నాలో నేను

మనకై మనం నిలబడేదెన్నడు?


“Wanting to be someone else is a waste of the person you are.”
Kurt Cobain

ఎప్పుడూ ఎవ్వరి వెంటో నడవడానికి
చూపే ఉత్సాహంకంటే..
నీ కాళ్ళ బలిమి తెలిసి నిన్ను నీవు
గట్టిగా నేలను తన్నిపెట్టి
నిటారుగా వెన్నుపూస
నిలిపి మాట్లాడే మనిషిగా
రూపొందలేవా?

ఎవడో ఒక మాయల మరాఠీ వెనక
వాడి మంత్ర దండపు మాయా శక్తి
లో ఏదో దాగుందన్న ఆతురతతో
పరుగుపెట్టడమే తప్ప
నీ పిడికిట బిగించి గట్టిగా
చేయెత్తి ఎప్పుడైనా విసిరికొట్టావా?

ఎక్కడిదో ఓ చద్దన్నం మూట
రాలిపడదా..
ఈ పూటకు గడిపేయలేనా
అన్న నిస్సత్తువ మూలుగు తప్ప
నీ పొలికేకతో దిగంతాలు పెక్కటిల్లి
భూమి పొరల దాగిన
నీదైన మెతుకు ఉబికి వస్తుందన్న
స్పృహ లేనితనమింకెన్నాళ్ళు?

ఈ బేలతనం వల్లనే
నిన్ను నీవు కబేళా పశువులా
తోలబడుతున్నావన్న గ్రహింపు
ఇంకెన్నాళ్ళకి?

(ఈ నాయకుల వెంట పరుగులెత్తుతున్న గొఱెలమందను జూసి)

అంతర్ముఖం


ఒంటరితనం మనిషిని ఏదేదో చేస్తుందన్నది అందరికీ అనుభవైకమే అనుకుంటా?

సమూహంలో కూడా ఒంటరితనం ఫీలవుతుంటాను నేను. అందరితో మాటాడుతున్నట్లే వున్నా అదేదో జారుడుబల్లమీద జారిపోతున్నట్లుగానే వుంటుంది. ఎదురుగా వున్నవాళ్ళలో మనలా ఆలోచించే వాళ్ళు లేకపోవడం, మానసికంగా దగ్గరితనం కలిగినవారు వుండకపోవడం ఈ వెలితికి కారణంగా ప్రతి క్షణం అనిపిస్తుంది. కానీ ఏవో మాటల్లో పడి కొద్ది సేపు అలా బయటపడినా మరల అంతర్ముఖుడినయిపోతుంటాను. ఇది చదువుకున్న రోజుల నుండి తక్కువగా వుండేది.  స్నేహితులు కూడా అతితక్కువమందిగానే వుండి కొన్ని అంశాలలోనే దగ్గరితనం వుండడంతో  మరల ప్యూపా దశకు చేరేవాడిని. అలాగని నాతో స్నేహం చేసేవాళ్ళు మరిచిపోయేవాళ్ళుకాదు. వారికి నాతో మాటాడడం రిలీఫ్ గా ఫీలవుతున్నాం అనేవారు. కానీ నాకు ఆ ఫీల్ కలగలేదు.

వివాహితుడనయినా, పిల్లలు మరల చదువులకు పై వూళ్ళకుపోవడంతో మరల అది ఎక్కువయింది. దానినుండి బయటపడడానికి శక్తికి మించినదయినా ఇలా ఈ అంతర్జాలలోకంలో నా మనసుకు నచ్చిన వాక్యాలను వెతుక్కుంటూ గడిపేస్తున్నా. అయినా మరల ఏదో గిల్టీ ఫీలింగ్ వెంటాడుతుంటుంది.  ఏమీ చేయలేకపోతున్నామే అని మదనపడడమే. మరల ఉపకారం పొందినవారు చేసిన ద్రోహం గుర్తొచ్చి అది కూడా మంచిది కాదన్న అభిప్రాయం ఏర్పడింది. అయినా చేతనయినంతలో మంచి చేయడానికే మొగ్గు చూపుతుంటాను. ఎవరికైనా కష్టం కలిగితే ఓర్చుకోలేనితనం (ఇది గొప్పకోసంకాదు). వెంటనే స్పందిస్తాను. కానీ అది ఒక్కోసారి నాకే అపకారంగా మారుతుంటుంది.  అయినా సగటు మానవుడిగా బయటపడలేకపోతున్నా.  ఈ బలహీనతవలన ఎదుటివారికి చేతకాని దద్దమ్మలా, అమాయకుడిలా కనిపిస్తుంటాను.  వెటకారమాడేవాళ్ళని అలా చూస్తూ వుండిపోతుంటాను.  అది వారి తెలివితక్కువతనమేలే అని నన్ను నేను సమర్థించుకుంటాను. కానీ మరల నాలో మదనం మొదలు. వెంటనే నువ్వెందుకు రియాక్ట్ కాలేకపోయావు అని. వదిలేయిలే అని కొద్దిసేపు కనులు మూసుకుంటాను.  ఇది చేతకానితనమా?

అందరిలా తుళ్ళుతూ తిరగలేనితనం ఎలా ఒంటబట్టిందో? ఇంక మారదేమో? మా అమ్మ అంటూ వుంటుంది ‘పుట్టుకతో వచ్చింది పుడకలతోనే పోతుందిరా’ అని. నిజమేనేమో.