ఉసురు

విద్వ్హంసకర అభివృద్ధికి ప్రతిఫలం – హిమవిలయం


Uttarakhand-rescue-AFP

Kedarnath shrine floods _0

Siva_Statue_RAin_PTI

మనిషి ప్రకృతితో పాటు జీవిస్తే అది తనను కాపాడుతుంది. ప్రకృతికి విరుద్ధంగా ఏదో సాధించేసామన్న గర్వంతో వినాశకరమని అంతా చెప్తున్నా వినకుండా విధ్వంసకర అభివృద్ధికి బాటలు వేసుకుంటూ పోతే ఇలా తానున్న కొమ్మనే నరుక్కున్నట్టు తన వినాశనానికే దారితీస్తుంది. కేదారినాథ్, బదరీనాథ్, చార్ దామ్ లలో జరిగిన ప్రళయ గంగా విస్ఫోటనానికి మన గుడ్డి ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలే కారణం. లెక్కకు మిక్కిలి జలవిద్యుత్ ప్రాజెక్టులు కట్టి, నదుల గమనాన్ని మార్చడానికి పర్వత సానువులను తొలచి రక రకాలుగా వాటి గమనాన్ని మార్చడంతోపాటు టూరిజమొక్కటే తమ ఆదాయ వనరుగా అక్కడికి అడ్డూ అదుపూ లేకుండా యాత్రికులను తోలడం కూడా ఈ మానవ వినాశనానికి సజీవ సాక్ష్యం. ఇలాంటి అభివృద్ధి మన వినాశనానికి నాందిగా పర్యావరణ శాస్త్రవేత్తలు, మేధావులు ఎన్ని మార్లు ఎన్ని రకాలుగా చెప్పినా రాబడి ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలే వీటికి బాధ్యత వహించాలి. అంత ఇరుకు రహదారుల మధ్య వేలాది వాహనాలను పోనివ్వడం ముందు చూపులేని ఘోర తప్పిదం. హిమాలయ ప్రాంతంలో ముందుగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు చేయలేదని వింటున్నాం. ఈ శాఖ ఇచ్చే నివేదికలు మామూలు రోజులలోనే సాధారణ ప్రదేశాలలోనే తారుమారు అవుతుంటాయి. అలాంటిది ఇంత ఎత్తైన ప్రదేశాలకు అన్ని వేలమంది యాత్రికులను అనుమతించడం తప్పిదం. ఇలా ఈ ప్రళయానికి మన అత్యాశే కారణం.

ఇలా ప్రకృతి వినాశనానికి కారణభూతమయ్యే అణువిద్యుత్ ప్రాజెక్టులు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డగోలు అనుమతిలిస్తున్న ఈ గుడ్డి ప్రభుత్వాల దాష్టీకాన్ని ఇకనైనా ప్రజలంతా కలిసి ఎదుర్కోక పోతే ఇలాంటి ప్రళయాలు సాధారణమై భారతదేశ చిత్రపటంలో మనిషి లేకుండా పోతాడు. వుంటే గింటే రోగిష్టి మానవులుంటారన్నది సత్యం.

ఈ ఆపదలో చిక్కుకుని మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజెద్దాం.

ఈ ఆపత్సమయంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న త్రివిధ దళాల సైనికులకు వందనం.

ఇక్కడ కూడా రాజకీయ యాత్రలు చేసే నాయకులకు శతకోటి వందనాలు.

వీళ్ళకిదే తాగించాలి..


