పిలుపు

ఏనుగును కప్పి ఏమార్చగలవా??


ఎన్నికల సంఘం నిర్నయాలు ఒక్కోసారి హాస్యాస్పదంగా అనిపిస్తాయి..
యూపీ ఎన్నికల సందర్భంగా మాయావతి పెట్టిన ఏనుగు బొమ్మలను కప్పి వుంచాలని ఆదేశాలు జారి చేసారు. అసలు ఆ ఏనుగుల బొమ్మలు కప్పడానికి ఎంత ఖర్చవుతుంది? కప్పినా అవి ఏనుగులవి అని జనానికి తెలియకుండా వుంటుందా?? మరి కప్పి ఎవరిని మభ్యపెట్టడానికి? వాటిని పూర్తిగా తొలగించే పని ముందుగా చేపట్టి వుండాల్సింది.
అసలు ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలో వుంటే వారి నాయకుల పేర్లను పథకాలకు, వీదులు, నగరాలకు, ప్రభుత్వ భవనాలకు నామకరణం చేస్తూ ప్రభుత్వ వాహనాలపై ముద్రిస్తూ పోతూ ఆ తరువాత ఎన్నికలప్పుడు వాటిని కప్పి వుంచమనడం కంటే ప్రజా ధనంతో చేపట్టే కార్యక్రమాలకు రాజకీయ ప్రేరేపిత పేర్లను పెట్టడం నిషేధిస్తూ చట్టాన్ని చేసి అమలు చేయించాల్సిన బాధ్యత  ముందుగా చేపట్టాలి. లేకపోతే పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నట్టుగా వుంటుంది..

షర్మిళకు మద్ధతు తెలుపుదాం


ఈశాన్య రాష్ట్రాలలో అమలు కాబడుతున్న ప్రత్యేక సైనికాధికార చట్టానికి వ్యతిరేకంగా గత పదకొండేళ్ళుగా పోరాడుతున్న ఇరోం షర్మిళకు మద్దతు తెలుపుదాం.. కృత్రిమంగా ఆహారాన్ని సరఫరా చేస్తూ నిర్బంధాన్ని అమలు చేస్తున్న రాజ్యహింసకు వ్యతిరేకంగా మేధావులు ప్రజాస్వామిక వాదులు విరివిగా కదలి రావాలసిన అవసరముంది. అన్నా హజారే దీక్షకు మద్ధతుగా కదిలిన జనం, రాజకీయ పార్టీలు గత పదకొండేళ్ళూగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న షర్మిళ పట్ల అనాగరికంగా కిమ్మనకుండా వుండటానికి ఓటు బ్యాంకు రాజకీయాలు తో పాటు ఒకే తానులోని గుడ్డలైన రాజకీయ వర్గాలు ఈ విషయంలో మౌనం దాల్చడం నేరం.. కౄరమైన చట్టాలను ప్రయోగిస్తూ పౌరుల హక్కులను హరించి వేస్తున్న పాలక వర్గాలన్నీ ఒకటిగానే కనిపిస్తున్నాయి. దీనికి మీడియాకూడా వంత పాడుతున్నాయి. సుదీర్ఘ కాలంగా పోరాడుతున్న షర్మిళ పోరాటానికి మద్ధతు తెలుపుదాం.. AFSPA  ను తక్షణమే రద్దు చేయాలని గొంతు కలుపుదాం..

ఇంత కఠినాత్ములమా?


ఒక ప్రక్క మనకు అత్యంత సమీపంలోనున్న దేశం మొత్తం బూడిదవుతున్న సందర్భంలో ఈ ఉపఖండంలో జరుగుతున్న క్రికెట్ వ్యాపారాన్ని ఎలా ఎంజాయ్ చేయగలుగుతున్నారో? అంత భీభత్సంగా ప్రకృతి విలయతాండవానికి గురై అల్లల్లాడుతూ ఆర్తనాదం చేస్తున్న ప్రజలను చూస్తూ సునామీ రోజుకూడా బందుపెట్టని ఫక్తు వ్యాపార సంస్కృతిని ఖండించను కూడా లేని సానుభూతి ఎవరికోసం? అణు ప్లాంట్లన్నీ బూడిదవుతూ మానవాళికి ముప్పుగా తయారవుతున్నా బహిరంగ ప్రదేశాలలో మూకుమ్మడిగా జనం కూడగట్టడం న్యాయమా? జరగరానిది జరిగితే ఎవరు దీనికి బాధ్యులు? జనావళి పట్ల బాధ్యత లేని పెట్టుబడిదారుల వ్యూహానికి ఇంత లోకువై పోవాలా? మన్యులంతా ఆలోచించగలరు….

