దౌర్భాగ్యం

జయము జయము మారాజా!!Brahmi

మా ముఖ్యమంత్రి గారు చాలా ప్రజాస్వామికంగా వుంటారు. రాజధాని ఏర్పాటు నిర్మాణాల గురించి దేశ విదేశీ ప్రతినిధులతో చర్చిస్తారు కానీ రాష్ట్ర ప్రజా ప్రతినిధులు మేధావులతో చర్చించరు. జయము జయము మారాజా!!

మీది మా దొడ్డ మనసు!!

మీరే చిరకాలం మమ్మల్నేలి తరించండి పెబూ!!

భారతరత్నమా నువ్వింత చీపా??


ఈ దేశ అత్యున్నత పద్మా అవార్డు భారత రత్న నిన్న మరికొద్ది నెలలో ముగిసిపోతున్న ప్రధాని సలహాదారుకు నిన్నటి వరకు ఆడి రిటైర్ అవుతున్న సచిన్ కు ప్రకటించారు. ఆ శాస్త్ర సాంకేతిక సలహాదారు ఏం సలహాలిచ్చారో కానీ ప్రధాని గారు తనకెక్కడా మసి అంటలేదని సర్ఫ్ ఎక్సెల్ ఏడ్ లా మాటి మాటికి ప్రకటించుకొని అప్పుడప్పుడు తమ కాళ్ళకు అడ్డం పడుతున్న తమ కుక్క పిల్ల సిబిఐ, కాగ్ లపై ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు ఈమద్య.

యింక క్రికెట్ అన్న జెంటిల్ మెన్ క్రీడను చెడ్డీలతో డాన్సులు చేసి బెట్టింగు వ్యాపారాలకు హద్దులు చెరిపేసి ఫిక్సింగ్ లతో పరువు పోయిన క్రీడగా మార్చిన శుభ తరుణంలో వున్న ఆ క్రీడాకారునికి ఈ రత్నాన్ని అలంకరించడం నాకు నచ్చలేదు. అలా అని ఈ రత్నాలు అలంకరించబడ్డ వారందరు గొప్పోళ్ళనీ ఒప్పుకోలేను.

హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్, ఒలింపిక్ వీరులు మిల్కాసింగ్, పి.టి.ఉష లాంటి వారు ఈయనకంటే మిన్న కాదా?

వీటికి రాజకీయపు నిరోధ్ లు తొడగబడుతున్న ఈ సమయంలో మరింతగా అంతా ఆహా ఓహో అని మీడియా అంతా తెగ గగ్గోలు పెట్టేస్తూ వుండడం యిదంతా ఆ క్రీడ ద్వారా లబ్ధిపొందుతున్న చానళ్ళు, తమ సమస్యలకంటే గెలుపోటములపైనే దృష్టి మళ్ళించే యిటువంటి వాటిని ప్రచారం చేయడంలో ముందుండే రాజకీయ పార్టీలు వీళ్ళకు కొమ్ము కాయడం మనం వంతపాడడం దురదృష్టకరం.

వీళ్ళంతా ప్రజలే మరి??


నిన్న జగన్ విడుదల అయిన తరువాత ముప్పావు గంటలోపు చేరుకోవాల్సిన వాడు ఆరు గంటలు రాజు వెడలె అన్నట్టు తన కాన్వాయ్ సాఫీగా తాపీగా పోనిచ్చి సాయంత్రం ఇంటికి చేరుకోవాల్సిన జనాల్ని నానా ఇబ్బందుల పాల్జేసి అదనంగా మరో లీటరు పెట్రోలు ఖర్చుకు గురిచేసిన వైనం ఆయన వెంట పడ్డ ఈ మీడియా హంగామా లైవ్ షోలు చూస్తుంటే జైలు కెళ్ళి రావడంలో ఇంత గొప్పదనముందా అనిపిస్తోంది.

కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అటు ఐ.ఏ.ఎస్. అధికారులను అనారోగ్యాలకు గురి చేసి వారి పరువు ప్రతిష్ట మంటగలిపి వారేదో దొంగలులా ఇన్నాళ్ళు చూపి తప్పని సరి పరిస్థితులలో బలవంతపు సంతకాలు చేయించుకున్న రాజకీయ అధికార రాకాసులను వదిలి పెట్టి వారిని జైళ్ళలో ముగ్గబెడుతు ఏ-1 గా వున్నవాడ్ని బెయిలిచ్చి ఇంత హంగామాగా ఇంటికి సాగనంపిన ప్రభుత్వాధికారులు పోలీసు అధికారులు మీ గులాంగిరికి జోహార్లు. ఇదంతా అధికార దుర్వినియోగం కాదా?

