విద్యార్థి

నెత్తుటి పసి మొగ్గలను చిదిమిన పాపులం మనమే కదా?


నెత్తుటి పసి మొగ్గలను చిదిమిన పాపులం మనమే కదా?

కాన్వెంటు చదువులకాశపడి ఇంత మందిని చేజేతులా చంపుకుంటున్నాం.
రైలు వస్తుందని అరిచి ఏడ్చినా బస్సునాపని డ్రైవర్ ది తప్పా? కాపలా లేని లెవెల్ క్రాసింగులను పట్టించుకోని ప్రభుత్వానిది తప్పా? ఊళ్ళో వున్న సర్కారీ బడులలో కనీసం ప్రాధమిక విద్య వరకైనా చదివించే ఓపిక లేని తల్లిదండ్రులదా? వారి మీద పడి శోకాలు తీసి మూర్చిల్లితే వారు మరల చిగురిస్తారా? ఎక్స్ గ్రేషియా ఎన్ని లక్షలిచ్చినా వారి ఊపిరి మరల పోసుకుంటుందా? ఆ ఇంట చిదిమిన దీపం మరల వెలుగుతుందా? అంతెత్తు ఎగిరిపడి కిలోమీటరుకు పైగా రైలు మహమ్మారి ఈడ్చుకు పోతుంటే వారి ఊపిరి తిత్తులు పగిలి గుండె చిద్రమై నెత్తుటి ముద్దలుగా మారిన ఈ భయ విహ్వల దృశ్యం మన మనసులనుండి చెరిగిపోతుందా? ప్రమాదం జరిగిన ప్రతిసారీ ఇలా జరిగి వుండాల్సింది కాదు, అలా చేసి వుండాల్సింది కాదు అనే ఈ నాయకులను అధికారులను ఎవరమూ నిలదీయలేమా? ఇంత ఘోర దృశ్యాన్ని మరల మరల మనం చూడవలసినదేనా? బతికున్న శవాలుగా ఈడ్వబడాల్సిందేనా?

పిల్లలూ మా తప్పులకు మా నోట్లో ఉచ్చబోయండి…ఏరగండిరా.. అయినా ఏం లాభం….

డిసెంబర్ 31???డిసెంబర్ 31 తర్వాత ఏమవుతుందోనని అంతా ఉత్కంఠ..

అటు లీకవుతున్న శ్రీక్రిష్ణ కమిటీ ఉద్దేశ్యాలు, గవర్నర్ గారి ఉత్సాహం జనాన్ని అయోమయానికి, ఆందోళనకి గురిచేస్తున్నాయి..

విద్యార్థిలోకం భవిష్యత్ ఏమవుతుందోనని తల్లిదండ్రుల భయం..
పరీక్షలు సజావుగా జరుగుతాయా అని ఉత్కంఠ… కేంపస్ కౌన్సిలింగ్ మిస్ అవుతారేమో పిల్లలని ఒకటే దడ…

అసలు ఉద్యమాలే వద్దు, రాజకీయాలు అవసరంలేదన్న వాదన ఓ వైపు, తమ భవిష్యత్ తెలంగాణాతోనే ముడిపడి వున్నదన్న వాదన బలంగా వినిపించిన విద్యార్థి నాయకత్వం ఓ వైపు..

మేము పెట్టుకున్న ఇంజినీరింగ్ కాలేజీ సీట్లు మిగిలి పోయిన దానికి తెలంగాణా ఉద్యమమే కారణమని యాజమాన్యాలు – అసలు మీ కాలేజీలలో లేని సౌకర్యాలు, విద్యార్థుల కంటే సీట్లెక్కువైనందునే మిగిలాయన్న వాదం ఈ వైపు…

ప్రభుత్వ యాజమాన్యాలలోని స్కూల్లు, కాలేజీల విద్యార్థులే వీటికి కారణమంటూ వారిని, వారి ఉద్యమాన్ని, నిబద్ధతను తక్కువంచనా వేసే వారికి గట్టి సమాధానమే దొరికింది..

