాహ్నం పిల్లలు వీధిలో యిమానం యిమానం అంటు ఒకటే పరుగులు. ఎప్పుడో ఒక సారి అలా వస్తూ వెల్తుంటాయి కదా అనుకుంటే ఈ రోజు మాత్రం రెండు హెలికాప్టర్లు మా ఇళ్ళపై ఓ నాలుగు గంటలపాటు గిరికీలు కొట్టాయి. ఒరిస్సా సరిహద్దునుండి CRPF జవాన్లను మోసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టాయి.

రోడ్లన్నీ సాయుధులతో నిండిపోయి హెలికాప్టర్ల హోరుతో యుద్ధవాతావరణం అనుభవించాం. అతి దగ్గరగా వాటిని చూసి కేరింతలు కొట్టిన చిన్న పిల్లలు కాసేపటికే అవి సాయుధులతో నిండి వుండటం చూసి గప్ చుప్ అయిపోయారు.

రజినీ అమితాభ్ కు భయపడి..


నిన్న మా వూళ్ళో రోబో ఆఖరు అంటే రాత్రి ఫస్ట్ షో చూసాను. ఇప్పటి వరకు చూద్దాం అనుకుంటూ వాయిదా వేసి సి.డీ.లో చూస్తే అంత ఎఫెక్టివ్ గా వుండదని చివరి రోజు చూసాను. రజిని ఇంటర్వ్యూలో అన్నది నిజమైంది. ఐష్ తో చేసిన మొదటి సాంగ్ లో గ్రూప్ డాన్సర్స్ లేకుండా చేసేటప్పుడు ఆమెకు దగ్గరగా వెళ్ళేటప్పుడు అమితాభ్ గుర్తొచ్చేవారని చెప్పాడు. సినిమా అంతా ఆమెకు ఆమడ దూరంలోనే పాపం యాక్ట్ చేసాడు. ప్రేమ సన్నివేశాలు కూడా డైలాగ్ కు పరిమితమై పోయాడు. దగ్గరగా హత్తుకొని చేసిన సన్నివేశమే లేదు. పాపం రజినీ.

సినిమా మధ్యలో కొంత బోర్ కొట్టినా ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్ సూపర్. నిజమే భారతీయ వెండితెరపై ఇంత గ్రాఫిక్స్ తో చేసిన సినిమా లేదు. రజినీ స్టైల్, మేకప్, రోబో నటనలో చేసిన విలనీ చాలా బాగున్నాయి. ఐష్ నలభయ్యో పడిలో కూడా అందంగా కనువిందు చేసింది..నిజమే ఓ పాటలో అన్నట్లు ఇంత అందం పచ్చిక అయితే పులి కూడా గడ్డే తినేది..
థాంక్స్ టు శంకర్..

కొండను మేస్తున్న మేఘాలు..


ఈ రోజు ఉదయంనుండి మేఘాలుకమ్ముకున్న వాతావరణం. ఎండలు తగ్గి చల్లగా వున్న వాతావరణంలో మిట్ట మధ్యాహ్నం వేళ మిత్రుని బండి వెనక వస్తూ మా చుట్టూ వున్న కొండలు చూస్తుంటే ఈ ఆహ్లాదకర దృశ్యం కనిపించింది. ఇలా కొండలపై ఆవరించిన మేఘాలను చూస్తే మా ప్రాంతంలో మేఘాలు కొండల్లో మేస్తున్నాయిరా అంటారు. ఆ దృశ్యం మీ కోసం..


ఈ ఫత్వాల గోలేంట్రా బాబూ..


ఇన్నాళ్ళూ మొన్నటి పెళ్ళి, దాని పెటాకులు, మరల విడాకుల పత్రంలో పేరు తప్పంట (ఇది TV9 కనిపెట్టిన సత్యం తర్వాత తుస్ అయ్యింది లెండి), పెళ్ళి గౌను గోల, మళ్ళీ ఇప్పుడు కలిసి తిరుగుతున్నారంట, మత పెద్దలకు ఆగ్రహం వచ్చి సున్నీ ఉలేమా గారు పెళ్ళికి వెళ్ళొద్దంటూ ఫత్వా జారీ చేసారు. యిలా మన సానియా పెళ్ళి రోజుకో హాట్ టాపిక్ గా మారి చానళ్ళకు TRP రేటింగ్ పెంచే కార్యక్రమంగా మారిపోయింది పాపం. మొన్నటి విడాకుల దందాకు యీయన గారిని పిలిచి తమలపాకు సమర్పించి వుండలేదేమో ఈ హుకుం జారీ చేసారు.

ఎంత స్పీడుగా కాల చక్రం తిరిగి 15 తారీఖు వస్తుందో యీ తంతు ముగిసిపోతుందో అని సానియాతో పాటు మనమూ అనుకోవాల్సి వస్తోంది.

విహెచ్ గారూ అద్దం చూసుకున్నారా?


