దుర్వినియోగం

పతకాలకు మరీ యింత భారీ నజరానాలా?


ఇటీవల తెలంగాణా సి.ఎమ్. గారు సానియా మీర్జాను తమ బ్రాండ్ (ఇదేమిటో కొత్త మార్కు) అంబాసిడర్ గా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ప్రకటిస్తూ కోటి రూపాయలు తన శిక్షణ కోసం ప్రకటించారు. అలాగే ఇటీవల ముగిసిన యూ.ఎస్. ఓపెన్ చాంపియన్షిప్ లో పెద్దగా పేరులేని మిక్స్ డ్ డబుల్ టైటిల్ సాధించిందని మరో కోటి రూపాయలు ప్రకటించారు. ప్రజల సొమ్మును మంచినీళ్ళ ప్రాయంగా (ఇదీ ఇప్పుడు ప్రియమైపోయింది) తమ బాబు జేబులో కన్నమేసి ఇచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారు. తాను తెలంగాణాను ఏలిన నైజామ్ వారసుడుగా అనుకుంటున్నారా సార్ వాడు. అసలు వ్యక్తిగత క్రీడాకారులకు అసలు ఈ క్రీడలకు ఇంతింత సొమ్ము దొబ్బ పెట్టడం అవసరమా? దానివలన ఏమైనా ఉత్పత్తి జరిగి నలుగురికి తిండి పెట్టేదుందా? నిజానికి మన గ్రామీణ క్రీడాకారులకు అసలు ఇటువంటి అవకాశాలు వస్తున్నాయా? ఎంతో మంది వాలీబాల్, కబడ్డీ మొ.న ఆటగాళ్ళు తమ వ్యక్తిగత ప్రతిభతో పతకాలు సాధించాక చదువుతో పాటు మెరిట్ సర్టిఫికేట్ చూపి ఉద్యోగాలలో వాటా పొందుతారు. లేని వాళ్ళు ఏ హోటళ్ళలోనో సర్వర్ లుగా బతుకీడ్చే వాళ్ళే ఎక్కువ. అసలు పాఠశాల స్థాయిలో వ్యాయామ అంశాలకు ఏమాత్రం ప్రాధాన్యం యిస్తున్నాం. వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించినంతవరకు వీటిని ప్రోత్సహిస్తే సరిపోతుంది. అంతే కానీ యిలా ఖరీదైన స్థలాలు డబ్బు ప్రజల కష్టార్జితాన్ని అప్పనంగా ధారపోస్తుంటే అంతా నోరెళ్ళబెట్టి చూడడమే తప్ప ఎవరూ వాటిని ఖండించడం లేదు. దానివలన వచ్చే కీర్తి ఎవరి భుజాలకు చేరుతుంది. వీళ్ళకి రక రకాల పేర్లతో బిరుదులు ఈ మద్య భారత రత్నలు ఇస్తున్నారు. ఇదంతా అనవసర ఆర్భాటం. క్రీడలు వ్యక్తిగత దారుఢ్యానికి తప్ప వాటి వలన ఒరిగేదేమీ వుండదు. ప్రజల ఉత్పత్తి సామర్థాన్ని దెబ్బతీసే క్రికెట్ ప్రసారాలు నిషేధించాల్సిన అవసరమెంతైనా వుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కానీ ఈ సానియా మానియా మన నాయకుడికి ఎందుకో యింతన్నది ఆ పెరుమాళ్ళకే ఎరుక…

ఆంధ్రజ్యోతివారికి శ్రీలక్ష్మీతో లవ్ ఫైయిల్యూరా???


గత ఆరునెలలుగా చూస్తున్నా…ఆంద్రజ్యోతి పేపర్లో ప్రతిరోజూ ప్రధాన వార్తగా ముందుపేజీలో లేకపోతే ఎక్కడో ఓ చోట ఆమె ఫోటోతో కూడిన వార్త రాయకుండా లేరు. ఆమె ఒక్కతే ఈ కుంభకోణమంతటికీ కారణంలా ఆమెనే ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంటే ఈ సందేహమొచ్చింది.