AJIT_PAWAR_GN_1222890e
ఇటీవల మహారాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కేంద్ర మంత్రి శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ వర్షాభావ పరిస్థితులలో రైతాంగం తీవ్ర దుర్భిక్ష పరిస్థితులనెదుర్కొంటున్నదని ప్రజల తాగు సాగు నీరు అవసరాలకు ప్రాజెక్టులనుండి నీళ్ళు వదలాలని దేశ్ ముఖ్ అనే రైతు 55 దినాలుగా నిరాహార దీక్ష చేస్తున్నారని విలేకరులు ప్రశ్నించగా డ్యాముల్లో ఉచ్చ పోయాలా అదీ సమస్యే ఉచ్చ పోయడానికి నీళ్ళు లేవని తీవ్ర అసహనంతో జవాబిచ్చారు. ఇది ఒక రాష్ట్ర అత్యున్నత పదవిలో వున్న మంత్రి భాష. అదే ప్రజలు వీళ్ళకి నీళ్ళకి బదులు ఉచ్చబోసి తాగిస్తే సరిపోతుంది కదా. రాజకీయ నాయకులు అధికారులు ఇలా ప్రపంచంలో అత్యున్నత ప్రజాస్వామ్య దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న కనీస జ్నానం లేకుండా మాటాడుతూ ప్రజల సహనానికి పరీక్ష పెడుతున్నారు. వీళ్ళకి తగిన బుద్ధి ప్రజలే చెప్పాలి.

‘అ’ధర్మాన నీ చిలుక పలుకులు కట్టిపెట్టు…


'అ' ధర్మాన

ఒక్కో మాట చిలుకలా పలుకుతూ గత కొన్నేళ్ళుగా రాష్ట్ర కేబినెట్ లో చక్రం తిప్పుతున్న ‘అ’ధర్మాన ప్రసాద రావు A5 ముద్దాయిగా సి.బి.ఐ. వాన్ పిక్ కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత కూడా ఇంకా తనేమీ ఎరుగనట్టు ముఖం పెట్టి (పాలిపోయిందిలెండి) ఇంకా తాను చార్జిషీట్ చదవలేదని చదివాక స్పందిస్తానని చెప్తూ ఢిల్లీకి తుఱుమన్నారు మన మంత్రివర్యులు.

అధికారంలోకొచ్చిన దగ్గర నుండి మాటల బుకాయింపుతో మేక వన్నె పులిలా ప్రవర్తిస్తూ శ్రీకాకుళం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా చలామణీ అవుతూ దాదాగిరి చేస్తూ తన కొడుకు పేర కన్నెదార కొండ గ్రానైట్ రాయి నిక్షేపాలున్న దానిని వ్రాయించి అడుగులకు మడుగులొత్తే అధికారగణంతో స్థానిక గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తున్న వీరి భాగోతం నేటితో బయటపడింది. యిలా తనకున్న పలుకుబడిని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ థర్మల్ పవర్ ప్లాంటులను నెలకొల్పుతాను ఎవడు అడ్డం వస్తాడో వాడి అంతు తేలుస్తానని ప్రకటించి స్థానిక పర్యావరణ ఉద్యమకారులను బాంబులతో బెదిరించిన నయా ఫాక్షనిస్టు నాయకుడు ‘అ’ధర్మాన.

అధికారంలో వుండగా కన్నూ మిన్నూ కానక వేలాది ఎకరాల పంట భూములను పారిశ్రామికీకరణ పేరుతో ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసిన ‘అ’ధర్మాన నేడు అది తన శాఖకు సంబంధం లేని వ్యవహారంగా బుకాయింపజూస్తున్నాడు.

రైతులు, ఆదివాసులను నిర్వాశితులుగా మార్చి కూడూ గూడూ గుడ్డకు దూరం చేసిన యిలాంటి దుర్యోధనులను వీరి అధికార గణాన్ని తీవ్రంగా శిక్షించితేనే రేపటి తరం కాస్తా పచ్చదనమైనా మిగిలి ఊపిరి పీల్చుకుంటుంది. కావున తక్షణమే వీరిని మంత్రివర్గం నుండి బహిష్కరించి నైతిక విలువలను పాటించాల్సిన అవసరముంది. ఇంకా సన్నాయి నొక్కులు నొక్కి ప్రజలలో అభాసుపాలు కాకూడదని ఆశిస్తున్నా…

