జ్నాపకాలు

భారమైపోతాను…


రూపాన్ని

కోల్పోయి

ఖాళీగా

మిగిలిన

ప్రతిసారీ

నీ జ్నాపకాలు

కమ్ముకొని

ఒక్కసారిగా

భారమైపోతాను…

సిమ్మాద్రి అప్పన్న దేవరా..


సిమ్మాద్రి అప్పన్న తో సీను


సామీ సిమ్మాద్రి అప్పన్నా..
సిమాచలం కొండదేవరా..
తండ్రీ దీవించు తండ్రీ…
కాలు కడిగిన వారు…
బొట్టు పెట్టే వారు…
చిట్టి పెట్టే వారు…
సుకంగా కలకాలం వుండాలని దీవెనలియ్యి దేవరా…

ఇది మా బాడంగి మండలం, పిన్నవలస అల్లు శ్రీను దీవెన..

వీడి రాకతో సంక్రాంతి వచ్చినట్లైంది…

గంగిరెద్దుల వారం బావ్ మేం, మాలోను సదువుకున్నోళ్ళున్నారు, టీసర్లయ్యారు, మిలటరీలోనున్నారు..

మరి నువ్వేం సదువుకోలేదంటే అదోలా సూసి సదువుకోలేదు అని సన్నాయి వాయించుకుంటూ తన కాశీ ఆవును తోలుకుపోయాడు.

కాశీ ఆవు అంటే వీపు మీద, మోర మీద మరో కాలుండేవి. వీటిని సింహాచలం కొండ దగ్గర వదిలేస్తారు. లేకపోతే వీళ్ళకు దానం చేస్తారంట.

(చిట్టంటే మా ప్రాంతంలో పశువులు తినే తౌడన్నమాట)

మాఊరి పాతాలు (నవరత్నాటాకీసు)


నవరత్న టాకీసు


మేమంతా పాతాలుగా పిలుచుకునే ఈ సినిమా హాలు మా ఊరి చివర ఇలా మూగగా మిగిలిపోయింది. 1950 ప్రాంతంలో ప్రారంభించిన ఈ నవరత్నా టాకీసు ఒక్కటే ఈ ప్రాంతానికి వున్న ఏకైక సినిమా హాలు. మా పెద్దతరం అంతా గొప్పగా చెప్పుకునే సినిమాలన్నీ ఇందులో చూసినవే. నేడు సినిమా టాకీసులలో వచ్చిన మార్పులకనుగుణంగా మార్పులకు చేరువ కాలేక ఓ సం. క్రితం దీనిని ఫంక్షన్ హాల్ గా మార్చారు. అయినా క్లిక్ కాక మరల మూతపడిపోయింది. రోజూ దీని ముందు వెళ్ళినప్పుడు చిన్నప్పుడు అమ్మ తాను ఎడ్లబండిపై పండగ దినాల్లో ఈ హాలుకు సినిమా చూడడానికి వచ్చినట్లు చెప్పిన విషయం, పాతాళభైరవి, గుండమ్మకథ, దేవదాసు మొ.న అప్పటి బ్లాక్ బస్టర్స్ గురించి చేసిన పరిచయాలు అలా గుర్తుకు వస్తుంటాయి. ఇప్పటికీ గూగుల్ వారి మేప్ లో నవరత్న గా ఓ గుర్తుగా మిగిలిన ఇది పాతతరం గుర్తుగా అలా ఎన్నాళ్ళు మిగులుతుందో. లేక ఏ కొత్త వ్యాపారానికి మారి మట్టిలో కలిసిపోతుందో కదా?

కన్నోరింటికి సేరిన సుభధ్ర


మా ఊరి జగన్నాధుని రధం

కళింగాంధ్రకే పరిమితమయిన జగన్నాధ రధయాత్రను ఈ దినం జరుపుకుంటున్నారు మా ప్రాంత ప్రజానీకం. ఈ పండగను ఇక్కడ ఆవిటి అంటారు. ఈ రోజు జగన్నాధునితో పాటు బలరాముడిని తోడుగా సుభద్ర తన  రథంపై ఊరేగింపుగా చేరుకుంటుంది తన కన్నవారింటికి. ఆ ప్రదేశాన్ని గుండిచ మందిరం అంటారు. ఈ రోజునుండి తొమ్మిది దినాలు శ్రీక్రిష్ణుడు దశావతారాలతో భక్తులకు కనువిందు చేసిన అనంతరం మారావిటి అదే మారు రథయాత్ర రోజు తిరిగి రథంపై ఊరేగింపుగా జగన్నాథ దేవాలయానికి చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.