రక్త చరిత్ర – 3..


ఈ రోజు పరిటాల రవి హత్య కేసులో అనుమానితుడు మద్దెలచెర్వు సూరిపై కాల్పులు జరపడం, ఇప్పుడే ఆయన మరణించినట్లు వార్తలు రావడంతో రక్తచరిత్ర మూడో భాగం మొదలైంది. ఈ గొలుసుకట్టు హత్యలు ఇలా కొనసాగుతూ ఎన్ని కుటుంబాలు ఇలా ఆసరా లేకుండా పోవాలో? ఈ ఫాక్షన్ హత్యలను ఆపే ప్రణాళికలేమీ మన రక్షణ వ్యవస్థలో లేవు. ఇది ఈ ఆధునిక కాలంలో ఇలా జరుగుతూ పోవడం సభ్య సమాజంనకు తలవంపులు కాదా?

రేపేమీ జరగకూడదు ప్రభూ…
మాకు ఎవరూ సుద్ధులు చెప్పొద్దు ప్రభూ..
ఎవరికి వారు మా వెన్నులో
పొడుస్తూనే వున్నారు ప్రభూ..
గాయాలు ఇంకా సలపరం పెడుతూనే వున్నాయి ప్రభూ..

అమ్మను కోల్పోయి
నాన్నను పోగొట్టుకొని
బిడ్డను అవిటివాణ్ణి చేసి
కన్న పేగులు తెంచిన
కత్తి మొనపై ఇంకా రక్తపు బొట్టు
కారుతూనే వుంది ప్రభూ..

ఇంకా మా సహనాన్ని పరీక్షించొద్దురా…
సమ్మతమే మన మతంరా..

కాషాయం పచ్చదనం మధ్యనున్న
తెలుపును మర్చిపోయారురా?
ఆ తెలుపు ధగ ధగలలో
మన కీర్తి పతాకను
ఎత్తి పడదాంరా..

(అయోధ్యపై వెలువడనున్న తీర్పు నేపథ్యంలో సామాన్యులు బలిగాకూడదని మనమంతా ముందుగా భారతీయులమనే గుర్తింపుతో అంతా కలసి నిలబడదామనే తీవ్ర ఆకాంక్షతో..)

గడ్డికుప్ప దగ్గర కుక్కను కట్టిన చందాన..


అన్నమో రామచంద్రా..


