హక్కు

పుట్టినూరు సొంతూరు కాదా?


ఇటీవల తెరాస నేత కె.సి.ఆర్. తెలంగాణాలో పుట్టిన వాళ్ళంతా తెలంగాణా వాళ్ళే అన్నదానిపై రాద్ధాంతం జరుగుతోంది. అయినా మన జన్మస్థల ధృవీకరణ పత్రం మనం పుట్టిన వూరి నుంచే కదా తీసుకుంటాం. మరి దీనిపై ఇంత గోల దేనికో?

ముల్కీ నిబంధనలను దొంగ సర్టిఫికేట్లతో వాడుకుంటారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆ సర్టిఫికేట్లు ఇచ్చేది మరి ఆ ప్రాంత అధికారులే కదా? వాళ్ళకు చిత్తశుధ్ధి లేదని అనుమానమా? దొంగ సర్టిఫికేట్ల సృష్టి ఎప్పుడూ వున్నదే. దానిని నిలువరించే కృషి వైపు ఆలోచించాలి కానీ ఆ ప్రాంతంలో పుట్టిన వాడికి అక్కడ నివాసముండే హక్కు లేదనడం ఫాసిజమే అవుతుంది కదా? అయినా దోచుకునే వాడికి కుల, మత, ప్రాంతీయ విభేదాలుంటాయా? ఆలోచించండి!
ఈ పాట విందాం..
నా జన్మభూమి

నిఝంగా యిది మహిళలకు మోక్షమా?


గత నాలుగైదు రోజులనుండి టీవీ చానళ్ళు, దినపత్రికలలో మహిళా బిల్లుకు మోక్షం అంటున్నారు. మోక్షం అంటే చావే కదా అర్థం.  చివరికి ఏదేతేనేం రాజ్యసభలో బిల్లు 166 మంది సభ్యులు ఆమోద ముద్రతో విముక్తి పొంది, అన్సారీ గారి తలబొప్పికట్టించినా నెగ్గుకొచ్చింది. యింక రేపు లోక్ సభలో ఆమోదంతో చట్టరూపానికి వస్తుంది. దీనితో సుమారు 182 మంది మహిళా సభ్యులతో లోక్ సభ, 81 మంది సభ్యులతో  రాజ్యసభ రంగులమయం అవుతుంది. దీని వలన మహిళలకు రాజకీయంగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయని తద్వారా వారి జీవితాలలో వికాశం వస్తుందని అన్ని రాజకీయపక్షాలు ఏకరవుపెడుతున్నాయి. కానీ నిఝంగా అది సాధ్యమా? ఈనాడు గ్రామపంచాయతీలలో, మండలపరిషత్ లలో, మున్సిపాలిటీ పాలక వర్గాలలో అమలవుతున్న మహిళా రిజర్వేషన్ లవలన వాళ్ళ గొంతు వినబడుతుందా? ఎన్నికయ్యాక వారు మరల ఇంటికే పరిమితం. వాళ్ళ భర్తలో,  కొడుకులో వీళ్ళ అధికారాన్ని చెలాయిస్తుంటారు.  అయినా ఈ కాలం ఎలచ్చన్లలో పోటీ చేయాలంటే కోటీశ్వరులకు తప్ప సామాన్యజనానికి అంత అవకాశముందా? రాజకీయ అవకాశాలతో అందలమెక్కి ఏమైనా జనాన్ని ఉధ్ధరించగలిగారా? మహిళా హోం మంత్రి యిలాకాలోనే మహిళలపై, విద్యార్థినులపై దాడులు జరుగుతుంటే, దానికి రాజకీయ రంగుపులిమి తప్పించుకోజూడడం అనుభవమే కాదా? యిదంతా సమస్యలనుండి పక్కదారిపట్టించే యత్నమేనని నా భావం.

పై ఫోటోలోని వారిని మినహాయించి, వివరించగోరుతూ..

యువతరానికి రాజకీయాలు అవసరం లేదా?