కార్పొరేట్ కాలేజీల చదువుతో మొత్తం విద్యనే అందని ద్రాక్ష చేసి, వ్యాపారం చేస్తున్న వారు పిల్లల భవిష్యత్ గూర్చి మాటాడడం విడ్డూరం… బడుగు బలహీన వర్గాల వారి పట్ల వారికున్న చిన్న చూపు ఇక్కడ ప్రస్ఫుటమయ్యింది…

ఉద్యమం, తమ భవిష్యత్ ను కలగలుపుకుంటూ ముందుకు పోతున్నామన్న వారి దృఢ సంకల్పం ముందు వీరి వాదనలన్నీ తాటాకు చప్పులయ్యాయి. సమాజ మార్పు కోరే వారెవరైనా తప్పక ఆహ్వానించాల్సిన అవసరముంది. కెరీర్ ఒక్కటే కొలమానమైన నేటి వ్యాపార విద్య వలన నష్టమే ఎక్కువన్నది స్పష్టమైంది.. ఏమైనా వారికి అభినందనలు తెలియజేయకుండా ఉండలేము.

డిసెంబర్ 31 చావుగీతను చూపి భయపెట్టాలనుకోవడం మూర్ఖత్వం. అదే ఆఖరి అంకం కాదు. కాదు కూడా..

వాయిదాలు, మోసాలు వారికి కొత్త కాదు. అసలు ఈ కమిటీకి ఏ చట్టబద్ధతా లేదన్నది అందరికీ తెలిసినదే.. వీళ్ళిచ్చే సూచనలు, సలహాలు తెలియనివేమీ కాదు.

ఒక పక్క కావాలంటే అదనపు బలగాలను పంపుతామన్న కేంద్ర గృహమంత్రి గారు ఇప్పటికే తన మనసులోని మాటను బయటపెట్టారు. కావున 31 తరువాత వారు తెచ్చే కొత్త వెలుగులేమీ వుండవు. భూకంపాలేమీ రావు. ఉగ్గబట్టుకున్న సహనానికి పరీక్ష మొదలవుతుంది.. అంతే…

ఈ ఉద్యమం వలన సమాజ నాయకత్వానికి కొత్త నెత్తురందింది.. ఇంకా బలమైన రూపం తీసుకొని ఓ గుణాత్మక మార్పుకు పునాది కావాలన్నది ఆకాంక్ష..
(ఈ రోజు ABN ఆంధ్రజ్యోతిలో Open Debate programme చూసి)

పల్లెటూరి పిలగాడా.. బడిబాటనెక్కని పిలగాడా


మొన్న పాఠశాలలు మొదలైనప్పటినుండి బడిబాట వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. నేను పనిచేస్తున్న గ్రామం జనాబా 800 వుంటుంది. అక్కడ వున్న ప్రాథమిక పాఠశాలలో తరగతికి ప్రస్తుతం 10 నుండి  15 మంది విద్యార్థులున్నారు. ఇందులో మొన్న 12 మంది ఐదో తరగతి వాళ్ళకు టీసీ లివ్వడమైంది. అలాగే ఈరోజుకు ఒకటో తరగతికి పిల్లలను చేర్పించమని ఇంటింటికి తిరిగినా ఎవరూ కొత్తగా చేరలేదు. కారణం మాకు దగ్గరలో 2 కి.మీ.లలో కొత్తగా ఒక ఇంగ్లీషు మీడియం పాఠశాల ప్రారంభమైంది. ఈ పాఠశాల నిర్వాహకులు ఈ మధ్య పదవీ విరమణ చేసిన వారు, చేయబోతున్న వారూ. వాళ్ళే చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్ర.పాఠశాలలో చదువు చెప్పరు మా కాన్వెంటులో చేర్పించండని ప్రచారం చేస్తున్నారు. వీళ్ళనేమనాలి. నిన్నటి వరకు అదే స్కూళ్ళలో ఉద్యోగాలు చేసి సుమారుగా 30 ఏళ్ళకు పైగా అదే బతుకు తెరువుగా వుండి, తాము పనిచేసినప్పుడు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులకు సిఫారసులు చేయించుకొని నేడు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు. మా ఊరి ప్రధానోపాఢ్యాయుడు ఇదంతా చెబుతుంటే నిజంగా వాళ్ళని చెప్పుతీసి కొట్టాలనిపించింది. ఎందుకంటే ఈ పరిస్థితులలో వున్న ఈ రెండు పోస్టులలో ఒక పోస్టు తప్పక కొత్తగా వచ్చిన రేషనలైజెషన్ లో త్వరలో ఎగిరిపోతుంది. వున్న 5 క్లాసులకు ఒక్కరే టీచరై, విద్యార్థులెందరైనా పాఠాలు చెప్పక తప్పని పరిస్థితి ఎదురై, అటు నెల నెలా రిపోర్టులు రాసుకోవడానికి సమయం చాలక, న్యాయం చేయలేని పరిస్థితులలో ఏడుపొక్కటే తక్కువవుతుంది. ఇలా తలా ఒక చేయేసి ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలలు మూసివేసే స్థితికి చేరితే వున్న ఈ ఒక్క అవకాశమూ కోల్పోతే పేద విద్యార్థులకు సరైన విద్య లభించని పరిస్థితులలో మరల పాలేళ్ళుగా మారని స్థితి తప్పదు…


ఎదలో పొగబెడుతున్నదెవరు?


