దాగుడు మూతలు

పతకాలకు మరీ యింత భారీ నజరానాలా?


ఇటీవల తెలంగాణా సి.ఎమ్. గారు సానియా మీర్జాను తమ బ్రాండ్ (ఇదేమిటో కొత్త మార్కు) అంబాసిడర్ గా టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ప్రకటిస్తూ కోటి రూపాయలు తన శిక్షణ కోసం ప్రకటించారు. అలాగే ఇటీవల ముగిసిన యూ.ఎస్. ఓపెన్ చాంపియన్షిప్ లో పెద్దగా పేరులేని మిక్స్ డ్ డబుల్ టైటిల్ సాధించిందని మరో కోటి రూపాయలు ప్రకటించారు. ప్రజల సొమ్మును మంచినీళ్ళ ప్రాయంగా (ఇదీ ఇప్పుడు ప్రియమైపోయింది) తమ బాబు జేబులో కన్నమేసి ఇచ్చినట్టుగా ఇచ్చేస్తున్నారు. తాను తెలంగాణాను ఏలిన నైజామ్ వారసుడుగా అనుకుంటున్నారా సార్ వాడు. అసలు వ్యక్తిగత క్రీడాకారులకు అసలు ఈ క్రీడలకు ఇంతింత సొమ్ము దొబ్బ పెట్టడం అవసరమా? దానివలన ఏమైనా ఉత్పత్తి జరిగి నలుగురికి తిండి పెట్టేదుందా? నిజానికి మన గ్రామీణ క్రీడాకారులకు అసలు ఇటువంటి అవకాశాలు వస్తున్నాయా? ఎంతో మంది వాలీబాల్, కబడ్డీ మొ.న ఆటగాళ్ళు తమ వ్యక్తిగత ప్రతిభతో పతకాలు సాధించాక చదువుతో పాటు మెరిట్ సర్టిఫికేట్ చూపి ఉద్యోగాలలో వాటా పొందుతారు. లేని వాళ్ళు ఏ హోటళ్ళలోనో సర్వర్ లుగా బతుకీడ్చే వాళ్ళే ఎక్కువ. అసలు పాఠశాల స్థాయిలో వ్యాయామ అంశాలకు ఏమాత్రం ప్రాధాన్యం యిస్తున్నాం. వ్యక్తిగత ఆరోగ్యానికి సంబంధించినంతవరకు వీటిని ప్రోత్సహిస్తే సరిపోతుంది. అంతే కానీ యిలా ఖరీదైన స్థలాలు డబ్బు ప్రజల కష్టార్జితాన్ని అప్పనంగా ధారపోస్తుంటే అంతా నోరెళ్ళబెట్టి చూడడమే తప్ప ఎవరూ వాటిని ఖండించడం లేదు. దానివలన వచ్చే కీర్తి ఎవరి భుజాలకు చేరుతుంది. వీళ్ళకి రక రకాల పేర్లతో బిరుదులు ఈ మద్య భారత రత్నలు ఇస్తున్నారు. ఇదంతా అనవసర ఆర్భాటం. క్రీడలు వ్యక్తిగత దారుఢ్యానికి తప్ప వాటి వలన ఒరిగేదేమీ వుండదు. ప్రజల ఉత్పత్తి సామర్థాన్ని దెబ్బతీసే క్రికెట్ ప్రసారాలు నిషేధించాల్సిన అవసరమెంతైనా వుంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా కానీ ఈ సానియా మానియా మన నాయకుడికి ఎందుకో యింతన్నది ఆ పెరుమాళ్ళకే ఎరుక…

పెద బేరగాడు…


బేరగాడు

ఈ ప్రస్థానం ఎటు వైపు..
T.కాంగ్రెస్ వాళ్ళంతా కుయ్యో మొఱో అంటూ వుంటే పదిహేను రోజుల్లో తెలంగాణా ఇచ్చేస్తారని సంకేతాలొచ్చాయంటాడు ఈ నాయకుడు…ఈయనకేమైనా ప్రత్యేక రాడార్ వుందా?
సోనియా చిదంబరంలతో ఎంత కుదిరిందో బేరం కానీ రాజుకున్న అగ్గిపై నీళ్ళు చల్లడానికి వెంటనే సిగ్గు ఎగ్గులేకుండా తయారై పోయాడు. ఏదో ఒక నిర్ణయం వెలువడే సమయంలో యిలా చేస్తూ పబ్బం గడుపుకుంటున్న ఇటువంటి నాయకుల
పబ్లిక్ నిలదీయాలి…