విద్యార్థులపై ఉక్కుపాదం పోస్టులో ఒక మిత్రుడు కామెంటు రాస్తూ విద్యార్థులు చదువుకోవాలి కానీ రాజకీయాలులో పాల్గొనరాదన్న అర్థంతో కుక్క గాడిద కథ చెప్పారు.

దీనికి నా సమాధానమిక్కడ రాద్దామనిః

యూనివర్శిటీలలో మన చదువులు అకడమిక్ సిలబస్ లకు మాత్రమే పరిమితం కావడం వలన అవి మార్కులు, పనికిమాలిన డాక్టరేట్లకు పరిమితమయిపోయాయి. సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేని, ఉద్యోగ బానిసలను తయారు చేయడానికే పనికి వచ్చి, కుల, మత, వర్గ, వర్ణాలతో కుళ్ళీపోయాయి.  యూనివర్శిటీ విద్యార్థులంటే 18 ఏళ్ళకు పైబడ్డవారే వుంటారు. వారికి సమాబంలో జరుగుతున్న పరిణామాలకణుగుణంగా స్పందించే హృదయం వుండడం తప్పా?

ఓటు హక్కు వచ్చే వయసును 21 నుండి 18 ఏళ్ళకు మన దివంగత యువ ప్రధాని మార్చి, ఎన్నికల రంగంలోకి దించలేదా? మరి ఓటు వేసే వారికి రాజకీయ అవగాహన, సమాజంలోని మార్పులను చూసే విజన్ కావాలి కదా? ఇది మరి ఆకాశం నుండి ఊడిపడుతుందా?

అలాఅయితే ఓటు హక్కు 30 ఏళ్ళు నిండి జీవితంలో స్థిరపడ్డవారికి మాత్రమే కలిగించాలి. తద్వారా మన సమాజంలో కీలక మార్పుకూడా చోటు చేసుకుంటుంది. మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం కూడా కలగవచ్చు.

ఎన్నికలొస్తే తమ ఝెండాలు మోయడానికి, జేజేలు కొట్టడానికి,  దొంగ ఓట్లు వేసేందుకు యువకులు కావాలి. కానీ తమ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం రాజకీయాలొద్దు చదువుకోవాలని సుద్దులు చెబుతారు.  ఇది మోసపూరితం కాదా?

రాజీనామాలు కోరడం ప్రజల ప్రజాస్వామిక హక్కు


తమకోసం ఏదో చేస్తారని తమ అమూల్యమైన ఓటు హక్కును వేసి గెలిపించిన ప్రజలకు, వారి ఆకాంక్షలు తీరేందుకు రాజీనామాను ఒక ఆయుధంగా ఎంచుకున్నప్పుడు, ప్రజా ప్రతినిధిగా వారి కోరికను మన్నించాల్సిన బాధ్యత వీళ్ళపై లేదా? ఎంతసేపు మేడమ్ ఏదో అంటారని, తాము పెట్టిన పెట్టుబడులు తిరిగి రాలేదన్నది  లోపల వుండి బయటకు ఏవో సాకులు చెపుతున్న వీళ్ళని ఏమనాలి? శాంతియుత మార్గంగా, ప్రజాస్వామిక హక్కుగా తమ డిమాండు సాధన రూపంగా ప్రజలు  ఎంచుకున్న అస్త్రాన్ని అంతే ప్రజాస్వామికంగా చేపట్టాల్సిన కనీస నైతిక బాధ్యత ప్రజా ప్రతినిధులుగా వీరందరిపై వుంది. ప్రజల ఆశలు నెరవేరిన నాడు వీళ్ళనే ఆజన్మాంతం ఎన్నుకొని తమ ఏలికలుగా సింహాసనంపై ప్రజలే కూచుండ బెడతారు. కావున రాజీనామా అస్త్రాన్ని కింది స్తాయి నుండి పార్లమెంటు వరకు అందరు ప్రజా ప్రతినిధులు ప్రజలపై గౌరవం, నమ్మకముంచి బాధ్యతగా, తమ ధీరోదాత్తతకు గుర్తుగా ప్రయోగించాలని అందరి కోరిక.