కాబోయే ముఖ్యమంత్రి అంటూ అరుపులు పెడబొబ్బల లైవ్ చూస్తుంటే వీళ్ళంతా ప్రజలే మరి?? వీళ్ళకోసం ఆలోచిస్తూ ఏదో మంచి జరుగుద్ది భవిష్యత్ తరానికి అని
ఆశించడం మన వెఱితనమే కదా?? రాష్ట్రాన్ని ఆర్థికంగా అథఃపాతాళానికి తొక్కిన ఒక రాచకురుపు వెంట ఇంత మందీ మార్బలం వెళ్ళడం ఎంత దౌర్భాగ్యం. ఒక్కో టీవీ ఒక్కో వ్యాఖ్యానంతో బేక్ గ్రౌండ్ మ్యూజిక్ తో జనాల మెదళ్ళను పాలిష్ చేసే పనిలో పడ్డాయి. ఇదా వీటి సామాజిక బాద్యత? వీళ్ళంతా రాజకీయ సామాజిక కుళ్ళును కడిగేయమని మళ్ళీ స్లోగన్స్.

దీనమ్మా బతుకు చీ.. థూ అని రిక్షా రాం బీడీ ముక్క కొరుకుతూ ఊస్తుంటే ఆశ్చర్యమేసింది…

ఏ మొగుడూ దొరకనప్పుడూ…


ఏ మొగుడూ దొరకనప్పుడు అక్క మొగుడే గతిలా ఈ రాష్ట్రానికి రోజుకో మొగుడొస్తుంటాడు, కాళ్ళూ చేతులూ, కళ్ళు కూడా లేని వికలాంగులులా వాడి చుట్టూ చేరి నవ్వులు చిందిస్తారు. మన ఖర్మకి ఇలాంటి స్థితి దాపురించింది. రోజుకో కొత్త పథకం ప్రకటించి మూడు రోజులకొకసారి ఢిల్లీ పరుగెత్తి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి అధికారాన్ని అధిష్టానం కాళ్ళు మొక్కుతూ కాపాడుకుంటేనే సరిపోతొంది. వీళ్ళ వలన జనానికి ఒరిగిందీలేదు.

సామాన్యుడా నీ ఓపికకు వేన వేల వందనాలు..

ఇద్దరు ముసలి దంపతులకు 360 గదులవసరమా??


New_Delhi_1964654c
మన నేతలంతా మనకు సుద్దులు చెప్పేవాళ్ళే.. కరెంటు వాడొద్దంటారు, గాస్ వాడకం తగ్గించేలా చర్యలు తీసుకుంటారు, భోజనం మానేయమంటారు.. పెట్రోలు డీజిల్ వాడకం కూడా .. ఇలా అన్నీ తగ్గించేసుకోమంటారు..

కానీ వీళ్ళ అధికార భవంతులలో జరుగుతున్న దుర్వినియోగమెంతో ఆలోచించరు. ఇద్దరు ముసలి దంపతులుండటానికి 360 గదులున్న రాష్ట్రపతి భవనం అవసరమా? ఇంక ప్రధానమంత్రి, పార్టీల అధ్యక్షులు, మంత్రులు, ఎం.పీలు, ఎం.ఎల్.ఏలు ఇలా వీళ్ళ విలాసవంతమైన జీవన విధానం వలన వృధా అవుతున్న ప్రజా ధనం, మానవ వనరులు ఎంతెంత??

ఇంక IAS, IPS, Group I Officer, న్యాయాధీశులు ఎంతలా అధికార దుర్వినియోగంతోపాటు తమ విలాసవంతమైన జీవితాలను ప్రజల డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారో మన కళ్ళ ముందు జరుగుతున్నవే.

ఇదంతా ఈ ప్రజాస్వామ్య దేశంలో సర్వ సాధారణంగా నడిచిపోతున్న విషయాలు. కూటికి నోచని కోట్లాది కుటుంబాల కంచాలను లాక్కుంటు వీళ్ళనుభవిస్తున్న ఈ రాజసాలను ప్రశ్నించి అడ్డుకోవాల్సిన అవసరముంది…

కాదంటారా??

‘అ’ధర్మాన నీ చిలుక పలుకులు కట్టిపెట్టు…


'అ' ధర్మాన

ఒక్కో మాట చిలుకలా పలుకుతూ గత కొన్నేళ్ళుగా రాష్ట్ర కేబినెట్ లో చక్రం తిప్పుతున్న ‘అ’ధర్మాన ప్రసాద రావు A5 ముద్దాయిగా సి.బి.ఐ. వాన్ పిక్ కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత కూడా ఇంకా తనేమీ ఎరుగనట్టు ముఖం పెట్టి (పాలిపోయిందిలెండి) ఇంకా తాను చార్జిషీట్ చదవలేదని చదివాక స్పందిస్తానని చెప్తూ ఢిల్లీకి తుఱుమన్నారు మన మంత్రివర్యులు.

