సంఘీభావం

ఆప్కో వస్త్రాలను కొందాం..


apco_logo-------final_0
ఈ రోజు సాయంత్రం విజయనగరంలో గంటస్తంభం దగ్గర్లోని ఆప్కో వారి షాపులో దుప్పటి, తువాలు, లుంగీ కొన్నాను. బిల్ చెల్లించే సమయంలో సేల్స్ మేనేజర్ థాంక్సండీ అంటూ సార్ మీరిలా కొనడం ద్వారా చేనేత కుటుంబాలను ఆదుకొన్న వారవుతారు. మాకైతే ఉద్యోగాలున్నాయి జీతాలు వస్తాయి కానీ ఈ వృత్తినే నమ్ముకున్న కుటుంబాలకు తాము శ్రమపడి నేసిన బట్టలు అమ్మబడడం ద్వారా తిండి దొరుకుతుంది. మీకు మరో మారు నమస్కారమంటూ తను కళ్ళలో నీళ్ళు పెట్టుకోవడం చూసిన మాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. తప్పకుండా మళ్ళీ వస్తామని మా ఫ్రెండ్ నేను వచ్చాం భారమైన మనసుతో.

మిత్రులారా..
దయచేసి ఆప్కో వారి వస్త్రాలను వీలున్నంత మేర వాడడానికి ముందుకు వచ్చి చేనేత కార్మికులను ఆదుకొనే ఉడతా సాయం చేయగలరని మనవి. ఈ వస్త్రాలు చాలా మన్నికైనవి కూడా.

చేనేత వస్త్రాలను కొందాం. చేనేత కార్మిక కుటుంబాలను ఆదుకుందాం.

ఖాళీలను పూరింపుము..


ఇంతకీ ఈ ఆరాట పోరాటమంతా హైదరాబాద్ కే పరిమితమవుతున్నట్టుంది..

రోజుకో లక్ష గళార్చన పేరుతో సాగుతున్న అరణ్య రోదనంతా ఈ ఒక్క తీరని కోరిక కోసమేనా?

క్లారిటీ లేని ఉద్యమ ప్రస్థానం జన దైనందిన జీవితాన్ని సంక్షుభితం చేస్తోంది..

రోజుకో వాయిదాతో నెట్టుకొస్తున్న హైకోర్టు వారినీ మేనేజ్ చేసే శక్తులకు జోహార్లు..

ఈ సూపర్ హీరో చివరి మజిలీ ఏ పార్టీలోకో సూచాయగా తెరముందుకు వస్తోంది..

తిరగడం మరచిన బస్సు టైర్లు చివరికి కాలే కడుపుల రబ్బరు వాసనతో కుదేలవుతున్నాయి..

సర్కారీ బళ్ళకు దూరమైన పలక బలపం మాస్టారి గారి కొడుకు కార్పొరేట్ కాన్సెప్ట్ స్కూళ్ళలో భద్రం..

రాజకీయ తోలుబొమ్మలాటల తైతక్కలతో విమానయాన సర్వీసులకు ఢిల్లీ హోటళ్ళకు గిరాకీ బాగుంది..

సిగ్గులేని ముఖాలను గొట్టాలముందు ఊదరగొట్టే రోజు వారీ పాచి డైలాగులను వినలేక మా టీవీ బంద్..

కాళ్ళు బార్లా చాపుకొని ఈజీ చైర్లో వాలి కళ్ళపై తడి గుడ్డ వేసుకొని రిలాక్సవ్వు తమ్మూ..

మరికాసేపట్లో రక్షణ మంత్రి గారూ గృహమంత్రి గారూ ఆసుపత్రినుంచి రిలీజయి వస్తారు…

జయహో………………… ఖాళీలను పూరింపుము….

