దాష్ఠీకం

తొడ చరిచిన విజయనగరం..


clock tower-viziznagaram 1
గత ఆరు రోజులుగా విజయనగరం కడుపులో దాచుకున్న బిడ్డనుకున్న వాడే కాలితో తంతే తొడ చరిచి నిలబడింది ఈ రోజు. కళ్ళ ముందు నీవు ఆక్రమించుకుంటూ పోతున్న తన భాగాలన్నీ పోయినా బాధపడని విజయనగరం నువ్వు పాలు తాగే రొమ్మునే గుద్దుతా వుంటే చూస్తూ వూరుకోలేక మంటలతో సమాధానం చెప్పింది. కావిడితో సారా అమ్ముకొని పెరిగిన బాబు వారసుడు ఈ రోజు ఇంతింతై అంతై రక్కసిలా మీదపడి పీక నులుముతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది. పసివాడని పిల్లలపై కంట్లో కారం చల్లి చావు దెబ్బలు కొట్టిన వాడి పునాదులు పెకిలించే గునపంగా మారింది.

ఇదంతా ఇక్కడ పోలీసు బాసుగా పని చేసి ప్రమోషనిచ్చి పంపి అదుపు చేయమని అంటే వారికి మేమంతా దొంగలుగా, సంఘ విద్రోహ శక్తులుగా కనబడటంలో ఆశ్చర్యం లేదు. గాలిని బంధించి ఊపిరాడకుండా శక్తిని హరించేద్దామని విఱవీగే వాడికి తొడ చరిచి ఎదురొడ్డి సవాల్ విసురుతోంది మా గున్నమ్మ వారసురాలు.

పాలపేకెట్టు 50 రూపాయలు గుడ్డు 10 రూపాయలుకు కొనుక్కునే స్థితికి నెట్టి ఆకలితో మండించి అదుపు చేద్దామని చూస్తున్నాడు.

బావ్ నువ్విప్పుడు మా తూరుపు కాపోడివి కాదురా బావ్. మాకెప్పుడో తెలిసిపోనాది. నీ మూతివీడని ఇసపు నవ్వులో డబ్బు దర్పంతో కాలెగరేసే దొరతనంతో నువ్వో ఇసప్పురుగువని. నువ్వింక నీ నోట్ల కట్టలలో కాలి పోవాలి తప్ప నీకు మా కంట తడి దూరమైపోనాది.

కొత్త (ప్రతి) నాయకుడు


Image
జగన్ ను దిల్ కుష్ లో పరామర్శించేందుకు విజయమ్మ బయల్దేరారు..ఇప్పుడే చేరుకొని కొడుకు చెంతకు చేరారు కూడా..
కానీ ఎవరి ఇళ్ళకు వాళ్ళను చేర్చే ఏకైక సాధనమైన ఆర్టీసి బస్సులను రద్దు చేసి రోడ్లన్నీ దిగ్బంధనం చేసిన రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం సామాన్య జనాలను ఇంత ఇబ్బందుల పాల్జేస్తూ అనవసరపు హైప్ సృష్టిస్తూ గత రెండు గంటలుగా భయకంపిత వాతావరణాన్ని మీడియా ద్వారా కల్పిస్తూ  వేలాది మంది పోలీసు బలగాలతో రాష్ట్రమంతా కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించి ‘కొత్త నాయకున్ని’ (తనకు ప్రతినాయకున్ని) కూడా సృష్టించుకుంది…
ఆర్థిక పరమైన నేరానికి పాల్పడ్డారని ఆరోపించబడిన వ్యక్తికి ఇంత పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ అనవసరంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతతను చెదరగొడ్తోంది..

దీనిద్వారా తన సొంత చానల్ పత్రికకే పరిమితమైన వ్యక్తి నేడు దేశ వ్యాప్తంగా వున్న మీడియాలో పాపులరవ్వడం ద్వారా తమ కన్ను తామే పొడుచుకున్నట్టైంది. దీని ద్వారా లబ్ధి పొందేది జగనే. ఈ దేశంలో అవినీతి ఆర్థిక నేరాల పట్ల సామాన్య జనం పట్టించుకున్న దాఖలాలే లేవు. అసలు ఏది నేరమో దేనిని ఏ స్థాయిలో శిక్షించాలో కూడా సరిగా స్పందించలేని న్యాయవ్యవస్థకూడా మనదే. అతి పెద్ద నేరాలు చేసిన వారిని చిన్న చిన్న మందలింపులతో వదిలేసిన దాఖలాలు చాలా. ఇలా ఇప్పటికే ప్రజలలో దీనిపట్ల ఎన్నికల ప్రచారానికి జగన్ వెళ్ళకుండా అడ్డుకోవడం ద్వారా తాము లబ్ధి పొందాలనుకోవడం అలాగే తమ నాయకుని పరిపాలన అంతా అవినీతిమయంగా పేర్కొనడం ద్వారా అది తమ నెత్తిపై సి.బి.ఐ. భస్మాసుర హస్తంగా మారిందన్నది త్వరలో తెలుసుకోబోతోంది…

కొండ ఫలం


కొండ ఫలం
దళారి ఫలహారం….

వారి స్వచ్చతను
నిలువెల్లా గాయపరుస్తూ
సాగే వ్యాపారం…

ఇది ఏళ్ళుగా సాగుతున్న
శ్రమ దోపిడీవలయం…

ఆడి సేతులల్ల బెమ్మజెముడు మొలిసియ్య…


ఖాకీచకుడు

అప్పా, ఓలప్పా ఏటే ఇలాగోసిపోయింది నీ సెయ్యి, బుగ్గ మీదేటే అలా కమిలిపోయింది అంటూ వొచ్చింది వరలక్ష్మి రాములమ్మ ఇంటికి..