ఇంత నిశ్శబ్ధమా…


గత కొన్నాళ్ళుగా రాష్ట్రమంతా ఓ నిశ్శబ్ధ వాతావరణం అలముకొంది.. కురవని నింబస్ మేఘాలులా ఓ పొడి వాతావరణమేదో చుట్టూరా కమ్ముకొంది. రోజు రోజుకు పెరిగి పోతున్న మహిళలపై దాడులు, నేరాలు మనల్ని ఏం కదిలించవు.. బియ్యం కేజీ రూ.40/-లుకు పైగా అయిపోయినా ఎవరూ స్పందించిన దాఖలాలు లేవు. నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయల ధరలు ఆకాశం దాటి ఎక్కడికో పై అంచులకు చేరుతున్నా జేబులు ఖాళీ అవుతున్నా ఎవరికి వారు చిల్లు జేబులలో చేతులు కుక్కుకొని ఠీవిగా నడిచిపోతున్నారు..

రాజీకీయ వాతావరణం కూడా ఒకరిమీద ఒకరు ఆడిపోసుకోవడమే తప్ప పాలన కుంటుపడిన వైనాన్ని గుర్తించడం లేదు. పాలనపై ఇదే తమ ముద్రగా ముందుకు పోతున్నారు. ప్రధాన ప్రతిపక్షానికి తమ పార్టీలోని నేతలను కాపాడుకోవడానికి ప్రణాళికలు వేసుకోవడంతోనే సరిపోతోంది.

తెలంగాణా ఆర్తనాదాన్ని పక్కన పెట్టి ప్రైవేటు వ్యాపారాలలో తలమునకలైనట్టున్నారు ఉద్యమ నేతలు. అప్పుడప్పుడూ కాల్చి పారేస్తామని ఓ స్టేట్ మెంట్ ఇచ్చి తమ ఉనికిని చాటుకుంటున్నారు.

ఎన్నికలేవైనా వస్తే తప్ప ప్రజలు గుర్తుకు రాని మన నాయకమ్మణ్యులు సదా మనకు గౌరవనీయులు కావడం మన దురదృష్టం.

మీడియా వారికి పాపం ఏ కొత్త అంశమూ లేక వారు చాల అనీజీగా ఫీలవుతున్నట్టున్నారు. వారికి ప్రజల దైనందిన జీవన సమస్యలకంటే ఏదో ఒక రంకుతనమో బొంకుతనమో వుంటేకానీ TRP రేటు పెరగదాయే,,,

సర్వేజనో సుఖినోభవంతు….

బోగస్ కిరణాలు


లక్షకొలువులు ఇచ్చేశాం అని సిఎం గారి ప్రకటన చూస్తే నవ్వొస్తోంది. ఈమధ్య ఈ యువకిరణాల ఉద్యోగాలపై గ్రామాలలోని యువకులు తామిచ్చిన కొలువులలో చేరారా లేదా అని విచారణకు గ్రామస్థాయి కమిటీలు వేసారు. నేనూ తిరిగా.. కానీ అందులో పేర్కొన్న కంపెనీలలో ఒక్కడు చేరలేదు. ఎందుకంటే ఆ ఉద్యోగాలు ఇచ్చినట్లు సమాచారమే లేదు. అసలు ఆ జాబితాలో ఇచ్చిన పేర్లలో 5 శాతానికి మించి ఎవరూ ఆ ఊళ్ళలో లేరు. ఏ ఊరివారో తెలీలేదు. అది స్వయంగా జిల్లా ఎంప్లాయ్ మెంటు ఎక్స్చేంజీ వారిచ్చిన జాబితా. సెక్యూరిటీ గార్డు పోస్టులలో స్వంత ఖర్చులతో చేరిన వారి పేర్లుకూడా వీళ్ళు కలిపేసుకున్నారు. ఇది మా పరిశీలనలో తేలిన అంశం. ఎందుకయ్యా ఇలా జన్నాన్ని మోసగిస్తారు??