భర్తల కోసం భార్యల ఆక్రోశం..ఏ కారడవిలో వున్నాడో, ఎప్పుడొస్తాడో, ఎలా వస్తాడో, బతికి వస్తే సంతోషం లేకపోతే నుదుట కుంకుమ చెరిగిపోయి తను పిల్లలు అనాథలయి బతకాలని, ప్రతి క్షణం తన కోసం కల కంటూ బతక లేక, చేస్తున్న ఉద్యోగం ఎవరికోసమో అర్థం కాక, తను ఏం తిన్నాడో ఎలా వున్నాడో తెలీని అగమ్యగోచరంలో ఓ భయానక వాతావరణంలో ఒంటరితనం భరించలేక గత మూడు రోజులుగా రోడ్లపై కొచ్చి తామూ మనుషులమేనని గుర్తించాలని పిల్లా పాపలతో ఓ ఆడ మంత్రి వున్న శాఖలోని మహిళలంతా ఆక్రోశిస్తే అదే శాఖలోని మరో సుఖం మరిగిన దున్నలు వెటకారం చేస్తే చెప్పే ఆయుధంగా తిరగబడి పిల్లినైనా గదిలో బంధిస్తే ఏం చేస్తుందో చేసి చూపారు స్పెషల్ పోలీసు బెటాలియన్ సాయుధ పోలీసుల భార్యలు…

వారి ఆవేదన వెనక దాగి వున్న ఎన్నో కఠోర సత్యాలు నేటికి మీడియా ముందుకొచ్చి అందరికీ తెలిసాయి. నిజానికి యిలా తమ దోపిడీ పాలనకు వత్తాసుగా తమకు రక్షణగా పనిచేస్తున్న వారి పట్ల యింత నిర్దయగా వ్యవహరించే ప్రభుత్వం వారి పై అధికారులకు యివన్నీ తెలియనివా? బ్రిటిష్ కాలం నాటి ఆర్డర్లీ వ్యవస్థను ఈనాటి ప్రజాస్వామ్యమని చెప్పుకొనే పాలనలో కూడా అమలు చేస్తూ కింది స్థాయి పోలీసును బానిసగా చూస్తూ దొర పెత్తనం చెలాయించే వీళ్ళకు నడి బజారులో కాలర్ పట్టుకోవద్దా. వారికి లేని హక్కును వారి భార్యలు చేసి చూపారు. ఇదే విధంగా ఆ పోలీసులే స్వయంగా చేసి వుంటే వారిపై క్రమశిక్షణా చర్యలంటూ భయపెట్టే వారు. అలాగే ఇక్కడ మరో విషయం ఇన్ని లక్షల మంది పోలీసులలో చాలా వరకు ఎస్.ఐ.కంటే దిగివ స్థాయి సిబ్బందంతా దిగువ మధ్య తరగతి, బీద కుటుంబాలనుంచి వచ్చినవారే. ఈ ఉద్యోగమూ లేకపోతే బతకలేమని చేస్తున్న వారే. ఈ విషయమెరిగిన పాలకులు వీరిపట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్నారు.

కావున వీరి డిమాండ్లన్నీ సహేతుకమైనవి కాబట్టి వీరిని మనుషులుగా సంసారులుగా గుర్తిస్తూ అంగీకరించేందుకు పాలక వర్గంపై అన్ని వర్గాల ప్రజలు వత్తిడి తేవాల్సిన అవసరముంది.

జూడాలకు మద్దతు తెలుపుదాం…


రాష్ట్రంలో గత నెలరోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె పట్ల ప్రభుత్వం రక రకాల వ్యాఖ్యానాలు చేస్తూ వైద్య విద్యార్థుల పట్ల ద్వేష భావాన్ని పెంపొందింప జేయడమే తప్ప వారి డిమాండ్ల పట్ల సముచిత వైఖరిని అవలంబించి సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా మొన్నటికి మొన్న 108 సిబ్బంది సమ్మె చేస్తే RTC డ్రైవర్ల తో నడుపుతామన్నట్టుగా ఆసుపత్రులను కూడా ఇష్తమొచ్చిన వారితో నడిపి ప్రజల ప్రాణాల పట్ల చులకన భావం చూపుతోంది.

