స్పూర్తి

మరో సామాన్యుని పక్షపాతి (K.G.కన్నాభిరాన్) ఇకలేరు


హక్కుల వాది


ఆయనను
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
మానవహక్కుల కొరకు ఉద్విగ్నంగా పోరాడే న్యాయవాది’
అంది..

నక్సల్బరీ తరం నాయకుడు
సత్యనారాయణసింగ్
‘ప్రాసిక్యూటర్లకు ప్రాసిక్యూటర్’ అన్నాడు..

ఒకప్పటి మానవహక్కుల నేత, జర్నలిస్టు,
ఇప్పుడు సంఘపరివార్ సిద్ధాంతకర్త
అరుణ్ శౌరి
‘లోకాధివక్త’ అన్నాడు..

ఆయన
నాలుగు దశాబ్ధాలుగా
న్యాయవాద వృత్తిలో
పోరాడే ప్రజల హక్కుల
పరిరక్షణ కోసం
అహర్నిశలు శ్రమిస్తున్న
అసాధారణ మేధావి

ఆంధ్రదేశంలోనే కాదు
దేశం మొత్తానికే
పౌర, ప్రజాతంత్ర హక్కుల స్ఫూర్తికి
పర్యాయ పదంగా ఎదిగినవాడు

మనిషిగా సామాన్యుడు
వాదనా పటిమలో అసామాన్యుడు
తోటి మనిషి హక్కులను కాపాడడంలో అనితర సాధ్యుడు

పై వాక్యాలన్నీ చదవగానే ఈ తెలుగునేలపై వున్న ఆ అసామాన్యుడు ఎవరో ఇప్పటికే అర్థమై వుంటుంది. ఈ వాక్యాలు 24 గంటలు అన్న ఆయన ఆత్మకథాత్మక సామాజిక చిత్రం అనే పుస్తకం వెనక అట్టమీదున్నవి. ఆయనే మనందరి హక్కుల న్యాయవాది కె.జీ.కన్నాభిరాన్. ఆయన ఈ సాయంత్రం 5.00 గం.ల ప్రాంతంలో అమరులయ్యారన్న వార్త సామాన్యులకు, నిరంతరం నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న వారికి అశనిపాతం. ఆయన లాంటి మరో న్యాయవాది పేదలకు, తాడిత, పీడిత వర్గాలకు ఇప్పట్లో మరల లభ్యంకావడం దుర్లభం. ఈ రోజుల్లో మనుషులలో పెరిగిపోతున్న నిర్లిప్తత, నిర్లక్ష్యం, వ్యక్తివాద ధోరణి, స్వార్థం మానవత్వాన్ని చంపేస్తున్న వేళ అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం కాలంలో ఇది అశనిపాతం..

జోహార్ కన్నాభిరాన్ జోహార్ జోహార్..

‘ఏంపిల్లడో’ వంగపండుతో టీ తాగిన వేళ..


ఉత్తరాంధ్ర గొంతు


విప్లవకవి వంగపండు ప్రసాదు ఈ పేరు గత నలభై ఏళ్ళుగా ఆంధ్ర దేశాన వినిపిస్తూనే వుంది. ఆయన రాసిన పాటలు, భూమిభాగోతం నాటకం జనంలో కలగలిసిపోయాయి. ఉత్తరాంధ్రలో బుగతల దోపిడీ ఎలా కొనసాగిందో, దానికి గ్రామ కరణం, మునసబులు ఎలా తోడ్పడేవారో, వారికి వత్తాసుగా పోలీసులెలా లాఠీలు ఝలిపించేవారో కళ్ళకు కట్టినట్లు చూపించడంతో భూమిభాగోతం ఉత్తరాంధ్రనే కాక యావత్ తెలుగుదేశాన ఒక ఊపు ఊపింది ఆ రోజుల్లో. ఆయన రాసిన ఏంపిల్లడో ఎల్దమొస్తవా పాట యువకులను ఎంతో ఉత్తేజితులను చేసింది. అలాగే ఆయన డాక్ యార్డ్ లో పనిచేస్తూ తానెరిగిన కార్మిక జీవితాలనుండి పొందిన ప్రేరణతో రాసిన యంత్రమెట్లా నడుస్తు వున్నదో పాట కార్మికుల శ్రమను కళ్ళకు కడుతుంది. అలాగే ఊరిచివర మాలపేట అన్న పాట తొలి దళిత విప్లవ గీతంగా చెప్పవచ్చు.