పెద బేరగాడు…


బేరగాడు

ఈ ప్రస్థానం ఎటు వైపు..
T.కాంగ్రెస్ వాళ్ళంతా కుయ్యో మొఱో అంటూ వుంటే పదిహేను రోజుల్లో తెలంగాణా ఇచ్చేస్తారని సంకేతాలొచ్చాయంటాడు ఈ నాయకుడు…ఈయనకేమైనా ప్రత్యేక రాడార్ వుందా?
సోనియా చిదంబరంలతో ఎంత కుదిరిందో బేరం కానీ రాజుకున్న అగ్గిపై నీళ్ళు చల్లడానికి వెంటనే సిగ్గు ఎగ్గులేకుండా తయారై పోయాడు. ఏదో ఒక నిర్ణయం వెలువడే సమయంలో యిలా చేస్తూ పబ్బం గడుపుకుంటున్న ఇటువంటి నాయకుల
పబ్లిక్ నిలదీయాలి…

జర భద్రం తమ్ముళ్ళూ…

ను

వార్తకు ఆధారంః

కుక్క కరిస్తే చెప్పుతో కొట్టుకోవడమే మిగిలిందా?


ఈ మధ్య రాష్ట్రంలో కుక్క కాటు మరణాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అని గౌరవనీయులైన వైద్యారోగ్య శాఖ కార్యదర్శి గారిని విలేకరులు అడిగితే యిందులో రాష్ట్ర ప్రభుత్వం కుట్రేమీ లేదని, జనం సరైన సమయానికి వేక్సిన్ వేయించుకోక పోవడంతో మరణాలు సంభవిస్తున్నాయని సెలవిచ్చారు.  కానీ వేక్సిన్ వేయించుకోవడానికి వెలితే సర్కారు దవాఖానలో వేక్సిన్ వుండదన్నది అందరికీ తెలిసిన విషయమే. పోనీ వైద్యారోగ్య మంత్రిగారినడుగుదామంటే ఆయన ఉప ఎన్నికల ఫలితాలతో బొప్పికట్టి యింకా పూర్తిగా కోలుకోలేదు. సి.ఎం.గారెమో గుండు గీయించుకొని హాయిగా ఏసీ కింద తలపెట్టి పడుకున్నారు. మరింక మన మొర వినేది సదరు గ్రామ సింహాలే కాబట్టి వాటి సంఘాలతో సమావేశమై వేడుకోవడమే తప్ప మరో గత్యంతరం లేకపోయే..

ఖమ్మంలో గౌరవనీయ మంత్రి వర్యుల కళ్ళముందే అయ్యా బతికించండయ్యా అని చుట్టుకుంటూ చనిపోయిన బాలుని హృదయ విదారక దృశ్యం టీవీలలో చూసిన మనం చలించిపోవడమే తప్ప సర్కారుకు  చీమ కుట్టినట్లైనా లేదు. కావున మనకు చెప్పుతో కొట్టుకోవడమే మిగిలిన వైద్యం…

మహిళలపై పెరిగిన దాడులు-పోలీసుల రాజీమార్గాలు


ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. ఆడపిల్ల బయటకు వెళ్ళి రావాలంటే ప్రాణాలరచేత్తో పట్టుకోవాల్సిన పరిస్థితి తల్లిదండ్రులది.. మహిళా హోం మంత్రిగారి హయాంలో మరీ పెట్రేగిపోతున్న ఆకతాయిలు, ఆ తరువాత డబ్బులుంటే చాలు కేసులు మాఫీ అవుతున్నాయన్న భరోసా పెరిగిపోయింది…