రాయే తల్లీ లచ్మీ.. ఏటి సెప్పమంతావే, మా ఆశా వర్కర్లమందరం కలిసి మన మండలం నుండి ఉదయం పాసెంజిరెక్కి విజీనగరం యూనియనోళ్ళు రమ్మన్నారని ఎల్లినాం… అలా ఎల్లి రైలు టేసను నుండి బయటకు వస్తూనే అందరం రెండు లైన్లుగా ఇడిపోయి జీతాలు పెంచాలని, యూనిపారాలివ్వాలని గట్టిగా అరుసుకుంటూ కలెకటేరాపీసు వైపు నడుత్తున్నాం. ఎత్తు బిడ్జీ కాడికి వచ్చే రావడంతోనే పోలీసులడ్డుకున్నారు.. ఇంతమందిమి మేముండగా ఇద్దరు ఆడపోలీసులు మిగిలినోళ్ళంతా మగపోలీసులే తల్లి.. ఏమయ్యా బాబూ మేము మా సమస్యలు జెప్పుకోటానికి ఎల్తున్నాం, మేమెవలం దుడ్డుకఱలు పట్టుకోనేదు, మా సేతిలో ఏమీలేదు, కాయితాలు తప్ప మరి అడ్డుకుంటున్నారేమయ్యా అని అడిగినారే మా ముందున్నోళ్ళు, సంగం నాయకులు..మీరు ముందుకెల్లడానికీలునేదంతే నేదనీసి లావుపాటి బాబు ఒకటే ఈరంగం.. అయితే మేమిక్కడే కూకుండిపోతాం, కలెకటరు బాబే వత్తాడైతే అనీసి ఎక్కడోళ్ళం అక్కడే రోడ్డుపైన కూసున్నామే… ఇంక ఆ ఆడ పోలీసులు రెచ్చిపోయి ఏటే నెగండే నంజిల్లారా అని గదమాయించేసరికి, బొబ్బిలి, సాలూరు సుట్టుపక్కలనుండి వచ్చినోళ్ళంతా మేమెందుకు నెగాలె, మమ్మల్ని ఎల్లనిత్తే ఎల్తాం, నేకపోతే ఇక్కడే వుంతాం అని ఆళ్ళ సేతుల్నిండి ఇడిపించుకుంతుంటే ఆ గుంజులాట సూసి ఏటే ఆల్లతోని మాటలు, అనీసి కఱి దున్నపోతులా ఎగసోప బెట్టుకుంటూ ఒక్కపాలిగా మామీద నాటీలతో ఇరగబాదీసినాడె.. ఆడు తినాద సిఐ బావంట… ఆడి సేతులు పడిపోను, ఆడి నోట్లో మట్టికొట్ట, నా రగతం పొయ్య, ఆడి జిమ్మడిపోను, ఆడి సేతులల్ల బెమ్మజెముడు మొలిసియ్య ఏనాడు మీ బావైనా కొట్టనేదే, అలాపింటిది ఆ నంజికొడుకు నాటీతో బాదీసినాడే, పచ్చి బాలింతరాలు సిన్న పిల్లల్ని సేతులల్లో పట్టుకొని పరిగెట్ట నేకపోతుంటే పిఱలమీద మరీ కొట్టీసినాడే, పైటసెంగులు, జుత్తు పట్టి నాగీసి ఈడీసీసినారే, ఇజీనగరం ఆడి బాబుగాడిదైనట్టు రోడ్లమీద ఈరంగం ఆడినాడే, మాలో నలుగురైదుగురికి బుఱలపై దెబ్బలు తగిలి సానా రక్తం పోయినాదే లచ్మీ… ఏటి సెప్తాను, తెల్లారిగట్ల ఇంటికాడ బయలెల్లినప్పుడు తాగిన గెంజేనే, దిగాక టీ సుక్కకూడా తాగకుండ ఎల్లినామా, ఈ దెబ్బలు ఈటితోని పాటు కడుపుమంటతో నకనకలాడిపోయినామే.. ఉపాధిహామీ పనులకెల్లినోళ్ళకు రోజుకు వందొస్తుందా, మాకేమో నెలకు నాలుగొందలు జీతం, అదీ ఇప్పుడు ఆరేడు నెలలుగా ఇయ్యనేదా, తీరా ఇచ్చినప్పుడు అందులో గుమస్తాబాబుకు ఏబై ఇయ్యాల మరి మండలాపీసు మీటింగులకెల్లాల, ఆలకి ఈలకి బాలేదంటే తోడు ఎల్తన్నామా, పురిటికి పున్నానికి తీసుకెల్తున్నామా అందరికీ ఎలాగోలా సేసుకొస్తున్నామా, అయ్యా మరో ఆరొందలైనా పెంచండి మాప్రబో అని సెప్పుకోడానికి ఎల్తామంటే ఇలగ కాలిపోయింది.. మేమేమైనా ఉద్యోగాలు జీవితకాలం సేత్తామన్నామా, గోనెసంచీలతో ఒంపీమన్నామా… ఏటోనే లచ్మీ ఇలా దెబ్బలు తినీసి వచ్చినానా ఇంక మీ బావ నీకెల్లొద్దంటే ఎల్లినావ్, నువ్వే అనుబవించే అని ఆడు రోడ్డు మీద టీకొట్టులోనికి ఎల్లిపోనాడు..ఈ పిల్లలకి ఒండిపోయాలి కదా అని మల్లీ నెగిసినానే… యిదీ నిన్నటి మా ఎద…

సర్కారీ దిగ్బంధం


తెలంగాణా జెఏసీ ఈ రోజు తలపెట్టిన మిలియన్ మార్చ్ ను అడ్డుకునే క్రమంలో సర్కారే రైళ్ళను, బస్సులను, రవాణా సౌకర్యాలను ముందుగానే ఆపివేసి రాజధానిలో బంద్ పాటిస్తోంది. ఇంక ప్రత్యేకంగా దిగ్బంధనం చేయాల్సిన అవసరమేముంది. ప్రజలు శాంతియుతంగా ఉద్యమిస్తామని చెపుతున్నా సర్కార్ లేనిపోని అపోహలను సృష్టించి ప్రజల జీవనాన్ని గతకొంతకాలంగా అతలాకుతలం చేస్తోంది.