అనుకోకుండా మేమిద్దరం ఈ రోజు తాను సైకిల్ పై వెళుతుండగా పలకరించడంతో కలుసుకున్నాం. చాలా రోజులుగా ఆయన ప్రత్యేక ఉత్తరాంధ్ర సాధనకు తన వంతు కృషిలో భాగంగా ధబేళ్ దుబేళ్ కార్యక్రమాలతో బిజీ అయి కలవడం కుదరలేదు. అలాగే ఆ మధ్య తాను వై.యెస్.మరణానంతరం ఏంపిల్లడో పాట శైలిలో ఆయన గురించి పాట రాసి సాక్షి టీవీలో వినిపించడంతో ఎదుర్కొన్న విమర్శలు, ఆ తరువాత నుండి ఆయన కొంత నాకు మానసికంగా దూరమయ్యారు. ఇవి వంగపండు జీవితంలో మొదటినుండి వున్నాయి. అంతా సినిమాలకు రాయకూడదనుకున్నప్పుడు ఆయన రాసి విమర్శలకు గురయ్యారు. అలాగే మగధీర సినిమాలో వాళ్ళు తన పాట చరణాలు వాడుకున్నందుకు నిరసన తెలిపి ఏదో మొత్తం పుచ్చుకొన్నాడని అనుకున్నారంతా. అయినా వంగపండు తన జీవన శైలినుండి దూరం కాలేదు. ఆయన ఆర్థికంగా పడ్డ ఇబ్బందులు ప్రత్యక్షంగా ఎరిగిన నాకు, వాటి ఒడిదుడుకుల వలన, కుటుంబ వత్తిడులకు లోనయి కొంతమేర ఆయన అటూ ఇటూ అయిన కాలం ఈ మధ్యనే. అయినా దాని ప్రభావం తన నడవడికపై ఎక్కడా కనపడదు.

చాలామందికి మల్లే విప్లవం పేరుచెప్పి లాభాలార్జించే మనిషంటే ఇక్కడ నమ్మరెవరూ. ఎందుకంటే ఆయన మాముందు ఏదీ దాచుకున్నది లేదు. తన పిల్లలచే మాత్రం ఎప్పుడూ చీకొట్టబడుతూ వుంటారు. తమను చిన్నతనంలో పట్టించుకోలేదని, పాటలు పాడుతూ తాను ఉద్యమాలలో వుండి తమను సరిగా చూడలేదని, వీటిలో వున్న చాలామంది తమ జీవితాలను సాఫీగానే సాగిస్తున్నారన్న వారి మాటలు కొంత నిజాలుగా కనిపించినా ఆయనకు తన పిల్లలంటే చాలా ప్రేమ. పెద్ద వాడు ఇప్పటికీ సరిగా జీవితంలో కుదుటపడలేదని బాధపడుతుంటాడు. కూతురు ఉష తానెలా వుంటానంటే అలా వుండమన్న స్వేచ్చ నిచ్చారు. ఆమె ఎంచుకున్న జీవితాన్ని తానెప్పుడూ అడ్డుచెప్పలేదు. చిన్న వాడు దుష్యంత్ కు చదువు చెప్పడానికి తన భూమిని తనఖాపెట్టి చదివించారు. ఆయనిప్పుడు హైస్కూలు టీచరయ్యడు ఈ మధ్య డిఎస్సీలో. అయినా ఆయనకు తండ్రి పట్ల తీవ్ర వ్యతిరేకత. తమకు ఆర్థికంగా ఇంకా బతికేందుకు తోడ్పడలేదని, ఉద్యమంతో మమేకమై డాక్ యార్డ్ లోని ఉద్యోగం రాజీనామా చేయడాన్ని తప్పుపడుతుంటాడు. అయినా వారికెవరికీ లోటు రానీయలేదు. వారివి గొంతెమ్మకోర్కెలు. వాటినే తీర్చడం తన ధ్యేయంగా పెట్టుకుంటే మనమీనాడు వంగపండు గురించి మాటాడేదే వుండదు. ఓ పక్క తమ తండ్రిని గొప్పకవి అంటూ పొగుడుతూ తిడుతుంటారు పిల్లలు. ఇది ప్రజల జీవితంలో మమేకమైన వాళ్లకు తప్పని స్థితే..

