రోదన

మరోమారు గాయపడ్డ సిక్కు హృదయాలు


1984 అక్టోబర్ 31 న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సెక్యూరిటీ గార్డుల చేతిలో హత్య గావింపబడ్డారు అన్న వార్త విన్న తరువాత ఆ గార్డులు సిక్కు తెగకు చెందిన వారని తెలిసిన వెంటనే ఢిల్లీ లోని సిక్కు ప్రజలపై నాటి కేంద్రమంత్రులు జగదీష్ టైట్లర్, హెచ్.కె.ఎల్.భగత్ ల నేతృత్వంలో కాంగ్రెస్ హిందు వాదులు చేసిన మారణహోమంలో వేలాది మంది సిక్కులు హత్యగావింపబడ్డారు. వారి ఆస్తులు దహనం చేయబడడమో, లూటీకి గురికావడమో జరిగింది. ఇది నాటి ప్రధాన పత్రికలలో పతాక శీర్షికలలో వచ్చింది.

శ్రీమతి గాంధీ హత్య గావింపబడడానికి కారణం జగమెరిగిన సత్యమే. ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో స్వర్ణ దేవాలయంలో వందలాది మంది సిక్కు యువకులను నిలబెట్టి కాల్చి చంపారు. గెడ్డం వుండడమే తప్పిదంగా నాటి యువకులను తీవ్ర భయోత్పాతానికి గురిచేసి తాను పెంచిన పాము సంత్ భింద్రన్ వాలే మహా సర్పమై తననే కాటువేయజూడడంతో సహించలేని నియంత మొత్తం సిక్కు జాతిమీదే తీవ్రంగా విరుచుకుపడింది. దానికి ప్రతిఫలంగా జరిగినది ఈ హత్య.

వేలాది సిక్కుజాతి ప్రజల మారణ హోమం అనంతరం ప్రధాని హోదాలో నాడు రాజీవ్ గాంధీ ఒక మహా వట వృక్షం కూలిననాడు ప్రకంపనలకు చిన్న చిన్న నష్టాలు జరుగుతాయని అన్న దానికి 15 సం.ల తరువాత సోనియాగాంధీ ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు తెలియజేస్తున్నట్లు గా ప్రకటించారు. కానీ కోల్పోయిన ప్రాణ, ఆస్తి నష్టాలకు వేలాదిమంది రోదనలకు ఈ స్టేట్ మెంటు ఆయింట్ మెంటుల పూత ఏమాత్రం?  పుండుమీద కారం చల్లినట్లుగా నాటి దోషులంతా ఒక్కొక్కరు సరైన సాక్ష్యాధారాలు లేవన్న సాకుతో కోర్టు కేసులనుండి బయటపడుతున్నారు. తాజాగా జగదీష్ టైట్లర్ గారుకూడా సి.బి.ఐ.వారి తీర్పు నే సమర్థిస్తూ ఢెల్లీ హైకోర్టు వారుకూడా క్లీన్ చిట్ యివ్వడంతో బయటపడ్డారు. సి.బి.ఐ. అన్నది కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ గా ప్రజల మనసులలో స్థిరపడిపోయింది.

గాయపడ్డ సిక్కు హృదయాల రోదన ఎవరికీ పట్టక పోవడం ఈ శతాభ్దపు విషాదం…

పంటకు నిప్పుపెట్టి రైతు మూగరోదన..


పంట చేతికొచ్చే కాలంలో సకాలంలో నీరందక ఎండిన పంటను చూసి తట్టుకోలేక భారీ అవి’నీటి(తి)’పారుదల శాఖామంత్రిగారి సామంత రాజ్యంలోని బుచ్చన్నపేట మండలం కట్కూరులో బండి సోమిరెడ్డి అనే కౌలురైతు (మూగవాడు) గొంతెత్తి తన ఆవేదనను వెలగక్కలేక పంటకే నిప్పుపెట్టి మూగగా రోదించిన వైనం ఈ రోజు ఆంధ్రజ్యోతిలో వచ్చింది. రైతులకు ఉచిత విద్యుత్ ఉత్తి విద్యుత్ గా మారి పంటకు నీరందక ఎండిపోయిన తీరు ఆ చుట్టుపక్కల రైతులందరిని తీవ్రంగా కలచివేస్తుంది.  అడిగితే ప్రతిపక్షం వారిలా మాటాడుతున్నరని యిక్కట్లు పాలు చేస్తారన్న భయంతో యిలాంటి విషయాలు బయటకు రావడంలేదు. ఏమి చేయలేక నిస్సహాయంగా యిలా తమ చితికి తామే నిప్పుపెట్టుకునేట్లు చేస్తున్న పరిపాలన పర్యవసానమిది.