జర భద్రం తమ్ముళ్ళూ…

ను

వార్తకు ఆధారంః

మరో డ్రామాకు తెరతీసిన నాయకులు


మన రాష్ట్ర రాజకీయ నాయకులు ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు మరో హైడ్రామాకు తెరతీసారు. రాష్ట్ర పాలనా వ్యవహారంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, రైతాంగం నుండి విద్యార్థులు, నిరుద్యోగులు అంతా తీవ్ర సంక్షోభంలో పడిపోయిన సందర్భంలో కేంద్రం కూడా మితిమీరిన పెట్రో ధరలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సందర్భం, పీకల్లోతు అవినీతి ఊబిలో కూరుకుపోయి ఊపిరాడక మరో మారు తెలంగాణా పేరుతో ఏదో ఒక రకంగా ప్రజల దృష్టిని మళ్ళించేందుకు వారి సభ్యుల రాజీనామా ఎత్తుగడలను చూపుతూ ఏదో జరిగిపోతుందన్న గాభరా సృష్టించి ప్రజలను అయోమయంలో పడేసి, రెచ్చగొట్టి ఊరికే తిని కూచునే తమ బలగాలను ఉసిగొలిపి మంట రేపే ప్రయత్నమే జరుగుతోందనిపిస్తోంది.. ఈ హైడ్రామాకు ప్రజలే తెరదించాల్సిన సమయం ఆసన్నమైంది. బీ వేర్ ఆఫ్ దీస్ ఆలీబాబా నలబై ఒక్క దొంగలు…

నాయకుడు కాని వాడా? కాలేని వాడా?


కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆజాద్ గారు కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా నాయకుడు కాడని, నాయకుడుగా ఎదిగేందుకు సమయం పడుతుందని, అంతదాకా అలా వుండనివ్వండని సెలవిచ్చారు.. వై.ఎస్.కు నాయకుడు కావడానికి నలభై ఏళ్ళు పట్టిందన్నారు.. మరి ఈయనకు ఎన్నేళ్ళు టైమ్ ఇవ్వాల్సింది?  

మరి అటు పార్టీ నాయకుడు కాక, ప్రజలభీష్టం మేరకు ఎన్నిక కాని వాడ్ని సి.ఎం. చేసిన అధిష్టానం బుద్దిలేనితనమా? ఆయన గుండు గీయించాడు సరే..కానీ పాలనా వ్యవహారాలలో కూడా గుండు సున్నాగా మిగిలిపోతున్నారు..

ఇంక పులి మీద పుట్రలా మా బొత్స బావ్ అధికార పగ్గాలు చేపట్టాడు.. ఇప్పటికే ఇద్దరి మధ్య అనురాగం అంతంత మాత్రమే.. త్వరలో ఈ సీను అటూ ఇటూ మారనుందా?

ఠాగూర్ తరహా వైద్యంలో బాబా???


సాయిబాబా పరిస్థితి చూస్తుంటే బాధగా వుంది..

8౦ సం.ల వృద్ధాప్యంలో ఇంత నరకానికి గురిచేయడం దారుణం..