జూడా ల డిమాండ్లలో మొదటిది రూరల్ సర్వీసు పట్ల వ్యతిరేకత. దీనిని సాకుగా చూపి ఒక్కో వైద్య విద్యార్థికి పాతిక లక్షలు ఖర్చు పెడుతున్నట్టుగా చెబుతోంది పాలక వర్గం. కానీ ఇది నిజం కాదు. ప్రభుత్వాసుపత్రులలోని రోగులపైన, ఆసుపత్రుల నిర్వహణ ఖర్చును కలిపి వైద్య విద్యార్థి ఖర్చులో కలిపి చూపుతున్నారు. గ్రామీణ ఆసుపత్రులలో నేడు రిటైర్మెంటుకు దగ్గరగా వున్న వైద్యులు తప్ప మిగిలిన పోస్టులన్నీ అప్పుడే రిలీవైన విద్యార్థులతో నింపి గ్రామీణ ప్రజల ఆరోగ్యం పట్ల చులకన చూపు చూస్తున్నది ప్రభుత్వం. ఎక్కడ ఏ ఆసుపత్రులలోను గ్రామీణ పిహెచ్ సిలలో ఎవ్వరూ స్థానికంగా వుండి లేక శ్రద్ధతో వైద్యం చేస్తున్న వారే కరవయ్యారు. అప్పటికే ఓ ఆరేడేళ్ళు కాలేజీలలో చదువు ముగించుకొని వచ్చిన వార్ని బలవంతంగా వారికి ఇష్టంలేని ఉద్యోగం చేయమంటే శ్రద్ధ వుంటుందా? ఈ విధంగా రెగ్యులర్ ప్రభుత్వ వైద్య ఉద్యోగాలను తగ్గిస్తూ పోతున్నది. తద్వారా వైద్య రంగాన్ని సంక్షేమ రంగం నుండి తప్పించే యత్నంలో భాగంగా గుర్తించాల్సిన అవసరముంది.

అలాగే స్టైపెండు పెంచమనడంలోనూ వారి డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించడంలేదు. వెనకబడిన ఉత్తరప్రదేశ్ కంటే తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు ఆర్నెల్లకోసారి నిధులు విడుదలచేస్తూ వారి చధువునకవసరమయ్యే వసతి సౌకర్యాల పట్ల శ్రద్ధ చూపకుండా వ్యవహరిస్తున్నారు. ఏ కళాశాలలోనూ గ్రంధాలయాలలో ఎప్పటివో పాత పుస్తకాలు తప్ప కొత్తగా వస్తున్న జర్నల్స్ కానీ వైద్య గ్రంధాలు కానీ లేని నిజం అందరికీ తెలిసినదే. ఒక్కో జర్నల్ సుమారు వెయ్యి రూపాయలు విలువగలవి ప్రతి నెలా కొనుక్కొని చదివే స్థోమత ఎంతమంది విద్యార్థులకు వుంటుంది. ప్రభుత్వ కళాశాలలలో చదివే విద్యార్థులలో అధిక శాతం మంది పేద మధ్యతరగతి బడుగు జీవుల పిల్లలే అయివుంటారన్నది నిజం కాదా..

వీళ్ళ సమ్మె జరిగే కాలంలో ఆసుపత్రులలో జరిగే సాధారణ మరణాలన్నీ లెక్కకట్టి వీళ్ళ ఖాతాలో జమచేయడం ఎంతవరకు సమంజసం?

ప్రతీ ఆర్నెల్లకోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు, సౌకర్యాలు పెంచుకుంటున్న పాలక వర్గం నిజానికి వైద్య విద్య పట్ల ఎంత శాతం నిధులు ఖర్చు చేస్తున్నదో బహిరంగ పరచగలరా? విడుదలైన నిధులలో ఎంత శాతం కళాశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు? ఎంత పెద్ద మొత్తంలో అధికారులు, రాజకీయ గణం బొక్కుతున్నారో బహిరంగంగా చెప్పగలరా?

