ఖండిద్దాం

ఇద్దరు ముసలి దంపతులకు 360 గదులవసరమా??


New_Delhi_1964654c
మన నేతలంతా మనకు సుద్దులు చెప్పేవాళ్ళే.. కరెంటు వాడొద్దంటారు, గాస్ వాడకం తగ్గించేలా చర్యలు తీసుకుంటారు, భోజనం మానేయమంటారు.. పెట్రోలు డీజిల్ వాడకం కూడా .. ఇలా అన్నీ తగ్గించేసుకోమంటారు..

కానీ వీళ్ళ అధికార భవంతులలో జరుగుతున్న దుర్వినియోగమెంతో ఆలోచించరు. ఇద్దరు ముసలి దంపతులుండటానికి 360 గదులున్న రాష్ట్రపతి భవనం అవసరమా? ఇంక ప్రధానమంత్రి, పార్టీల అధ్యక్షులు, మంత్రులు, ఎం.పీలు, ఎం.ఎల్.ఏలు ఇలా వీళ్ళ విలాసవంతమైన జీవన విధానం వలన వృధా అవుతున్న ప్రజా ధనం, మానవ వనరులు ఎంతెంత??

ఇంక IAS, IPS, Group I Officer, న్యాయాధీశులు ఎంతలా అధికార దుర్వినియోగంతోపాటు తమ విలాసవంతమైన జీవితాలను ప్రజల డబ్బుతో ఎంజాయ్ చేస్తున్నారో మన కళ్ళ ముందు జరుగుతున్నవే.

ఇదంతా ఈ ప్రజాస్వామ్య దేశంలో సర్వ సాధారణంగా నడిచిపోతున్న విషయాలు. కూటికి నోచని కోట్లాది కుటుంబాల కంచాలను లాక్కుంటు వీళ్ళనుభవిస్తున్న ఈ రాజసాలను ప్రశ్నించి అడ్డుకోవాల్సిన అవసరముంది…

కాదంటారా??

తారలు ఈ సమాజపు నిలువెత్తు ప్రశ్నలు కారా??ఇటీవల ఆంధ్రజ్యోతి వారి టీవి చానల్ ద్వారా పత్రిక ద్వారా ఏదో ఓ పెద్ద నేరస్తురాలిని పట్టుకున్నట్టు, తన ఒక్క దాని వల్లనే ఈ తెలుగునేలంతా కుళ్ళిపోతున్నట్టు రోజంతా ఊదరగొట్టి రోజూ కథనాలు ప్రచురిస్తూంది. ఈరోజుకు రాజకీయ నాయకులు, వారి తాబేదార్లు, పోలీసులకు తనతో లింకులు వున్నాయని వాటిని బయటపెట్టుతూ తనను తాను రక్షించుకోజూస్తున్నట్టు కథనం రాసింది. అలాగే కొంతమంది రా.నా.ల వలన తనకు బెదిరింపులొస్తున్నట్టుగా కూడా.. ఒంటరిగా వున్న ఆడదానిని చంపేయడం అదీ ఇలా ముద్ర పడ్డ వాళ్ళని ఏం చేసినా ఈ సమాజం హర్షిస్తుందిలే ఆన్న ధీమా వున్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు..

అసలు మీడియా అంత పవిత్రంగా ఏడిసిందా ఈ దేశంలో???

అసలు ఇది తారా చౌదరితోనే మొదలయ్యిందా? లేక అమ్మె ఒక్క దానితోనే అంతమయిపోతుందా.. ఇలాంటి వారు ఈ సమాజంలోంచి వస్తున్న వారే కాదా?? ఎంతమంది జీవితాలను ఈ సమాజం నాశనం చేస్తూ వాళ్ళని ఇలా పెడదోవ పట్టడానికి దోహదం చేయడంలేదు. రాజకీయనాయకులు, అధికార గణం వీరిని ఇలా తయారు కావడంలో పాత్ర వహించడం లేదా.. వ్యభిచార వృత్తి మన సమాజంలో అంతర్లీనంగా అంగీకరింప బడుతూ శతాబ్ధాలుగా వస్తున్నదే కదా… మరి తారా చౌదరి వలన నష్టమెవరికి జరిగింది. ఏదో పెద్ద స్టింగ్ ఆపరేషన్ తో పట్టుకున్నటు బిల్డప్ ఇచ్చి అదో దేశ ద్రోహ నేరంలా మీడియా చూపుతోంది.. వారిని సంస్కరించాల్సింది పోయి వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళను మరింత కుంగిపోయేట్టు చేయడం ద్వారా ఉపయోగముంటుందా…లేదంటే వాళ్ళు మరింత మొరటుగా తయారవ్వడానికి ఈ ప్రచారం ద్వారా మరింత పెరగడానికైనా ఉపయోగపడుతుంది ఇలాంటి కథనాలు.

కుళ్ళిన సమాజంలో వుంటూ ముక్కు మూసుకున్నామనడం హాస్యాస్పదం కాదా.. ఈ వ్యవస్థలో తారాచౌదరిలు వస్తూనే వుంటారు… వారిని వెంటాడి వేటాడకండి.. వారి తప్పు తెలుసుకొని మారే అవకాశమిద్దాం…

తెలంగాణా యాగం?


తెలంగాణా కోసం శత చండీ యాగం చేస్తున్నానని కె.సి.ఆర్. ప్రకటన్ ప్రజలను తప్పుదోవపట్టించడానికేనన్నది సుస్పష్టం. తనకున్న నమ్మకాలని ఏదో విధంగా కాష్ చేసుకోవాలనుకునే ఇలాంటి వారిని ప్రజలు ఇంకెంతో కాలం భరించలేరు. కాకపోతే తన కుటుంబ సభ్యులతో కలిసి చేస్తున్న దానిని తెలంగాణాకు ముడిపెట్టి చేయడం ఖండించాలి..

