కృతజ్నతలు

న్యాయదేవతకు వందనం


గత నాలుగునెలలుగా అప్రకటిత  కల్లోలిత ప్రాంతంగా  తీవ్ర నిర్బంధాన్ని అనుభవిస్తున్న ఉస్మానియా క్యాంపస్ పై న్యాయమూర్తులు స్పందించిన తీరు అభిలషణీయం. వారి తీర్పునకు వేన వేల వందనాలు. ఎవరి వత్తిడులకు లొంగని ఒకే ఒక్క వ్యవస్థగా తమ తీర్పునకు కట్టుబడి, తాము రోజూ ప్రత్యక్షంగా చూస్తున్న విద్యార్థుల అగచాట్లను, ఆవేదనను, ఆక్రందనను కని, విని తమకు చెవులు మాత్రమే కాదు కళ్ళూ వున్నాయని నిరూపించారు. కరకు ఖాకీల  కల్లబొల్లి కబుర్లను తప్పుపట్టి, ఉక్కుపాదం ముళ్ళను వంచే తీర్పునిచ్చారు.

తీవ్రవాదులపైన, టెఱరిస్టులపైనా ప్రయోగించాల్సిన రక్తం రుచిమరిగిన గ్రేహౌండ్స్ వాళ్ళను ఎందుకుపయోగిస్తున్నారో ప్రజలు గ్రహించాలి. జర్నలిస్టులను కవచాలుగా ఉపయోగించుకొని, వారి బైక్ లకు నిప్పుపెట్టి ఉచ్చపోసారంటే ఎంత కసిగా ప్రవర్తిస్తున్నారో అర్థంచేసుకోవాలి. దేనికి ఈ అసహనం? ఎవరిమీద ఈ అకారణ దురాగ్రహం? అదుపుతప్పిన ఆవేశం?

ఇకనైనా ప్రజల వాణిని వినే వ్యవస్థగా పాలక వర్గం తమ ఒంటెద్దు ధోరణిని వీడి యూనివర్శిటీని ముళ్ళకంచెలనుండి విముక్తిగావించాలి. తాము పోలీసుల కనుసన్నలలో కాదు ప్రజలకు బాధ్యులుగా పరిపాలన చేయాలన్న విషయాన్ని గ్రహించాలి. సమస్యను తప్పు దోవ పట్టించే సలహాదారులను (చిత్రగుప్తులను) పక్కనపెట్టి,       వారినీ  ఈ దేశ, రాష్ట్రపౌరులుగాగుర్తించి,వారు వేసిన ఓట్లు కూడా మీ అధికారానికి నిచ్చెనమెట్లగా   వాడుకున్నారన్న విషయాన్ని గుర్తెరిగి, సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునే దిక్కుగా,  సామరస్య వాతావరణాన్ని ఏర్పడే దిశగా కృషిచేయాలి. యితరేతర ప్రభావాలనుండి దృష్టిమరల్చి, పరిపాలన సజావుగా సాగేందుకు కృషిచేయాలి.

మరొక్కమారు న్యాయదేవతకు వేనవేల దండాలు…