ఇది ఒక ఐదారేళ్ళ క్రితం వరకు అత్యంత వైభవంగా జరిగేది. జనం ఊకపోస్తే రాలనంతగా చేరి రథం లాగుతూ వచ్చి గుండిచ మందిరం చేరేముందు  రథంపైనే పూజలు చేసే వారు. ఈ సమయంలో చాలా సందడితో పండగ వాతావరణం నిండుగా వుండేది. అరటిపళ్ళను పైకి విసురుతూ మొక్కుకునే వారు కొందరు. ఇందులో ఆకతాయి కుఱవాళ్ళు అరటిపళ్ళ మధ్యలో బరువైన నాణాన్ని వుంచి గురిచూసి కొట్టేవారు. అది తగిలిన వాళ్ళు తిట్ల పురాణం లంకించుకునేవారు. అదో  సరదాగా సందడిగా అంతా ఎంజాయ్ చేసేవారు. ఇప్పుడు రథం చుట్టూ జనం చేరేందుకే గంటలు పడుతోంది. రథం సైజు కూడా కుంచించుకు పోయింది. అప్పుడు రెండు ఏనుగులంత రథం వుండేది. ఇప్పుడు గున్న ఏనుగంత అయిపోయింది. అలాగే యాత్ర జరిగే రోజుల్లో వర్షాలతో బురద బురదగా వుండేది. ఈ రోజు వాన తప్పక కురుస్తుందన్న నమ్మకంతో జనం వుండేవారు. కానీ ఈ రోజు ఎక్కడో ఒక చినుకు తప్ప వానలేక మరింత బోసిపోయింది మా సుభద్రక్క. ఆవిటి రోజు ‘ఆరిది’ వండిపెట్టే వాళ్ళే లేకపోయారు. ఆరిది అంటే బియ్యం పిండితో కొబ్బరిముక్కలు, బెల్లం వేసి చేసే ఒకరకమైన పరమాణ్ణం. దాని కమ్మదనం ఈ పోస్టు రాస్తుంటే ముక్కపుటాలకు చిన్నప్పుడు మా బాప్ప (మేనత్త) వండిపెట్టినది ఇప్పటికీ ఎరుకై  మనసు బాధగా మూలుగుతోంది.

ఆంధ్రరాష్ట్రంలో మరెక్కడా ఈ పండగ వుండదు. ఈ మూడు జిల్లాలకే పరిమితమయిన పండగ. దీనికి కారణం ఈ ప్రాంతం ఒరిస్సాకు దగ్గరగా వుండటం, అలాగే ఒడియా బ్రాహ్మణులెక్కువగా వున్న దగ్గర వారి సాంప్రదాయాను సారం ఈ యాత్ర జరుగుతోంది. మా ప్రాంతంలో పార్వతీపురం, కురుపాం, చినమేరంగి, సంగంవలస, సాలూరు జమీందారులు వున్న దగ్గర జగన్నాదస్వామి దేవాలయాలు వారు కట్టించినవి వుండటం, వాటికి వారు సమకూర్చిన ఈనాంలు ఇప్పటికీ ఆయా ఆలయ పూజారుల కింద వుండటం  చేత ఆలయాలు నిర్వహింపబడుతు కొంతమేర ఈ యాత్ర కొనసాగుతున్నాయి.  కొత్త కొత్తగా పుట్టుకొచ్చిన షిరిడీ సాయిబాబా గుడుల మోజులో పాత దేవుళ్ళను పట్టించుకున్న భక్తులు కరవై ఇవి నామ మాత్రంగా సాగుతున్నాయి. ఆలయాలు శిధిలావస్తకు చేరుకుంటున్నాయి. అయినా కళింగాంధ్ర సాంప్రదాయ మేలుకలయికగా ఈ యాత్ర  జరుపుకోవడం ముదావహం.