పండగ

అత్యాశ కాకూడదు..


రాబోతున్న ఎండల వేడిమికి
చిగురాకుల గొడుగు పట్టే
వృక్షరాజంలా
నిస్వార్థతను అద్దుకునే
హృదయాల మేలు కలయిక
కావాలి ఈ ఉగాది…

నేలతల్లి కడుపున
దాగిన నీటి ఊటలను
తాగి తిరిగి
తొలకరితో మొదలై
పచ్చని పంటలనందించే
తపనతో వర్షించే కాలమేఘంలా
ధర్మాన్ని ఆచరించే
నిజాయితీ నివ్వాలి ఈ ఉగాది…

నిత్యమూ నిరతరమూ
విమర్శా ఆత్మ విమర్శల
మేలు కలయికలా
మన మధ్య స్నేహ పుష్పం
ఉదయించాలి ఈ ఉగాదిన…
(అందరికీ ఉగాది శుభాకాంక్షలుతో)

మా ఊళ్ళో రూపాయల వాన..


ఈ రోజు మధ్యాహ్నం సడన్ గా అప్పటి వరకు చుఱు మనిపించిన సూరీడు మబ్బుల చాటుకు పోవడంతో పక్కనున్న రైతు సోదరులతో ఏమిటిలా మబ్బులు కమ్మినాయి, వర్షమేమైనా వస్తుందా అని అన్నా. వస్తే ఇది రూపాయల వాన బాబూ అన్నారు. అదేంటి రూపాయలు పడతాయా అని అన్నా. పై నుండి కాదు బాబూ, నేలతల్లి ఇస్తుంది, మొన్న భోగి రోజు  కురిసిందే వాన.  తరువాత నువ్వులు జల్లాం. అప్పటి నుంచీ మరల పడలేదు. ఈ రోజు ఎన్ని చినుకులు పడితే అన్ని రూపాయలే బాబు. వేసీ నూలు పంట కదా? తొలకరికి ముందు పంట చేతికి వస్తే, ఉభాలకు మదుపులు చేరుతాయి. కొంత అప్పుల బాధ తీరుతుంది అని చెప్పారు.

వాన కోసం ఆర్తిగా చూస్తున్న వారిని చూస్తుంటే వ్యవసాయం యింకా జూదమే కదా అనిపించింది.

సాయంత్రం వారూహించినట్లుగానే  చిరుజల్లులు పడ్డాయి. చినుకులు చూస్తుంటే ఒక్కోటీ ఒక్కో రూపాయిలా కనబడ్డాయి..

తెలుగు చాప్లిన్ కు జన్మదిన శుభాకాంక్షలు


హాస్య బ్రహ్మ, నవ్వుల హరివిల్లు, పన్  డా. పద్మశ్రీ బ్రహ్మానందం గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం.

తన ముఖ కవళికలతో మన ఎదలో చక్కిలి గిలి పెట్టి, ఎంత విషాదంలో వున్న వారికైనా తనని చూడగానే నవ్వు పుట్టించే హాస్యబ్రహ్మకు తెలుగు ప్రజలు ఋణపడివుంటారు.

హాస్యానికి మించిన గుండె వైద్యమేముంటుంది. ఎద భారాన్ని తగ్గించుకోవాలంటే ఈ ముఖం చూస్తే చాలు.

కత్తిరాందాస్ కత్తిపోటుతో మదిలోని విషాదపుకుత్తి తెగి అవతల పడని వారుంటారా?

జీవితంలో పేదరికపు లోతులను చూసిన వ్యక్తి.

తెలుగు చాప్లిన్ గా పిలుచుకుంటే తప్పేంటి?

గిన్నీస్ బుక్ లో కెక్కిన మన నవ్వుల రేడుకు జన్మదిన శుభాకాంక్షలు.

క్రిస్మస్ పండగ జరుపుకుందాం


క్రిస్మస్ పండగ అత్యధిక సామాన్య ప్రజలు జరుపుకునే పండగ. పండగనాడు బంద్ జరపమని, ఓ.యూ. ప్రాంతంలో మాత్రమే కొనసాగుతుందని చెప్పిన విద్యార్థి లోకాన్ని అభినందిద్దాం. వారు చూపిన సంయమనాన్ని, మత సామరస్యాన్ని అభినందిస్తూనే, వారి పోరాట స్ఫూర్తిని గౌరవిద్దాం.

అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు….