నిజం

కిషోర్ చంద్ర దేవ్ లేఖ పొగ బాంబా లేక డైనమెట్టా??ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో పెద్ద కుదుపు కుదిపిన, కేంద్ర మంత్రి నిజాయితీపరుడు అయిన కిషోర్ చంద్ర దేవ్ అధిష్టానానికి రాసిన లేఖ మా బొత్స బావ్ కు కోపమొచ్చేట్టు చేసింది. మాఫియా డాన్ బొత్స గారిని, అసమర్థ సి.ఎం. కిరణ్ గారిని మారిస్తే కాని నిలువ నీడ లేదని లేఖ రాసినట్టుగా మీడియాలో ప్రచారంతో బొత్స బావ్ అగ్గి మీద గుగ్గిలమై పోయి రాసిన పత్రికపైనా కోర్టుకు వెళతానని స్క్రోలింగ్ ఆపక పోతే మీడియాపై కూడా కోర్టుకు పోతానని రుసరుసలు విసవిసలు మధ్య దూసుకుపోయాడు.

అయినా బావ్ నువ్వు మాఫియా డాన్ అంటే చంకలు గుద్దాల్సింది పోయి అలా గరం అవుతావేంటి బావ్.. ఇప్పటికే నీవైపు కన్నెత్తి చూడడానికి భయ పడుతున్నారాయె.. ఇంక నీ పేరు కూడా తలవరు కదా.. నువ్వు చేస్తున్నన్ని కబ్జాలు, ఈ నాలుగు జిల్లాల్లో నీ మేనల్లుడు షాడొ లీడర్ చేస్తున్న దాదాగిరీ తెల్దా పెద్దాయనకు. అందుకే కూసింత గట్టిగా సెప్పినాడు ఆ గట్టి పిండం. మద్యం మాఫియా బట్టబయలు చేయబోతే ఆ ACP ని శంకరగిరి మాన్యాలు పట్టించేసి కిరణ్ ముడ్డికిందకి చిరు చాపను లాగి భయపెట్టి ఆ ACB కేసులను మాఫీ చేయించీసి తెల్ల కార్డుయ్ గాల్లని పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేట్టు చేసిన మహానుభావుడివి. ఇవన్నీ దగ్గరగా ఎరిగిన పెద్ద మనిషికి ఒళ్ళు మండి రాసీసాడు. మరేటి సేత్తావేంటి. అయినా సూట్ కేసులున్న నీకు భయమేటి. కాళ్ళ బేరంలో నీకు సాటిరారు కదా..

మరింక కిరణ్ గారి గురించి ఎంత తక్కువ మాటాడుకుంటే అంత మంచిది.. అదంతా పెద్దాయన సూసుకుంతాడు..

కరెంటు కామెంటు7-హస్తమించిన సూరీడు..సూరీడు గుర్తు పెట్టుకొని ఏదో సమాజంలో మార్పు తీసుకు వచ్చేస్తాను, సామాజిక న్యాయం నినాదంగా ఊదరగొట్టిన చిరంజీవి తన లోతు గుండెలో ఇన్నాళ్ళు దాచుకున్న యవ్వారాన్ని ఈరోజుకు బయటపెట్టుకొని ఊపిరి పీల్చుకున్నాడు. అధికార లాలసతతో మొదలుపెట్టిన తన రాజకీయ ప్రస్థానాన్ని ఇలా మరో మెట్టు పైకెక్కడానికి ఇలా బోర్డు తిప్పేయడం చూస్తుంటే ఇంత సిగ్గుమాలిన రాజకీయాలను చూస్తూ ఊరుకున్న మన నిస్సహాయత పట్ల అసహ్యమేస్తోంది. మొత్తమ్మీద తన పెట్టుబడి తిరిగి రాబట్టుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప దీనివలన రాజకీయాలలో ఏమీ పెను మార్పులు రాకపోవచ్చు. అసలే అసమ్మతి కుంపట్లతో ఉడుకుతున్న కాంగ్రెస్ నెత్తిన మరో కుంపటి పెట్టుకుండే తప్ప ఇది మరోటి కాదు. ఈ విలీనం వలన మరింత గందరగోళంకు గురవుతూ ఇంక ఇంతవరకు బయటపడని వారు అటు జగన్ వైపో, టి.డి,పి. వైపో గెంతడం తథ్యం.

