నివాళి

శవాలపై గుడ్డలేరుతున్న రాజకీయ రక్కసులు


తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కోరుతూ సుమారు 400 మందికి పైగా యువతీ యువకులు ఆత్మార్పణం చేస్తే కళ్ళుతెరిచిన కేంద్రం తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ మొదలైందన్న ప్రకటనతో మొదలు పెట్టి శ్రీ క్రిష్ణ కమిటీ వరకు అన్ని దగాకోరు నిర్ణయాలు ప్రకటిస్తూ, రోజూ ఏదో ఒక ఆలవోక ప్రకటనలతో వారి గుండెల్లో గునపాలు దించడంలో అన్ని రాజకీయ పక్షాలు తలా ఒక చేయివేసాయి. ప్రధాన పక్షాల అధినేతలు మాత్రం కమిటీకు ఏమీ చెప్పక ఒకడు మేమే కదా ఇచ్చేది చచ్చేది అని ప్రగల్భాలు పలుకుతుంటే, ఇస్తే వొద్దమని ఇంకోడు సన్నాయి నొక్కులు నొక్కుతూన్నాడు. ఈ లోపుగా రాజీనామాలు చేసిన స్థానాలలో పోటీకి మేమంటే మేం సై అని నిస్సిగ్గుగా ముందుకు వచ్చిన వీళ్ళకు నిజంగా తెలంగాణా ప్రజల పట్ల అభిమానముందా? వారి భావోద్రేకాలను సొమ్ము చేసుకొనడానికి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. భారీ విగ్రహ దళసరి నాలుక నాయకుడు గెలిస్తే నేనే సి.ఎం.అయి తెలంగాణా ఇచ్చేస్తానని కదల్లేక కదుల్తూ జనాన్ని విసిగిస్తున్నాడు. మరల వీళ్ళ నల్లడబ్బు, అధికార ప్రభావం పారించి ఎలాగైనా ఎన్నికల్లో గెలిచే ఏర్పాట్లు చేసుకుంటున్న ఈ మోసకారి నాయకులను ఎండగట్టాలంటే అసలు ప్రజలు తమకున్న ఒకే ఒక అస్త్రం స్వచ్చందంగా ఈ ఎన్నికలను బహిష్కరించడమే. అదే నిజమైన తెలంగాణా స్ఫూర్తి. ఎన్నిమార్లు ఎన్నికలలో పాల్గొన్నా దాని ప్రభావం ఒట్టిపోతున్న వేళ మాకొద్దీ కుట్రపూరిత, దగాకోరు, దగుల్భాజీ ఎన్నికలని, శవ రాజకీయాలని ప్రజలు విస్పష్టంగా ప్రకటించిన వేళ ఈ కాగితప్పులుల మేకపోతు గాంభీర్యాలు పటాపంచలై దిగి వస్తారు.అదే ఆత్మార్పణ చేసిన అమరులకు నిజమైన నివాళి…

కాదంటారా?


నవ్వుతెరల మాటున దాచుకున్న విషాదం


నవ్వుతెరల మాటున దాచుకున్న విషాదం

(ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్ జయంతి సందర్భంగా ఆయనకు యిదే నా నివాళి..)

పేదపద్మనాభంపై సినిమా వాళ్ళ నిర్లక్ష్యం


హాస్యరస రాజు పద్మనాభం చనిపోయిన తరువాత ఒక్కపేరున్న నటుడుకూడా తన ఆఖరి చూపుకు వెళ్ళలేదు. బతికినన్నాళ్ళు నిజాయితీగా బతికి, సంపాదించిన దానితో మరల సొంతంగా సినిమాలు తీసి తగలబెట్టుకొని చివరి దశలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులకు లోనైన తమ సహ నటుడు చనిపోతే ఒకరిద్దరు తప్ప (గాయకులు బాలసుభ్రహ్మణ్యం, నటుడు మాదాలరంగారావు..) పేరున్న నటులు ఒక్కడు కూడా వెళ్ళలేదు. పాత సినిమాలలో ఆయన లేని సినిమాలు తక్కువ. తన సహజమైన యాసతో, నటనతో మనలనలరించిన వానికి మన తెలుగు పరిశ్రమ యిచ్చిన గౌరవం ఇది. డబ్బున్నవాడికి అన్ని పదవులు, అవార్డులు యిచ్చి చస్తే వాడి కళ్ళు ఇంత పెద్దవి అని తెగ పొగిడే వీళ్ళు తమ సహజమైన రంగును యిలా బయటపెట్టుకున్నారు. గాన గంధర్వుడిగా అందరం ఈనాడు గౌరవిస్తున్న బాల సుబ్రహ్మణ్యంకు తన మర్యాదరామన్న సినిమాలో అవకాశమిచ్చింది పద్మనాభం. వీళ్ళలా లౌక్యం, తార్పుడు గుణం లేక వున్నదంతా ఆర్పుకున్న వాడికి చివరిలో దక్కెది యిదే. తోటి నటులనే గౌరవించని వీరు సమాజానికి ఏదో చేసేస్తారనుకోవడం మూర్ఖత్వం.

స్వప్నిక – ఓ మరపురాని గాయం


ఏడాదిగా మరపురాని మానిపోని
గాయం
నీ కలలపై యాసిడ్ దాడి
నీ కన్నవాళ్ళకు కడుపు శోకం
నీకై ప్రతి మనసు ఓ మంచు ముత్యమై తాకాలని
నిన్ను ఓదార్చాలని ఆరాటపడ్డ రోజు
నిస్సహాయులై నిలిచిన రోజు
స్వప్నికా నీకివే మా నీరాజనాలు

(గతేడాది డిసెంబరు 13 న వరంగల్ లో యాసిడ్ దాడిలో మరణించిన స్వప్నికకు నివాళిగా)

శ్రీకాంత్ అమర్ రహే..


ఒక ఆవేదనా పూరిత
ఆవేశ క్షణాన
ఇన్నినాళ్ళు నీ నేల తల్లిని చెరబట్టిన
వారికి కొరివి పెట్టాలన్న నీ
కోరికను బిగ్గరగా నినదించేందుకు
నీవే కొవ్వొత్తివై
భవిష్యత్ తరాల జీవితాలకు
దివిటీగా మారే నీ
స్వచ్చమైన గొంతును
ఇలా బలిదానం చేసి
మా వెన్నులోని చలిని పటాపంచలు
చేసిన నీ త్యాగం
నూతన తెలంగాణా  చరిత్ర పుటల్లో
నెత్తుటి తడి అక్షరాల మద్య
సజీవం మిత్రమా…
నీ ఆశయం నెరవేరేందుకు
నేడు లక్షలాది పాదాలు కదులుతున్నాయి..

జయహో ముంబై


ముంబై – ఇది  ఒక గాయపడ్డ నగరం

నెత్తురోడుతున్న నగరం

సామాన్యుడి నెత్తురితో హోళీ ఆడుతున్న నగరం

గత్యంతరం లేక డబ్బావాలా సాగిపోతున్న నగరం

 

మీ నవ్వు వెనకాల దాగిన దుఖం

బిగబట్టిన మీ పెదవి వెనకాల దాగిన దృశ్యం

మా గుండెల్లో పదిలం…