ప్రజల డిమాండ్ల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే ముఖ్యమంత్రి మరో నీరో గా తన్ను తాను ఋజువు పరచుకోవడానికి తప్ప పాలన పట్ల శ్రద్ధలేదన్నది ప్రజలకు ఎరుకైనది. అలాగే వైద్యం పట్ల ఏమాత్రం అవగాహన లేని వారికి ఆ శాఖను అప్పగించి రౌడీలులా మాటాడిస్తున్నారు తప్ప సమస్యను సానుకూలంగా పరిష్కరించే కృషి జరగడంలేదు. ఈ విధంగా చేస్తూ చెంచా లాయర్లతో ప్రజా వ్యాజ్యాల ద్వారా కోర్తుల ద్వారా సమస్యను పక్కదారి పట్టించే యత్నం చేస్తూ నియంతలా వ్యవహరిస్తు వైద్య విద్యార్థులపట్ల ప్రజలలో ఏహ్యభావాన్ని తెచ్చే ప్రభుత్వ ధోరణిని ఖండిస్తూ జూ.డా.లకు మద్దతు తెలుపుదాం.

నెత్తుటి తడి ఆరకముందే..సోంపెటలో జరిగిన కాల్పుల సంఘటన నుండి ప్రజలు తేరుకొనకముందే పాలక వర్గం థర్మల్ ప్రాజెక్టులకు అనుమతి కొరకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. దీనిని కోరిన (అ)ధర్మాన ప్రసాద్ తనను మాత్రం ఈ ఉపసంఘంలో వేయొద్దని తప్పించుకొని వెనక నుండి మంత్రాంగం సాగించడానికి ముందుకు వచ్చాడు.

అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ప్రజల నిరసన వెనక ప్రతిపక్షాల కుట్ర వుందని ఉక్రోశం వెళ్ళగక్కుతున్నారు. కేంద్ర పర్యావరణ నిపుణులు పర్యటించి అక్కడ వున్నవి సారవంతమైన వ్యవసాయ భూములని, విలువైన నీటి నిల్వలు కలిగిన బీల భూములని, వాటిని ధ్వంసం చేయడం వలన మనిషి మనుగడకే ప్రమాదమని రిపోర్ట్ ఇచ్చినాయి. మరి ఇవేవీ పట్టనట్లు, తమ పెట్టుబడులకే ప్రాధాన్యతనిస్తూ ప్రజల నిరసనను తక్కువ చేసి చూపడానికి ప్రయత్నిస్తున్నారు.

ఒక్క థర్మల్ ప్రాజెక్టులు నెలకొల్పడమే అభివృద్ధికి నమూనానా? ఇవేమీ లక్షలాదిమందికి ఉపాథి కల్పించే పరిశ్రమలా? మరి వీటిని స్థాపించడం వలన ఎవరికి ఉపయోగం? దీనిలో ధర్మాన వాటా ఎంతో తేల్చాలి. ఎంతమంది చచ్చినా వీటిని నెలకొల్పుతానని భీషణ ప్రతిజ్నలు చేయడంలో ఆంతర్యమేమిటో? ఒక్కసారిగా వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తేల్చాల్సిన అవసరం వుంది?

నేటికి ఒక్క మంత్రి కూడా చనిపోయిన వారిని పరామర్శించే సాహసం చేయలేక పోయాడు. గత సం.కాలం నుండి ప్రజలు స్వచ్చందంగా చేస్తున్న నిరసనల వెనక రాజకీయ ప్రోద్భలం వుందనడం కుట్ర. అంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కానీ, హోం మంత్రి కానీ సందర్శించలేదంటే వీళ్ళకి ఉత్తరాంధ్రపై వున్న ప్రేమ ఏపాటిదో తెలుస్తోంది. మంత్రులంతా ఎవడి ప్రాంతానికి వాడే పరిమితమయి పోయారు. తమ పదవులను కాపాడుకోవడంలో వున్న శ్రద్ధ ప్రజల ఆకాంక్షలను, అవసరాలను తెలుసుకోవడంలో లేకపోయింది. నెపం ఎవడి మీదకో ఒకడి మీదకి నెట్టి వేయడం తప్ప మరోటి కాదు.