గడ్డికుప్ప దగ్గర కుక్కను కడితే ఆవును మేయానివ్వదు, తాను తినదన్న చందంగా వుంది భారత ఆహార నిల్వ అధికారుల తీరు. సుప్రీంకోర్టు వారు గోదాముల్లో నిల్వ వున్న 25 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను పేదలకు ఉచితంగా పంపిణీ చేయాలని, ఒక్క గింజ కూడా వృధా కాకూడదని ఆదేశిస్తూ ప్రభుత్వ నిర్వాకాన్ని తూర్పారబడితే అధికారులు మాత్రం వాటికి ధరను నిర్ణయించి పంపిణీ చేస్తామని పట్టుబడుతున్నారు. ఏదో విధంగా ప్రజలకు నామ మాత్రపు ధరకైనా విక్రయించే చర్యలయినా చేపడుతున్నారా అంటే అదీ లేదు. ఉచితంగా ఇవ్వడానికి వీరికున్న అభ్యంతరమేమిటో న్యాయస్థానం ముందే పెడితే ఆ సుత్తితో ఏదో ఒకటిచ్చేవారు కదా? దేశంలో ప్రతి యేడాది లక్షల టన్నుల ఆహార ధాన్యాలు ముక్కిపోతూ పనికి రాకుండా పారబోస్తున్నారు. ఆకలి చావులతో అలమటించే జనం మాత్రం పెరిగిపోతున్నారు. వెనకబడ్డ ప్రాంతాలలోనైనా వీటిని పంపిణీ చేస్తే వలసలను నివారించొచ్చు. ప్రతిరోజూ లక్షలాదిమంది కూలీలు రైళ్ళలో ఉత్తరాదినుండి, ఒరిస్సా, ఉత్తరాంధ్రల నుండి చెన్నై, బెంగళూరు, హైదరాబాదు వంటి నగరాలకు తరలివెళ్తున్నారు. వీరు చూపే జి.డి.పి.రేఖా చిత్రాలు వాళ్ళ నుదుటన కనిపించవు. కనుక ఇకనైనా ఉన్నత న్యాయస్థానం మాట అమలు చేసి నలుగురికి తిండిపెట్టాలని డిమాండ్ చేద్దాం…

ఉద్యమాల వనంరా…


అదిగదిగో ఉద్దానం..

ఉద్దానం కాదురా

ఉద్యమాల వనంరా…

ఈ పాట ఇంకా సజీవంగానే వుంది. సోంపేట ఉద్దానంలో భాగమే. మొన్నటి వరకు పాలకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన పోరాటాల పురిటిగడ్డ. జమీందారీ పాలకులను ఎదిరించి పోరాడిన పోరుగడ్డ. ఉద్యమం వారికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య. ఉప్పెనకు ఎదురొడ్డే గుండె ధైర్యం కలవారు.

కోస్టల్ కారిడార్ పేరిట నెల్లూరు నుండి ఇచ్చాపురం వరకు వున్న 1000 కి.మీ. తీర ప్రాంతాన్ని ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పనంగా దానం చేయబూనిన పాలకులు ఇక్కడి ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన కనీస ప్రజాస్వామిక దృక్పధాన్ని విస్మరించారు. ఒకే ప్రాంతంలో ఉత్తరాంధ్రలో 10 వరకు థర్మల్ ప్లాంటులు అవి కూడా వ్యాపార నిమిత్తం నిర్మించబూనడం, అలాగే రణస్థలం దగ్గర అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణం చేబూనడం ఎంతవరకు సమంజసం?

ఉత్తరాంధ్ర ప్రజలు అంబలి గాళ్ళు, వారేమి చేస్తారులే, వారి నాయకులు మన కాలికింద చెప్పులై వున్నారు కదా అన్న ఫాసిస్టు ఆలోచనతో తప్పుడు అవగాహనతో ఈ ప్రాంత వినాశనానికి పూనుకున్నారు. బీల ప్రాంతమంతా సారవంతమైన భూములతో, నీటి వనరులతో, కొబ్బరి చెట్లతో గోదావరి తీర ప్రాంతాన్ని తలపించే వ్యవసాయ భూములతో పచ్చగా కళ కళలాడే ప్రాంతం. అలాగే తీరప్రాంతం అంతా మత్స్య సంపదతో నిండి వేలాది మంది మత్స్యకార కుటుంబాలు ఆధారపడిన జీవగడ్డ. అటువంటి ప్రాణాధారమైన ప్రాంతంపై ప్రజల అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుందామన్న కుటిల ఆలోచనతో ఈ ప్రాంతాన్ని కబళించ చూడడం మూర్ఖత్వం.

ఉద్దానం ప్రాంత ప్రజలు ఎంత సాధారణంగా సౌమ్యంగా జీవనం సాగిస్తారో, తెగిస్తే ఉవ్వెత్తున ఉప్పెనలా విరుచుకుపడగలరని ఇక్కడి చరిత్ర తెలిసిన వారికి అవగతమౌతుంది. కొన్ని నెలలుగా ఈ ప్లాంట్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్చందంగా ఏ రాజకీయ పార్టీ నేతృత్వంలో లేకుండానే గాంధేయ మార్గంలో తమ వ్యతిరేకతను తెలియజేస్తూ నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ ఉనికికి ముప్పు వస్తుందని గ్రహించిన కొన్ని రాజకీయ పార్టీల నేతలు వారికి మద్ధతుగా మాటాడారు.