ఇప్పటికీ ఆయన గోచి బిగించి గొంగడి వేసుకొని పాడుతూనే వున్నారు. అది విప్లవ గీతమే కావచ్చు ఉత్తరాంధ్ర జాలరి పాటే కావచ్చు. చితికిన బతుకులను పాట కట్టి కనులముందుంచగల సత్తా తనలో ఇంకా వుందని, తన వారసత్వాన్ని తెలంగాణా బిడ్డలందుకున్నంతగా తన నేల నుంచి ఎవరూ రాకపోవడం బాధాకరమంటుంటారు.

తాను ఇటీవల రాసిన తొమ్మిది పాటలతో ఒక సీడీ ని రూపొందించానని, దాని ఆవిష్కరణకు తాను బావగా పిలిచే గద్దర్, గోరటి వెంకన్న, ఆర్.నారాయణమూర్తి వస్తున్నారని, విశాఖ ఆర్ కే బీచ్ లో నవంబరు 7 వ తేదీ సాయంత్రం కార్యక్రమం అనుకుంటున్నామని చెప్పారు. గోరటి ప్రస్తుతం లండన్ వెళ్ళాడంటూ ఫోన్ చేస్తే నీ పాటనందుకున్న మేము ఇలా విదేశాలలో తిరుగుతున్నా నువ్వింకా మీ నేలమీదే వున్నావన్నారంట. ఆ విషయం గర్వంగా చెప్తూ మనకెందుకు బ్రదర్ అలాపింటి ఆశలు. మనం మన జనంతో కలిసి వుండడమే నాకు గొప్ప అన్న ఆయన మాటలు ఆయనలోని నిరాడంబరత్వాన్ని తెలియజేసాయి.

ఆయన చాలా భోళా మనిషి. ఎవరైనా వంగపండు గారూ అని పలకరిస్తే చాలు తన పాట తనకు తెచ్చిన గుర్తింపు అంటూ మురిసిపోతారు. తాను ప్రత్యేకించి సిద్ధాంతాలు, వ్యాకరణాలు చదవలేదంటారెప్పుడూ. తాను పుట్టిపెరిగిన పల్లె వాతావరణం, చిన్నప్పటినుండి తాననుభవించిన, ఎరిగిన జీవితాన్ని, ప్రత్యక్షంగా చూస్తున్న జనజీవన వైవిధ్యాన్ని తన పాటలద్వారా వెలుగులోకి తెస్తున్నానంటారు. ఉత్తరాంధ్ర జానపదంలోని నుడికారాన్ని పట్టుకున్న వంగపండు తన పాటలలోని యాసలోని స్వచ్చత మల్లే తనతో మాటాడితే ఆ అమాయకత్వం, స్పందన ఎరుకై మనం కూడా ఆయన పాటకు గొంతు కలుపుతాం…

ఇలా ఈ మనిషి ఇప్పటికీ తాను నమ్మిన దానికి తన 66 సం.ల వయసులో కూడా ఉత్సాహంగా రోడ్డుపై చిందేస్తున్న తన ఆరోగ్యానికి తానే సంబరపడిపోతుంటాడు.

టీ తాగినంతసేపూ తన చుట్టూ పలకరింపులే..
ఆయన సెల్ నెం.9441305889

ఆయన గొంతులో వినండి ఏంపిల్లడో ఎల్దమొస్తవా..

దీపాలు ఆర్పితే (Earth hour) కర్బనం పోదంట!


