గొణుగుడు

పిల్లి గుడ్డిదయితే ఎలకేదో చూపించిందంట?


అసలీ బ్రాండ్ ఎంబాసిడర్ లేంటీ. ఇదేమైనా కంపెనీ వ్యాపారమా? లేక IPL బేరమా? రాష్ట్రాలను ప్రజల ఆస్తిగా చూడరా వీళ్ళు. వ్యాపార కేంద్రాలుగా మార్చేసి అమ్మి పార దొబ్బుతారా? జనంకోసమే మా ఉద్యమం జనం కోసమే ఇదంతా అని ఇప్పుడిలా కోట్లాది రూపాయలు వీళ్ళ బాబు సంపాదించిందాంట్లోంచి ఇచ్చినట్లు నజరానాల రూపంలో ఇస్తూ ఫోజులు కొడుతుంటే వీళ్ళ చుట్టూ చేరి భజనలా? మీ ….మ్మా? బూతులొస్తున్నాయిరా చూస్తుంటే. జనం రోజూ ఏదో ఒక కారణంతో చస్తూ బతుకుతుంటే మీ వేషాలిలా. తన ముడ్డి కాకపోతే కాశీ దాకా డేకమన్నాడంట ఎవడో? అత్త సొమ్ము అల్లుడు ధారపోసినట్లు జనం సొమ్ము మీ ప్రచారార్భాటాలకు ఖర్చు పెడతారా? చేవ చచ్చిన ఆటగాళ్ళకి కోట్ల రూపాయలా? వర్షం పడితే కారి దొబ్బే బడికి పైకప్పు బాగు చేయించండిరా అంటే సవాలక్ష సాకులతో రూపాయి విదిల్చని మీరు ఇలా చేయడం భావ్యమ? పిల్లి గుడ్డిదయితే ఎలకేదో చూపించిందంట? జనం యిలా వున్నంత కాలం మీ గారడీ చెల్లుబాటవుతుందనా? ఛీ..

ఏ మొగుడూ దొరకనప్పుడూ…


ఏ మొగుడూ దొరకనప్పుడు అక్క మొగుడే గతిలా ఈ రాష్ట్రానికి రోజుకో మొగుడొస్తుంటాడు, కాళ్ళూ చేతులూ, కళ్ళు కూడా లేని వికలాంగులులా వాడి చుట్టూ చేరి నవ్వులు చిందిస్తారు. మన ఖర్మకి ఇలాంటి స్థితి దాపురించింది. రోజుకో కొత్త పథకం ప్రకటించి మూడు రోజులకొకసారి ఢిల్లీ పరుగెత్తి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి అధికారాన్ని అధిష్టానం కాళ్ళు మొక్కుతూ కాపాడుకుంటేనే సరిపోతొంది. వీళ్ళ వలన జనానికి ఒరిగిందీలేదు.

సామాన్యుడా నీ ఓపికకు వేన వేల వందనాలు..

బాబాల బూతు భాగోతం..


మొన్న కల్కి బాబా, నిన్న నిత్యానంద, నేడు పత్రి గురూజీలు. ఇలా ఎన్ని జరిగినా వీళ్ళ వెంట పడడం జనం మానరు. ఇది ఏదో జనాన్ని వాళ్ళు

మోసం చేస్తున్నట్టుగా మీడియా ప్రచారం. కానీ వీళ్ళేమైనా చదువు సంధ్యా లేని వారా?? కావాలని వెళ్ళి అర్పించుకుంటున్న వారితో జరిగే నష్టమేంటి. దీనివలన

సమాజానికి ఏమాత్రమూ నష్టమ్ లేదనుకుంటా.. కుతి తీరని వెధవరాయుల్లే కదా వెళ్ళేది. ఏదో వచ్చి పడుతుందనో లేక అడ్డదిడ్డంగా సంపాదించిన దాంట్లో కొంత

ఇలా పారెస్తే పాపశాతం తగ్గిపోతుందనో కదా? వాళ్ళకి దీనివలన మరింత ప్రచారమే తప్ప ఈ జనం మారరు. ఇదో పెద్ద సామాజిక చైతన్యం తెచ్చేసే వార్తలా ప్రింట్

ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వీళ్ళ వెంట పడడం. అసలైన సమస్యలను వదిలేసి. వీళ్ళకు బేరసారాలు కుదిరితే వదిలేసే వారే కదా ఎక్కువ.