అధికారంలోకొచ్చిన దగ్గర నుండి మాటల బుకాయింపుతో మేక వన్నె పులిలా ప్రవర్తిస్తూ శ్రీకాకుళం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా చలామణీ అవుతూ దాదాగిరి చేస్తూ తన కొడుకు పేర కన్నెదార కొండ గ్రానైట్ రాయి నిక్షేపాలున్న దానిని వ్రాయించి అడుగులకు మడుగులొత్తే అధికారగణంతో స్థానిక గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తున్న వీరి భాగోతం నేటితో బయటపడింది. యిలా తనకున్న పలుకుబడిని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ థర్మల్ పవర్ ప్లాంటులను నెలకొల్పుతాను ఎవడు అడ్డం వస్తాడో వాడి అంతు తేలుస్తానని ప్రకటించి స్థానిక పర్యావరణ ఉద్యమకారులను బాంబులతో బెదిరించిన నయా ఫాక్షనిస్టు నాయకుడు ‘అ’ధర్మాన.

అధికారంలో వుండగా కన్నూ మిన్నూ కానక వేలాది ఎకరాల పంట భూములను పారిశ్రామికీకరణ పేరుతో ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసిన ‘అ’ధర్మాన నేడు అది తన శాఖకు సంబంధం లేని వ్యవహారంగా బుకాయింపజూస్తున్నాడు.

రైతులు, ఆదివాసులను నిర్వాశితులుగా మార్చి కూడూ గూడూ గుడ్డకు దూరం చేసిన యిలాంటి దుర్యోధనులను వీరి అధికార గణాన్ని తీవ్రంగా శిక్షించితేనే రేపటి తరం కాస్తా పచ్చదనమైనా మిగిలి ఊపిరి పీల్చుకుంటుంది. కావున తక్షణమే వీరిని మంత్రివర్గం నుండి బహిష్కరించి నైతిక విలువలను పాటించాల్సిన అవసరముంది. ఇంకా సన్నాయి నొక్కులు నొక్కి ప్రజలలో అభాసుపాలు కాకూడదని ఆశిస్తున్నా…

నీచ రాజకీయులు


పార్లమెంటరీ రాజకీయాలు ఎంత కుళ్ళు కంపుకొడుతున్నాయో అందరికీ అవగతమవుతోంది…

అసెంబ్లీ హాలులో బూతు బొమ్మలు చూస్తూ గడిపేవారు కొందరు…

జనం నెత్తురు తాగుతూ కోట్లరూపాయల సారా వ్యాపారం చేస్తూ పట్టుబడితే కులం పేరుతో తప్పుకోజూసే వాడొకడు…

శాఖల కోతలతో అగ్గిమీద గుగ్గిలమవుతాడొకడు…

బట్టీలకు బట్టీలు సారా వ్యాపారం చేస్తున్న వాడు అధినాయకుడై కూచుంటాడు పైన,

మోజు పడి మహిళను లోబర్చుకొని చంపిస్తాడొక మంత్రివర్యుడు….

వీళ్ళ డొక్కలు శుద్ధి జేయడానికే సరిపోతుంటే పరిపాలనెవడు జేస్తాడు…

వీళ్ళ అధికార ధాహం దన మదాంధకారాలతో జనం నెత్తిన కూచున్న ఈ రాజకీయ నీచులను పాతరెయ్యాలి….

పద్మ అవార్డులలో కూడా మన వాటా ఇంతేనా??


ఈ రోజు ప్రకటించిన 109 పద్మా అవార్డులలో మన రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే వచ్చాయి..ఇందులో ఓ సోషల్ వర్కర్ డా.జి.మునిరత్నం, బాడ్మింటన్ క్రీడాకారుడు సయ్యద్ మహమ్మద్ ఆరిఫ్ లకు
పద్మశ్రీలు దక్కాయి. మిగిలిన కేతగిరీలలో ఎక్కడా మనవాళ్ళు లేరు భారత రత్న ఈ ఏడాది లేదని తేల్చేసారు… సచిన్ కు వయసు కాస్తా ముదిరేంతవరకు ఆగుతారేమో..ఇంకెవరూ భారతరత్నలు
ప్రస్తుతానికి లేరు…మన వాళ్ళకు లాబీయింగ్ చేయడానికి సమయం లేదు ఈ విషయంలోననుకుంటా…వీళ్ళ పదవులు కాపాడుకోవడానికె కాల్మొక్త బాంచెన్ అంటూ ఢిల్లీ యాత్రలు చేస్తేనే సరిపోతుంది
కదా??
http://ibnlive.in.com/news/full-list-2012-padma-awards/224135-53.html

400 రూ.లకు సం.ఐతే లక్షలకోట్లు తిన్నవారికెన్నాళ్ళు?


