మానవసంబంధాలు

తండ్రీ… రాక్షసుడా….


తనెవరో,

ఆడో, మగో,

ఏ కులమో,

ఏ మతమో,

ధనికురాలో,

పేదరాలో

తెలీని

ఆ పిచ్చితల్లి…


నవమాసాలు

అమ్మకడుపులో

భద్రంగా ఈదులాడి

బయటపడిన క్షణం…


తను ఆడబిడ్డనని

తన ఇంట తిరుగాడే

అదృష్ట దేవతనని

గారాభంగా చేతుల్లోకి

తీసుకుంటావనుకుంటే

ఒక్కసారిగా నేలకేసి మోది

చంపుతావనుకోలేదు నాన్నా…


ఇందులో నా తప్పేంటో

కాస్తా చెప్పగలవా?

మరో మారు జన్మెత్తకుండా

వుంటా….

(ఉదయాన్నే పేపరులో ముందు పేజీలోనే ఆడబిడ్డని నేలకేసి బాది ఆసుపత్రిలోనే చంపిన తండ్రి వార్త చదివి)

ఆస్తికోసం తల్లికి HIV రక్తం ఎక్కించిన కూతుళ్ళు.


మానవత్వం మంటగలిసిని వేళ.

రాను రాను దిగజారుతున్న మానవ సంబంధాల గురించి ఉలిక్కిపడకుండా వుండగలమా? ఒకడు తల్లిని చావుకు ముందే శ్మశానానికి తగిలేసాడని ఆ మధ్య చదివాం. ఎంతో మంది తల్లిదండ్రులను వృద్ధాశ్రమాలకు తరిమేయడం చూస్తున్నాం. తల్లీ తండ్రి చేస్తున్న ఉద్యోగాలకోసం వారిని రిటైర్మెంటుకు ముందు రోజు చంపేసిన వారిని కొంతమందిని చూసాను. మీరూ చూసే వుంటారు? చాలామంది వృద్ధులు వసతి లేక, కన్నవారి కాఠిన్యానికి దూరమై రోడ్లపై అడుక్కోవడం చూస్తున్నాం. కానీ ఇది మరీ దారుణమైన వార్త. కన్నపేగులను తెంచి హారంగా చేసుకున్న వారసుల వార్త.

ఆస్తికోసం తల్లికి HIV రక్తం ఎక్కించిన కూతుళ్ళ గురించి ఇప్పుడే చదివాను. గుంటూరులో తల్లిపేరనున్న పది లక్షల ఆస్తికోసం ఆమెకు HIV రక్తం ఎక్కించారని అనారోగ్యానికి గురైన తల్లి తెలుసుకొని జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేయడంతో ఈ వార్త బయటపడింది.

ఆమె మరణించేంతవరకు ఆగలేకపోయిన కూతుళ్ళు ఈ దారుణానికి ఒడిగట్టారంటే ఆస్తి – మమకారాన్ని, అనుబంధాలను ఎంతగా నాశనం చేస్తుందో వింటూంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. కన్నపేగుల తీపినెరుగని వారిగా తయారయిన ఈ వంశాంకురాల్ని కన్న ఆ తల్లి మనోవేదనకు కొలమానం వుంటుందా? వారి పిల్లలు వారినెలా చూస్తారోనన్న భయమైనా వుందా వీళ్ళకి?

వార్త ఆధారం http://thatstelugu.oneindia.in/news/2010/10/04/greedy-daughters-heinous-act-against-041010.html

పెరుగుతున్న Acceptancy


మనలో రాను రాను అన్ని విషయాల పట్ల Acceptancy పెరుగుతోంది.

యింతకు ముందు ఏదైనా విషయంపై తిరిగి ప్రశ్నించే తత్వం కలిగి వుండేవారం. కానీ నేడు మనలో పెరుగుతున్న స్వార్థమో, అభద్రతా భావమో కానీ మన ప్రక్కనే ఎంత ఘోరమైన,  అన్యాయమైన విషయం జరిగినా లేక మన ఉనికికే ముప్పువస్తున్నా సరే,   నోట్లో ఏదో అడ్డం పడ్డట్టు, కనులపై ఏదో నల్లని గుడ్డ కప్పి వున్నట్లు తప్పుకుపోతున్నాం.

ఇది నిజమా? కాదా?

ఆదిమరాగంనిన్నటి ఎత్తైన కొండ పైకి ఆయాసపడుతూ

సాగిన నా ప్రయాణపు బడలిక

నీ వెన్నెలంటి  నవ్వుతో మాయమయ్యింది

నీ స్వచ్చమైన మమకారం

ఇవాల్టికివాల ఈ పల్లపు

ప్రాంతంలో సరుకుగా మారిన

సత్యం నీకు తెలియకపోవడమే

నీ ఆరోగ్య రహస్యం


తొలిసారిగా చూస్తున్నా

ఈ హడావిడీ జీవన గమనంలో

ఆకురాలిన కాలంలో

లేలేత చిగురు మృధుత్వాన్ని

జలపాతాల హోరులో సన్నని

నీ గొంతులోంచి ఆదిమ రాగాన్ని

నీ నుదుటి ముడతల మధ్య దాగిన

చారిత్రక సత్యాన్ని….


(ఆదివాసీ గూడెంలో ఎదురైన గిరిజన వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ)

సెకన్ల కక్కుర్తి


డాడీ బాగున్నారా?

బాగున్నాను బాబూ!

భోంచేసారా?

చేసాను రా…

జ్వరం తగ్గిందా?

కొంచెం వుం..

డాక్టరుకు చూపించండి..

(ఆ అలాగేరా….

అయితే వుంటాను.

ఒరే…

అప్పటికే కట్,

మొబైల్ స్క్రీన్ పై మీరు 17 సెకన్లు ఆదాచేసారు. మీ బాలన్స్….

బాబు మోములో చిన్న వెలుగు…

 

ఇదీ నేటి మానవ సంబంధాల టాక్ టైం…