ఉద్యమం ద్వారానే సాధ్యమవుతుందన్న విషయాన్ని పక్కన పెట్టి మిలియన్ మార్చ్ నుండి పక్కకు తప్పుకొని, సోనియాకు భజన చేయడం మొదలుపెట్టి, మౌనం దాల్చిన ఈయన ఈ విధమైన ప్రచారార్భాటాలకు పాల్పడడం దారుణం..

రాజకీయ పార్టీలు సెక్యులర్ గా కనీసం అగుపించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించలేనితనాన్ని అంతా ఖండించాలి. ఈ యాగపు ఖర్చును తన సొంత అకౌంట్ లో జమ చేయాలి..

ప్రజా ఉద్యమాలను తప్పుదోవ పట్టించే ఇలాంటి నాయకులను ఖచ్చితంగా నిలదీయాలి…

ఈ కడుపుకోతకు సమాధానం ఏది?పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా ఖమ్మంజిల్లా వేలేరుపాడు మండల కేంద్రంలోని జి.ప.ఉ.పాఠశాల ఆవరణలో పోలీసుల ఆయుధాల ప్రదర్శనలో భాగంగా ఓ పోలీసు నిర్లక్ష్యం ఇద్దరు విద్యార్థుల నిండు ప్రాణాలను బలిగొంది.

తమ ఆయుధ పాటవాన్ని ప్రదర్శించడం ద్వారా వీళ్ళు సాధించేదేమిటి? అసలు లోడ్ చేసిన ఆయుధాలను ఎలా గురిపెట్టారు? విద్యార్థులకు ఆయుధాలను చూపించి వారికి ఒనగూర్చే లాభమేమిటి? ఆయుధాల గురించి ఈ కాలం ప్రత్యేకంగా ప్రదర్శించాలా? ఏ చిన్నపాటి బంద్ అయినా అంతెందుకు ఎం.పీ.పి. దగ్గరనుంచి ఎం.పీ.ల వరకు పక్కన గార్డ్ లేకుండా ఎవడున్నాడు.రోడ్లపై ఆయుధాలు వేలాడేసుకు తిరుగుతున్న వారిని ప్రతిరోజూ గమనిస్తూనే వుంటాం. ఇలా ఈ ప్రత్యేక ప్రదర్శనల ద్వారా అదనంగా పొందేదేముంది? మా దగ్గర ఇంత ఆయుధ సంపద వుంది, మమ్మల్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదని చెప్పడానికి తప్ప..

గాయపడిన మరో ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా వుంది. ఈ కడుపుకోత తీర్చేదవరు? వీళ్ళిచ్చే ముష్టి పాతిక వేలా? లేక హోంగార్డ్ ఉద్యోగమా? ఆ ఇద్దరి భవిష్యత్ దీపాన్ని కొండెక్కించి ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చిన ఈ సంఘటననైనా గుణపాఠంగా తీసుకొని ఇలాంటి తుపాకుల ప్రదర్శనను నిలిపివేయాలి..

సోంపేట డాక్టర్ గారి ఆసుపత్రిలో బాంబు పేలుడుసోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలలో చైతన్యాన్ని కలిగించి, పర్యావరణ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీల అండ లేకుండా ప్రజలను కూడగట్టి ఉద్యమాన్ని చేపట్టిన డా.వై.కృష్ణమూర్తిగారి ఆసుపత్రి రెండో అంతస్తులో నిన్న బాంబు పేలుడు సంభవించింది. ఎవరికీ ప్రాణాపాయం లేకపోయినా ఆ సమయంలో డాక్టరుగారు వైద్యం అందిస్తు వున్నారు. ఆ పేలుడువలన ఆసుపత్రి టాయిలెట్స్, ఓ గది దెబ్బతిన్నాయి. యిలా ప్రజలను చైతన్యం చేసే వారిపై దాడి చేయడానికి ఉపక్రమిస్తున్నారంటే వీళ్ళు ఎంతకైనా తెగించి ఫ్యాక్టరీ వాడి కొమ్ము కాస్తున్నారని అర్థమవుతోంది. ప్రజలంతా నేడు స్వచ్చందంగా బంద్ పాటించారు. స్థానిక కాంగ్రెస్ నాయకునిపై అనుమానముందని డాక్టరుగారు రిపోర్ట్ యిచ్చారు. డాక్టరు గారిని భయపెట్టడం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చొచ్చునన్న భ్రమలలో వున్నారు. సోంపేట కాల్పుల సంఘటన జరిగిన రోజు కూడా పోలీసులు, NCC గూండాలు ఆసుపత్రిపై దాడి చేసి, రోగులను కూడా కొట్టారు. ఐనా ప్రజల సహకారంతో డాక్టరుగారు ధైర్యంగా నిలబడ్డారు. ఆయన చేస్తున్న కృషికి, మొక్కవోని ధైర్యానికి మనమంతా చేయూతనివ్వాలని కోరుకుంటూ..

డాక్టర్ గారి సెల్ నెం.ః9440347548, H.No.08947 234588

http://ibnlive.in.com/generalnewsfeed/news/bandh-in-sompeta-to-protest-explosion-at-nursing-home/347214.html
http://expressbuzz.com/states/andhrapradesh/blast-rocks-sompeta-whistleblower%E2%80%99s-hospital/209307.html