అమ్మకానికి న్యాయం…


ఇదేమైనా మనకు కొత్త వార్తా…

లేక మనకు మింగుడు పడనిదా…

గాలి జనార్థన రెడ్డికి ఐదు కోట్లు లంచం తీసుకొని బైల్ ఇచ్చారంట న్యాయమూర్తిగారు..

ఏదో కక్కుర్తిపడ్డారు ఆయన గారు..దానికి ఇంత పెద్ద వార్త చేసి బిల్డప్ ఇచ్చాయి ఈ రోజు వార్తా పత్రికలు..దీనిని సామాన్య జనం ఏమైనా చదివి రోడ్లెక్కి అబ్బో ఆ న్యాయమూర్తిగార్ని శిక్షించి న్యాయ దేవత శీలాన్ని కాపాడండి అని గగ్గోలు పెడతారా ఎక్కడైనా ఎప్పుడైనా..

నీకు వ్యతిరేకంగా వున్న వాడి గురించి ఇంతింత బాక్స్ ఐటంలు కట్టి రాస్తావే కానీ అదే నీ దగ్గరివాడో లేక నీ పార్టీవాడో చేసినప్పుడు అశ్వథ్థామ హతః అన్న స్టైల్లో ఎక్కడో ఆరో పేజీలో రాస్తున్నావే..మరి నీకెక్కడి బాధ్యత వుంది.. అందుకే ఇలాంటివి ఎవడూ పట్టించుకోవడం మానేసాడు..

వాడికి డబ్బు ఎక్కువుంది..అమ్ముడుపోయే వాడు దొరికినప్పుడూ వీజీగా కొనుక్కున్నాడు.. అసలు ఇలా మేనేజ్ చేయడం కొత్తనా…ఎవడికి అవకాశమున్నంత మేరా వాడు ఈ దేశంలో చేసుకు పోతూనే వున్నాడు కదా..

మన దేశ ప్రధానమంత్రివర్యుల పాలనా కాలంలో ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణాలు వెలుగులోకొచ్చినా వారు మాత్రం నాకే మసి అంటనేలేదు.. నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటానంటారు..అంటే ఆయన రాజకీయం చేస్తున్నట్టే కదా..మరి ఆయనెన్నడైనా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారా?? అసలు ఆయన రాజకీయాలలో వుంటే ఏంటి లేక పోతే మనకేంటి..దమ్ముంటే ఏ శిక్షకైనా సిద్దమే అనాలి.. తనకు తెలీకుండా ఇన్ని లక్షలకోట్లు దారి మళ్ళుతాయా.. అయినా ఆయన గురించి పరిశోధించి నిరూపించే కాలానికి ఆయనా పదవిలో వుంటాడా? లేక ఆయనేమైనా యుక్త వయసులో నవనవలాడుతున్నారా?? అసలు మన దర్యాప్తు సంస్థల స్పీడు తెలీనిదా మనకి..

అందుకే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?? పాలక వర్గమే భ్రష్టు పట్టి పోయుంటే ఇంక దాని నాలుగు కాళ్ళలో ఒకటి కుంటిదని బాధ పడడం మన వెఱితనం కదా…

ఈ మంట కొద్ది సేపేలేరా???