పరీక్షలను గతంలో కంటే  15 రోజులు ముందుగా నిర్వహించ తలపెట్టడంలో కార్పొరేట్ కాలేజీల కుట్ర దాగి వుండడం నిజం కాదా? సిలబస్ ను పాడేసి EAMCET కోసం ప్రత్యేక క్లాసులు నిర్వహించుకోవడం కోసం ఈ కాలేజీ యాజమాన్యాలతో కుమ్మక్కై ఈ విధంగా పరీక్షలు, విద్యార్థుల పేరుతో మార్చ్ ను అడ్డుకోవడం, విద్యార్థులను కూడా ఉదయాన్నే పరీక్షా కేంద్రాలకు చేరుకోమని బలవంత పెట్టడం ఇంత వత్తిడి మధ్య వారేమి పరీక్షలు రాస్తారు. బట్టీ గాళ్ళగా మారిన విద్యార్థిలోకం ఎటూ పాలుపోక బిక్కమొగం వేస్తోంది. గతంలో ఏదో ఒక సాకుతో పరీక్షలు వాయిదా వేసే సర్కారు పట్టుదలకు పోయి ఈ విధంగా విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు లోను చేస్తోంది.

ఇంక తెలంగాణా అంతటా అమలు  చేస్తున్న రెడ్ ఎలర్ట్, తీవ్ర నిర్బంధం తప్పక ఏదో ఒక రోజు తగిన మూల్యాన్ని చెల్లించక తప్పదు. వేలాది మంది సాయుధ పోలీసుల పహరాలో సర్కారే తనను తాను నిర్బంధించుకుంటున్న ఈ దిగ్బంధాన్ని ప్రజలే బద్దలుకొట్టాలి…

బీహార్లో ప్రతిఘటన సీను
నిన్న బీహార్లో కామంతో, అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన బీజెపి ఎమ్మెల్యేని ఓ ఉపాధ్యాయురాలు ఒక్క వేటుతో పడగొట్టి కసిదీరా పొడిచి పారేసిందన్న వార్త చదివిన దగ్గర్నుంచి అంతా చదివే వుంటారు కదా అని రాయలేదు. కానీ ఆమె శక్తిగా తిరగబడిన వైనం ఇక్కడ రాయకుండా ఉండలేకపోయేట్టు చేసింది. కొన్ని సంలుగా ఆమె అనుభవిస్తున్న వేదన, నరకంనకు నిన్నటితో ముగింపునిచ్చింది. ప్రతిఘటన సినిమాలోని చంద్రమోహన్ లా వాళ్ళాయన పోలీసు రిపోర్ట్ ను వెనక్కుతీసుకోవడం వలన ఏమీ చేయలేక పోయామన్న సిగ్గుమాలిన ప్రకటనిచ్చిన ఆ డీజీపీ గాడ్ని కూడా వేసేసి వుండాల్సిందన్నంత కోపమొస్తోంది. పనికి మాలిన వాళ్ళుగా తయారయ్యి, అధికారంలోని వారి చంక నాకే ఇలాంటి వాళ్ళ వలన ఆ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది. ఆమెపై తిరిగి నేరారోపణ చేయడం, ఇదంతా ప్రీ ప్లాన్డ్ మర్డర్ అని ప్రకటించడం, ఉపముఖ్యమంత్రిగాడు కుట్ర అనడం ఈ దేశ రాజకీయ వ్యవస్థ పతనానికి గుర్తు.

ఇంతలో మన విజయవాడ డి.సి.పి.గారు పోకిరీలో సి.ఐ.లా అమ్మాయిలకు మెసేజ్ లు పెట్టడం, ఫోన్లు చేసే న్యూస్ వచ్చింది. వాడు సిగ్గులేకుండా ఫోన్ ఇన్లో వాగుతుంటే ఈ వెధవలు అన్నీ వదిలేసి చేరారా అనిపిస్తోంది.

ఇంతలా అరిస్తే గానీ బిచ్చమెయ్యరా?


పోరాడిన నైటింగేల్స్.