రాజకీయ నాయకుల వత్తిడులకు లోను కాని అధికారులెవరైనా వున్నారా? పోనీ వత్తిడి చేయని రాజకీయనాయకులున్నారా?? తెలుగుదేశం పాలనా కాలంలో జరిగిన ఏలేరు కుంభకోణంలో పాల్గొన్న అధికారులు లేరా?? ఎన్నో అవకతవకలను కప్పిపుచ్చేస్తూ అధికారులు రాజకీయ నాయకులతో అంటకాగడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. ఒక్క శ్రీలక్ష్మితోనే మొదలు కాలేదు..తుదీ కాలేదు. మరి ఆంధ్రజ్యోతికి ఎందుకీ కక్ష ఆమెపై.. దేవాలయానికి వెళ్ళినా వెంటపడి అక్కడా వ్యంగ్యంగా రాతలు. జైల్లో భర్త కలిసినా వార్త. ఆమె తోటి ఖైదీలతో మాటాడినా వార్త. అసలు ఈ పత్రిక వార్తలు మరచి కథనాలు రాస్తూంది అన్నది నిజం కాదా??

ఒక మహిళ పట్ల ఈ రకమైన ప్రవర్తన కలిగి వుండటం ఏ జర్నలిజం. ఆమె తప్పు చేసినట్టు నిరూపితమైతే శిక్ష అనుభవిస్తుంది. ప్రస్తుతం జైల్లోనే రిమాండ్ లో వున్నారు కదా?? ఇంక మీ కథనాలతో ఆమె వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడం సమంజసమా??

 

ఐతే అయినోడి పెళ్ళి లేకపోతే గులాపోడి పెళ్ళి (కడపోరు)


కడప ఉప ఎన్నికలు జరుగుతాయన్నప్పటినుంచి రాష్ట్ర పాలన స్తంభింప జేసి మంత్రులు, అధికార పార్టీ MLA లు మేమే వైఎస్ వారసులమంటూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించి ప్రజలంతా తమ వైపే వున్నారని, గెలుపు మాదేనని తొడలు గొట్టి మీసాలు మెలేసిన వారంతా పోలింగ్ ముగిసిన తరువాత సెంటిమెంటు సెంటంతా జగన్ కే అంటుకుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అధికారులు జగన్ కు పనిచేసారని ఆరోపణలు అధికారంలో వున్నవారే చేయడం వాళ్ళ అసమర్థతకు గుర్తుకాదా?

ఈ సందర్భంగా మా అమ్మమ్మ జెప్పిన ఈ సామెత గుర్తుకు వచ్చింది.. ఐతే అయినోడి పెళ్ళి లేకపోతే గులాపోడి పెళ్ళి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు….

ఈ ఎన్నికల సందర్భంగా అధికార ప్రతిపక్షం వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా డబ్బు మద్యం పంచారో చూస్తుంటే ఎన్నికలంటేనే అసహ్యం వేస్తోంది..

జనం కూడా ఇంతలా అమ్ముడుపోవడం ఇంతకుముందు జరిగినా ఇప్పుడు మరింత పబ్లిక్ గా బరితెగించడం చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ కావడంలో ఎవరి పాత్రా తక్కువకాదన్నది నిష్ఠుర సత్యం…

అన్ని రోడ్లు కడపవైపే!!!


కడప ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డప్పటినుండీ రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది..

సచివాలయానికి సెలవు ప్రకటించినట్లుగా మంత్రులందరూ కడపలో మకాం వేసారు. వేలాదిమంది పోలీసుల మోహరింపు, అధికార గణం కూడా అక్కడే తిష్టవేయడం ఒక MP & MLA సీటుకు యింతగా ప్రాధాన్యమిచ్చి మొత్తం రాష్ట్ర పరిపాలనను స్తంభింపజేయడం ఘోరం..

రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా రైతాంగం దిక్కుతోచని పరిస్థితుల్లో వుంది..

వైద్యారోగ్య శాఖ మంత్రివారు పోటీలో వుండి ఆ శాఖ బిక్కమొహం వేసింది.

ముఖ్యమంత్రి దగ్గరనుండి కాంగ్రెస్ అధిష్టానం వరకు అంతా జగన్ మెజారిటీని తగ్గించే ప్రయత్నాలలో పడి పాలనను మరిచిపోయారు…కోట్లాది రూపాయల సొమ్ము ప్రవహిస్తోంది..