మళ్ళీ పెరిగిన పెట్రోలు ధర
ఓ రెండు దినాలు ధర్నాల హడావిడి
మేమైతే ఇలా చేసే వాళ్ళం కాదని అలా ఊడబొడిచేసే వాళ్ళమని బండి లాగేవాడొకడు

రంగు రంగుల జెండాల బాండ్ మేలాం గోలలు
దిష్టిబొమ్మల దగ్ధాలతో తృప్తి పడిపోయి
చల్లగా బంకుకు చేరి మూసుకొని పోసుకుపోతాం….

ఇది తెలిసిన గెడ్డం వెనకాల ఓ పిల్లి మీసపు నవ్వు వెక్కిరిస్తూనే వుంటుంది….

చీమలు పెట్టిన పుట్టలు…


చీమలు పెట్టిన పుట్టలు పాముల పాలైనట్లు పుట్టపర్తి పుట్టలో బంగారు బాబా కూడబెట్టింది పాముల పాలౌతోంది…ప్చ్…

అంతా చోద్యం చూస్తున్నారు….

సామాన్యులెప్పుడూ నిస్సహాయులౌతున్నారు…

అందరూ శ్రీ వైష్ణవులే…చాపలోని చేపలు మాత్రం హుష్…

వొట వృచ్చం..


మా బావ్ పాత బండి

అయ్యా, మా బొత్స బావ్ అంటే అంత ఈర్ష్య పడిపోతుంటారయ్యా అందరూను. ఇంతింతై వటుడింతై అన్నట్లు  మా వోడు మఱిసెట్టు నెక్క ఊడలు దిగబారించేసినాడు మా జిల్లాలో..

మరొకడెవుడూ జిల్లాలో అడుగుపెట్టనీకుండా తన సామ్రాజ్యం ఇస్తరించేసినాడంటే నమ్ము.. ఇంకొకడెవుడు బ్రాందీ, సారా వేపారానికి రానీయక ఓల్ సేల్ మొత్తం సిండికేట్ తనసేతుల్లోనే..

జిల్లా కేంద్రంలో పెబుత్వ జాగాలల్లో తన మల్టిప్లెక్స్ లు కట్టించేత్తున్నాడు బావ్..ఎప్పుడైనా మా ఇజీనగరం వొత్తే బస్సుల కాంప్లెక్సుకాడాగి ఒకమారు ఎదురుగుండా సూడండయా బావ్.. అక్కడ వున్న పెభుత్వ జాగా మొత్తం లీజుకు తీసుకున్న అంబికా కంపెనీ వోడ్ని బయపెట్టి ఈయన గారు దొబ్బేసి పెద్ద మల్టీప్లెక్స్ కట్టేత్తున్నాడంతారయ్యా. నిజం ఆ పెరుమాల్లకే తెలియాలయ్యా.  అలాగే మరి ఆ సుట్టుపక్కలెక్కడా జాగాలు మిగలనీయలేదు.. అటు గోదారమ్మ జిల్లాల్లో కూడా పాగా ఏసీనాడని ఇనికిడి..

జిల్లాలో అంగన్వాడి నుండి  కలెక్టర్ పోస్టు దాకా మా బావ్ మేనల్లుడు బావ్ సూసుకుంతాడని మావోడు ఎక్కడున్నా గుండెమీద సెయ్యేసి ఆయిగా నిద్రపోతాడునెండి. ఎందుకంటే ఆబావ్ అలాపిలాటి బావ్ కాదు మరి. ఆ బావ్ సెల్లెత్తినాడంతె పనైపోయిందన్నలెక్కే.. ఎవురికైనా ఏటి కావాలి బావ్ ఇంతకమ్టే.. ఇలపింటి మనుసులు ఎందరు కావాలి..ఒక్కల్జారా…

బావ్ ఈ పాలి ఎలచ్చన్లొత్తే   మొత్తం   నియోజకవర్గాలన్నీ మా బావే   (అంటే తమ్ముళ్ళు, బావా బామ్మర్దులు, మేనళ్ళుల్లు) పోటీ సేస్సెనా ఆచ్చర్యపోనక్కర్లేదు బావ్. 

