స్మృతిలో

నవ్వుల రేడు రాజబాబు గారి జయంతి నేడు..


నవ్వులరేడు


తెలుగు సినీ వినీలాకాశంలో తన హాస్య నటనతో అలరారించి తన దైన శైలిలో ఓ ప్రత్యేక ముద్రను వేసి మనందరి మదిలో చిరకాలం గుర్తుండిపోయే తన నటనా వైదుష్యంతో, సమాజంలో తోటి మనుషులకు సాయపడే ధర్మగుణంతో తన జీవితాన్ని సార్థకం చేసుకొన్న హాస్యనట చక్రవర్తి రాజబాబు గారి జయంతి సందర్భంగా నేడు ఆయన నటనను మరో మారు పునఃస్మరించుకుంటూ ఓ మారు మనసారా నవ్వుకుంటూ ఆయనకు నివాళినర్పిద్దాం.

నవ్వుల రేడుగా వరుసగా 7 మార్లు ఫిలిం ఫేర్ అవార్డులు తీసుకున్న మొదటి కమెడియన్ మన హాస్యరస రాజబాబు. మహాకవి శ్రీశ్రీకి తోడల్లుడు మన రాజబాబు. చిన్న వయసులోనే చనిపోయి మనందరినీ విషాదంలో ముంచిన హాస్యరాజును మరోమారు పలవరిద్దాం..

వీళ్ళు కసబ్ కంటే నేరస్తులుకారా?


పాతికేళ్ళ క్రితం పాతికవేలమంది ఘోర మరణానికి కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ పై పెట్టిన కేసు నిందితుల ఆరోగ్య సమస్యలను కారణంగా చూపి న్యాయమూర్తి వారికి రెండు సం.ల జైలు, లక్ష రూపాయల జరిమాన విధించి చెరో పాతిక వేల పూచీకత్తుతో బైలు మంజూరు చేయడం చూస్తుంటే న్యాయ దేవత విగ్రహానికి కాదు ఈ బతికున్న న్యాయమూర్తుల కళ్ళకు గంతలు కట్టుకున్నారనిపిస్తుంది. ఇన్నేళ్ళ తరువాత ఇంత నామ మాత్రపు శిక్షలతో సరిపెట్టడం చూస్తుంటే డబ్బున్న వాడు, అధికారం అండగా వున్నవారికేం పీకలేమన్నది అర్థమయి మూగగా ఆక్రోశించడమేనా అనిపిస్తోంది. ఈ కేసులో మొదటినుండి ఆ కంపెనీ వాదనలను సుప్రీంకోర్టు వారు కూడా సమర్థిస్తూనే వచ్చినట్లు తెలుస్తోంది. వారు భారత దేశంలో పరిశ్రమలు పెట్టి, ఇక్కడి కోర్టు పరిథిలోకి రామంటే నోరుమూసుక్కూచున్న పాలక వర్గాల తీరు గర్హనీయం. ఇది ఆనాడే అంతర్జాతీయ న్యాయ స్థానం ముందు పెట్టి వుంటే దోషులకు సరైన శిక్షపడేదేమో? ఏనాడూ దీనిని సరిగా పట్టించుకోలేదు. బాధితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం నేటికీ అందలేదు.

ఈ కంపెనీ కారణమైన ఘోరకలి కసబ్ చేసిన దానికంటే నేరం కాదా? కనీసం వీళ్ళపై హత్యానేరం మోపబడలేదు. దర్యాప్తు చేసిన సి.బి.ఐ. వారి కళ్ళుకూడా ఈ దుర్ఘటనలో పోయుంటాయి. ఆ కంపెనీ చైర్మన్ ఆండర్సన్ గాడి వూసే లేదు. ఎందుకంటే వాడు తెల్ల తొక్కగాడని వదిలేసి వుంటారు. ఇది అమెరికా వాడి తొత్తుల పాలన కాబట్టే ఇలా జరిగింది.

అంతుచిక్కని వ్యాధులతో, అంధత్వంతో ఎందరి జీవితాలో నాశనంచేసిన కంపెనీని ఏం చేయలేని వారు ఈ దేశంలో అణువిద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడం ఎంతవరకు సమంజసం. బాక్సైట్, జింక్, రసాయన పరిశ్రమల వ్యర్థ పదార్థాలు, థర్మల్ విద్యుత్ కేంద్ర కాలుష్యాలకే జనం యిప్పటికే అంతుచిక్కని రోగాల బారిన పడుతుంటే కొత్తగా అణు విద్యుత్ ప్రాజెక్టులు పెడతాడంట మన ప్రధాని. దానికి ఇక్కడ మన సి.ఎం. కూడా వంతపాడుతున్నడు. భోపాల్ దుర్ఘటనను అంత ఈజీ గా తీసుకున్న పాలక వర్గం ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యతలేని అధికార గణం వున్న ఈ దేశంలో యిటువంటి ప్రమాదకర ఫ్యాక్టరీల స్థాపనతో ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడటాన్ని అడ్డుకోలెకపోతే ఈ విధ్యంసకర అభివృద్ధికి కోట్లాదిమంది బలికాక తప్పదు. భోపాల్ మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మన భవిష్యత్ పట్ల కూడా ఒకమారు ఆలోచిద్దాం.