ఉదాహరణకు ఈ నెల పదమూడో తారీఖున శిరీష అనే ఎం.బి.ఏ. విద్యార్థినిపై మోటార్ బైక్ పై వచ్చి దాడి జరిగితే మూడు వేళ్ళు తెగి పదిహేను అడుగుల దూరంలో పడితే అది ప్రమాదవశాత్తు జరిగిందని సెలవిస్తున్న పోలీసుల తీరు అనుమానాస్పదంగా వుంది. ఏవిధమైన ఆయుధంతో దాడి చేయకపోతే చేతి వేళ్ళు ఎలా తెగిపడతాయి? అలాగే ఎప్పటినుండో ప్రేమించమని వేధిస్తున్న వ్యక్తి కావాలని దాడి చేయకపోతే అది వీళ్ళన్న ప్రమాదమైనా ఆ వ్యక్తి ద్వారానే జరిగివుండాల్సిన అవసరముండేదా అన్నది సామాన్యులుగా మనకే తెలుస్తున్న జవాబు. అంతకుముందు పోలీసు స్టేషన్ లో వేధింపులపై రిపోర్టు ఇస్తే రాజీ చేసుకోమని సెలవిచ్చిన పోలీసు అధికారులు వాళ్ళ అమ్మాయిలపట్ల ఎవరైనా ఇలానే ప్రవర్తిస్తే రాజీకి వస్తారా? ఇంక ఈ సీను పై ఆ ప్రదేశంలో వున్న సాక్షులను అడిగితే రెప్పపాటులో జరిగిపోయిందిమేమేమీ చెప్పలేమన్నారని నిన్నటి వార్త. ఇప్పుడు నూటఎనిమిది కి అక్కడి నుండి వెల్లిన కాల్స్ లో ప్రమాద కారకుడైన వాడిదే మొదటినెం.అని చెప్పడమ్ బట్టి చూస్తే కేసును ఎలా మూసివేయాలో బాగా ఆలోచించి చేస్తున్నట్టున్నారనిపించడంలేదా? వీళ్ళు కేసును పక్కదోవపట్టించాలంటే ఏమైనా చేయగలరని నిరూపితమౌతోంది. జరిగింది ప్రమాదమన్నవారు ఫోరెన్సిక్ లాబ్ కు పంపారంట. వాళ్ళేలా ఈ కేసులో తేలుస్తారు? ఇది హాస్యాస్పదంగాలేదా? చేతి పై ఎంత పదునైన ఆయుధంతో దాడి జరగకపోతే వేళ్ళు అదీ మూడువేళ్ళు తెగిపడతాయా?

ఆడపిల్లల్ని కనడమే నేరమా? అటు విశాఖలో ఉపాద్యాయురాలిని ఘోరంగా  బడిపిల్లలముందే నరికి చంపాడొకడు. ఎక్కడున్నాం మనం? ఎటువైపు మన ప్రయాణం?

వార్త ఆధారం

తండ్రీ… రాక్షసుడా….


తనెవరో,

ఆడో, మగో,

ఏ కులమో,

ఏ మతమో,

ధనికురాలో,

పేదరాలో

తెలీని

ఆ పిచ్చితల్లి…


నవమాసాలు

అమ్మకడుపులో

భద్రంగా ఈదులాడి

బయటపడిన క్షణం…


తను ఆడబిడ్డనని

తన ఇంట తిరుగాడే

అదృష్ట దేవతనని

గారాభంగా చేతుల్లోకి

తీసుకుంటావనుకుంటే

ఒక్కసారిగా నేలకేసి మోది

చంపుతావనుకోలేదు నాన్నా…


ఇందులో నా తప్పేంటో

కాస్తా చెప్పగలవా?

మరో మారు జన్మెత్తకుండా

వుంటా….

(ఉదయాన్నే పేపరులో ముందు పేజీలోనే ఆడబిడ్డని నేలకేసి బాది ఆసుపత్రిలోనే చంపిన తండ్రి వార్త చదివి)

ఉత్తరాంధ్ర ఉసురు తీస్తున్న బొగ్గు కుంపట్లు..