రిజర్వుడు వంతారా ఆయన సెప్పులు మోసినోల్లూ ఇప్పుడు సానా మంది వున్నార్లెండి. 

రానున్న పంచాయతీ ఎన్నికల్జూడండి మా సెడ్డ రంజుగుంతాయి మరి. ఇంక తన ఇస్వరూపం సూడాల్సిందే.. 

ఈ దెబ్బతో బీసీ వోట్లన్నీ ఆయనకే..ఆయన పార్టీకే ఏసేత్తారని అమ్మగారు సా సెడ్డ నమ్మకంతో ఈజీగా కుర్సీలో సారగిలబడ్డారని తేలుతోంది. మరి మా వోడు అలాపింటిలాపింటి ప్లాన్లేత్తాడనుకున్నారేటి.. ఈ దెబ్బతో ఎగస్పార్టీవోల్లందర్నీవోల్ మొత్తం సాపలో సుట్టేసి మా పెదచెరువులో ఇసిరేత్తాడు సూడండి…

ఒకపాలి తీరిక జేసుకొని  మీరొచ్చి సూసి ఈ వట  వ్రుచ్చం కింద గానోదయం పొంద ఇన్నపం.. మా సెడ్డ మనోవికాసం పొందుతారని ఆమీ..ఉండండి మరి నా బీడీ ఐపోవచ్చింది…

ఐతే అయినోడి పెళ్ళి లేకపోతే గులాపోడి పెళ్ళి (కడపోరు)


కడప ఉప ఎన్నికలు జరుగుతాయన్నప్పటినుంచి రాష్ట్ర పాలన స్తంభింప జేసి మంత్రులు, అధికార పార్టీ MLA లు మేమే వైఎస్ వారసులమంటూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పించి ప్రజలంతా తమ వైపే వున్నారని, గెలుపు మాదేనని తొడలు గొట్టి మీసాలు మెలేసిన వారంతా పోలింగ్ ముగిసిన తరువాత సెంటిమెంటు సెంటంతా జగన్ కే అంటుకుందని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అధికారులు జగన్ కు పనిచేసారని ఆరోపణలు అధికారంలో వున్నవారే చేయడం వాళ్ళ అసమర్థతకు గుర్తుకాదా?

ఈ సందర్భంగా మా అమ్మమ్మ జెప్పిన ఈ సామెత గుర్తుకు వచ్చింది.. ఐతే అయినోడి పెళ్ళి లేకపోతే గులాపోడి పెళ్ళి అన్నట్లు ప్రవర్తిస్తున్నారు….

ఈ ఎన్నికల సందర్భంగా అధికార ప్రతిపక్షం వాళ్ళు ఎంత నిస్సిగ్గుగా డబ్బు మద్యం పంచారో చూస్తుంటే ఎన్నికలంటేనే అసహ్యం వేస్తోంది..

జనం కూడా ఇంతలా అమ్ముడుపోవడం ఇంతకుముందు జరిగినా ఇప్పుడు మరింత పబ్లిక్ గా బరితెగించడం చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ కావడంలో ఎవరి పాత్రా తక్కువకాదన్నది నిష్ఠుర సత్యం…

ఆడి సేతులల్ల బెమ్మజెముడు మొలిసియ్య…


ఖాకీచకుడు

అప్పా, ఓలప్పా ఏటే ఇలాగోసిపోయింది నీ సెయ్యి, బుగ్గ మీదేటే అలా కమిలిపోయింది అంటూ వొచ్చింది వరలక్ష్మి రాములమ్మ ఇంటికి..