ఇటీవలే నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు, ప్రముహ పర్యావరణ వేత్త మేధాపాట్కర్ కూడా సందర్శించి వీరి ఆందోళనకు మద్ధతు పలికి, ప్రాజెక్టుల నిర్మాణం వలన ఈ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని, లక్షలాది ప్రజలు నిర్వాసితులౌతారని, కావున వీటిని ఉపసంహరించుకోవాలని విజ్నప్తి చేసారు.

దీంతో ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు మద్ధతుగా వేలాది పోలీసు బలగాలను తరలించి అక్కడ నిరాహార దీక్షా శిబిరాలను తొలగించే ప్రయత్నం చేసింది. అలాగే నిన్నటికి నాగార్జున కన్స్ట్రక్షన్స్ వారు చేపట్టిన నిర్మాణకార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన నిరాయుధులైన ప్రజలపై కంపెనీ ప్రైవేటు గూండాలతో పాటు 3000 మంది సాయుధ పోలీసులను వారిపైకి ఉసిగొల్పి నలుగురు మత్స్యకారుల ప్రాణాలు తీసారు.

అలాగే ఇక్కడి ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న డా.రామారావుగారి క్లినిక్ పై దాడి చేసి, రోగులను తరిమి వేసారు. సమీప గ్రామాలపై పడి ప్రజలను చితకబాదుతున్నారు.

ఇదంతా చూస్తుంటే మళ్ళీ శ్రీకాకుళం మొదలయ్యే క్రమానికి ప్రభుత్వమే ప్రజలను తోస్తుందనిపిస్తుంది. ఏమీ తెలీనట్లు మాట్లాడుతున్న ముఖ్యమంత్రిగారు, పోలీసులను వెనకేసుకొస్తున్న హోంమంత్రిగారి మాటలు తీవ్ర వేదనకు లోనైన ప్రజలకు పుండుమీద కారం చల్లినట్లుగా వున్నాయి.

వేల ఎకరాల పంట భూములను, తీర ప్రాంతాన్ని నాశనం చేసే థర్మల్ ప్లాంట్ల వలన ఎవరికి ఉపయోగం? అక్కడ ఉత్తత్తైన విద్యుత్ లో ఒక్క యూనిట్ కూడా ప్రభుత్వానికి చెందదు. మరి వారికి ఇంత చౌకగా భూములను కట్టబెట్టి, అనుమతులే లేని వారికి వత్తాసుగా నిలబడి ప్రజల ప్రాణాలను హరించే వీరిని ఏమనాలి?

మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే ఉద్దానం ఒట్టి బీల ప్రాంతమే కాదు ఉద్యామాల వనం..

