కవిత

వరదపాలు


బురద బువ్వ

 

 

 

 

 

 

 

 

చేతికంది వచ్చిన కొడుకును

పొట్టన పెట్టుకున్న సుడిగుండమల్లే

ఈ వరద కోత కొచ్చిన పంటను

నీటముంచి రైతు కంట కారే

నెత్తుటి వరదైంది…

 

ఆరుగాలం శ్రమించి

పుస్తెలకూడా  తాకట్టుపెట్టి

పండించిన పంట చేను

ఏపుగా ఎదిగిన ఎన్నుల

వెలుగుతో కనుల నిండుగా

పండిన కార్తీక పున్నమి వెన్నెల

కొండ చాటుకు మళ్ళకముందే

తీరందాటిన జల ప్రళయంతో

అలముకున్న చీకట్లతో

ఎలా ఈ ఏడు గట్టెక్కేదంటూ

బావురుమంటున్న రైతన్న

 

చుట్టూ ఆకాశంలో గిరికీలు కొట్టి పోయిన

ఉత్తుత్తి కిరణాల పొడిపొడి మాటల

హామీలతో మరింత కుంగిన

ఆకుపచ్చ చందమామ

నీకు సాయం ఒట్టి

ఎండమావేనా???

ధరణీమాతకు క్షమార్పణలతో..


అమ్మా..

మా అల్ప బుద్ధితో నిన్నర్థం చేసుకోలేక

నీ కడుపులో చేయిపెట్టి నిన్ను తీవ్ర

అవమానాల పాల్జేసి, నీ పాలుతాగి

నీ రొమ్ముగుద్దే నీచుల సావాసంతో

నీ పచ్చని చీరను లాగి నిన్ను వివస్త్రను

చేసి వికటాట్టహాసం చేసే ఈ మూర్ఖులను

క్షమించు తల్లీ..

క్షమించమనే అర్హతను కోల్పోయామని తెలుసు…

అయినా నీవు సహనానికి మారు రూపమనే

ధైర్యంతో ప్రార్థిస్తున్నా…

తెరిచిన నీ మూడో నేత్రాన్ని చాలించుతల్లీ

ఈ బుగబుగల తాపాన్ని తగ్గించు తల్లీ

(ధరిత్రీ దినోత్సవం నాడు ఏమీ చేయలేని నిస్సహాయతతో ఈ ప్రార్థన)

ఎదలో పొగబెడుతున్నదెవరు?


అంతా కలిసి నడవాల్సిన వేళ

అందరి వేళ్ళు కలిసి ఒకే పిడికిలవ్వాల్సిన క్షణాన

మండుతున్న నెత్తురు ఒకే నరంనుండి ప్రవహించాల్సిన సమయాన

కోట్ల గొంతులు ఒకే పొలికేకగా పిక్కటిల్లాల్సిన కాలాన

ఏ కాలనాగు విషపు బుసలు మిమ్మల్ని వెన్నాడుతున్నాయి

ఏ సైతాను మీలో ప్రవేశించి విచ్చిన్నం చేస్తోంది..

కలసి నిలబడితే కానీ

కలల అంచుమీద కత్తి సాము చేస్తే గానీ

గెలవలేమని తెలిసి మీరిలా….


ఎండిన పేగుల నాదం మీ నినాదం కావాలి…

రండి కదలిరండి కలసిరండి

కలబడి నిలబడి తెగబడి పోరాడండి…

(ఉస్మానియా జాక్ లో చీలిక వార్త చదివి ఆవేదనతో)