మరో పెద్ద జోక్ ఈ రోజు చిరంజీవి నోటి వెంట వచ్చిందిః అవినీతిపై కాంగ్రెస్ తీసుకున్న చర్యలు తనను ఆకర్షించిందంట. ఇంత కంటే హాస్యాస్పదమైనదేమైనా వున్నదా? అంటే ఇంక రెండు చెతులా సంపాదించ వచ్చునని చిరు ఆశ పడుతున్నట్లున్నాడు.. హతోస్మి..

నిజాలను మింగేసే కార్పొరేట్ ఆసుపత్రులు..


నిన్న చంపబడ్డ మద్దెలచెర్వు సూరిని కారులోంచి దించిన సీను చూస్తే చిన్న పిల్లాడికి కూడా అర్థమవుతుంది. అప్పటికే చనిపోయి వున్నాడని. మరి 5.55 PM – 7.55 PM వరకు వారు చేసిన వైద్యం ఎవరికి. ఈరోజు ఫోరెన్సిక్ లాబ్ వారు చెప్పిన చనిపోయిన సమయానికి ఈ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యుల రిపోర్ట్ కు తేడా వుందంటే ఎవరిది తప్పు. ఇలాగే మరో కార్పొరేట్ ఆసుపత్రి కేర్లోనే ఆనాడు వర్థమాన సినీ నటి ప్రత్యూష రేప్, మర్డర్ కేసు ఆధారాలు కోల్పోయి చివరికి అసలు నిందితులు తప్పించుకున్నారు. ఆనాడు హోం మంత్రి కుమారుడు నిందితుడు. సేమ్ కార్డ్ రిపీటయ్యిందిప్పుడు. అంటే కార్పొరేట్ ఆసుపత్రులన్నీ సాక్ష్యాధారాలను గల్లంతు చేయడానికి ఉపకరిస్తాయనేగా? శవాలకు వైద్యం చేయగలిగే వైద్యులున్నందుకు గర్విద్దామా?

కరెంటు కామెంట్స్4 – ప్లీనరీలో అంతా అమ్మ భజనేనా?
125 సం.ల వయసు కలిగిన జాతీయ కాంగ్రెస్ పార్టీ 83వ పార్టీ అత్యున్నత చర్చా వేదికైన ప్లీనరీ ద్వారా తమ దశా దిశా నిర్దేశించుకొనేందుకు కూచున్న నేతలంతా చివరకు కొత్తగా సాధించిందేమీ లేకపోగా అధ్యక్ష స్థానానికి ఎన్నికలు ప్రతీ మూడేళ్ళనుండి ఐదేళ్ళకు పెంచుతూ తీర్మానం చేయడం ద్వారా అధినేత్రికి ఈ విసుగు నుండి ముక్తి కల్పించారు. అవినీతిని అంతం చేసేద్దామన్న ప్రగల్భాలు పలకడం తప్ప అది వారి మూలుగులలోనే వుందన్న విషయాన్ని కప్పి పెట్టడానికి విఫలయత్నం చేసారు. అంతా సోనియమ్మ మహత్యం అన్న పొగడ్తలతో అధినేత్రి వద్ద తమ ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు తంటాలు పడ్డారు తప్ప, దేశంలో అధికారంలో వున్న పార్టీ ప్రజల సమస్యల పట్ల సరైన దృక్పథాన్ని రూపొందించి ఇలా మనకున్న అధికార కాలంలో వీటినుండి ప్రజలకు విముక్తి కల్పించే ప్రయత్నాన్ని చేద్దామన్న ఒక్క తీర్మానం లేదు. పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయి, లక్షల కోట్ల ప్రజాధనం కొద్దిమంది పిడికిట్లోకి పోవడాన్ని, తద్వారా దేశం ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడాన్ని తమ వాగాడంబరతతో కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం గొంగట్లో తింటూ వెంట్రుకలేరుకున్నట్లుగా వుంది. తమ సామంత రాజుల పరిపాలనంతా దీనికేమీ తీసికట్టుగా లేకపోవడం, కొత్తగా పుట్టుకొచ్చిన వంశాంకురాల కోట్ల కొలదీ అవినీతి డబ్బుతో తిరిగి తమకే ఎదురుతిరగడానికి మూలాలు వెదికి, తాము ప్రజలకు జవాబుదారీగా ఎదగాలన్న ఆకాంక్ష ఏ ఒక్కరిలోనూ లేకపోగా, వీటన్నిటికీ విరుగుడు యువరాజు గారిని వచ్చే ఎన్నికలలో గెలిపించడమే తమ పరమావధిగా భుజానికెత్తుకోవడానికి ఒకరికి ఒకరు పోటీ పడడం చూస్తుంటే ఈ బురారీ సమావేశాలు ప్రజలకు టోపీ వేయడానికి కొత్త పథకాలు ఆలోచించడానికే పనికొచ్చాయనిపిస్తోంది.