శవాలపై గుడ్డలేరుతున్న రాజకీయ రక్కసులు


తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోరుతూ సుమారు 400 మందికి పైగా యువతీ యువకులు ఆత్మార్పణం చేస్తే కళ్ళుతెరిచిన కేంద్రం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్న ప్రకటనతో మొదలు పెట్టి శ్రీ క్రిష్ణ కమిటీ వరకు అన్ని దగాకోరు నిర్ణయాలు ప్రకటిస్తూ, రోజూ ఏదో ఒక ఆలవోక ప్రకటనలతో వారి గుండెల్లో గునపాలు దించడంలో అన్ని రాజకీయ పక్షాలు తలా ఒక చేయివేసాయి. ప్రధాన పక్షాల అధినేతలు మాత్రం కమిటీకు ఏమీ చెప్పక ఒకడు మేమే కదా ఇచ్చేది చచ్చేది అని ప్రగల్భాలు పలుకుతుంటే, ఇస్తే వొద్దమని ఇంకోడు సన్నాయి నొక్కులు నొక్కుతూన్నాడు. ఈ లోపుగా రాజీనామాలు చేసిన స్థానాలలో పోటీకి మేమంటే మేం సై అని నిస్సిగ్గుగా ముందుకు వచ్చిన వీళ్ళకు నిజంగా తెలంగాణా ప్రజల పట్ల అభిమానముందా? వారి భావోద్రేకాలను సొమ్ము చేసుకొనడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. భారీ విగ్రహ దళసరి నాలుక నాయకుడు గెలిస్తే నేనే సి.ఎం.అయి తెలంగాణా ఇచ్చేస్తానని కదల్లేక కదుల్తూ జనాన్ని విసిగిస్తున్నాడు. మరల వీళ్ళ నల్లడబ్బు, అధికార ప్రభావం పారించి ఎలాగైనా ఎన్నికల్లో గెలిచే ఏర్పాట్లు చేసుకుంటున్న ఈ మోసకారి నాయకులను ఎండగట్టాలంటే అసలు ప్రజలు తమకున్న ఒకే ఒక అస్త్రం స్వచ్చందంగా ఈ ఎన్నికలను బహిష్కరించడమే. అదే నిజమైన తెలంగాణా స్ఫూర్తి. ఎన్నిమార్లు ఎన్నికలలో పాల్గొన్నా దాని ప్రభావం ఒట్టిపోతున్న వేళ మాకొద్దీ కుట్రపూరిత, దగాకోరు, దగుల్భాజీ ఎన్నికలని, శవ రాజకీయాలని ప్రజలు విస్పష్టంగా ప్రకటించిన వేళ ఈ కాగితప్పులుల మేకపోతు గాంభీర్యాలు పటాపంచలై దిగి వస్తారు.అదే ఆత్మార్పణ చేసిన అమరులకు నిజమైన నివాళి…

కాదంటారా?


ధరణీమాతకు క్షమార్పణలతో..


అమ్మా..

మా అల్ప బుద్ధితో నిన్నర్థం చేసుకోలేక

నీ కడుపులో చేయిపెట్టి నిన్ను తీవ్ర

అవమానాల పాల్జేసి, నీ పాలుతాగి

నీ రొమ్ముగుద్దే నీచుల సావాసంతో

నీ పచ్చని చీరను లాగి నిన్ను వివస్త్రను

చేసి వికటాట్టహాసం చేసే ఈ మూర్ఖులను

క్షమించు తల్లీ..

క్షమించమనే అర్హతను కోల్పోయామని తెలుసు…

అయినా నీవు సహనానికి మారు రూపమనే

ధైర్యంతో ప్రార్థిస్తున్నా…

తెరిచిన నీ మూడో నేత్రాన్ని చాలించుతల్లీ

ఈ బుగబుగల తాపాన్ని తగ్గించు తల్లీ

(ధరిత్రీ దినోత్సవం నాడు ఏమీ చేయలేని నిస్సహాయతతో ఈ ప్రార్థన)

ఎదలో పొగబెడుతున్నదెవరు?


అంతా కలిసి నడవాల్సిన వేళ

అందరి వేళ్ళు కలిసి ఒకే పిడికిలవ్వాల్సిన క్షణాన

మండుతున్న నెత్తురు ఒకే నరంనుండి ప్రవహించాల్సిన సమయాన

కోట్ల గొంతులు ఒకే పొలికేకగా పిక్కటిల్లాల్సిన కాలాన

ఏ కాలనాగు విషపు బుసలు మిమ్మల్ని వెన్నాడుతున్నాయి

ఏ సైతాను మీలో ప్రవేశించి విచ్చిన్నం చేస్తోంది..

కలసి నిలబడితే కానీ

కలల అంచుమీద కత్తి సాము చేస్తే గానీ

గెలవలేమని తెలిసి మీరిలా….


ఎండిన పేగుల నాదం మీ నినాదం కావాలి…

రండి కదలిరండి కలసిరండి

కలబడి నిలబడి తెగబడి పోరాడండి…

(ఉస్మానియా జాక్ లో చీలిక వార్త చదివి ఆవేదనతో)