అంతా కలిసి నడవాల్సిన వేళ

అందరి వేళ్ళు కలిసి ఒకే పిడికిలవ్వాల్సిన క్షణాన

మండుతున్న నెత్తురు ఒకే నరంనుండి ప్రవహించాల్సిన సమయాన

కోట్ల గొంతులు ఒకే పొలికేకగా పిక్కటిల్లాల్సిన కాలాన

ఏ కాలనాగు విషపు బుసలు మిమ్మల్ని వెన్నాడుతున్నాయి

ఏ సైతాను మీలో ప్రవేశించి విచ్చిన్నం చేస్తోంది..

కలసి నిలబడితే కానీ

కలల అంచుమీద కత్తి సాము చేస్తే గానీ

గెలవలేమని తెలిసి మీరిలా….


ఎండిన పేగుల నాదం మీ నినాదం కావాలి…

రండి కదలిరండి కలసిరండి

కలబడి నిలబడి తెగబడి పోరాడండి…

(ఉస్మానియా జాక్ లో చీలిక వార్త చదివి ఆవేదనతో)

పరీక్షలకాలంలో చెలగాటమాడుతున్నారు..


ఇది విద్యార్థుల పరీక్షల కాలం. దీనిని వారి భవిష్యత్ కు పరీక్షాకాలంగా మారుస్తున్నారు. ఈ సమయంలో  విద్యార్థుల ఏకాగ్రతను చెడగొట్టే విధంగా IPL మ్యాచులతో వారి మనసును దారిమళ్ళించే షోలు జరుగుతున్నాయి. వ్యాపారమయమై పోయిన క్రికెట్ ఆట, రకరకాల వింత పోకడలతో జనం డబ్బులు కొల్లగొట్టే కార్యక్రమంగా మారిపోయింది. మీరనవచ్చు చదువుకునే వాడు ఇవన్నీ పట్టించుకోకూడదని. కానీ ఇంట్లో ఎవరో ఒకరు వీటి వెంట పడే వారుంటారు. అది ఎంతో కొంత వీరిపై ప్రభావం చూపదా? ఈ ప్రభావాల బారిన పడకూడదనే తాపత్రయంతో తమ తాహతుకు మించినదైనా తలమ్ముకునైనా సామాన్యజనాలుకూడా కార్పొరేట్ కాలేజీల వెంట పడుతున్నారు. ఇది సమాజంలోని అత్యున్నత వ్యక్తులుగా కొలవబడుతున్నవారి బాధ్యతా రాహిత్యంకాదా?

అలాగే కరెంటుకోత. సరిగ్గా చదువుకునే సమయంలోనే peak time అని power cut అమలు చేస్తున్నారు. ఇది పట్టణాలలో కొంత మినహాయింపు వున్నా గ్రామీణ ప్రాంతంలో అత్యంత బాధాకరంగా సాగుతోంది. వేసవి ఉక్క పోత తో పాటు వెలుగు లేకుండా చేస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు. కాస్త ఆలోచించండి పాలక ప్రభువులారా!

ఆత్మ బలిదానాలన్నీ రాజకీయ హత్యలే!


నిన్న ఓయూ విద్యార్థుల  అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం సందర్భంగా ఆ ఉద్వఘ్న క్షణాలలో యాదయ్య తనకు తాను కిరోసిన్ పోసుకు నిప్పంటించుకొని తన చివరి ఊపిరి వరకు జై తెలంగాణా అని నినదించడం చూసైనా రాజకీయ పక్షాలులొ చలనం కలగలేదంటే, యిదంతా పథకం ప్రకారం వారి వారి వ్యాపారాలకు అనుకూలంగా ఉద్యమాలను మలచుకోవడంగా కనిపిస్తోంది. వరంగలె లో సవేరా టీవీలో జరుగుతున్నది చూస్తూ తట్టుకోలేక తాను కిరోసిన్ పోసుకు కాల్చుకుంది.

తెరాస వాడు ఎక్కడా ఒక్కడూ  కనబడలే. ఏబేరాల రాయబారాలలో కులుకుతున్నారో?

