ఓదార్పు

నెత్తుటి పసి మొగ్గలను చిదిమిన పాపులం మనమే కదా?


నెత్తుటి పసి మొగ్గలను చిదిమిన పాపులం మనమే కదా?

కాన్వెంటు చదువులకాశపడి ఇంత మందిని చేజేతులా చంపుకుంటున్నాం.
రైలు వస్తుందని అరిచి ఏడ్చినా బస్సునాపని డ్రైవర్ ది తప్పా? కాపలా లేని లెవెల్ క్రాసింగులను పట్టించుకోని ప్రభుత్వానిది తప్పా? ఊళ్ళో వున్న సర్కారీ బడులలో కనీసం ప్రాధమిక విద్య వరకైనా చదివించే ఓపిక లేని తల్లిదండ్రులదా? వారి మీద పడి శోకాలు తీసి మూర్చిల్లితే వారు మరల చిగురిస్తారా? ఎక్స్ గ్రేషియా ఎన్ని లక్షలిచ్చినా వారి ఊపిరి మరల పోసుకుంటుందా? ఆ ఇంట చిదిమిన దీపం మరల వెలుగుతుందా? అంతెత్తు ఎగిరిపడి కిలోమీటరుకు పైగా రైలు మహమ్మారి ఈడ్చుకు పోతుంటే వారి ఊపిరి తిత్తులు పగిలి గుండె చిద్రమై నెత్తుటి ముద్దలుగా మారిన ఈ భయ విహ్వల దృశ్యం మన మనసులనుండి చెరిగిపోతుందా? ప్రమాదం జరిగిన ప్రతిసారీ ఇలా జరిగి వుండాల్సింది కాదు, అలా చేసి వుండాల్సింది కాదు అనే ఈ నాయకులను అధికారులను ఎవరమూ నిలదీయలేమా? ఇంత ఘోర దృశ్యాన్ని మరల మరల మనం చూడవలసినదేనా? బతికున్న శవాలుగా ఈడ్వబడాల్సిందేనా?

పిల్లలూ మా తప్పులకు మా నోట్లో ఉచ్చబోయండి…ఏరగండిరా.. అయినా ఏం లాభం….

సలాం ముంబై…


నెత్తురోడిన ముంబై
మౌఢ్యం ఏదైనా మారణ హోమమే
మానవ హననమే…

కోల్పోయిన వాళ్ళలో నీకు చాయ్ తాపించిన వాడూ వున్నాడు
నీలో గూడు కట్టుకున్న చీకటి విషాదానికి
ఎన్నటికీ ఇది పరిష్కారం కాదు.. కాకూడదు…

నెత్తురోడిన వీధులు
చిద్రమైన మానవ దేహాలు
మూల్గుతున్న హృదయాలు
యిక్కడితో ఆగనీ…

పరిమళించనీ మానవత్వం….
ముంబై నీకు సలాం….

దీపావళి కావాలి రైతు ఇంట ఆనందావళి


Diwali Animated Scraps : Click Here To Forward This Picture To Your Friendz
దీపావళి
మోసుకొస్తోంది
ఓ ‘జల్’ ప్రళయాన్ని!

యిప్పటికే చేను నీటమునిగి
గుండె అంతా చెరువై
కన్నీళ్ళ వరద పర్యంతమైన
రైతు ముంగిట మరో
జల ప్రళయ విధ్వంసపు వార్తలతో
ఎలా విరజిమ్మగలదు
ఈ దీపపు కాంతి!!

కానీ
ఓ మూల దాగిన ప్రమిద
అటూ ఇటూ ఊగుతున్న
తన చిరు దీపపు కాంతితో
ప్రళయాన్ని సైతం
ఆపగలనన్న
హామీనిస్తూన్నట్లు….

ట్యూన్ కాని మా రేడియో అన్నయ్య..