బొగ్గు కుంపటి

ప్లాంటు చుట్టూ నిర్మిస్తున్న గట్టు

ఈ రోజు కాకరాపల్లి ధర్మల్ ప్రోజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పల్లె ప్రజలపై పోలీసు కాల్పులలో ఇద్దరు మరణించారు. బీల ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ప్లాంటు వలన మొత్తం ఆ ప్రాంతమంతా జలమయమై ప్రజలు కూడూ గూడుకు దూరమైపోతున్నందుకు నిరసనగా చేపట్టిన ఉద్యమాన్ని అణచివేయడానికి శతృ దేశంపై దండయాత్రకు వెళ్ళినట్లుగా వందలాదిమంది పోలీసులను మోహరించి భయభ్రాంతులను చేస్తున్నా ప్రజలకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవడంతో గత్యంతరం లేక తిరగబడుతున్న వారిపై సాయుధ మూకలు కాల్పులు జరపడం, ఈ కాల్పులలో మరణించిన వారిని ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన నాగేశ్వర రావు, బీరపువానిపేట గ్రామానికి చెందిన ఎర్రయ్యలుగా గుర్తించారు. అనేక మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. పోలీసు ఫైరింగ్ తో వారి గుడిసెలన్నీ తగలబడుతున్నాయి.

ఇంతగా ప్రజలు తిరగబడుతున్నా ప్రైవేటు కంపెనీలకు అమ్ముడు పోయిన పాలక వర్గం వారి విన్నపాలను వినేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. గత ఆరు నెలలుగా వడ్డితాండ్ర గ్రామస్తులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా కనీసం స్పందించలేదు. ఆ ప్లాంటు చుట్టూ నిర్మించిన గట్టు వలన వందలాది ఎకరాల వరి పంట మునిగిపోయింది. ఆ ఫోటోలతో కూడిన పోస్ట్ గతంలో ప్రత్యక్ష్జంగా చూసి ఈ బ్లాగులో వుంచాను. ఎంతసేపూ వారికి మద్ధతుగా ఎవరెవరు వస్తున్నారు, ప్రతిదినం ఎవరు కూచుంటున్నారు అన్న విషయ సేకరణ పట్ల వున్న ఆసక్తి తప్ప వారి గోడును వినే నాధుడు లేకపోవడం, మునిగిపోతున్న తమ బతుకులను కాపాడుకోవడానికి తిరగబడ్డం తప్ప ప్రత్యామ్నాయం లేకపోయిన ఆ మత్స్యకార, సన్నకారు రైతు కుటుంబాల ప్రాణాలను తీయడం ఎంతవరకు సమంజసం. ఇలా ప్రజల ప్రాణాలను హరించి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు?, ఇంత ఘోరమైన నీచమైన పనులు చేస్తూ ప్రజల పట్ల బాధ్యతలేని పాలకులు తమ ఆస్తులను కూడబెట్టుకోవడానికి అధికార ప్రతిపక్ష నాయకులు ఒకటై పోయారన్న చేదు నిజం ఇక్కడ సత్యదూరం కాదు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రోజెక్టు ప్రతిపక్ష భారీ విగ్రహానిదేనన్న సత్యం అందరికీ తెలుసు. వీడు మైకు దొరికితే గొంతు చించుకొని అవినీతి గురించి మాటాడుతాడు ముద్ద ముద్దగా. ఇక్కడి జనం నోట్లో మట్టి గొట్టడానికి తయారైన వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఉత్తరాంధ్ర బొగ్గుకాక తప్పదు. దీనిని ప్రజాస్వామ్య వాదులు, మేధావులు తప్పక ఖండించి ప్రజల పక్షాన నిలిచి పోరాడాలని కోరుకుంటున్నాం..

వార్తనిక్కడ చదవండి