ఇంత అధికార దుర్వినియోగంతో ఎన్నికలు నిర్వహిస్తున్నా ఎన్నికల కమీషన్ చేష్టలుడిగి చూడటం దాని నిస్సహాయతను తెలియజేస్తోంది…

352 – స్వేచ్చపై చీకటి తెర..


ఈ రోజుకు సరిగ్గా 35 ఏళ్ళ కిందట అర్థరాత్రి నాడు ఈ దేశాన్ని చీకటి గదుల్లోకి నెట్టిన ఒక నియంత పాలనలో మగ్గిన దినాలను గుర్తుచేసుకోవడమంటే మనిషి సంఘజీవిగా మారిన తరువాత తనకు తాను నియంత్రించుకునే క్రమంలో ఒక నిబద్ధ పౌరుడిగా సాంఘిక బాధ్యతలను నిర్వర్తించేందుకు ఏర్పరచుకున్న చట్రాలలో తన కళ్ళపై తానే తారు పూసుకునేట్టు చేయగల ప్రభువుల పాలనలోకి బలవంతంగా తోసివేయబడతానని ఊహించని సామాన్య జీవి ఈ దేశంలో ఓ మహారాజ్ని పరిపాలనలో కొనసాగడానికి తనకున్న (లేని) అధికారంతో  352 అన్న ఈ అధికరణంలోని రాకాసి కోరలతో  ఏమైనా చేయగలనని నిరూపించిన చీకటి రోజు.  ఓ ఆడ హిట్లర్ పాలన కొనసాగిన దుర్దినాలు. నాజీల వారసులేం చేయగలరో ప్రజలకు ప్రత్యక్షంగా అనుభవమైన 19 నెలలు…

ఆనాటి సాంఘిక పరిస్థితులను మరల చదువుతుంటే ఈ దేశంలో అధికారంలో వున్న వాడి చంక నాకడానికి అటు అత్యున్నత పదవిలో వున్నవాడి దగ్గరనుంచి న్యాయమూర్తుల దాకా ఎంతగా బరితెగిస్తారో నన్నది ఒళ్ళు గగుర్పొడిచే పచ్చి నిజం. ప్రతి నిమిషం తనను తాను కాపాడుకునేందుకు రాజ్యాంగానికి చేయాల్సిన అక్రమ సవరణలన్నీ చేస్తూ న్యాయాన్ని, ధర్మాన్ని అపహాస్యం చేసిన ఓ ప్రధానికి అడుగులుకు మడుగులొత్తిన నాటి అధికార గణం ఆ తరువాత తమ కార్యకలాపాలపై కనీసం ప్రజలకు వివరణనిచ్చుకునే నైతికత నేటికీ ఈ దేశంలో లేదు. ఆమె పుత్ర రత్నాన్ని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆ రోజుల్లో ‘సూర్యోదయమయ్యింది’ అని న్యాయమూర్తులు ఉత్తరాలు రాసారంటే ఈ దేశ న్యాయస్థానాలు ఎవరికోసం పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. ఈ కాలంలో లక్షలాదిమందిని డిటెన్యూలపేరుతో జైళ్ళలో కుక్కారు. ఎవరికీ ప్రభుత్వ చర్యలకు  వ్యతిరేకంగ మాటాడే అవకాశం లేకుండా చెసారు. పౌరుల ప్రాధమిక హక్కులను హరించారు. ఇక్కడ మరో విషాదం భారత కమ్యూనిస్టు పార్టీ ఇందిరా గాంధీని సమర్థించింది.

ఈ కాలంలోనే  1976 డిసెంబరులో తీసుకువచ్చిన 42 వ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ ప్రవేశికలో కొత్తగా సోషలిస్టు, సెక్యులర్ అనే మాటలను చేర్చింది. దానితో పాటు భాగం IV Aఅనే పేరుతో, అధికరణం 51 ఎ గా ప్రాధమిక విధులు అనే పరిచ్చేదాన్ని చేర్చింది.  దీనిపై కన్నాభిరాన్ ఏమంటారంటే ‘ రాజ్యాంగంలోకి మీరు ఒక వైపు బాధ్యతలు ప్రవేశపెట్టి, మరోవైపు సోషలిజం ప్రవేశపెడుతున్నారంటే ఇవి రెండూ కలిస్తే నేషనల్ సోషలిజం అవుతుంది అని’ అంటే నేషనల్ సోషలిజం అంటే నాజీజం. హిట్లర్ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఉపయోగించే నినాదం అది. దాన్ని అవలంబించడం అంత మంచిపనికాదంటారాయన.