కాంగ్రెస్ వాడు ఆలూ లేదూ చూలూ లేదు కొడుకు పేరు సోమలింగమన్నట్లు సి.ఎం. నేనంటే నేనని  ప్రకటించుకొంటు, స్వార్థ ప్రయత్నాలు మొదలెట్టారు.

తెదెపా వాళ్ళు కళ్ళు చిదంబరం (ఇది సింబాలిక్ గా మాత్రమే, మరోలా అనుకోవద్దు) కళ్ళులా అటొకటి, ఇటొకటి చూపుతున్నారు.

మొదటి అంకంనుండే తీవ్ర మీమాంస కలిగిన ప్రరాపా వారు ఊయలెటు ఊగితే ఆ చివర నాది అని ఊగుతున్నారు.

కొంగకు పళ్ళెంలో పెట్టిన పాయసంలా వుంది బిజెపి వాళ్ళ పరిస్థితి.

మజ్లిస్ వారిది ఎవరైతే నాకెంటి మా పాతబస్తీలో మాదే కదా మజిల్ పవర్, దేశం ఏ గుడ్డు కరిస్తే నాకేంటని కాచుక్కూచున్నారు.

యిలా రాజకీయ పార్టీలు ఎవరికి వారు వుంటే ప్రజలు మాత్రం తమకేమీ పట్టనట్లు తమ జీవితపు నౌకను ఎటు గాలివీస్తే అటు తెరచాపతో పాటు తెరల ముందు లాగించేస్తున్నారు.

నేటివరకు సుమారు 300ల మంది పైగా ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఇవన్నీ ఓట్టిపోవల్సిందేనా?

వారు కన్న  కలలను వారి కనురెప్పల మాటున బూడిద గావడమేనా?

ఈ రాజకీయ రాబందుల గళ్ళాను ప్రజలెప్పుడు పట్టుకు నిలదీస్తారో?

ప్రస్తుతం యిదంతా రాజకీయ వ్యవస్థ వైఫల్యమే. ఈ కారణంగానే అణచివేత విధానాన్ని అవలంచిస్తోంది. కౄర నిర్బంధాన్ని ప్రయోగిస్తోంది. అది చూసి విద్యార్హ్తి, యువజనులు తాము మోసపోతున్నామనే భావనలో ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారు. కావున యివి రాజకీయ హత్యలే.

బలి కోరుతున్నారా?


విద్యార్థుల అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పాలక వర్గం కర్ఫ్యూ వాతావరణాన్నీ కల్పించి ప్రజలెవరూ బయటకు రావద్దని హెచ్చరించడం చూస్తే ఈ రోజు మరో బషీర్బాఘ్ సంఘటన చేసేందుకు సమాయత్తమవుతున్నట్లుగా అగుపడుతోంది. 20,ooo ల మంది పోలీసులను మోహరించి ఖాకీ మయం చేసి యుద్ధవాతావరణాన్ని సృష్టించింది.

  • ఇంత నిర్బంధం అవసరమా?
  • ఉద్యమం తీవ్రరూపం దాల్చుతూ యువకుల ప్రాణాలను బలికోరుతున్నారా?
  • ఇది ఎవరి శాంతిభద్రతలు కాపాడడానికి?
  • ఈ భయానక వాతావరణాన్ని ఎవరికోసం సృష్టిస్తున్నారు?
  • ప్రశ్నించే వారే ఉండకూడదా?
  • అడిగే సాహసం చేయబూనడం నేరమా? పాలకవర్గం ఉద్యమాలను కౄరంగా అణచివేయడమే పరిష్కారమా?

యువతరానికి రాజకీయాలు అవసరం లేదా?


విద్యార్థులపై ఉక్కుపాదం పోస్టులో ఒక మిత్రుడు కామెంటు రాస్తూ విద్యార్థులు చదువుకోవాలి కానీ రాజకీయాలులో పాల్గొనరాదన్న అర్థంతో కుక్క గాడిద కథ చెప్పారు.

దీనికి నా సమాధానమిక్కడ రాద్దామనిః

యూనివర్శిటీలలో మన చదువులు అకడమిక్ సిలబస్ లకు మాత్రమే పరిమితం కావడం వలన అవి మార్కులు, పనికిమాలిన డాక్టరేట్లకు పరిమితమయిపోయాయి. సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేని, ఉద్యోగ బానిసలను తయారు చేయడానికే పనికి వచ్చి, కుల, మత, వర్గ, వర్ణాలతో కుళ్ళీపోయాయి.  యూనివర్శిటీ విద్యార్థులంటే 18 ఏళ్ళకు పైబడ్డవారే వుంటారు. వారికి సమాబంలో జరుగుతున్న పరిణామాలకణుగుణంగా స్పందించే హృదయం వుండడం తప్పా?