గత డిసెంబరు 9 నాడు ఈ దేశ అత్యున్నత శాశన వ్యవస్థ గుమ్మం ముందు నిలబడి తెలంగాణా ఏర్పాటుకు నాందీవచనాలు పలుకుతూ వారిలో ఆశలు రేకెత్తించిన వారు దీనిపై కప్పదాటు వేత ధోరణిలో కనీసం తీర్మాణాలలో చోటు కల్పించక పోవడం ద్వారా తెలంగాణా ప్రజలను ఇన్నాళ్ళు మోసం చేస్తున్నట్లుగానే అర్థమవుతోంది. వేసిన కమీషన్ కు న్యాయబద్ధత లేకపోవడం, రాష్ట్ర పార్టీ ధోరణి తెలపకపోవడం ద్వారా తెలంగాణా ప్రజల కళ్ళలో కారం కొట్టడానికి మరో ప్రయత్నంగానే భావించాల్సి వస్తోంది. రాష్ట్ర ప్రజలంతా తీవ్ర అభద్రతా భావంలో వుంటున్న కాలంలో అధికార పార్టీ అత్యున్నత వేదికలో దీనిపై చర్చ లేదంటే వారి మోసపూరిత ధోరణిని గ్రహించాలి.

చివరకు అమ్మ, బాబులకు చెక్కభజనలో ఆరున్నొక్క రాగాలాపనే తప్ప మనకొరిగేదేమీ లేదన్నది నిజమా కాదా?

వై.ఎస్.వుంటేనా…


ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన డి.ఎస్.ముందు ఒక సర్పంచ్ సుమారు అరవై ఏళ్ళకు పైగా వున్న పెద్దాయన జరిగిన పంట నష్టం గురించి వివరిస్తూ, ఉపాధి హామీ పథకం వలన వలస పోయే కూలీలు తగ్గినా వ్యవసాయ కూలీ రేట్లు పెరిగి వ్యవసాయం పెట్టుబడి అధికమైందని వివరిస్తూ, తుఫాను వలన జరిగిన పంట నష్టానికి ఇదే సమయంలో వై.ఎస్. గనక వుంటే నేనున్నానని అని తన ప్రసంగం కొనసాగిస్తుండగా ప్రక్కనున్న ప్రభుత్వ విప్ కోండ్రు మురళి మైక్ లాక్కుని, ప్రతిపక్షాలు అసెంబ్లీని అడ్డుకుంటున్నాయని, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ సహకారంతో సాయం చేసే వారని అన్నప్పుడు జనం వై.ఎస్.ఆర్.జిందాబాద్ నినాదాలతో సమాధానమిచ్చారు. మురళి లాంటి నడమంత్రపు సిరి రాజకీయ నాయకులు అలా ఓ సర్పంచ్ మాట్లాడుతుండగా మైక్ లాక్కోవడం చూస్తుంటే రాజకీయ ఊసరవెల్లులు ఎలా ప్రవర్తిస్తారో కళ్ళముందు కనబడింది.