ఓ పదేళ్ళ క్రితం వరకు మా వూళ్ళో ఎక్కడో దగ్గర రేడియో వినబడేది.. అంతకు ముందర క్రికెట్ కామెంటరీ కోసం చెవిదగ్గర రేడియో ట్రాన్సిస్టర్ వుండటం మోడర్న్ చిహ్నంగా వుండేది.  అలాగే వార్తలకు అదే ఆధారం.. ప్రాంతీయ వార్తలు,  జాతీయవార్తలను తెలుగులో చదివే కందుల సూర్యనారాయణ మొ.న వారంతా మనకు కనబడని స్నేహితులులా వుండేవారు. వాళ్ళ పేరు చెప్పకుండానే గుర్తుపట్టే వాళ్ళం.. అలాగే ఉదయాన్నే వచ్చే సుప్రభాతం, సూక్తిముక్తావళి, భక్తిరంజని రేడియోలో పెద్ద సౌండ్ తో పెట్టే అమ్మ, చిత్ర తరంగణి, మధ్యాహ్నం కార్మికుల కార్యక్రమం, రాత్రిని వచ్చే రేడియో నాటికలు, జాతీయ నాటికలు ఎంతో శ్రద్ధగా వినేవాళ్ళం. ప్రతీ బుధవారం సిలోన్ రేడియో స్టేషన్ లో వచ్చే బినాకా గీత్ మాలా గురించి వారం వరకు వేచి వుండటం అదో థ్రిల్.. సామాన్యుని బతుకులో రేడియో ఓ భాగం. సంచార జీవులు కూడా తమ గుడారానికి రేడియో వేలాడదీసే వారు. స్వయంకృషి సినిమాలో హీరో రేడియో వినే హిందీకూడా నేర్చేస్తాడు. ఇలా రేడియో మనకు ఆనాడున్న ఒకే ఒక్క entertainer..

అలాగే అభిమాన హీరో  కొత్త సినిమా ఆడియో కేసెట్ రిలీజయితే సందడే సందడి. సాయంత్రానికి ఊర్లోకి కేసెట్ రావడం,  కాపీలు  రెడీ  అయిపోవడం,  టేప్  రికార్డర్లలో , టూఇన్ వన్ లలో ,  ఫేంట్ బకిల్కు పెట్టుకున్న వాక్ మన్ లలో        వినడం, వీధుల్లో పెద్ద పెద్ద బాక్సులలో  వినిపిస్తూ  గెంతులేయడం అదో ఆనందం…

ఆ రోజుల్లో  మా రేడియో అన్నయ్యకు చేతినిండా పని.. చుట్టు కుప్పలా చిన్న ట్రాన్సిస్టర్ల నుండి పెద్ద పెద్ద ఆడియో సిస్టమ్ ల వరకు వుండేవి. రాత్రి ఎప్పుడో చేరేవాడు ఇంటికి.. మాటిచ్చాడంటే దాని పనయ్యేంతవరకు విడిచిపెట్టేవాడు కాదు.. మన వద్ద పాడనని మొరాయించిన రేడియో చిటికెలో బాగయ్యేది. ఏ పార్ట్ పోయిందో చెప్పి కరెక్టుగా, తన కష్టానికి తగ్గట్టుగా తీసుకునే రేడియో అన్నయ్య అంటే అందరికీ అభిమానం.

కానీ నేడు ఎవరూ కనీసం సి.డీ.లు కూడా కొన్న పాపాన పోవడం లేదు. అంతా మొబైల్ డివైస్ లో ప్లే అవుతుంటే వింటున్నాం. దీంతో మూగబోయిన రేడియోలు, కనుమరుగైన టేప్ రికార్డర్లు, టూ-ఇన్-వన్ ల వలన నేడు రేడియో అన్నయ్యల బతుకు చితికి, ఈ వయసులో మరో పని చేతకాక అరుదుగా వచ్చే రేడియోనే కెలుకుతూ కాలం వెళ్ళదీస్తున్న వారికి ఓ ఓదార్పు మాటివ్వగలమా?