గత మూడు రోజులుగా వరంగల్ లోని ఎం.జి.ఎం.ఆసుపత్రి ఆవరణలో ఆమరణదీక్ష చేస్తున్న నర్సుల కోరిక న్యాయబధ్ధమైనది, సమంజసమైనదేనని తెలిసినప్పటికీ పాలకులు ఇప్పటికి రెండుసార్లు హామీలతోనే సరిపెట్టడం వలన వారు తమ ఆకలి పోరాటాన్ని చివరి అస్త్రంగా ఆమరణ దీక్షకు ఉపక్రమించి వాటర్ టాంక్ ఎక్కి కూచుని తమ జీవన్మరణ సమస్యైన ఉద్యోగ భద్రతపై పోరాడితే గానీ మరల హామీతో వారిని ఉపశమింపచేసారు. పోరాడుతున్న వారిపై నాన్ బైయిలబుల్ కేసులు నమోదు చేయడం, అర్థరాత్రి వాళ్ళిండ్లలో చొరబడి వాళ్ళ భర్తలను, తోటి కుటుంబ సభ్యులను అరెస్ట్ చేయడం వంటి భయానక పరిస్థితులు కల్పించారంటే పోలీసులు, పాలక వర్గం ఎంతకైనా తెగిస్తోందని అర్థమవుతోంది. తమను రిక్రూట్ చేసుకున్న జీవోలోని అంశాలను ఇంప్లిమెంట్ చేయకుండా మరో కొత్త రిక్రూట్ కోసం ప్రయత్నించడంతో తమ ఆశలు కోల్పోయే ఆఖరి దశలో ఇలా వీధికెక్కిన వారిపై కౄరంగా ప్రవర్తించడం దారుణం.

అటు సుప్రీంకోర్టు ఆఖరి అస్త్రంగానే అరెస్టును చూపించాలని తీర్పులిస్తుంటే మన పోలీసులు పిచ్చుకలపై బ్రహ్మాస్త్రంలా అరెస్టులతో ఉద్యమాలను అడ్డుకోవడం, ఆడవారిపైన లాఠీలు ఝళిపించడం చేస్తుంటారు. ఉద్యమకారులపై కఠిన వైఖరి తప్ప వారి కోరికలను సానుభూతితో వినడం, వాటి పరిష్కార మార్గాలను సున్నితంగా పరిష్కరించేందుకు కృషి చేయడం మానేసి చాలా రోజులైంది. పోలీసు వారు తమకు ఉద్యోగాలు రాకముందు తామూ వీధి రోడ్లపైకొచ్చేసిన సందర్భాలు మొన్నటికి మొన్న కరీంనగర్ లో జరిగింది. దొరికిన వాహనాలను తగలబెట్టారు. వారికి సర్టిఫికేట్లపై పెట్టిన ఆంక్షలకు వ్యతిరేకంగా ఇలా చేసారు. మరి ఉద్యోగం వచ్చాక తమ లాగే తమ మొర వినిపించుకోవడానికి ఆఖరి అస్త్రంగా రోడ్డేక్కే నిరుద్యోగులు, చిరుద్యోగులపై విరుచుకు పడే ముందు వాళ్ళు తమలాంటి మనుషులే, వారిలాంటి పిల్లలు తమకూ వున్నారన్న ఇంగిత జ్నానం కోల్పోతారు. ఏమైనా అంటే ఉద్యోగధర్మంలో తరతమ బేధాలు లేవు, తాము అంకుశం వారసులమన్న ఫోజు. కానీ ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ పటంలో విఱవీగే భారతదేశంలో ఇప్పటికీ వలసవాద చట్టాలు, దొరల పాలనావశేషాలు కొనసాగడం మన ఖర్మనుకుందామా.

నెత్తుటి తడి ఆరకముందే..సోంపెటలో జరిగిన కాల్పుల సంఘటన నుండి ప్రజలు తేరుకొనకముందే పాలక వర్గం థర్మల్ ప్రాజెక్టులకు అనుమతి కొరకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. దీనిని కోరిన (అ)ధర్మాన ప్రసాద్ తనను మాత్రం ఈ ఉపసంఘంలో వేయొద్దని తప్పించుకొని వెనక నుండి మంత్రాంగం సాగించడానికి ముందుకు వచ్చాడు.

అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ప్రజల నిరసన వెనక ప్రతిపక్షాల కుట్ర వుందని ఉక్రోశం వెళ్ళగక్కుతున్నారు. కేంద్ర పర్యావరణ నిపుణులు పర్యటించి అక్కడ వున్నవి సారవంతమైన వ్యవసాయ భూములని, విలువైన నీటి నిల్వలు కలిగిన బీల భూములని, వాటిని ధ్వంసం చేయడం వలన మనిషి మనుగడకే ప్రమాదమని రిపోర్ట్ ఇచ్చినాయి. మరి ఇవేవీ పట్టనట్లు, తమ పెట్టుబడులకే ప్రాధాన్యతనిస్తూ ప్రజల నిరసనను తక్కువ చేసి చూపడానికి ప్రయత్నిస్తున్నారు.