జరిగిన అవినీతి, ఆశ్రిత పక్షపాతం వీటన్నింటికీ కారణంగా వై.ఎస్.ను ఎంతలా విమర్శించినా సామాన్య జనంలో ఆయనకున్న పేరు ఇంత తొందరగా మసిబారదనిపిస్తోంది..

కరెంట్ కామెంట్స్ 3 – కొత్త మంత్రి వర్గం


కొత్త సీసాలో పాత సారా


కొత్త మంత్రివర్గం కొలువు దీరింది..

అధిక శాతం రెడ్డి వర్గానికే దక్కింది..

ముఖ్యంగా వై.ఎస్.ను తన మరణానంతరం తమ అద్దంలో ఎంత చిన్నవాడుగా చూపించే ప్రయత్నం చేసారో వారికె అందలమెక్కించారన్నది ప్రస్ఫుటమైంది…

పదవులకోసం ఎంతగా పాకులాడుతారో, తాము దేనికైనా తెగిస్తారన్నది దీనిద్వారా తేటతెల్లమైంది…

పాత కాపులకే మళ్ళీ పగ్గాలు దక్కడంతో పాలనలో కొత్తదనం ఎలా తేగలరు ఈ ఒకప్పటి క్రికెట్ కెప్టెన్. జట్టులోకి రిటైరైన వారిని, మాచ్ ఫిక్సింగ్ గాళ్ళను తీసుకొన్న ఫలితంగా
ప్రజలకు ఏమీ ఒరగబెట్టేది వుండదన్నది చేదు నిజం కాదా?

ఏమైనా ఈ కొత్త పాలెగాండ్రు ఎన్నాళ్ళు కొలువుదీరుతారో వేచి చూద్దాం…

ముందే చేసుండాల్సింది..


రోశయ్యగారు తీసుకున్న తాపీ నిర్ణయం వలన యింతా జరిగింది. అసలు రాత్రి జగన్ ను గృహనిర్బంధంలో వుంచి వుంటే తెలంగాణాలో యింత ఉద్రిక్త పరిస్థితి వచ్చేది కాదు. రైలు ఎక్కనిచ్చి, భారీ బందోబస్తు మధ్య పెదవులనుండి బయటపడీ పడని నగుమోముతో ఆయన బయల్దేరడం వలన జరిగిన ఈ ఆస్తి నష్టాన్ని ఆయన నుండే తిరిగి వసూలు చేస్తే మరల యిలాంటి ఉద్రిక్త పరిస్థితులు యిలాంటి నాయకులు చేపట్టరు.

సురేఖ గారు తమ అనుచరులతో కాల్పులు జరిపించడం జరిపించి ఏదో సామెతలో అన్నట్లు ఇంటి చూరుకు నిప్పుపెట్టి అత్తా నా ఒళ్ళు వణుకుతోందన్న కోడలు మాదిరిగా ఆత్మ హత్యాయత్నం డ్రామా ఆడారు. యివన్నీ జనం చూస్తున్నారన్న వివేకం లేని రాజకీయ నాయకులను ఏమనాలో తెలియడం లేదు.

పానకంలో పుడకలా జగడపాటి గారికి తీవ్రవాద సంస్థలు గుర్తొస్తున్నాయి. ఎవరికి నచ్చినట్లు వారు తిరగడానికి పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు పంతాలకు పోవడం దేనికి. ఏం సాధిద్దామని? నిజంగా వీళ్ళకు ప్రజలపై ప్రేమ వుందా? వుంటే ఈ మధ్యకాలంలో తుఫానులో మృతి చెందినవారిని, వడగాడ్పులలో మృతి చెందిన వారిని పరామర్శించొచ్చు కదా? అసలు వీళ్ళు నిజమైన సమైక్యాంధ్ర వాదులైతే ఇటీవల తెలంగాణా కోరుతు ఆత్మ బలిదానం చేసిన వారి కుటుంబాలను పరామర్శించొచ్చు కదా? వై.ఎస్. హఠాన్మరణం వలన చనిపోయారన్నది వాస్తవానికి దూరంగా లేదా? ఎందుకంటే ప్రాజెక్టుల పేరుతో కోట్లు గడించిన కాంట్రాక్టర్లు, ఆయన చలవతో మంత్రిపదవులు పొంది తరతరాలకు సరిపడ కూడబెట్టుకున్న మంత్రి వర్గ సహచరులకు కానీ,  రోజూ ఆయనకు గొడుగు పట్టిన సూరీడుకు ఆగని గుండే వీళ్ళందరికీ ఆగిపోవడమేమిటి? రాజుగారు మరణించిన ఆర్నెళ్ళకు ఏడ్చిన రాణిలా ఇప్పుడు వద్దు మొర్రో అని అంటున్నా ఓదార్పు పేరుతో తిరగడమేమిటి? తనకున్న ఫాలోయింగ్ ను షో చేయడానికి కాకపోతే? కావున ఈ రోజు జరిగిన,జరుగుతున్న ఆస్థి, ప్రాణ నష్టానికి ఈయన గారిని బాధ్యున్ని చేస్తే మరోమారు ఏ నాయకుడు తోక జాడించడు. ఆ ధైర్యం మన యంత్రాంగానికుందా?