ఈ రోజు వార్త దినపత్రికలో ఈ వార్త చదివి ఆశ్చర్యమేసింది..

నాలుగువందల రూయల జేబు దొంగతనం చేసిన వ్యక్తికి ఓ ఏడాది  జైలు శిక్ వంద రూపా జరిమానాను వేసారు  విశాఖపట్టణంలో గౌరవనీయ స్థానిక మేజిస్ట్రేటు వారు.

మరి ఇన్ని లక్షల కోట్ల  కుంభకోణాలు చేసిన వారికి ఎన్నేళ్ళు శిక్ష ఎంత జరిమానా వేయాలి. ఏమిటో కడుపు జరక్కో, చిల్లర పనులకో ఆశ పడి జేబు కత్తిరిస్తే పాపం ఓ ఏడాది జైలు.

ఈ ఘరానా దొంగలకు  నిజంగా శిక్షపడుతుందా?? అరెస్టైనా జైలులోనూ ప్రత్యేక సౌకర్యాలు, అనారోగ్యం పేరుతో ఆసుపత్రులలో వైద్యాలు.. ఇదీ మన నేర శిక్షాస్మృతి…

ఉన్నోడికి మేసినంత.. లేనోడికి కడుపుమంట…

ఇది ప్రగతి విరామం..


మనిషి నోట్లోకి ఇంత ముద్ద దిగాలన్న
ఒకే ఒక్క ఆశతో
ఒంటిపై గుడ్డ కానరాకుండా
దప్పికగొన్న గొంతులో ఇన్ని నీళ్ళు కూడా
పోసుకోక ఎగసోప పడుతూ
ఉత్త చేతుల్తోనే ఆశగా లేని కరెంటు తీగల్ని
కలుపుతూ నేలమ్మ కడుపున నాలుగు
గింజలు పండించి నలుగురికీ
అన్నమై తాను తృప్తిగా తేన్చేందుకు
ఆరుగాలం నెత్తుటిని చెమటగా మార్చే
సత్తెకాలపు వాడు
నేడు
కన్నెఱ జేస్తూ తన నాగలి కఱును
గోడకు జారగిలబెట్టి పూన్చిన
ఎద్దులను కట్లు విప్పదీసి
బండి సీలలను ఊడబెరికి
నెత్తిన చుట్టిన తలపాగా విప్పదీసి
నడుముకు చుట్టి
బంద్ చేస్తున్నానింక
అని సమర శంఖారావం
పూన్చిన క్షణం
నువ్వూ నేనూ
మొఖం ఎక్కడ పెట్టుకుందాం??

సుఖమన్నది ఎరుగని
పిచ్చి నాగలి ఆకలిగా నేలపై
మోరజాపి జూస్తుంటే
ఆ నేలపై తిరుగాడే వాళ్ళకు
ఇంక మంచి జరుగుతుందా??

ప్రతిది తూనిక జేసి గాజు గోళాల మధ్య
జరిగే సత్తు వ్యాపార కూడళ్ళలో
నువ్వు ఆబగా నాకే విదేశీ పాచి వాసన
నీ ముక్కు రంధ్రాలకు సోకడం లేదంటే
శాపగ్రస్తుడెవ్వడో బోధపడలేదా??

చిరుగు పాతలే నీ మానాన్ని
కాపాడే ఎరగా నీ కళ్ళముందు తెరలు తెరలుగా
కదలాడుతుంటే నీవమ్మేసిన అమ్మతనం
ఇంక నీకు కానరాలేదంటే ధృతరాష్ట్రుడెవడో
ఎరుకపడలేదా???

బుడబుక్కల వారిలా వేషాలేస్తూ
రోజుకో నెరవేరని హామీల నేతి బీరకాయల్ని
గుప్పిస్తూ కుప్పిగంతులేస్తున్న వాడ్ని చూసి
వాడి ముఖాన ఖాండ్రించి ఉమ్మడానికి కూడా
అసహ్యమేస్తుందన్నది నిజం

ఇది పంటకు విరామం కాదు
జాతి ప్రగతికి విరామం..విలోమం….