నాకు తోచినది

దాయాది పోరు??


రాబోయే ఉపఎన్నికలు ఓ కొత్త ఒరవడికి తెరలేపుతున్నాయా?

మొన్న మీసం మెలేసి తొడ చరిచినప్పుడు, నిన్న ప్రతిపక్షం వారి చొక్కా పట్టుకొని తాను రాములోరి లక్ష్మణుడినని జీర గొంతుతో పలికిన పలుకులు ఉత్తుత్తినే అని కొద్ది గంటల్లోనే నిరూపించి తాను విభీషణున్నే అని చెప్పకనే చెపుతున్న పులివెందుల పులిబిడ్డ (సీనియర్-2) రాజకీయాలలో బంధుత్వంకు ఎటువంటి సెంటిమెంటు లేదని నిరూపించి అమ్మ విసిరే పాచికలో పావు కాబోతున్నారా?

ఇదేదో ఓ గొప్ప ప్రజాస్వామ్య పద్ధతిగా మనం కీర్తించుకుంటూ బుల్లి తెరముందు కూచుండిపోతాం… ఆహా మనమెంత ఆశపోతులం…

ఈ పొట్టేళ్ళ పందెంలో బలికాబోయే మూగజీవులెన్నో….

హతవిధీ…  ఇది మరో రావణకాష్టం కాబోదు కదా?

అంతా తేలుకొట్టిన దొంగలే…


ఆధునిక నారదుడు

వికీలీక్స్ పుణ్యమా అని మొత్తం ప్రపంచ దేశాల అంటకత్తెర సంబంధాలన్నీ బయటపడ్డంతో ఎక్కడి వారక్కడ తేలుకుట్టిన దొంగల మాదిరి గప్ చుప్ గా అయిపోయారు. ఇంత కాలం స్వేచ్చా, ప్రజాస్వామ్యాలకు మాదే చిరునామా అని గుండెలుబాదుకొని చెప్పుకుంటూ, ఇతర దేశాలన్నిటి మీద పెద్దన్న దొరతనం చెలాయించిన అమెరికా లోగుట్టు బయటపడ్డంతో, వారి అనైతిక విదేశీ వ్యవహారాలు, వ్యాపారాల కుతంత్రాలు అందరికీ ఎరుకలోకి రావడంతో వీటిని బయటపెట్టిన అసాంజ్ పై నిరాధార నేరారోపణ చేసి అరెస్ట్ చేయించడం చూస్తుంటే ప్రశ్నించిన వారిని మొదటి నుండి అణగదొక్కుతోంది మొఱో అని చెప్తున్న లాటిన్ అమెరికా దేశాల గోడు నిజమైందిప్పుడు. ఇరాక్ పై చేసిన అన్యాయపూరిత దాడి వెనక వారి లాభాపేక్ష, అధికార దర్పం, బిన్ లాడెన్ వేట పేరుతో ఆఫ్ఘనిస్తాన్ లో కొనసాగుతున్న నరమేధం. తద్వారా రష్యా, చైనాల పక్కలో స్థానానికి అది చేసే ప్రయత్నం, ఇటు వివిధ దేశాలలో తమ రాయబార కార్యాలలో జరుగుతున్న అనైతిక దూతల గూఢచర్యలు, ఈ జేమ్స్ బాండ్ లు వివిధ రూపాలలో అన్ని దేశాల ప్రభుత్వ కార్యక్రమాలలో వేలు పెట్టిన తీరువలన వారెదుర్కొంటున్న స్థానిక అనిశ్చితి, తద్వారా వారి వ్యాపార లావాదేవిల గుట్టు మొత్తమ్మీద అమెరికా ముఖం చిరిగిన విస్తరైంది వికీలీక్స్ వలన. ఏ మానవ హక్కుల కోసం తనకు తాను పేటెంట్ కల్పించుకొని, తన వాగాడంబరతతో, సైనిక, ఆర్థిక బలంతో ఇన్నాళ్ళు ఆధిపత్యాన్ని చలాయించిందో వాటన్నింటికీ చెంపపెట్టులా ఈ కేబుల్ లీకులు చుట్టుముట్టాయి.

పనిలో పనిగా ఇటు మన యువరాజు గారి అపరిపక్వత కూడా బట్టబయలైంది. దీంతో మన పాలక వర్గం పరిస్థితి చింపి చేటంతైంది. ఆయన అడుగిడిన చోటల్లా ప్రతిపక్షానికి కలిసొచ్చే కాలంగా మారుతుండటంతో, దీంతో కునుకుతున్న నక్కపై తాటిపండులా పడింది. ఏమన్నా ఈ విషయంలో మతతత్వ ఉగ్రవాదాన్ని తప్పకుండా ఖండించాలి. కానీ, దానిని బహిరంగంగా ఖండించలేని రాహుల్జీ ఇలా తన గోడు ఓ రాయబారి దగ్గర చెప్పుకోవడం సిగ్గుచేటు. ఆ విన్నవాడు అది రికార్డ్ చేయడంకూడా అనైతికమే. ఇలా రాయబారకార్యాలయాలన్నీ ఆయా దేశాల గూఢచర్య కేంద్రాలుగా మారిపోవడం ఏ రకమైన దౌత్యనీతో..