ఒక్క థర్మల్ ప్రాజెక్టులు నెలకొల్పడమే అభివృద్ధికి నమూనానా? ఇవేమీ లక్షలాదిమందికి ఉపాథి కల్పించే పరిశ్రమలా? మరి వీటిని స్థాపించడం వలన ఎవరికి ఉపయోగం? దీనిలో ధర్మాన వాటా ఎంతో తేల్చాలి. ఎంతమంది చచ్చినా వీటిని నెలకొల్పుతానని భీషణ ప్రతిజ్నలు చేయడంలో ఆంతర్యమేమిటో? ఒక్కసారిగా వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తేల్చాల్సిన అవసరం వుంది?

నేటికి ఒక్క మంత్రి కూడా చనిపోయిన వారిని పరామర్శించే సాహసం చేయలేక పోయాడు. గత సం.కాలం నుండి ప్రజలు స్వచ్చందంగా చేస్తున్న నిరసనల వెనక రాజకీయ ప్రోద్భలం వుందనడం కుట్ర. అంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కానీ, హోం మంత్రి కానీ సందర్శించలేదంటే వీళ్ళకి ఉత్తరాంధ్రపై వున్న ప్రేమ ఏపాటిదో తెలుస్తోంది. మంత్రులంతా ఎవడి ప్రాంతానికి వాడే పరిమితమయి పోయారు. తమ పదవులను కాపాడుకోవడంలో వున్న శ్రద్ధ ప్రజల ఆకాంక్షలను, అవసరాలను తెలుసుకోవడంలో లేకపోయింది. నెపం ఎవడి మీదకో ఒకడి మీదకి నెట్టి వేయడం తప్ప మరోటి కాదు.

కాల్పులలో మరణించిన వారి నెత్తుటి తడి ఆరకముందే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరం. ప్రజల సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు వేరే మార్గం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

వీళ్ళు కసబ్ కంటే నేరస్తులుకారా?


పాతికేళ్ళ క్రితం పాతికవేలమంది ఘోర మరణానికి కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ పై పెట్టిన కేసు నిందితుల ఆరోగ్య సమస్యలను కారణంగా చూపి న్యాయమూర్తి వారికి రెండు సం.ల జైలు, లక్ష రూపాయల జరిమాన విధించి చెరో పాతిక వేల పూచీకత్తుతో బైలు మంజూరు చేయడం చూస్తుంటే న్యాయ దేవత విగ్రహానికి కాదు ఈ బతికున్న న్యాయమూర్తుల కళ్ళకు గంతలు కట్టుకున్నారనిపిస్తుంది. ఇన్నేళ్ళ తరువాత ఇంత నామ మాత్రపు శిక్షలతో సరిపెట్టడం చూస్తుంటే డబ్బున్న వాడు, అధికారం అండగా వున్నవారికేం పీకలేమన్నది అర్థమయి మూగగా ఆక్రోశించడమేనా అనిపిస్తోంది. ఈ కేసులో మొదటినుండి ఆ కంపెనీ వాదనలను సుప్రీంకోర్టు వారు కూడా సమర్థిస్తూనే వచ్చినట్లు తెలుస్తోంది. వారు భారత దేశంలో పరిశ్రమలు పెట్టి, ఇక్కడి కోర్టు పరిథిలోకి రామంటే నోరుమూసుక్కూచున్న పాలక వర్గాల తీరు గర్హనీయం. ఇది ఆనాడే అంతర్జాతీయ న్యాయ స్థానం ముందు పెట్టి వుంటే దోషులకు సరైన శిక్షపడేదేమో? ఏనాడూ దీనిని సరిగా పట్టించుకోలేదు. బాధితులకు పూర్తిస్థాయి నష్టపరిహారం నేటికీ అందలేదు.