మరో సామాన్య నిరాయుధుని బలి


ఈరోజు సంతోష్ నగర్ కూడలిలో గస్తీలో వున్న కానిస్టేబుళ్ళపై ఆగంతకులు కాల్పులు జరపగా అందులో రమేష్ అనే కానిస్టేబుల్ మరణించాడు. మరో యిద్దరు గాయాలపాలయ్యారు.

ఇది మన నిర్లిప్త రక్షక భట వ్యవస్థ యిచ్చిన బలిగానే పరిగణించాలి. పోలీసు గస్తీ పోస్టులలో వున్న వారిని నిరాయుధులుగా నిలబెట్టడం, అది కూడా పాతబస్తీ కూడళ్ళలో ఎంతవరకు సమంజసం? ఆ దగ్గర్లోనే మన సిద్ధం హీరో జగపతిబాబు డూప్ సి.పి. ఖాన్ గారు (గల్లీ పోలీసు క్రికెటర్) పర్యవేక్షిస్తున్నారంట మందీ మార్బలంతో. పాపం బిక్కు బిక్కుమంటూ 18 వ తారీఖు ఎప్పుడు గడుస్తుందా అని ఎదురుచూస్తున్న సామాన్య పోలీసులకు ప్రాణాలర్పించాల్సి రావడం విషాదకరం, విచారకరం, ఖండించాల్సిన విషయం. యిలా నిరాయుధులుగా నిలబెట్టిన వారిపై గతంలో కూడా దాడులు జరిగాయన్న ఇంగితజ్నానం లేకుండా వారి బలికోరడం వారి దౌర్భాగ్యం తప్ప మరోటి కాదు. బాసులు చుట్టూ ఆయుధధారులను వుంచుకొని గల్లీలో షికార్లు చేస్తూంటే పాపం రమేష్ బలయ్యాడు.

ఇది పిరికిపంద చర్యగా అంతా స్టేట్ మెంట్లతో సరిపిట్టేస్తారు రేపు. మరి కొద్ది గంటల్లో టీ.వీ.వాళ్ళుకూడా మరో కొత్త అంశం తో ఊదరగొడతారు. వికారుద్దీనో, జలాలుద్దీనో తాపీగా జారుకుంటాడు. ప్రతీకారంగానో, కేసు మూసేయడానికో సోడాబుడ్డీ అహ్మదో, దర్జీవాలా కబీరో కటకటాలు లెక్కిస్తాడో లేక ఎదురుకాల్పులలో మరణిస్తాడు!

శాంతి శాంతి శాంతి..

‘జాతిపిత’ మహాత్ముడు కాదా?


