ప్రత్యేకం

మా ఊళ్ళో ఎగిరిన హెలికాప్టర్..


యిమానం


ఈ రోజు మధ్యాహ్నం పిల్లలు వీధిలో యిమానం యిమానం అంటు ఒకటే పరుగులు. ఎప్పుడో ఒక సారి అలా వస్తూ వెల్తుంటాయి కదా అనుకుంటే ఈ రోజు మాత్రం రెండు హెలికాప్టర్లు మా ఇళ్ళపై ఓ నాలుగు గంటలపాటు గిరికీలు కొట్టాయి. ఒరిస్సా సరిహద్దునుండి CRPF జవాన్లను మోసుకొచ్చి ఇక్కడ విడిచిపెట్టాయి.

రోడ్లన్నీ సాయుధులతో నిండిపోయి హెలికాప్టర్ల హోరుతో యుద్ధవాతావరణం అనుభవించాం. అతి దగ్గరగా వాటిని చూసి కేరింతలు కొట్టిన చిన్న పిల్లలు కాసేపటికే అవి సాయుధులతో నిండి వుండటం చూసి గప్ చుప్ అయిపోయారు.

ఇన్నాళ్ళకు తప్పు తెలిసొచ్చిందా?


ప్రభుత్వ కార్యక్రమాలన్నింటికీ ఆఖరికి మరుగుదొడ్ల నిర్మాణాలకు కూడా జాతీయనాయకుల పేర్లు పెట్టి వారి పరువుతీస్తున్న తమ పార్టీ ప్రభుత్వాల తీరును అడ్డుకొనే క్రమంలో ఇకనుండీ ఏ పథకానికి పడితే ఆ పథకానికి ఇందిరా రాజీవ్ ల పేర్లు పెట్టొద్దని హుకుం జారీ చేసారని వార్త. ఇన్నాళ్ళకు తమ పధకాలలోని డొల్ల తనం గుర్తొచ్చి దాని పర్యవసానం పట్ల గ్రహింపు కలిగినట్లుంది హైకమాండ్ వారికి ఇకనైనా ఈ సాగతీత పేర్లతో విముక్తి కలుగుతున్నందుకు సంతసిద్దాం..

సల్మాన్ ఖాన్ అన్నదాంట్లో తప్పేముంది..ముంబయి దాడులపై సల్మాన్ ఖాన్ వ్యాఖ్యానిస్తూ ప్రముఖులున్న కేంద్రాలపై దాడులు జరగడం మూలంగానే దానికి అంత ప్రాముఖ్యమిచ్చారని అన్నదాంట్లో తప్పేముంది. సామాన్యులుపై జరిగిన దాడులపై గానీ, ప్రమాదాలను గానీ, అత్యాచారాలను గానీ, హత్యలను గానీ పాలక వర్గం సరిగా స్పందించి చర్యలు తీసుకున్న సందర్భాలు చాలా తక్కువ. అదికూడా రాజకీయపరమైన లబ్ధి చేకూర్చేది, ఓట్లను కూడబెట్టేదైతే తప్ప స్పందించేది అతి తక్కువ సార్లు మాత్రమే. ఈ విషయంలో ఆయనను తప్పుపట్టడం తప్పు. ఇంక పాకిస్తాన్ హస్తంపై వ్యాఖ్య దానిపై పాలక వర్గమే గట్టిగా నిలదీయలేకపోతోంది. చక్రవర్తి అమెరికా వారు అక్కడో మాట ఇక్కడికొచ్చాక ఇక్కడో మాట అన్నా ఖండించలేని దౌర్భాగ్యం మనది.

ఈ ఒక్కరోజు పర్స్ తీయొద్దు


మనలో పెరిగిన వస్తు వ్యామోహం అనవసరపు ఖర్చులతో కష్టఫలాన్ని వృధా చేస్తోందన్న సత్యాన్ని తెలియచెప్పడానికి ఈ రోజును అంతర్జాతీయంగా బైనథింగ్ డే గా పాటిస్తున్నారు. నిత్యమూ ఏదో ఒక వస్తువును అవసరమున్నా లేకపోయినా కొనడం, ఎవరి దగ్గరో వున్నవి నా దగ్గర లేవని వెంపర్లాడడం, అవసరము లేకపోయినా సెల్ ఫోన్ లో మాటాడటం ఇలా చిన్నవిగా కనిపిస్తున్న అంశాలే మన జేబులకు చిల్లు పెట్టి ఆనక అవసరమైన దానికి అప్పుకు పరుగులు తీయిస్తోన్న మన మనసు గుఱానికి కళ్ళెం వేయడానికి తొంభైరెండు,  సెప్టెంబరులో వాంకోవర్ లో మొదలైన ఉద్యమం నేడు ప్రపంచవ్యాప్తమయి అందరిని జాగరూకులను చేస్తోంది. థాక్స్ గివింగ్ డే (థన్యవాదాలు తెలుపుతూ పెద్ద ఎత్తున బహుమతులు ఇచ్చుకునే రోజు) జరుపుకున్న మరుసటి రోజు దీనిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

సామాన్య మధ్యతరగతి ఆదాయ వర్గాలలో నేడున్న వివరీత వినియోగ మనస్తత్వాన్ని అదుపులో వుంచుకునేందుకు ఇది దోహదపడుతుంది కాబట్టి మనమంతా ఈరోజు పర్స్ లవైపు చేయిని పోనీయొద్దు.