లక్షల కోట్ల ఆస్తులను ఎలా దొంగిలించుకు పోవాలోనన్న కుతంత్రాలకు ప్రస్తుతం అక్కడ జరుగుతున్న తంతు సాక్ష్యం కావచ్చు. ఇంత మంది భక్తుల వీరావేశం నీరుగారిపోయి ఇన్నాళ్ళు భజన చేసిన వాళ్ళు కిమ్మనకుండా ఊరకుండిపోయారంటే ఆయనింక లేకపోయుండొచ్చు అన్నది అందరికీ అర్థమైపోయుండాల. డా.సఫా మొత్తం వ్యవహారాన్ని ఓ గూడుపుఠానీలా నడుపుతూ దానికి సర్కారు వారి తానా తందానా తోడు కావడం వెనక ఎవరి లాభాలు వాళ్ళకుండొచ్చు. ధనం మూలం ఇదం జగత్ అన్న సూక్తి అక్షరాలా నిజమౌతున్నదిక్కడ.  భక్తి ముసుగులో అక్కడ పోగుపడ్డ ధనం ఇప్పుడు ఎవరెవరి ఖాతాల్లోకి మార్చుకోవాలోనన్న ప్రయత్నంలో అంతా భాగస్వాములై ఠాగూర్ సినిమాలోని కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు అనుమానంగా వుంది. ఇదంతా పూర్తయ్యాక బాబా ఈ క్షణమే వైకుంఠానికి చేరుకున్నారు తొందర్లో మళ్ళీ దర్శనమిస్తారని సెలవిస్తారు డా.సఫా గారు. అంత దాకా ఈ మూగ భక్తులు పక్కన పెట్టిన తాళాలు అలా పడి వుంటాయి. నిజంగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇన్నాళ్ళు వేచి చూడాలా…ఐ.సి.యు.లో వున్నవారి విజువల్స్ చూపకూదదా? ఇదంతా మన చెవిలో పెద్ద కాబేజీ పెట్టే ప్రయత్నం కాదా? అయినా మనకెందుకులే… శాంతి..శాంతి..శాంతిః

రెండు నాల్కల ధోరణిని ఖండించాలి..


జనవరి ఐదు మీటింగునకు పార్టీలనుండి ఇద్దరేసి నాయకులను ఆహ్వానించడంలోనే కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత ధోరణి తెలుస్తోంది.

శ్రీక్రిష్ణ కమిటీ పేరుతో వచ్చిన బృందం అన్ని ప్రాంతాల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు కానీ ఎంచుకున్న ప్రాంతాలకే పరిమితమైపోయారు. ఈ బృందం ప్రచారానికిచ్చిన ప్రియారిటీ ప్రజల అభిప్రాయాలకిచ్చినట్లుగా లేదు. ఎప్పుడూ మీడియాముందు ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని ప్రస్తావిస్తూనే వచ్చారు. ఇందులో దుగ్గల్ చాలా ముందున్నారు. ఇంతవరకు ఏర్పాటైన ఏ కమిటీలు ఇలా మీడియా ముందు ఫోజులివ్వలేదు. పనయిన తరువాత నివేదిక సమర్పించే ముందు చెప్పేవారు. ఇది కూడా ఒక ఎత్తుగడగానే చేసినట్లున్నారు. ఎందుకంటే ఆంధ్రులు ఆరంభశూరులని వీళ్ళకి బాగా చెప్పినట్టున్నారు తమిళ తంబి.

అలాగే రాజకీయ పార్టీలన్నీ ఇరు ప్రాంతాలుగా విడిపోయి తమ తమ అభిప్రాయాలను తెలియజేసాయి. ఈ ఎడబాటును అర్థం చేసుకుంటే చాలు. అలాగే ప్రధాన రాజకీయ పక్షాలైన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల అధినాయకత్వం తమ అభిప్రాయాలను కమిటీకి సమర్పించలేదు. దీనిని కూడా పట్టించుకోలేదు. మరి ఇద్దరేసి నాయకులను ఆహ్వానించడమంటే మరల రెండు అభిప్రాయల మధ్య సఖ్యత ఎలా కుదురుతుంది. అలా కాకుండా ప్రతి పార్టీ అధ్యక్షుల అభిప్రాయాలనే తీసుకుంటామంటే ఆయా పార్టీల వైఖరి తేట తెల్లమవుతుంది. సమస్య అటో ఇటో తేలిపోతుంది. అది వదిలేసి ఈ రెండు నాల్కల ధోరణి వలన సమస్య మరింత జఠిలమవుతుందన్నది అక్షర సత్యం.

కాళ్ళూ చేతులు కదపలేకపోయినా ‘సత్యం’ పరార్?