ఈ రోజు రాత్రి 8.30 ని.ల నుండి ఒక గంట పాటు సుమారు 125 దేశాలలో అన్ని విద్యుత్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయడం వలన గ్లోబల్ వార్మింగ్ కాపాడవచ్చునని World Wildlife Fund (WWF) వాళ్ళు ఒక కార్యక్రమాన్ని రూపొందించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. కానీ విద్యుత్ రంగ నిపుణులు మాత్రం దీని వలన అంత వుపయోగంలేదని చెపుతున్నారు. అన్ని విద్త్యుత్ లైట్లు ఆపి వేసినా, సప్లై కట్ చేసినా సరే ఆ తరువాత పునఃప్రారంభ సమయంలో విపరీతమైన లోడ్ పడి అంతకు రెట్టింపు కర్బనం ఉత్పత్తి జరుగుతుందని తెలియజేస్తున్నారు.  దీని బదులు విద్యుత్ పరికరాల పట్ల సరైన అవగాహన కలిగించి, మామూలు బల్బుల వాడకం నుంచి సిఎఫ్ ఎల్ వంటి విద్యుత్ తక్కువ అవసరపడే వాటిపట్ల ప్రచారం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

చూడండి http://www.telegraph.co.uk/earth/environment/climatechange/7527469/Earth-Hour-will-not-cut-carbon-emissions.html

కానీ WWF వాళ్ళు మాత్రం ఈ Earth hour పాటించడంవలన ప్రజలలో విద్యుత్ వినియోగంపట్ల, పర్యావరణం  పట్ల  ఎరుక కలుగజేయవచ్చునని ఆశపడుతుంది.  ఏదేమైనా మన ఆలోచనలలో మార్పు రానంతవరకు ఏదీ అమలు కాదు. మన అస్తిత్వం ప్రశ్నార్థకం కాబడేంతవరకు దానిపట్ల ఎరుక వుండదు. Empire State of Building (New York), Big Ben (London), Eiffel Tower (Paris) ల దగ్గర కూడా మొత్తం చీకటే ఆ గంట.

ఏమైనా నేడు రాష్ట్ర విద్యుత్ పరిస్థితి మన వాతావరణాన్ని కాపాడే విధంగానే వుంది కదా సారూ..

ఆమె గెలిచింది – అతను ఓడాడు


82 వ ఆస్కార్ అవార్డు పోటీలలో తన మాజీ భర్తపై దర్శకత్వ శాఖతో పాటు ఉత్తమ చిత్రం అవార్డును కూడా సొంతం చేసుకొని ఆరు విభాగాలలో తన చిత్రం ది హర్ట్ లాకర్  జయకేతనం ఎగరవేయగా మహిళా దినోత్సవం రోజున మొట్టమొదటిసారిగా మహిళా దర్శకురాలిగా కేథరిన్ బిగెలో అవార్డు గెలుచుకోవడం ఎంతైనా అభినందనీయం. ఈ సందర్భంగా కెమరూన్ కూడా చప్పట్లతో ఆమెను అభినందించడం ముదావహం.

వీడియోలో ఆమె విజయదరహాసం..http://oscar.go.com/video/index?playlistId=167479&clipId=253278

ఉస్మానియా ఉద్యమ గర్జన విజయవంతం


నేడు ఉస్మానియాలో విద్యార్థుల గర్జన విజయవంతమయి తెలంగాణా గుండెచప్పుడుని నేల నాలుగు చెరలా వినిపించింది.

అవకాశవాద రాజకీయ నాయకులను తన గర్జనతో హెచ్చరించింది.

ఉద్యమానికి దిశానిర్దేశాన్నిస్తూ ఈ నెల 5న గుజ్జర్ల తరహా రైలురోకో అందోళనకు పిలుపునిచ్చింది.

ఢిల్లీ పెద్దల ఊగిసలాటను కట్టిపెట్టాలని వెంటనే రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ను వినియోగిస్తూ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసింది.

ఈ రోజు సభకు తెలంగాణా నలుదిశలనుండి కదిలివచ్చిన విద్యార్థి ప్రభంజనాన్ని రాజ్యం సైనికంగా ఆడ్డుకోజూస్తూ అక్రమ అరెస్టులు చేసింది. వారినందరినీ బేషరతుగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

నక్కజిత్తుల చంద్రబాబు కొత్తగా ఆలపిస్తున్న సమైక్య రాగాన్ని ఖండిస్తూ తీవ్రంగా హెచ్చరించింది.

