సందేహం

ఉరే సరి కానీ….కసబ్ కు ఉరే సరి అన్నది సరే కావచ్చు. నేరం చేసిన వాడు తప్పించుకోవడానికి ఎన్ని విధాలుగానైనా ప్రయత్నించినా సరైన శిక్ష పడాల్సిందే..

కానీ ఇక్కడ నాదో సందేహం అలా భేతాళ ప్రశ్నలా వెంటాడుతోంది.. తీర ప్రాంతం చుట్టూ అనేక గస్తీ నౌకా దళాలు, రాడార్లు పనిచేస్తుంటే అంత మంది విదేశీయులు అలా ఓ చిన్న బోటులో వచ్చి వందలాది మంది ప్రాణాలను నగరం నడిబొడ్డున తీసే సాహసం వెనక వున్న కుట్రదారులెవరోనన్నది ఇంత వరకు మన దర్యాప్తు సంస్థలు ఎందుకు కనిపెట్టలేక పోయారు??

ఇక్కడి రాజకీయ పోలీసు నిఘా వ్యవస్థలో వారికి సహకారం లేకుండా ఈ దారుణ మారణ కాండ జరిగి వుండేదా?? తామేదో గొప్ప ఘనకార్యంగా న్యాయం ధర్మం పాటించినట్టు చూపడానికి అక్కడికక్కడే కాల్చి వేసే అవకాశమున్నా పాతిక కోట్ల ఖర్చుతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్ట లేక పోయి ఇప్పుడు ఉరి సరి అంటున్నాయి మన నాలుగు స్తంభాలు..

సామాన్యుడా నీ సహనం గొప్పదిరా…

రెండు నాల్కల ధోరణి..


ఇటీవల సోదరుని హత్య చేసారన్న నేరాభియోగంపై పోలీసులే చేసిన స్టింగ్ ఆపరేషన్లో అరకోటి ఆఫర్ చేసిన కె.ఎ.పాల్ కి ఇంత వరకు ఒక్క సీటు కానీ ఎజెండా కానీ లేని రాజకీయ పార్టీ అధ్యక్షుడన్న నెపంతో బెయిల్ మంజూరు చేసిన న్యాయమూర్తి మరి జగన్ విషయంలో ఆ సూత్రం ఎందుకు వర్తించలేదో వివరిస్తూ హత్యా నేరం కంటే ఆర్థిక నేరమే చెడ్డదంటూ సెలవిచ్చారు. పోలీసులనే కొనడానికి వారి ద్వారా ఎదురుకాల్పుల పేరిట తన ప్రత్యర్థిని చంపడానికి పథకం వేసిన పాల్ ని వదిలి వేయడానికి ఏ న్యాయ సూత్రం చెప్పిందో లేక ఈయనను కూడా కొంత మొత్తానికి ప్రార్థన ద్వారా పాల్ కొని వేసాడో తెలియాల్సిన అవసరముంది.

నేను ఆర్థిక నేరాలకు పాల్పడిన జగన్ ను వెనకేసుకు రావడంలేదు. కానీ, ఒకే రకమైన కారణానికి బెయిల్ అడిగితే ఒకరికి మంజూరు చేసి ఇంకోకరికి తిరస్కరించడమంటే ఇక్కడ న్యాయస్థానాలు కూడా రాజకీయ ప్రత్యర్థుల పట్ల వేరు వేరుగా వ్యవహరిస్తున్నాయన్నదే. ఒక పెద్ద చేయేదో మేనేజ్ చేస్తున్నట్లుగా అర్థం అవుతూంది…

ఈ రెండు నాల్కల ధోరణి ఎందుకు??

వీళ్ళ గురించి వీళ్ళేమనుకుంటున్నారో???


తెగిన గాలిపటాలు

వీళ్ళకిప్పుడు రాజకీయాలెందుకు??

వీళ్ళు ఎందులో వుంటే మనకెందుకు???

వీళ్ళ గురించి వీళ్ళకున్న అభిప్రాయమేమిటో???

మీడియాలో స్పేసెందుకు దండగ కాదా???

రాజు చచ్చిన ఆర్నెల్లకు..


రాజు చచ్చిన ఆర్నెళ్ళకు రాణి ఏడ్చిందన్న సామెతలా వుంది AICC తీసుకున్న నిర్ణయం. జగన్ ను అడ్డుకునేందుకు వేసిన అస్త్రం తప్ప ఈ లక్షరూపాయల పరిహారం ఎందుకు ప్రకటించారో ఇప్పుడు వివరంగా చెపితే బాగుంటుంది. ఇది పార్టీ నిధి నుండి విడుదల చేస్తున్నారా లేక ప్రజల పన్నుల సొమ్మా ముందుగా తేట తెల్లం చేయాలి. ఇది పార్టీ సొమ్మయిన ప్రజలను పిండి వసూలు చేసినదే కదా? మొన్నటి వరకు ఆ చావులన్నీ ఉత్తివే అని అన్న వృద్ధ జంబూకాలు ఇప్పుడు మాట మార్చడం ప్రజల జ్నాపక శక్తిపై వారికున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది.