ఈ కంపెనీ కారణమైన ఘోరకలి కసబ్ చేసిన దానికంటే నేరం కాదా? కనీసం వీళ్ళపై హత్యానేరం మోపబడలేదు. దర్యాప్తు చేసిన సి.బి.ఐ. వారి కళ్ళుకూడా ఈ దుర్ఘటనలో పోయుంటాయి. ఆ కంపెనీ చైర్మన్ ఆండర్సన్ గాడి వూసే లేదు. ఎందుకంటే వాడు తెల్ల తొక్కగాడని వదిలేసి వుంటారు. ఇది అమెరికా వాడి తొత్తుల పాలన కాబట్టే ఇలా జరిగింది.

అంతుచిక్కని వ్యాధులతో, అంధత్వంతో ఎందరి జీవితాలో నాశనంచేసిన కంపెనీని ఏం చేయలేని వారు ఈ దేశంలో అణువిద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడం ఎంతవరకు సమంజసం. బాక్సైట్, జింక్, రసాయన పరిశ్రమల వ్యర్థ పదార్థాలు, థర్మల్ విద్యుత్ కేంద్ర కాలుష్యాలకే జనం యిప్పటికే అంతుచిక్కని రోగాల బారిన పడుతుంటే కొత్తగా అణు విద్యుత్ ప్రాజెక్టులు పెడతాడంట మన ప్రధాని. దానికి ఇక్కడ మన సి.ఎం. కూడా వంతపాడుతున్నడు. భోపాల్ దుర్ఘటనను అంత ఈజీ గా తీసుకున్న పాలక వర్గం ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యతలేని అధికార గణం వున్న ఈ దేశంలో యిటువంటి ప్రమాదకర ఫ్యాక్టరీల స్థాపనతో ప్రజల జీవితాలతో, ప్రాణాలతో చెలగాటమాడటాన్ని అడ్డుకోలెకపోతే ఈ విధ్యంసకర అభివృద్ధికి కోట్లాదిమంది బలికాక తప్పదు. భోపాల్ మృతులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మన భవిష్యత్ పట్ల కూడా ఒకమారు ఆలోచిద్దాం.

బాబులో యింకా తగ్గని అసహనం..


నిన్నను ధరల పెరుగుధరలకు వ్యతిరేకంగా చంద్రబాబు, నారాయణ, రాఘవులు కలిసి చేసిన  ధర్నా దగ్గర తెలంగాణా న్యాయవాదులు ప్లెకార్డులు పట్టుకొని మీరెటువైపు అని ప్రశ్నిస్తే, తాను మైకులో హెచ్చరించడం చూస్తుంటే, చంద్రబాబులో యింకా అసహనం తగ్గలేదనిపించింది. వీళ్ళు మామూలు గొంతుతో నినదిస్తుంటే, తన ప్రసంగానికి అడ్డుపడుతున్నందుకు చప్పట్లతో వారిని పారదోలండనడంతో వాళ్ళు మరింతగా ముందుకు రావడంతో, మాజీ మేయర్ గూండాలతో మహిళా న్యాయవాదులపైనా పడి కొట్టడం చూస్తుంటే బాబూ ఓ గూండా లీడర్  మాదిరిగా కనిపించాడు.  అరిగిపోయిన రికార్డు మాటలతో నారాయణ, రాఘవులు విసిగించారు. తెచ్చిపెట్టుకున్న వాళ్ళలో అధికశాతం ఈయన గారి జెడ్ కేటగెరీ బందొబస్తు, గూండాగాళ్ళే కనిపిస్తున్నారు. ముందుగా ప్రిపేరయి వచ్చినట్లుగానే వున్నారు. ఆ తరువాత జర్నలిస్టులతో మాటాడినప్పుడు కూడా మొఖం చీదరించుకొని  యిలానే చేస్తాం అన్నట్లు మాటాడడం చూస్తుంటే యీయనేనా మనకు తొమ్మిదేళ్ళు ఏలింది అనిపించింది. పదవికి దూరమయిపోవడంతో ఏమి చేయాలో పాలుపోక చేస్తున్నట్లుగా అనిపిస్తోంది.

న్యాయవాదులపై జరిగిన దాడిని తప్పక ఖండించాలి.