జీవితం

గొల్లపిల్లాడిని అయ్యా, ఇలపింటివి తప్పవు..


ఈ రోజు దగ్గరి బంధువుల ఇంటికి తప్పక హాజరుకావాల్సిన కార్యానికై ఆటోలో వెల్తుండగా నా పక్కన ఓ పది పన్నెండేల కుఱాడు కూచున్నాడు. నే వెల్తున్న ఊరిలో ఎముకలు విరిగితే కట్టు కట్టే నాటువైద్యుడు చాలా ఫేమస్ మా ప్రాంతంలో. రెండు ముంజేతులకు వీడికి కట్లుండడం చూసి, వాడి చూపులలో నిర్లక్ష్యం, ఒకింత నిర్వేదం కనబడి పలుకరించాను. ఏ వూరు మీదితో మొదలుపెట్టి, ఏం ఘనకార్యం చేసి రెండు విరగ్గొట్టుకున్నావని అడిగాను..

నా ప్రశ్నకు అదే చూపులతో వాడు చెట్టెక్కి పడ్డాను అని చెప్పాడు.

వెంటనే నేను వాడికి బుద్ధి చెప్పేద్దామన్న ఆదుర్ధాతో ‘అదేమి పనిరా, హాయిగా చదువుకోవాల్సిన వయసులో, అలా ఎక్కొచ్చా?’ అని కొంత పెద్దరికం కలగలిపిన గొంతుతో ప్రశ్నించాను.

కానీ సిసింద్రీలా వెంటనే వాడి నోటినుండి ఈ జవాబు ‘గొల్ల పిల్లాడినయ్యా, చెట్టెక్కక పోతే ఎలా? ఇలపింటి దెబ్బలు మాకు తప్పవు’ అని చాలా మామూలుగా చెప్పాడు.

చదువుకోవాల్సిన వయసులో ఇలా గొఱెలు కాయడం ఎందుకు, ఎంతవరకు చదివావని అడిగితే, ఐదో తరగతి వరకు చదివాను, నాకు నాన్న లేడు, తప్పదు మరి ఈ పని అని చెప్పాడు.

దాంతో వాడికి చిన్న వయసులోనే కలిగిన కష్టానికి చాలా బాధ కలిగింది. కులవృత్తి చేయక తప్పని పరిస్థితికి నెట్టపడ్డ వాడి అసహాయతకు జాలేసింది. కానీ చదువుకుంటే నీ భవిష్యత్ బాగుంటుంది, వాళ్ళలో చదువుకున్న నాకు తెలిసిన వాళ్ళ బందువులబ్బాయి గురించి తెలుసా అని మొదలుపెట్టి చెప్పాను. కానీ వాడు ఇవేమీ పట్టవన్నట్లుగా తనకు చేతులు రెండూ బాగైపోతే ఎంత తొందరగా మరల కాపుకు పోతానా అన్న ధ్యాసే వాడి చివరి చూపులో కూడా కనబడింది..

బతుకు పోరాటంలోకి తొందరగా దూకిన వాడి ధైర్యానికి అభినందించాలో, తప్పనిసరైన ఈ జీవన వేదానికి దారితీసిన వైనానికి జాలిపడాలో, ఇటువంటి పిల్లలకు ఎన్ని పథకాలు వున్నా కుటుంబ పరిస్థితులు, ఆర్థిక తారతమ్యాల వలన వారి బతుకులు ఎప్పటికీ మెరుగుపడని విధానాలను తిట్టుకోవాలో తెలియని డోలాయమానానికి గురయ్యాను.