ఆయేషా మీరా హత్య కేసులో నిందితునిగా నేరారోపణ చేయబడ్డ సత్యంబాబు వాయిదాలకు వచ్చేటప్పుడు పోలీసు కానిస్టేబుళ్ళ చేతులమీదో, కాళ్ళీడ్చుకుంటూనో వస్తున్నది అందరికీ తెలిసినదే. నిమ్స్ నుండి విజయవాడకు వాయిదాకు తీసుకు వస్తుండగా 11 మంది సాయుధ పోలీసుల పహరా నుండి ఎలా తప్పిపోయాడో అని అందరికీ ఇప్పుడు భేతాళ ప్రశ్న. సత్యం బాబు తల్లి మరియమ్మ తన కుమారుడ్ని చంపేసే ఉద్దేశ్యంతోనే యిలా కాకమ్మ కథలు అల్లుతున్నారని ఏడుస్తోంది. అటు ఆయేషా తల్లి కూడా కేసును మూసివేసే ఉద్దేశ్యంతో సత్యంను చంపే పథకంలో భాగంగానే ఇలా చేసారని ఆవేదనగా ఆగ్రహంగా తిడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులే టెఱరిస్టులని ధర్మాగ్రహం (TV5లో) వెల్లగక్కారు.

ఈ కేసులో ముందునుండీ సామాన్యజనానికి ఎన్నో సందేహాలను మిగిల్చారు. అసలు నిందితులను దాచే ఉద్దేశ్యంతోనే మొదట లడ్డూ అని, తరువాత ఈ సత్యంబాబును తెరపైకి తెచ్చారు. సత్యంబాబు నోటితో కూడా తానే నిందితుడ్ని అని చెప్పించారు. తరువాత కోర్టులో తనకు ఈ కేసులో ఇరికించారని చెప్పాడు. దాంతో ఆయనకు కాళ్ళూ చేతులు పడిపోయిన జబ్బు వచ్చింది.

యిలా ప్రత్యూషలు, ఆయేషాలు అమానుషంగా బలయిపోయినా పట్టించుకునే నాధుడే లేడు. మొదటి దానిలో ప్రస్తుత ప్రతిపక్షం వాళ్ళూ అధికారంలో వుండగా జరగగా, రెండోది జరిగి అప్పుడే మూడేళ్ళూ దాటిపోయాయి. దివంగత వైఎస్ గారి పాదాలమీద పడి వేడుకున్నా చిరునవ్వుతో ఆశీర్వదించారే తప్ప నేరస్తులు బయటపడలేదు.  పేదవాడు, దళితుడు అయిన సత్యంబాబు పై ఇది రుద్దబడిందిగానే అన్నం తిన్న ఎవరికైనా అర్థమౌతుంది. పాపముపశమించుగాక…


ఎవరు భర్త – ఎవరు భార్య


తెలంగాణా ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఏర్పడిన శ్రీక్రిష్ణ కమిటే చైర్మన్ జస్టిస్ శ్రీక్రిష్ణ తెలంగాణా ఆంధ్రా ప్రాంతాలను భార్యా భర్తల సంబంధంతో పోలుస్తూ వ్యాఖ్యానించారు. అయితే ఇందులో ఎవరు భర్త స్తానంలో వున్నారు, ఎవరు భార్య స్తానంలో వున్నారు. నిజానికి సామాన్యంగ వేధింపుల భర్త నుండి భార్యే విడాకులు కోరుతుంది కాబట్టి తెలంగాణా ప్రాంతానిదే భార్య స్తానం అనుకుంటా.

తన ఈ వ్యాఖ్యానంతో మనకు అర్థమయ్యేది ఈ కమిటీ తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ కోసం కాదు యిరువర్గాల మధ్య సయోధ్య కోసం ఓ కౌన్సిలింగ్ డాక్టర్ మాదిరి పనిచేసే కార్యక్రమం మాత్రమే. యింతమంది ఆత్మ బలిదానాలతో తెలంగాణా ఆత్మ క్షోభిస్తుంటే ఈ నాన్చుడు కమిటేలతో ఒరిగేదేమీ లేదు. రాజకీయనాయకుల నంగనాచి కబుర్లను నమ్మి యువత మోసపోరాదు. వాళ్ళ వాళ్ళ వ్యాపార లావాదేవీలను కాపాడుకునేందుకు ఎవరితోనైనా కయ్యమాడగలరు, వియ్యమందగలరు. కనుక ప్రజలే దీనికి పరిష్కారమార్గం వెదుక్కోవాలి.