ఓటు హక్కు వచ్చే వయసును 21 నుండి 18 ఏళ్ళకు మన దివంగత యువ ప్రధాని మార్చి, ఎన్నికల రంగంలోకి దించలేదా? మరి ఓటు వేసే వారికి రాజకీయ అవగాహన, సమాజంలోని మార్పులను చూసే విజన్ కావాలి కదా? ఇది మరి ఆకాశం నుండి ఊడిపడుతుందా?

అలాఅయితే ఓటు హక్కు 30 ఏళ్ళు నిండి జీవితంలో స్థిరపడ్డవారికి మాత్రమే కలిగించాలి. తద్వారా మన సమాజంలో కీలక మార్పుకూడా చోటు చేసుకుంటుంది. మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం కూడా కలగవచ్చు.

ఎన్నికలొస్తే తమ ఝెండాలు మోయడానికి, జేజేలు కొట్టడానికి,  దొంగ ఓట్లు వేసేందుకు యువకులు కావాలి. కానీ తమ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం రాజకీయాలొద్దు చదువుకోవాలని సుద్దులు చెబుతారు.  ఇది మోసపూరితం కాదా?

విద్యార్థులపై ఉక్కుపాదం


ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్స్ విభాగంలోని విద్యార్థులపై నిన్న సాయంత్రమునుండి పోలీసుల రక్కసి దాడిని ప్రజాస్వామిక వాదులు ఖండించాలి. అకారణంగా విద్యార్థినిలపై కూడా లాఠీలతో విరుచుకుపడ్డారు. భాశ్పవాయు ప్రయోగం, రబ్బరు బుల్లెట్ల ప్రయోగం, చివరకు గాలిలో కాల్పులు జరిపారు. విద్యార్థులను రెచ్చగొట్టి రాళ్ళతో దాడి చేసారు. వారు తిరిగి దాడి చేస్తే శత్రువుపైనో, రౌడీమూకలపైనో పడ్డట్లు దాడిచేసారు.

గాయపడ్డవారిని అంబులెన్సులో తరలించేందుకు కూడా అనుమతినివ్వకుండా, మీడియావారిపై కూడా దాడిచేసి  భయానక వాతావరణాన్ని సృష్టించారు.   ఇది కావాలని ప్రశాంతతను చెడగొట్టి శాంతిభద్రతల సమస్యగా మార్చి, విద్యార్థుల గొంతునొక్కే పని. తద్వారా తెలంగాణా వాదనను అణచివేయబూనడం తప్ప మరోటికాదు. తమ ప్రాంత స్వయంపాలనకు నేతృత్వం వహిస్తున్నారన్న అక్కసుతో పాలక పక్షం రాక్షసంగా విరుచుకుపడుతోంది. యూనివర్శిటీ ప్రాంగణాన్ని యుద్ధభూమిగా మారుస్తోంది. ఈ సమయంలో ప్రజలు విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలవాలి.

జరభద్రం కొడకో..


జరభధ్రం కొడకో

కొడకో నా కొమరన్నా జరా భధ్రం కొడకో..

రిక్షా ఎక్కేకాడ దిగేకాడ మల్పుకాడ..

అన్న గద్ద్రరన్న పాట గుర్తొస్తుంది జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే. రాజకీయ ఊసరవెల్లులు రోజుకో గొంతుతో మాట్లాడుతుంటే వీళ్ళేనా ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచి, ప్రజల ఆకాంక్షలను, ఆశలను తీర్చేవారా? అని అనిపిస్తోంది. పదవులు వదలడం దేశద్రోహమంటాడు నిన్న మొన్నటివరకు వీధిలో వీరంగమేసిన సర్వేవారు. ఇట్లాంటి వారిని నమ్ముకోవడం అంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదడం లాంటిదే.

కనుక ప్రజల ఆశలు వమ్ముకాకుండా కాపాడేది మొక్కవోని దీక్షతో ప్రజలమధ్యకు ఉద్యమాన్ని తీసుకుపోవడమే. ఈ నక్క జిత్తుల మాయలలో పడక సరైన కార్యాచరణ ప్రణాలికతో ముందుకు పోవాలని ఆశిస్తూ..