అలాగే వ్యక్తుల నిర్భంధం విషయంలో రాజ్యాంగం మౌలిక నిర్మాణం దెబ్బతినడం లేదని న్యాయస్తానం తీర్పునిచ్చిందీకాలంలో. అంటే ప్రభుత్వం హక్కులు ఇస్తుంది, రాజ్యాంగం హక్కులు ఇస్తుంది. అందువల్ల ఆ హక్కులను ప్రభుత్వం. రాజ్యాంగం వెనక్కి తీసుకోవచ్చని దాని అభిప్రాయం. కాని ఇది సామాజిక ఒడంబడిక సూత్రానికే వ్యతిరేకమని కన్నాభిరాన్ అభిప్రాయం. ప్రజలు పాలకులకు, ప్రభుత్వానికి కొన్ని అధికారాలివ్వడానికి ఒడంబడిక చేసుకుంటారు. దానిని తుంగలో తొక్కి ప్రజలపై సర్వాధికారాలు తమవే అని, తాము ప్రజలకు రక్షకులుగా వారిని పూర్తిగా తమ కాలికింద అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయి నేటి రాజ్యాంగ యంత్రం.

ఈ చీకటి రోజుల అణచివేత నాటితో అంతం కాలేదు. దానికి కొనసాగింపుగా నేడు కొత్త కొత్త చట్టాలను ప్రజలను కాపాడే పేరుతో తమ అధికారాన్ని ప్రశ్నించే వీలులేకుండా అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నారు. దీనికి రాజకీయ పక్షాలన్నీ వంతపాడుతున్నాయి. మరింతగా ప్రజలపై విరుచుకుపడే చట్టాలకోసం, అధికారాల కోసం అఱులు చాస్తున్న నేటి పాలకవర్గం ఎవరి పక్షమో బహిరంగ రహస్యం. కాబట్టి ఎవరికి వారు తమకెందుకులే అనుకునే స్థితినుండి నిజమైన ప్రజాస్వామ్యం, శాంతి నెలకొనేందుకు మేల్కొనాల్సిన ఆవశ్యకతను ఈ దినం గుర్తుచేసుకోవాలని….

పెద్దలసభకు అందరూ బాగా ఉన్నోళ్ళేనా?


ఇటీవల రాజ్యసభకు జరిగిన ఉపఎన్నికలలో అన్ని పార్టీల వారూ బాగా ధనవంతులనే పంపడానికి మొగ్గుచూపారు. పెద్దల సభ ఉద్దేశాన్నే కోల్పోయి అంతా ధనవంతులు, ప్రత్యక్ష ఎన్నికలలో నెగ్గలేని ప్రజా తిరస్కృతుల సభగా మార్చారు. దీనిని బిలియనీర్ల సభగా పేరు మారిస్తే పోద్ది.

మేధావులను, ప్రజల గురించి పాటుపడే వాళ్ళను, ప్రత్యేకంగా ప్రజల బాధల పట్ల, సమస్యల పట్ల అవగాహన కలవారిని, చట్టాల రూపకల్పనలో అనుభవజ్నులను ఈ సభకు ఎన్నుకుంటే దిగువ సభలో చట్టాలు రూపొందించినప్పుడు జరిగే పొరపాట్లను సరిదిద్దేదిగా ఈ సభ పార్లమెంటు గౌరవాన్ని నిలిపేదిగా ఉండేది. కానీ అన్ని పక్షాలు తమకు నిధులను, ఓట్లను కూడబెట్టే వర్గాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. అందరికంటే కాస్తా మెరుగయిన వాడనుకుంటున్న బాబు కూడా ఇద్దరు ధనవంతులను ఎంచుకున్నారు. వీళ్ళు ఈ పదవిలోకి వెళ్ళి జనంకు ఏం ఒరగబెడతారు.