ఈ రోజు మీడియాతో  వి.హనుమంతరావు గారు జగన్ ఓదార్పు యాత్ర గురించి మాట్లాడుతూ నేనెళ్ళినా జనం విరగబడి వస్తారని సెలవిచ్చారు. ఈయన గారిని జనం మరిచిపోయిన సంగతిని అప్పుడప్పుడు వైఎస్ వ్యతిరేక వ్యాఖ్యలతో, తలా తోకా లేని మాటలతో మీడియా వాళ్ళ పుణ్యమా అని కనబడి గుర్తు చేస్తారు కాబట్టి సరిపోయింది గానీ యిలాంటి నాయకులు మరీ జోకులేస్తుంటారు అప్పుడప్పుడిలా? ఆయన బతికున్నంత కాలం నోరుమూసుకొని వున్నారెందుకో చెపితే జనం గౌరవించే వారేమో! 10, జన్ పథ్ లో కాల్మొక్త బాంచెన్ అని పడి వుండి, బయటకు వచ్చి అది చేసేస్తారు, ఇది పీకెస్తాం అని సెల్ఫ్ డబ్బా కొట్టే వాళ్ళను ఈ మీడియా వాళ్ళు తమ గొట్టాలతో చుట్టుముట్టడం చూస్తుంటే చిరాకేస్తుంటుంది…

బొత్స బావ్ మా బాగా సెలవిచ్చినావ్ బావ్..


బావ్ మా బొత్స్ బావ్, ఏం సెప్పినావయ్యా, ఏజ్జెప్పినా నువ్వే జెప్పాల, ఎవుడేమనుకున్నా నాకేటి, నా మనసులో మాట నేననేత్తాను అన్న నీ బాట నాకు మా బాగా నచ్చింది బావ్.

మీ అధిట్టానం గూర్సి నీకు తెల్సినట్టుగా మరి ఎవురికీ తెలియదంతే. ఎందుకంతే ఇక్కడ మీసాలు మెలేసిన్నా కొడుకులు, మరి అక్కడ ఏం మూజూపుతారో గానీ తోకాడిస్సుకుంటూ వచ్చేత్తుంటే నువ్వు మాత్రం సానా సక్కగా సెప్పినావ్.

యిందీ బాబులుకు ఎన్నెన్ని రాస్ట్రాలున్నాయి, సింగుబాబులుక్కూడా రొండు రాస్ట్రాలయిపోతే వొచ్చిన నట్టమేమీ లేని నాడు మరి మన తెలుగోడికేటి నట్టం అని బాగా సెప్పినావ్. నిజమే కదా, ఎందుకీ తగువులు తంటాలు,  అటు మాది మాడిపోతందంతే, ఇటు నాది కాలిపోతందని తన్నుకోవడమెందుకు. రొండు రాస్ట్రాలు, ఇద్దరు ముఖ్యమంత్రులు (వీలయితే ఇటు అది మనమే కావొచ్చు!), ఇద్దరు గవినేరు బావులు, రొండు రాజధానులు, రొండు సెక్రటెరియేట్లు, రొండు రాజభవనాలు, బోలెడు మంది వందిమాగధులు వచ్చి పడుతానంటే వొద్దనేసే మూర్ఖులేటి యీలు అని నీకు సానా కోపం ఇప్పటికెగిసిపడింది.

మరో మంచి మాట సెప్పినావ్, ఎన్ని రాస్ట్రాలయినా, ఎవుడు ముఖ్యమంత్రో, మంత్రో, ఎమ్మెల్యో అయినా సామాన్య పెజానీకానికి ఏటీ ఒరగబెట్టింది నేదని. యిన్నాళ్ళ తమ పరిపాలనలో తెలిసిన నిజాన్ని యిలా కరెకెటుగా కక్కేసినావ్. ఏదయినా నువ్వే బావ్ సెప్పాల. తమరి గురువుగారినే పక్కకు నెట్టేసి, అన్నదమ్ములు, బామ్మర్థులు, అప్పసెల్లెల్లు, మేనల్లుల్లుతో మొత్తం విజీనగరమంతా తమరొక్కరే వొటవృక్షం మాదిరి ఊడలల్లేసినావ్. నీకు తెలీద రాజకీయ వైకుంఠపాళీ. అందుకే నీకీ సక్కనైన ఆలోసన వొచ్చింది. మరి వొగ్గీమాకు బావ్. ఈ దెబ్బతో కొడితే రెండు పిట్టల్నీ కొట్టాల. నేకపోతే నేదు.

ఎవుడేటి అనుకుంతే మనకేటి. ఆయిగా ఆడుతూ పాడుతూ యిడిపోతే ఆలబాదేదో ఆలు పడతారు. మన బాదేదో మనం పడుదాం గానీ. ఓసీ మరీ సిగ్గైపోమాకు బావ్, నీ నవ్వెనకాల ఎన్ని గూఢార్థాలో. ఈ మాట మీద నిలబడిపోమీ. తల్లితోడు. మల్లీ ఎలచ్చన్ల మొత్తం మన నియోజకవర్గాలన్నీ బొత్స & కో తోటే కప్పెడదాం. ఎవుడడ్డమొత్తాడో జూద్దుం గానీ.

నీలి చందమామ


ఈరోజు నీలిచందమామ దర్శనం అవుతుంది. 1741 తరువాత మరల ఈ రోజు ఈ చంద్రగ్రహణం

ఏర్పడుతోంది. నూతన సం.ఆరంభగడియలలోనే ఇది సాక్షాత్కరిస్తోంది. ఒకే నెలలో రెండు

మార్లు పౌర్ణమి ఏర్పడటం 2, 3 సం.లకొకసారి జరుగుతుంది. ఈ గ్రహణాన్ని మొదలు తుది

ఘడియలలో భారతదేశమంతా కనిపిస్తుంది. ఆకాశ వీక్షకులకు ఇది కనువిందుచేయనుంది.