మొత్తానికి మన ఆధునిక నారదుడు ఇలా తంబురా మీటి అందరి గుట్టు రట్టు చేయడం ద్వారా భవిష్యత్తులో అది మరింత దాపరికానికి దారితీసేందుకు కొత్త దారులు వెతుకుతారో, లేక ఈ అనైతిక కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెట్టి స్నేహ సౌభ్రాతృత్వాలతో దేశాల మధ్య నూతన వరవడికి కొత్తపుంతలు తొక్కుతారో కదా? కానీ చివరిది అత్యాశే కావచ్చు. ఎందుచేతనంటే అంతా వ్యాపారమయం కాబట్టి.

రక్తచరిత్ర2 – సాఫీగా చప్పగా ఓ సందేశంతో…


ఎంతో ఉద్వేగానికి లోనవుతూ ఏం చెప్పాడోనని ఆశగా ఈ రోజునుండి మా ఊళ్ళో రిలీజైన మోర్నింగ్ షోకు వెళ్ళాను. కానీ సినిమాలో కాంట్రవర్సీగా చెప్పుకోదగ్గ సీను లేకపోవడం, సమకాలీన రాజకీయ నాయకులెవరినీ ప్రొజెక్ట్ చేయకపోవడంతో సాదాసీదాగా, చప్పగా, సాఫీగా సాగిపోయింది.

చెప్పుకోదగ్గ విషయమేమంటే వివేక్ ఒబెరాయ్ కు పోటీగా సూర్య నటించాడు. మొదటి సీనులోనే మందుపాతరతో ఎంటరై అక్కడ చూపిన భావాలు ఓ యువకుడి పగ, ప్రతీకారాలకు దర్పణం పట్టాయి. ఎక్కడా తగ్గకుండా మొఖంలో భావోద్వేగాలను పలికించారిద్దరూ.. సునీత పాత్రధారికి కొంత అవకాశమిచ్చాడిందులో, ప్రియమణి నటనకూడా బాగుంది. సమకాలీన రాజకీయ నాయకుల పాత్రలను చూపకపోవడం, డైలాగులు సైలెంటయిపోవడంతో వర్మకూడా సినిమా ఆడనివ్వరని భయపడ్డాడని తెలుస్తోంది. దాంతో రెండో భాగంలో తెలిసిన కథనే తెరమీద మరో మారు చూడడంతో అంత ఫీల్ కలగలేదు. నటీ నటులు పాత్రోచితంగా నటించి మెప్పించారనొచ్చు. అంతవరకు అనుకొని చూడొచ్చు. టేకింగ్ కెమెరా తలకిందులుగా తిప్పడం, అడ్డదిడ్డంగా తిప్పుతుండడం తిక్కశంకరయ్యలా అనిపిస్తాడు. నాగేంద్ర హరాయా అన్న బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆ సీనుకు అవసరమా అనిపిస్తుంది. ఈ తిక్క లేకపోతే చాన్నాళ్ళకి మొఖంపై కెమెరా ప్రతిఫలించి, కళ్ళలో నటన చూపే నటులను చూస్తున్నామన్న ఫీలింగ్ మిగులుతుంది..

చివర్లో శుభలేఖ సుధాకర్ అవకాశ వాద రాజకీయనాయకుల ఫీలింగ్ బయటపెట్టాడు. అలాగే ఆఖర్లో ప్రతాప్ రవి కొడుకు మొఖం చూపించి ముగించడంతో మరో పదేళ్ళకో, పదిహేనోళ్ళకో ముసలి వర్మ రక్తచరిత్ర-3 భాగంకోసం వేచిచూడమన్నట్లుంది..

కత్తులతో సావాసం పాట మంచి సందేశాత్మకంగా వుండి వర్మ గొంతులో వినసొంపుగా వుండి Heart touching వుంది…

మొత్తమ్మీద తీసినదాంట్లో మనకు సగమే చూపించగలిగిన వర్మను అభినందిద్దాం..

రజినీ అమితాభ్ కు భయపడి..


నిన్న మా వూళ్ళో రోబో ఆఖరు అంటే రాత్రి ఫస్ట్ షో చూసాను. ఇప్పటి వరకు చూద్దాం అనుకుంటూ వాయిదా వేసి సి.డీ.లో చూస్తే అంత ఎఫెక్టివ్ గా వుండదని చివరి రోజు చూసాను. రజిని ఇంటర్వ్యూలో అన్నది నిజమైంది. ఐష్ తో చేసిన మొదటి సాంగ్ లో గ్రూప్ డాన్సర్స్ లేకుండా చేసేటప్పుడు ఆమెకు దగ్గరగా వెళ్ళేటప్పుడు అమితాభ్ గుర్తొచ్చేవారని చెప్పాడు. సినిమా అంతా ఆమెకు ఆమడ దూరంలోనే పాపం యాక్ట్ చేసాడు. ప్రేమ సన్నివేశాలు కూడా డైలాగ్ కు పరిమితమై పోయాడు. దగ్గరగా హత్తుకొని చేసిన సన్నివేశమే లేదు. పాపం రజినీ.

సినిమా మధ్యలో కొంత బోర్ కొట్టినా ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్ సూపర్. నిజమే భారతీయ వెండితెరపై ఇంత గ్రాఫిక్స్ తో చేసిన సినిమా లేదు. రజినీ స్టైల్, మేకప్, రోబో నటనలో చేసిన విలనీ చాలా బాగున్నాయి. ఐష్ నలభయ్యో పడిలో కూడా అందంగా కనువిందు చేసింది..నిజమే ఓ పాటలో అన్నట్లు ఇంత అందం పచ్చిక అయితే పులి కూడా గడ్డే తినేది..
థాంక్స్ టు శంకర్..