రాయే తల్లీ లచ్మీ.. ఏటి సెప్పమంతావే, మా ఆశా వర్కర్లమందరం కలిసి మన మండలం నుండి ఉదయం పాసెంజిరెక్కి విజీనగరం యూనియనోళ్ళు రమ్మన్నారని ఎల్లినాం… అలా ఎల్లి రైలు టేసను నుండి బయటకు వస్తూనే అందరం రెండు లైన్లుగా ఇడిపోయి జీతాలు పెంచాలని, యూనిపారాలివ్వాలని గట్టిగా అరుసుకుంటూ కలెకటేరాపీసు వైపు నడుత్తున్నాం. ఎత్తు బిడ్జీ కాడికి వచ్చే రావడంతోనే పోలీసులడ్డుకున్నారు.. ఇంతమందిమి మేముండగా ఇద్దరు ఆడపోలీసులు మిగిలినోళ్ళంతా మగపోలీసులే తల్లి.. ఏమయ్యా బాబూ మేము మా సమస్యలు జెప్పుకోటానికి ఎల్తున్నాం, మేమెవలం దుడ్డుకఱలు పట్టుకోనేదు, మా సేతిలో ఏమీలేదు, కాయితాలు తప్ప మరి అడ్డుకుంటున్నారేమయ్యా అని అడిగినారే మా ముందున్నోళ్ళు, సంగం నాయకులు..మీరు ముందుకెల్లడానికీలునేదంతే నేదనీసి లావుపాటి బాబు ఒకటే ఈరంగం.. అయితే మేమిక్కడే కూకుండిపోతాం, కలెకటరు బాబే వత్తాడైతే అనీసి ఎక్కడోళ్ళం అక్కడే రోడ్డుపైన కూసున్నామే… ఇంక ఆ ఆడ పోలీసులు రెచ్చిపోయి ఏటే నెగండే నంజిల్లారా అని గదమాయించేసరికి, బొబ్బిలి, సాలూరు సుట్టుపక్కలనుండి వచ్చినోళ్ళంతా మేమెందుకు నెగాలె, మమ్మల్ని ఎల్లనిత్తే ఎల్తాం, నేకపోతే ఇక్కడే వుంతాం అని ఆళ్ళ సేతుల్నిండి ఇడిపించుకుంతుంటే ఆ గుంజులాట సూసి ఏటే ఆల్లతోని మాటలు, అనీసి కఱి దున్నపోతులా ఎగసోప బెట్టుకుంటూ ఒక్కపాలిగా మామీద నాటీలతో ఇరగబాదీసినాడె.. ఆడు తినాద సిఐ బావంట… ఆడి సేతులు పడిపోను, ఆడి నోట్లో మట్టికొట్ట, నా రగతం పొయ్య, ఆడి జిమ్మడిపోను, ఆడి సేతులల్ల బెమ్మజెముడు మొలిసియ్య ఏనాడు మీ బావైనా కొట్టనేదే, అలాపింటిది ఆ నంజికొడుకు నాటీతో బాదీసినాడే, పచ్చి బాలింతరాలు సిన్న పిల్లల్ని సేతులల్లో పట్టుకొని పరిగెట్ట నేకపోతుంటే పిఱలమీద మరీ కొట్టీసినాడే, పైటసెంగులు, జుత్తు పట్టి నాగీసి ఈడీసీసినారే, ఇజీనగరం ఆడి బాబుగాడిదైనట్టు రోడ్లమీద ఈరంగం ఆడినాడే, మాలో నలుగురైదుగురికి బుఱలపై దెబ్బలు తగిలి సానా రక్తం పోయినాదే లచ్మీ… ఏటి సెప్తాను, తెల్లారిగట్ల ఇంటికాడ బయలెల్లినప్పుడు తాగిన గెంజేనే, దిగాక టీ సుక్కకూడా తాగకుండ ఎల్లినామా, ఈ దెబ్బలు ఈటితోని పాటు కడుపుమంటతో నకనకలాడిపోయినామే.. ఉపాధిహామీ పనులకెల్లినోళ్ళకు రోజుకు వందొస్తుందా, మాకేమో నెలకు నాలుగొందలు జీతం, అదీ ఇప్పుడు ఆరేడు నెలలుగా ఇయ్యనేదా, తీరా ఇచ్చినప్పుడు అందులో గుమస్తాబాబుకు ఏబై ఇయ్యాల మరి మండలాపీసు మీటింగులకెల్లాల, ఆలకి ఈలకి బాలేదంటే తోడు ఎల్తన్నామా, పురిటికి పున్నానికి తీసుకెల్తున్నామా అందరికీ ఎలాగోలా సేసుకొస్తున్నామా, అయ్యా మరో ఆరొందలైనా పెంచండి మాప్రబో అని సెప్పుకోడానికి ఎల్తామంటే ఇలగ కాలిపోయింది.. మేమేమైనా ఉద్యోగాలు జీవితకాలం సేత్తామన్నామా, గోనెసంచీలతో ఒంపీమన్నామా… ఏటోనే లచ్మీ ఇలా దెబ్బలు తినీసి వచ్చినానా ఇంక మీ బావ నీకెల్లొద్దంటే ఎల్లినావ్, నువ్వే అనుబవించే అని ఆడు రోడ్డు మీద టీకొట్టులోనికి ఎల్లిపోనాడు..ఈ పిల్లలకి ఒండిపోయాలి కదా అని మల్లీ నెగిసినానే… యిదీ నిన్నటి మా ఎద…