కాల్పులలో మరణించిన వారి నెత్తుటి తడి ఆరకముందే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరం. ప్రజల సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు వేరే మార్గం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

కర్ఫ్యూ


ఎక్కడినుండో సూటిగా వచ్చి తగిలిందొక రాయి

చివ్వున చిమ్మిన నెత్తురు

చేతిలో వున్న శిశువును మరింతగా

హత్తుకొని పరుగు…

ఎవరు చేసిన పొరపాటుకు

ఎవరికీ శిక్ష?

ఎందుకీ పొరపొచ్చాలు?

ఎవరి అధికార దాహం తీర్చడానికి?

నిశ్శభ్ధం  పెను నిశ్శభ్దం కమ్ముకున్న

చీకటిలో కేక పెట్టలేని గాయం!

ఝెండా ఎవరిదో చేతిలో పెట్టి పారిపోయిన

ఆకతాయి.. కడుపులో దిగిన కత్తి పేగులను

కుప్పగా పోసి పోయిన కర్కశం!

తను రోజూ  ఆడుకునే గల్లీలో

ఘజనీల దాడితో భీతిల్లిన కుఱాడి కళ్ళలోని

భయంపట్టదా మీకు?

రోజూ అలాయి బలాయి చెప్పుకునే చేతులు

నేడు అనుమానంగా బిగుసుకుంటున్న వైనం..

మొన్నటి హలీం తీపి, నిన్నటి ఉగాది పచ్చడి చేదు

యింకా నాలిక ముందు రుచిగా జ్నప్తికి వస్తున్నాయి!

ఈ అనుమానపు గీతలు గీసిన వాడి

గీత చెరిపెయ్య కలుద్దాం కలుద్దాం

తెలంగాణా ఉద్యమాన్ని NGO లా నడుపుతున్న కోదండరాం


తెలంగాణా ఉద్యమాన్ని గత డిసెంబర్ 9 ప్రకటన తరువాత ఉవ్వెత్తున ఎగసిపడిన తెలంగాణా ప్రజల ఆకాంక్షణు రాజకీయ ఐక్య కార్యాచరణ సమితిగా ఏర్పడ్డ రాజకీయ పార్టీలు ఎద్దు ఎండకు లాగ, పోతు నీడకు లాగలా ఒక్కో పార్టీ ఒక్కో పంధాలో పోతూంటే దాని కన్వీనర్ గా వున్న కోదండరాం గారు ఏమాత్రం పోరాట స్ఫూర్తిని రగిలించలేని నిస్సహాయ నాయకుడిగా ప్రకటనలకే పరిమితమయిపోయారు.

సహాయ నిరాకరణ చేపట్టాలని ప్రకటిస్తారు. అది పూర్తిగా జరిగేందుకు ఎటువంటి కార్యాచరణ లేకుండా ప్రకటిస్తే ప్రజలు ఎలా అమలుచేస్తారు. రోజు రోజుకు ఉద్యమం రాజకీయ నాయకుల ప్రకటనలకే పరిమితమవుతోంది తప్ప ప్రజల భాగస్వామ్యంతో నడిచే పోరాట రూపాలు లేక వెనకబడుతుండటంతో అనుమానాలకు తావిస్తోంది.ప్రభుత్వ కార్యక్రమాలును స్తంభింపచేసి, ప్రజలే తమ స్వయంపాలనా రూపాలతో సమాంతరంగా ఒక ప్రత్యామ్నాయ పరిపాలనా రూపాన్ని చూపగలగాలి.

