ఫన్

ఏదో ఒక బొమ్మే కదా సారూ…


నేను తోలుబొమ్మను కాను.. మన్మోహన్జీ…

కాకపోతే

పిండిబొమ్మో, రబ్బరు బొమ్మో, చెక్క బొమ్మో…

మొత్తానికి ఏదో ఒక బొమ్మేనని ఒప్పుకున్నారు కదా సారూ….

NTRగారి ఆత్మకు త్వరలో శాంతి చేకూరనుందా?


ఈ రోజుతొ ముగిసిన తెదెపా మహానాడు జరిగిన తీరు చూస్తుంటే ఈ అనుమానం కలుగుతోంది. ముందు రెండు రోజులు మహానాడుకు దూరంగా వున్న బాలయ్య, జూ.NTR లు నిన్న హాజరై పలికిన పలుకులు, హరికృష్ణ నట సార్వభౌముని జయంతి సందర్భంగా జరిగినకేక్ కటింగ్ పై  అసహనం చూస్తుంటే తె.దే.పా. కి మంచి రోజులు రానున్నాయా అనిపిస్తోంది.

అటు బాలయ్య కూడా మధ్యంతర ఎన్నికల గురించి తొందరపడుతున్నారు.  సింహా హిట్ తో పుంజుకున్న బాలయ్య ముఖంలో చార్మింగ్ పెరిగింది. విజయంతో దూసుకుపోతూ తన ఆకాంక్షను బయటపెడుతున్నారు. కానీ తన సోదరి వత్తిడితో బావే భావి సి.ఎం. అని చెప్పక తప్పింది కాదు. అటు జూ.తారక రాముడు కూడా యువకులకు అవకాశాలు రావాలని మామయ్యను కోరడం ద్వారా తన ప్రాధాన్యత గురించి ప్రశ్నించాడు. వీరి రాకతో కాస్తా కళ వచ్చినట్లుంది. NTR కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత లోకేష్ కు నిద్దరపట్టనీయడం లేదులా వుంది. మొత్తంగా చూస్తే దివంగత రామారావుగారి ఆత్మకు త్వరలో శాంతి చేకూరనుందా అనిపిస్తోంది. తథాస్తు.

లైలా చేసిన మేలు


లైలా ఒక్కమారుగా కోస్తా తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసి 3 రాత్రులుగా కంటిమీద కునుకులేకుండా చేసినా  కొన్ని మంచి కార్యాలు కూడా చేసింది….

అవిః

1. ఎన్నడూ ఎరగని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన కాలంగా చెప్పుకుంటున్న వేళ, వడదెబ్బలకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80మందికి పైగా మరణాలు సంభవించి జనం అట్టుడుకుతున్న వేళ ఒక్కసారిగా వాతావరణం చల్లబరిచింది.

2. అలాగే చిరు పోలవరం యాత్ర, చంద్రబాబు రైతు యాత్ర, రోశయ్య ప్రజాపథంలతో వేడెక్కిన రాజకీయ వాతావరణంకు తోడుగా యువరాజ వారి వరంగల్ ఓదార్పు యాత్రతో ప్రధాన రాజకీయ పక్షాలులోనే చీలిక ఏర్పడే విధంగా సాగిన తీవ్ర వాగ్యుద్ధాలతో ఒక్కసారిగా 50 డిగ్రీలు దాటిన రాజకీయ వేడి నిట్టూర్పులను కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లుగా లైలా ఒక్క విసురుతో వాయిదా వేయించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

3. గొంతెడ్డి మంచినీళ్ళకోసం మైళ్ళకొద్దీ దూరం నడిచి వస్తున్న ఆడపడుచులకు కాసింత ఓదార్పు నిచ్చింది లైలా. కాస్తా బోర్లలో, బావులలో నీటి ఊట చేరితే అదే పది వేలు. రక్షిత మంచినీటి పథకాలకంటే తాగుడు పథకాలకే ప్రాధాన్యమిస్తున్న పాలక, అధికార గణం నిర్లక్ష్య, నిర్లజ్జ వైఖరికి ప్రకృతిమాత కన్నెఱ చేసి తన ఆడపడుచుల ఆవేదనను తీర్చిందిలా..

4. అధికారగణం అక్టోబరు, నవంబరు నెలల వరకు ఆర్తిగా ఎప్పుడు తుఫానులు వస్తాయా, ఆ సాయంపేరుతో ఆడిట్ లేని నిధులను మింగేద్దామా అని ఎదురుచూసే శ్రమ లేకుండా మేనెలలోనే వారిని కనికరించిందీ లైలా…

ఇంకా ఏమైనా వుంటే పంచుకోండి…

ఈ ఫత్వాల గోలేంట్రా బాబూ..


ఇన్నాళ్ళూ మొన్నటి పెళ్ళి, దాని పెటాకులు, మరల విడాకుల పత్రంలో పేరు తప్పంట (ఇది TV9 కనిపెట్టిన సత్యం తర్వాత తుస్ అయ్యింది లెండి), పెళ్ళి గౌను గోల, మళ్ళీ ఇప్పుడు కలిసి తిరుగుతున్నారంట, మత పెద్దలకు ఆగ్రహం వచ్చి సున్నీ ఉలేమా గారు పెళ్ళికి వెళ్ళొద్దంటూ ఫత్వా జారీ చేసారు. యిలా మన సానియా పెళ్ళి రోజుకో హాట్ టాపిక్ గా మారి చానళ్ళకు TRP రేటింగ్ పెంచే కార్యక్రమంగా మారిపోయింది పాపం. మొన్నటి విడాకుల దందాకు యీయన గారిని పిలిచి తమలపాకు సమర్పించి వుండలేదేమో ఈ హుకుం జారీ చేసారు.

ఎంత స్పీడుగా కాల చక్రం తిరిగి 15 తారీఖు వస్తుందో యీ తంతు ముగిసిపోతుందో అని సానియాతో పాటు మనమూ అనుకోవాల్సి వస్తోంది.

విహెచ్ గారూ అద్దం చూసుకున్నారా?


ఈ రోజు మీడియాతో  వి.హనుమంతరావు గారు జగన్ ఓదార్పు యాత్ర గురించి మాట్లాడుతూ నేనెళ్ళినా జనం విరగబడి వస్తారని సెలవిచ్చారు. ఈయన గారిని జనం మరిచిపోయిన సంగతిని అప్పుడప్పుడు వైఎస్ వ్యతిరేక వ్యాఖ్యలతో, తలా తోకా లేని మాటలతో మీడియా వాళ్ళ పుణ్యమా అని కనబడి గుర్తు చేస్తారు కాబట్టి సరిపోయింది గానీ యిలాంటి నాయకులు మరీ జోకులేస్తుంటారు అప్పుడప్పుడిలా? ఆయన బతికున్నంత కాలం నోరుమూసుకొని వున్నారెందుకో చెపితే జనం గౌరవించే వారేమో! 10, జన్ పథ్ లో కాల్మొక్త బాంచెన్ అని పడి వుండి, బయటకు వచ్చి అది చేసేస్తారు, ఇది పీకెస్తాం అని సెల్ఫ్ డబ్బా కొట్టే వాళ్ళను ఈ మీడియా వాళ్ళు తమ గొట్టాలతో చుట్టుముట్టడం చూస్తుంటే చిరాకేస్తుంటుంది…