రన్నింగ్ కామెంటరీ

కరెంట్ కామెంట్స్ 5 – అంతా క్రెడిట్ పాలసీనే..


ఈ మధ్య ఆంధ్ర దేశంలో విరివిగా జరుగుతున్న దీక్షల తంతు చూస్తుంటే ఒకరికి మించి ఒకరు జనాల అమాయకత్వాన్ని కొల్లగొట్టేద్దామన్న ఆతురతతో తమ క్రెడిట్ ను పెంచుకొని రాబోవు ఎలచ్చన్ల కాలానికి మేమే ముందు చేసినాం, మేమెక్కువ కాలం చేసినం, మేమిది సాధించినాం అని చెప్పుకోవడానికి రకరకాల పగటి వేషాలు వేస్తున్నారు.

తొమ్మిది రోజులు దీక్షలో కూచున్నా మొఖం కూడా వాడకుండా వీల్ చైయిర్ లో బయటకు వచ్చిన బాబు దీక్షను జనం పట్టించుకోక పోవడంతో ఎటుబోయి ఏమొస్తుందోనని, తనలా ఖాళీగా వుండి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్న ఉపగ్రహాలను విమానంలో తెప్పించుకొని కొబ్బరిబొండాం కొట్టించి విరమించిన బాబు పట్ల జాలిపడడానికి కూడా జనంకు తీరికలేదు.

పాపం తాను కూచున్న క్రిష్ణా తీరం పొడుగు వెడల్పులు తెలియక చలికి తిరిగి రాని జనం వచ్చిన దారిగుండా రెండో రోజే తిరుగుటపా కట్టేయడంతో బుట్టా దుట్టా చుట్టేసి పలాయనం చిత్తగించారు జననేత(?) జగన్ గారు..

తెలంగాణా విద్యార్థి, యువజనులపై బనాయించిన అక్రమ కేసులతో తమ తమ నియోజక వర్గాలలో తిరగలేక, అధిష్టానం దగ్గర కక్కలేక మింగలేక నోట్లో కండువాలు కుక్కుకుని వున్న కాంగేయులు, శ్రీక్రిష్ణ కమిటీ పొడిచేదేమీ వుండదు కాబట్టి, కనీసం ఈ కేసులైనా ఎత్తివేయకపోతే మొఖం చెల్లదన్న వేడుకోలుకు ఓ చిన్న డ్రామాతో ముగింపునిచ్చారు మన లివింగ్ లిజెండ్ కామెడీ పొలిటికల్ ఫిలాసఫర్ కేకే గారి స్క్రీన్ ప్లే, దర్శకత్వంలో, కెప్టెన్ కిరణ్ గారి నిర్మాణ నిర్వహణ చలవతో, అర్థమై చావని మాటల రచయిత జానారెడ్డి గారి పర్యవేక్షణలో, చేవెళ్ళ చెల్లెమ్మ గారి సమర్పణలో పండించారు చివరికి.

ఏదేమైతేనేం మొత్తమ్మీద బనాయించిన కేసులెత్తేసి, సివరాఖరికి అంకుశం అరవింద్ గారికి రాజకీయ పంచ్ తో దిమ్మదిరిగేట్లు చేసారు.

ఇలగిలపింటివి జరిగి పోతుండగా జనం మాత్రం సల్దివన్నంతో కొరుక్కుందామంటే ఉల్లిపాయ దొరక్క గబ గబా గెంజి మెతుకుల్తాగేసి, ఎవడెలగేడిస్తే నాకేటి, నా గమేలా, పారా వుంటే సాలని పరుగో పరుగు…