అందుకే కా.తరిమెల నాగిరెడ్డి పార్లమెంటును పందులదొడ్డిగా అభివర్ణించారు. కాదంటారా?

తూ..నా బొడ్డు జీవోలు..


చిన్నప్పుడు ఆటల్లో చేసే చిన్న చిన్న పొరపాట్లకు ఉమ్ము తడితో బొడ్డుపై రాసుకొని తూ నా బొడ్డు అంటే వదిలేసే వారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో వస్తున్న జీవోలు అలానే వెనక్కు మరలుతున్నాయి. ముఖ్యమంత్రికి తెలియకుండానే అధికార గణం జీవోలు జారీ చేయడం, ఆ తదుపరి అబ్బే ఏదో తెలియక జరిగిపోయిందంటూ దానికి మరల సవరణ జీవో విడుదల. పరిపాలనపై పట్టు లేకపోవడం, అధికార గణం తమ ప్రాబల్యాన్ని యిలా చూపే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది.

నిన్న విడుదలైన బి.సి.విద్యార్థుల ఫీజు రియింబర్స్ మెంటు జీవో కూడా యిలానే ఏడ్చింది. చివరికి సి.ఎం.గారు తూ నాబొడ్డు అనడంతో ఆ జీవోకు సవరణ వచ్చింది. కార్పొరేట్ కళాశాలలలో చదివే విద్యార్థులకు యికపై ఆ ఉపకార వేతనాలు యివ్వకుండా ప్రభుత్వ జూ.కళాశాలలకు 100 కోట్లు రిలీజ్ చేద్దామన్న మంత్రివర్గ ఉపసంఘం, అధికారుల నిర్ణయానికి తలూపినందుకు అది నిజమేననుకొని మరో మాట లేకుండా ఉత్తర్వులిచ్చేసారు. అది రేపిన, రేపబోయే గాలి దుమారంను గ్రహించి మరల దానికి సవరణ తెచ్చారు. అసలు ఆ పథకంతో ప్ర.జూ.కళాశాలలు మూతపడే స్థితికి వచ్చాయి. ఆరోగ్యశ్రే తో ప్రభుత్వ దవాఖానాలలో  మందుల కొరత ఏర్పడి జ్వరాలతో మూలుగుతున్నట్లు యివి కూడా అలా తయారయ్యాయి. కార్పొరేట్ రంగాన్ని పెంచి పోషించేందుకు ఉపకరించేవిగా మారిన ఈ రెండు పథకాలు కొంత లాభమున్నా అధిక మొత్తంలో నష్టాన్నే చేకూర్చి, ప్రభుత్వానికి తెల్ల ఏనుగులా తయారయ్యాయి. వై.ఎస్.పథకాల జోలికి పోతే యువరాజు ముప్పేట దాడి చేస్తుండటంతో ఈ వయసులో నాకెందుకొచ్చిన తంటా అనుకుంటున్న సి.ఎం. చేష్టలుడిగి నీరసపడిపోతున్నారు. చివరకు అవి రాష్ట్రానికి గుదిబండలా మారిపోయాయి. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించాలనుకోవడంలో తప్పు లేదు కానీ, ప్రభుత్వ కళాశాలలను నిర్వీర్యం చేయడం వలన భవిష్యత్తులో దారులు మూసుకుపోయాక అక్కడకూడా శూన్యమైపోతే విద్యార్థుల భవితవ్యం ఏమిటి?

నా పోస్టులను కాపీ చేస్తున్ననాదెళ్ళ శ్రీధర్


ఈ మధ్య గత కొద్దికాలంగా పౌరస్వేచ్చ బ్లాగులో నాదెళ్ళ శ్రీధర్ నేను ఇక్కడ రాస్తున్న టపాలను కాపీ చేసి తన బ్లాగులో పోస్టు చేస్తున్నారు. కనీసం సేకరించిన బ్లాగు url కూడా ఇవ్వడంలేదు. ఇది అతిక్రమణకాదా? స్వేచ్చా దుర్వినియోగంకాదా?

చూడండిః http://nadellasridhar.wordpress.com/2010/02/03/గొల్లుమన్న-భల్లుగూడ