భారత ప్రజలలో అత్యధిక శాతం మంది నారాయణుని దశావతారాలలో ఒకడిగా, తమ జాతిపితగా, మహాత్ముడిగా ఆరాధిస్తున్న మోహన్ దాస్ కరంచంద్ గాంధీ లోని సామాన్యుని కోణాన్ని వెలుగులోకి తెస్తున్నట్లుగా చెప్పుకుంటూ లండన్ విశ్వవిద్యాలయానికి చెందిన జేడ్ ఆడమ్స్ రాసిన ‘గాంధీః నేకెడ్ యాంబిషన్’ అనే పుస్తకం ఆయన లోని శృంగారం విషయంలో ఆయనలోని బలహీనతలను ఎత్తిచూపించింది. వయసు పైబడ్డాక కూడా అనుచరుల భార్యలతోను, మేనకోడలు వరుసయే టీనేజ్ పిల్లలతోనూ ఆయన ప్రవర్తించిన తీరును అక్షరబద్ధం చేసిన ఈ పుస్తకం అసామాన్య వ్యక్తిలోని అల్పత్వాన్ని సోదాహరణంగా వివరిస్తోందంట. యూరప్ లో తాజాగా విడుదలై అప్పుడే వివాదాలకు తెరలేపుతోంది.

గాంధీ దృక్పథం శృంగారం విషయంలో అసహజంగా, అస్వాభావికంగా వుందన్న విషయాన్ని దేశవిభజన సమయంలోనే నెహౄ గ్రహించారంట. ఈ స్వభావం కారణంగానే జె.డి.కృపలానీ, వల్లభాయి పటేల్ వంటి నాయకులు ఆయనకు దూరంగా జరిగారంట.

సెక్స్ పట్ల ఆలోచనలను అదుపులో వుంచుకోవడానికి గాంధీ విపరీతంగా ప్రయోగాలు చేశారంట. తన కోరికలు అదుపులో వున్నాయోలేవో చూడటానికి అమ్మాయిలను తన పక్కనే నగ్నంగా పడుకోపెట్టుకోవడం, వాళ్ళు స్నానం చేస్తుంటే కళ్ళుమూసుకుని అక్కడే ఉండటం, తాను స్నానం చేసుకునే ముందు మసాజ్ చేయించుకోవడం యిదివరకే చాలామందికి తెల్సిన విషయాలు. వీటికి మరికొంత యీ పుస్తకంలో జోడించారు.

యివన్నీ చదువుతుంటే ఈ మధ్య మన మాజీ గవర్నర్ తివారీ, యిటీవలి నిత్యానంద స్వామి రాసలీలలు గుర్తుకొస్తున్నాయి. యిలా అంటే చాలా మందికి ఆగ్రహం రావచ్చు. కానీ యిది ఆ ప్రయోగాల బారిన పడ్డా అమ్మాయిల మానసిక క్షోభను గురించి ఆలోచిస్తే ఎంత అసంబద్ధంగా, జుగుప్సాకరంగా వుంటుందో కదా?

(నిన్నటి ఆంధ్రజ్యోతి నవ్య లోని కథనం, జీ 24 channel లోని చర్చ చూసి)

చిచ్చు వెనక మైనింగ్ మాఫియా?


ఈ రోజు ఆంధ్ర భూమి దినపత్రికలో హైదరాబాద్ అల్లర్ల వెనక మైనింగ్ మాఫియా హస్తం వుందని వార్త రాసారు.

గాలి సోదరుల గనుల అక్రమ తవ్వకాలను రోశయ్య ప్రభుత్వం అడ్డుకొనడాన్ని జీర్ణించుకోలేని వారు ఈ హైదరాబాదు అల్లర్లకు ఒక వర్గం వాళ్ళకి విరివిగా డబ్బులు పంపుతున్న సమాచారముందని రాసారు. చివరికి కర్ణాటక ప్రభుత్వాన్ని అల్లకల్లోలం చేసిన ఈ సుడిగాలి సోదరులు తమ అనుంగు మిత్రుల ద్వారా ఆంధ్ర ప్రదేశ్ లో కూడా చిచ్చుపెట్టగలిగారంటే వారి బలం ఏపాటిదో అర్థమవుతోంది. వారికి ఇక్కడి వారి సహకారం లేకపోతే ఇదంతా జరుగదు. వారి ఎన్నికలకు తోడ్పాటునందించిన దేముడి కుటుంబం దన్ను లేకుండా వుంటుందా? కాగల కార్యం గంధర్వుడే తీరుస్తానంటే వద్దంటారా?

యిలా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వారిని ఉరితీయాలి.