కరెంట్ కామెంట్స్2 – కుంభకోణాల సంవత్సరం


ప్రజాస్వామ్యం?వరుసగా ఈ సం. కాలంలో బయటపడుతున్న లక్షల కోట్ల కుంభకోణాల పర్వం ఇంకా ముగింపుదశకు చేరుకోలేదు. రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తూ సామాన్యజనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక వేత్తలలో సమకాలీన కాలంలో చెప్పుకోదగ్గ వ్యక్తి పరిపాలనలో ఇన్ని కు.కో.లు వెలుగు చూడడం, అయినా ఆ మేధావి తన హుందాతనాన్ని తన మౌనంతో నిలుపుకుంటూ చెయ్యి ఊపుతూ సాగిపోతున్నారు. అటు తన కుడిభుజం గృహమంత్రిత్వ శాఖ నిర్వర్తిస్తున్న మరో ఆర్థిక వేత్త కూడా తన పంచె మడత నలగకుండా దర్యాప్తు సంస్థలను అలా మెల్లగా కదిలిస్తూ భారత దేశ ప్రజలు అత్యంత సహనశీలురని, ప్రతి ఏటా నిలువుదోపిడీ ఇచ్చుకోవడం అలవాటుగా వున్నవారని నిరూపించే ప్రయత్నం చేయడానికి తన శాయశక్తులా కృషి చేస్తున్నారు.

భారత ప్రజాస్వామ్యమా మరిన్ని కు.కో.లతో పరిఢవిల్లు…
కోట్లు వున్న వాడిని లక్షల కోట్లకు ఎగదోయి…
తినడానికి చిప్ప లేని వాడికి ఎంగిలాకు దొరకనీయి…
అంతా శాంతి శాంతి శాంతి జపాల హోరులెత్తనీయి…
హాయిగా ఈ చిల్లు దుప్పటిలో దూరిన దోమని
ఈ అర్థరాత్రి చంపడానికి గాంధీ తాత అడ్డుపడి
కఱతో ఒక్కటిచ్చిన ఈ వాత చూడు….
తెల్లవారి పేపర్లో దోమకాటుకు
ఓ అభాగ్యుడి చావు…
ఇంత పనికి రాని వార్త ఫీడ్ చేసినందుకు
స్టింగర్ తొలగింపు….
హహహహహహహహ్…
అహింసా వాదీ అమర్ రహే…
భారత మాతాకి జై…
మొత్తానికి నీవు సహనశీలివమ్మా….