అసలు ఓ నాయకుడు చనిపోతే అంతమంది సామాన్య జనం చనిపోవడం ఈ విశ్వంలోనే ఎక్కడా లేదు. ఇలాంటి జీర్ణించుకోలేని సంఘటనలు జరిగినప్పుడు ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం మనకు తమిళ తంబీల నుంచి వచ్చిన ఓ దురాచారం. తరువాత్తరువాత ఇది ఓ ఆయుధంగా మారింది. వేలకోట్ల రూపాయలు సంపాదించుకున్న వారెవరికీ ఆగిపోని గుండె రెండు వందల పించను అందుకున్న ముసలి వారిది కావడం విషాదం. ప్రతి ఇంట్లో ఆ రెండురోజులు ఓ విషాదకర వాతావరణాన్ని నింపి ఇలాంటి సంఘటనలకు ప్రేరేపించిన చానళ్ళను ఏమనాలో తెలీడంలేదు. ఆ తరువాత తమ తమ రాజకీయ ఊసరవెళ్ళితనాన్ని బయటపెట్టుకొని ఎవడి గోడు వాడు వినిపించడం మొదలు పెట్టారు.

వారసత్వంగా అధికారం రాకపోతుందా అని ఆశించి భంగపడ్డ యువనేత తన ఆఖరి అస్త్రంగా ఓదార్పు యాత్ర చేపట్టడంతో పెరుగుతున్న ఆయన ఇమేజిని దెబ్బకొట్టే చివరి ప్రయత్నంగా కాంగ్రెస్ నాయకత్వం ఈ పేకేజీ ప్రకటించింది. తుఫాను వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించి మరణించిన వారిపట్ల ఇలాంటి సానుభూతి ఏనాడూ చూపిన దాఖలాలు లేవు. కొన్ని వేలమంది రైతులు మన రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర విదర్భ ప్రాంతం, యూ.పి.లో, పశ్చిమ బెంగాల్ మొ.న రాష్ట్రాలలో ఆత్మ హత్యలు చేసుకుంటే వారిపట్ల కూడా పార్టీపరంగా ఇటువంటి పేకేజీ ఇవ్వలేదు. ప్రభుత్వ పరంగా వారిని పూర్తిగా ఆదుకున్నదీ లేదు. అలాగే తెలంగాణా కోసం ఆత్మాహుతి చేసుకున్న యువకుల పట్ల కనీసం ఓ సానుభూతి వాక్య తీర్మాణం కూడా చేయలేదు.

మొన్నటికి మొన్న చంద్రబాబు బాబ్లీ అరెస్టు జరిగినప్పుడు రోజూ ఓ పదిమంది చనిపోయిన లిస్టు ఆంధ్రజ్యోతిలో వచ్చేది. కానీ వాళ్ళెవరూ దీని గురించి స్పందించిన దాఖలాలు లేవు. ఇవన్నీ నిజమైనవి అయితే వదిలేస్తారా? ఎందుకో కావాలని ప్రజల మనోభావాలను, మానసిక ధైర్యాన్ని దెబ్బకొట్టే ప్రయత్నాలను ఈ మధ్య మీడియా చేస్తోంది.

ఇటువంటి పేకేజీ పలాస్త్రీలు రాజకీయాలను మరింత భ్రష్టు పట్టిస్తాయన్నది సత్యం.

బాబ్బాబూ దయచేసి ఈ ధర్మ సందేహాన్ని తీర్చరూ..చదరంగం విజేత విశ్వనాథన్ ఆనంద్ భారతీయుడు కానప్పుడు శ్రీమతి సోనియా గాంధీజీని ఎలా ఒప్పుకోగలమో చెప్తారా?

Are poets perverted?


నాకీ సందేహం ఎప్పటినుంచో వుంది. ఇది కవులను అవమానించాలని కాదు. నేనూ అప్పుడప్పుడు రాస్తుంటాను. కానీ సందేహ నివృత్తి చేసుకుందామని.

కవి మామూలుగా అందరిలా చూడడు, అందరిలా ఆలోచించ లేడు. ఏదో తెలిసీ తెలియని సంఘర్షణ వెన్నంటి వేటాడుతుంటే కాగితంపై అక్షరంగా బలవుతాడు. ఇది కవి ప్రత్యేకత. అదే అదే నాకనిపిస్తుంది ఎందుకిలా అని. ఇది మానసిక దుర్భలత్వమా? ధీరోదాత్తతా? అందరిలా వుండలేనితనమా? ఉక్కపోతను భరించలేనితనాన్ని అందరిలా లౌక్యంగా, కపటంగా దాచుకోలేనితనమా? ………

ఇలా నా సందేహాన్ని మీ ముందుంచాను. మీ జవాబు కోసం… మీకు కోపమొచ్చినా…