మొన్నటికి మొన్న ఉస్మానియా విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో ఒక్క రాజకీయ పార్టీ వారి స్టూడేంట్సు విభాగం కూడా పాల్గొనకుండా అదేదో వారి స్వంత కార్యక్రమంగా మిగల్చడంతో, మానసిక వేదనకు గురైన యాదయ్య వంటి విద్యార్థుల ఆత్మబలిదానాలతో విషాదంగా ముగిసింది. అదే అన్ని విభాగాలవాళ్ళు ఆ రోజు వారికి మద్ధతుగా నిలిస్తే అది ఈ రోజు వేరే రూపంలో కనబడేది.

ఉద్యమం యొక్క స్ఫూర్తిని కొనసాగించే కార్యక్రమాలు లేక కొవ్వొత్తుల దీపారాధనలతో ముగిసిపోతోంది. ఎక్కడికక్కడ ప్రజలు రోడ్లపైకి వచ్చి స్వచ్చందంగా నినదించే కార్యరూపాలు లేకపోవడంతో ఒక స్తబ్ధత నెలకొంటోంది. రాజకీయ నాయకుల గండుపిల్లి వ్యాఖ్యానాలు చెల్లుబాటవుతున్నాయి.

రాజీనామాలు చేయాలన్న డిమాండ్ ను కూడా ముందుగా అందరితో చర్చించి జేఏసీ యే వాళ్ళచేత రాజీనామాలు తీసుకొని వుంటే ఈరోజు యిలా కప్పల తక్కెడలా పరిస్థితి వుండేది కాదు. కాంగ్రెస్, టీడీపీల మోసపూరిత మాటల మాయలో పడి గాలితీసిన బెలూన్ లా అయిపోయింది. యికనైనా నాయకుల ప్రభావంనుంచి బయటపడి, ప్రజలవద్దకు తీసుకువెళ్ళగలిగితే, ప్రభుత్వం దానికదే దిగివస్తుంది.

ఎంతసేపూ ప్రజలు తమ పించన్లు, ఇందిరమ్మ ఇళ్ళ గురించి ఆలోచన తప్ప, విద్యార్థులిచ్చిన స్ఫూర్తిని కొనసాగించాలన్న పోరాటదీక్షను చేపట్టలేకపోవడానికి కారణాలను వెంటనే కనుగొని ఉద్యమాన్ని ముందుకుతీసుకుపోయేలా కృషిజరగాలని కోరుకుంటూ..

ఆత్మ బలిదానాలన్నీ రాజకీయ హత్యలే!


నిన్న ఓయూ విద్యార్థుల  అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా ఆ ఉద్వఘ్న క్షణాలలో యాదయ్య తనకు తాను కిరోసిన్ పోసుకు నిప్పంటించుకొని తన చివరి ఊపిరి వరకు జై తెలంగాణా అని నినదించడం చూసైనా రాజకీయ పక్షాలులొ చలనం కలగలేదంటే, యిదంతా పథకం ప్రకారం వారి వారి వ్యాపారాలకు అనుకూలంగా ఉద్యమాలను మలచుకోవడంగా కనిపిస్తోంది. వరంగలె లో సవేరా టీవీలో జరుగుతున్నది చూస్తూ తట్టుకోలేక తాను కిరోసిన్ పోసుకు కాల్చుకుంది.

తెరాస వాడు ఎక్కడా ఒక్కడూ  కనబడలే. ఏబేరాల రాయబారాలలో కులుకుతున్నారో?

కాంగ్రెస్ వాడు ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగమన్నట్లు సి.ఎం. నేనంటే నేనని  ప్రకటించుకొంటు, స్వార్థ ప్రయత్నాలు మొదలెట్టారు.

తెదెపా వాళ్ళు కళ్ళు చిదంబరం (ఇది సింబాలిక్ గా మాత్రమే, మరోలా అనుకోవద్దు) కళ్ళులా అటొకటి, ఇటొకటి చూపుతున్నారు.

మొదటి అంకంనుండే తీవ్ర మీమాంస కలిగిన ప్రరాపా వారు ఊయలెటు ఊగితే ఆ చివర నాది అని ఊగుతున్నారు.

కొంగకు పళ్ళెంలో పెట్టిన పాయసంలా వుంది బిజెపి వాళ్ళ పరిస్థితి.