వీరజవానులు-హిమపాశంమనం రోజూ యింత ధైర్యంగా గుండెలపై చేయేసుకొని నిదురపోతున్నామంటే

రేపటి సూర్యోదయం చూస్తున్నామంటే ..

మన రోజువారీ  వ్యాపారాలు, వ్యవహారాలు

ప్రేమలు, పెళ్ళిళ్ళు, పురుడులు, చావులు,

ఎన్నికలు-రాజకీయాలు, ఉద్యమాలు, ధర్నాలు,

వంటలూ-వార్పులూ,

సినిమా రిలీజులు, గలీజులు,

పబ్ లూ-బార్లూ , తాగుడూ-తూలుడూ..

కుట్రలూ-కుహకాలు,

అంతా సాఫీగా, సాదాగా, భారీగా

ఎవరికి వారి పరిమాణంలో

జరిగిపోతున్నాయంటే

వీటి వెనక ఓ అదృశ్య శక్తి అదే మన

వీరజవానుల రెప్పవేయని కాపలా

వారినే కప్పిన హిమపాతం యమపాశమయి

వారి కలలను కల్లలు చేయడం పెను విషాదం

వారి అమరత్వానికి నా గుండెలనిండిన  నిలువెత్తు SALUET

(కాశ్మీర్ దగ్గర్లోని గుల్బర్గా వద్ద హిమతుఫాన్ లో చిక్కుకొని అమరులైన 17 మంది వీరజవానుల స్మృతిలో)

నాన్న గుండె ఆగింది..


చిన్నారి తన చిట్టి పాదాలతో

గుండెలపై ఆడిన క్షణాలు గుర్తొచ్చి

ఒక నాన్న గుండె ఆగింది


తనకు తినిపించిన గోరుముద్దలలోని

ఎంగిలి మెతుకు తీయదనం గుర్తొచ్చి

ఒక నాన్న గుండె ఆగింది…


తన నునులేత నుదుటిపై

పెట్టిన ఆత్మీయ ముద్దు గుర్తొచ్చి

ఒక నాన్న గుండె ఆగింది…


బాయిలర్ లోంచి డాడీ డాడీ అన్న

ఆర్తనాదం వినిపించి

ఒక నాన్న గుండె ఆగింది…

ఊపిరి వున్నంతవరకూ కొట్లాడదాం..


చావు దానంతటదే రావాలని కాళ్ళు బార్లా చాపుకొని

ఎదురుచూసే వాళ్ళు కోట్లాదిమంది

కానీ చావుకు ఎదురు నిలిచి పోరాడే వాళ్ళు కొద్దిమంది


రాజకీయ బేహారుల మోసాలకు

గుండెలు భారమయి చావుని ఆహ్వానిస్తున్న తీరు

బాధాకరం

ఇది కాదు మన వారసత్వం


శత్రువు గుండెల్లో నిదుర పోయిన

పెద్ది శంకర్. . . . . లలా

మండే నిప్పు కణికలై భూమ్యాకాశాలు

దద్ధరిల్లేలా పొలికేక కావాలి మనతరం


చావు గుండెల్లో నిదురపోదాం

ప్రజల కనులలో మెరిసే ఆశా కిరణాలవుదాం


ఆత్మ బలిదానం కాదు

బలిపీఠంపై వారినే కూర్చోబెడదాం


(తమ నేలతల్లి విముక్తి కోసం ప్రాణాలర్పించిన వేణు, సువర్ణల స్మృతిలో)


ఉద్యమాల సంద్రమే


గుండె గుండెంతా

గాయాల కూడలైనప్పుడు

జీవితం

పోరాటాలకేంద్రమే

ఉప్పొంగే

ఉద్యమాల సంద్రమే.

..అలిశెట్టి ప్రభాకర్  (12.01.1954-12.01.1993)

(అంతిమ శ్వాసదాకా విప్లవోద్యమ అభిమానీ, కవితా చిత్రశిల్పీ, ఫోటో చిత్రకారుడూ అయిన ప్రభాకర్ స్మృతిలో ఆయన పదునైన కవితా పాదం)