ఏకాభిప్రాయ సాధన పేరుతో ఉద్యమంపై నీళ్ళు చల్లే కార్యక్రమంగా 5/01 సమావేశం ముగిస్తే శంషాబాద్ విమానాశ్రయం నుండి చెప్పులతో తరిమికొడతామని రాజకీయ బేహారులను హెచ్చరించింది.

ఫ్రెంచి విప్లవం నాటి విద్యార్థుల పోరాట స్ఫూర్తిని నేడు ఉస్మానియా పుణికిపుచ్చుకొని తెలంగాణా సాధనకు కృషి చేస్తున్నందుకు ఆలంబనగా నేడు లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణా విద్యార్థి లోకానికి సామాన్యుడిగ వినమ్రంగా జేజేలు పలుకుతున్నా.


కాలరెత్తిన దళితుడు


ఒంటినిండా బట్టా

కడుపునిండా తిండే కాదు

మనిషిగా గుర్తింపుకోసం

నీ యుగాల ఆక్రందనను

ఎలుగెత్తి చాటిన

దళిత జాతి సింహగర్జన

జై భీం

అందుకో మా ఆత్మగౌరవ

పోరాట వందనాలు

శ్రీకాంత్ కు పెట్రోల్ – కె.సీ.ఆర్.కు పండ్ల రసం


ఇదెక్కడి న్యాయం

ఎన్నిసార్లు మోసపోతాం


లాఠీలు విరిగింది మన వీపులపైన

జీపులెక్కింది నాయకులు


పెట్రోల్ పోసుకు తగలడింది మనం

పళ్ళరసం చప్పరించింది తొండ మొఖం


రక్తం చిందించింది విద్యార్థిలోకం

ఇంక ఉద్యమం నడిపేది మనం


కె.సి.ఆర్.లు కె.టీ.ఆర్.లు మనకొద్దు

థూ..  థూ..  ఎన్నాళ్ళీ బానిస బతుకు

జెండా పట్టేదీ మనమే

ముందడుగు వేసేదీ మనమే

యువ సునామీ..


సామాజిక పరిణామం వేగవంతం కావాలంటే ఆలోచనాపరుల ఆశయాలను ఆచరించే వాళ్ళు ముఖ్యం.  గత కొన్నేళ్ళుగా కెరీరిజం మోజులో పడి నా చల్లకుండ సల్లగా వుంటే చాలు నాగరాజా అనే మనస్తత్వాన్ని అలవర్చుకొన్న యువతరం తమ భవిష్యత్తు కుప్పకూలుతున్న నిజాన్ని ఆలస్యంగానైనా గ్రహించడంతో సమస్యలపై కదిలే స్పూర్తిని మరల చేగొనడం ఆనందాన్నిచ్చింది. సాఫ్ట్ వేర్ మోజులో గత 10 యేళ్ళుగా పడి కళ్ళముందు 21″ స్క్రీన్ తప్ప మరేదీ కనబడనంత కూరుకుపోయిన యువతరం చివరాఖరకు తమ చాప కింద నీరు ఆర్థిక మాంద్యంతో ప్రవేశించడంతో భవిష్యత్ శూన్యంగా గోచరించి మరల సమాజాన్ని ఆవలోకించడం మొదలుపెట్టడంతో కురువృధ్ధులు తమ అధికార పీఠాలు కదలబారడాన్ని గమనించి భయబ్రాంతులకు లోను చేయపూనుకున్నారు. కానీ ఉత్తుంగ తరంగంలా లేచిన విద్యార్థి లోకం రాబోయే రోజుల్లో వీరికి పెనుసవాల్ కానున్నది. ఓట్లు గుద్దే మరమనుషులుగా తయారుచేయ చూస్తున్న నాయకులను ప్రశ్నించే స్థాయికి చేరుకుంటోంది. యువత తలుచుకుంటే పెను మార్పు ఖాయం. కూలుతున్న తమ కుటుంబాల స్థితిగతుల కు కార్యకారణ సంబధాలను ఒకపరి ఆలోచిస్తే సత్యమేంటో తెలుసుకున్న క్షణం యువ సునామీ ఖాయం.