మజ్లిస్ వారిది ఎవరైతే నాకెంటి మా పాతబస్తీలో మాదే కదా మజిల్ పవర్, దేశం ఏ గుడ్డు కరిస్తే నాకేంటని కాచుక్కూచున్నారు.

యిలా రాజకీయ పార్టీలు ఎవరికి వారు వుంటే ప్రజలు మాత్రం తమకేమీ పట్టనట్లు తమ జీవితపు నౌకను ఎటు గాలివీస్తే అటు తెరచాపతో పాటు తెరల ముందు లాగించేస్తున్నారు.

నేటివరకు సుమారు 300ల మంది పైగా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇవన్నీ ఓట్టిపోవల్సిందేనా?

వారు కన్న  కలలను వారి కనురెప్పల మాటున బూడిద గావడమేనా?

ఈ రాజకీయ రాబందుల గళ్ళాను ప్రజలెప్పుడు పట్టుకు నిలదీస్తారో?

ప్రస్తుతం యిదంతా రాజకీయ వ్యవస్థ వైఫల్యమే. ఈ కారణంగానే అణచివేత విధానాన్ని అవలంచిస్తోంది. కౄర నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. అది చూసి విద్యార్హ్తి, యువజనులు తాము మోసపోతున్నామనే భావనలో ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. కావున యివి రాజకీయ హత్యలే.

ఎదలో యాదయ్య..తెలంగాణా తెలంగాణా తెలంగాణా

కోటి గాయాల వీణ

నేడు నీ రొమ్ము పాలు తాగిన వారే

నీ కడుపులో చేయిపెట్ట చూస్తున్నారు

వీరి మోసకారి మాటలకు యింకెంతకాలం

దగా పడతావు తల్లీ….


చూడు చూడు నీ గాయాలు మాన్ప

నెత్తురోడుతున్న నీ శిశువులను

ముళ్ళ కంచెలకావలకు నెట్టాలని చూస్తున్నాడు

ఈ కొత్త నరసింహావతారుడు

రక్తం రుచిమరిగిన తోడేళ్ళ గుంపు మధ్య

రణన్నినాదమై వేలగొంతులు నినదిస్తున్నాయి…


యిది పోరాట రూపం కాదనుకున్నా

కపట నాటకాల క్రిష్ణునికి ఈ కమురు వాసన

ముక్కు పుటాలకు తగులుతుందా?

అంతా దేవుళ్ళే, కానీ ఇక్కడ ద్రౌపది మానభంగం తప్పలే!


గుండెల్లో రోజుకో మాటల మంట రగిలిస్తుంటే

తమదైన ఏకాభిప్రాయాన్ని ఇలా అగ్నిప్రవేశంతో

ప్రకటిస్తున్న యాదన్నలను మా ఎదకు

హత్తుకుంటున్నాం…

బలి కోరుతున్నారా?


విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పాలక వర్గం కర్ఫ్యూ వాతావరణాన్నీ కల్పించి ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించడం చూస్తే ఈ రోజు మరో బషీర్బాఘ్ సంఘటన చేసేందుకు సమాయత్తమవుతున్నట్లుగా అగుపడుతోంది. 20,ooo ల మంది పోలీసులను మోహరించి ఖాకీ మయం చేసి యుద్ధవాతావరణాన్ని సృష్టించింది.

  • ఇంత నిర్బంధం అవసరమా?
  • ఉద్యమం తీవ్రరూపం దాల్చుతూ యువకుల ప్రాణాలను బలికోరుతున్నారా?
  • ఇది ఎవరి శాంతిభద్రతలు కాపాడడానికి?
  • ఈ భయానక వాతావరణాన్ని ఎవరికోసం సృష్టిస్తున్నారు?
  • ప్రశ్నించే వారే ఉండకూడదా?
  • అడిగే సాహసం చేయబూనడం నేరమా? పాలకవర్గం ఉద్యమాలను కౄరంగా అణచివేయడమే పరిష్కారమా?