ఆకాంక్ష-తెలంగాణా

ఖాళీలను పూరింపుము..


ఇంతకీ ఈ ఆరాట పోరాటమంతా హైదరాబాద్ కే పరిమితమవుతున్నట్టుంది..

రోజుకో లక్ష గళార్చన పేరుతో సాగుతున్న అరణ్య రోదనంతా ఈ ఒక్క తీరని కోరిక కోసమేనా?

క్లారిటీ లేని ఉద్యమ ప్రస్థానం జన దైనందిన జీవితాన్ని సంక్షుభితం చేస్తోంది..

రోజుకో వాయిదాతో నెట్టుకొస్తున్న హైకోర్టు వారినీ మేనేజ్ చేసే శక్తులకు జోహార్లు..

ఈ సూపర్ హీరో చివరి మజిలీ ఏ పార్టీలోకో సూచాయగా తెరముందుకు వస్తోంది..

తిరగడం మరచిన బస్సు టైర్లు చివరికి కాలే కడుపుల రబ్బరు వాసనతో కుదేలవుతున్నాయి..

సర్కారీ బళ్ళకు దూరమైన పలక బలపం మాస్టారి గారి కొడుకు కార్పొరేట్ కాన్సెప్ట్ స్కూళ్ళలో భద్రం..

రాజకీయ తోలుబొమ్మలాటల తైతక్కలతో విమానయాన సర్వీసులకు ఢిల్లీ హోటళ్ళకు గిరాకీ బాగుంది..

సిగ్గులేని ముఖాలను గొట్టాలముందు ఊదరగొట్టే రోజు వారీ పాచి డైలాగులను వినలేక మా టీవీ బంద్..

కాళ్ళు బార్లా చాపుకొని ఈజీ చైర్లో వాలి కళ్ళపై తడి గుడ్డ వేసుకొని రిలాక్సవ్వు తమ్మూ..

మరికాసేపట్లో రక్షణ మంత్రి గారూ గృహమంత్రి గారూ ఆసుపత్రినుంచి రిలీజయి వస్తారు…

జయహో………………… ఖాళీలను పూరింపుము….

లగడపాటి + చిరు = వ్యాపారవాదం..


లగడపాటి గారు తిరుపతిలో సభలో మాటాడుతూ చిరు తను కలిసి తెలంగాణా ప్రాంతంలో తిరుగుతామని సవాల్ చేస్తున్నారు. ప్రాంతీయవాదంలో పస లేదని సెలవిచ్చారు. తన సమైక్య వాదంలో వున్న పస వ్యాపార పస కాకపోతే ఈయనకు ఈ రాష్ట్ర ప్రజలపై ఇంత ప్రేమ దేనికేడ్చినట్లు. తన సొంత గ్రిడ్ లలో తయారయిన విద్యుత్ ను బయటకు అమ్ముకుంటూ ఇక్కడి వనరులతో వ్యాపారాలు చేసుకుంటూ కోట్లాది రూపాయలు సంపాదించే యీయన గారికి యిక్కడి వనరుపై ప్రేమా లేక జనంపైనా?

చిరు గారు భారమైన స్టెప్పులు జనం చూడలేకపోతున్నారన్న నిజం తెలిసి మొఖానికి రంగుమాని ప్రజలకు రంగు వేద్దామని బయల్దేరి బామ్మర్థి కోటరీతో సీట్లమ్ముకొని,  తనేదో ఉద్ధరిస్తాడని మోద్దామని బయల్దేరిన మిత్రా, ప్రభాకర్ లాంటి వారు ఈయన గారి లోగుట్టు తెలిసి పారిపోయారు.                                                                  ఏనాడూ పిల్లికి బిచ్చం పెట్టని ఈయన జనాల్ని ఏముద్ధరిస్తాడు అన్నది తొందరగానే గ్రహించిన జనం దూరంగా జరిగారు. దాంతో సొంత గ్రామంలోనే ఓడిపోయి ఏం జేయాలో తెలియక, ఉన్న పరువేదో నిలుపుకుందామని కొత్తగా సమైక్య వాదాన్ని తలకెత్తుకొన్నా ఎవరూ వెంట రాక, ఒంటరిగా అద్దం ముందు నిలబడిపోయాడు.

ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి తొడగొడుతున్నారు. ప్రజల మనోభావాలను, ఉద్వేగాలను రెచ్చగొడితే కాళ్ళు విరుగుతాయి తప్ప మరేమీ కాదన్నది తొందర్లోనే ఎరుకవుతుంది. తమ తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు హైదరాబాదునుండి వెల్లగొడతారేమోనన్న భయంతో యిలా ఉత్తర ప్రగల్భాలు పలుకుతున్నారు.

విద్యార్థులపై ఉక్కుపాదం


ఉస్మానియా యూనివర్శిటీలోని ఆర్ట్స్ విభాగంలోని విద్యార్థులపై నిన్న సాయంత్రమునుండి పోలీసుల రక్కసి దాడిని ప్రజాస్వామిక వాదులు ఖండించాలి. అకారణంగా విద్యార్థినిలపై కూడా లాఠీలతో విరుచుకుపడ్డారు. భాశ్పవాయు ప్రయోగం, రబ్బరు బుల్లెట్ల ప్రయోగం, చివరకు గాలిలో కాల్పులు జరిపారు. విద్యార్థులను రెచ్చగొట్టి రాళ్ళతో దాడి చేసారు. వారు తిరిగి దాడి చేస్తే శత్రువుపైనో, రౌడీమూకలపైనో పడ్డట్లు దాడిచేసారు.

గాయపడ్డవారిని అంబులెన్సులో తరలించేందుకు కూడా అనుమతినివ్వకుండా, మీడియావారిపై కూడా దాడిచేసి  భయానక వాతావరణాన్ని సృష్టించారు.   ఇది కావాలని ప్రశాంతతను చెడగొట్టి శాంతిభద్రతల సమస్యగా మార్చి, విద్యార్థుల గొంతునొక్కే పని. తద్వారా తెలంగాణా వాదనను అణచివేయబూనడం తప్ప మరోటికాదు. తమ ప్రాంత స్వయంపాలనకు నేతృత్వం వహిస్తున్నారన్న అక్కసుతో పాలక పక్షం రాక్షసంగా విరుచుకుపడుతోంది. యూనివర్శిటీ ప్రాంగణాన్ని యుద్ధభూమిగా మారుస్తోంది. ఈ సమయంలో ప్రజలు విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలవాలి.

గుండెలలో గునపాలు…


ఓ సుదీర్ఘ స్వప్నాన్ని కన్న కంటి

రెప్పలు కత్తిరించబడ్డాయి

ఓ దీర్ఘ శ్వాస తరువాత ఉలికిపాటు

ఆశల జడివానల మధ్యలో పిడుగుపాటు

కోట్లాది గుండెలలో ఒక్క గునపం పోటు

నినదించిన గొంతులపై ఉక్కుపాదం

రేపటి సూర్యోదయానికి

నేడే వీడని గ్రహణం

ఎన్నటికీ రాని వసంతంతో

మూగవోయిన కోయిల రెక్కల టప టప

అంతా కౄర వికటాట్టహాసాలే

కానీయండి మీ ఎడతెరపిలేని వికృత దాహార్తి

చివరాఖరుగా ఈ చివర ఓ

చిన్నారి చేతిలోని వడిసెల రాయి గిరిగిరతిరుతున్న

ఝంకారనాదం…

(నిన్నటి విధివిధానాల ప్రకటన విన్నాక)

కలిపిన చేతులు కడవరకూ..ఇదో మహా మానవ హారం

తెలంగాణా ప్రజల ఆకాంక్షల సమాహారం

కలిసిన యీ చేతులు కడవరకూ …

విజయం చేకూరేవరకు విడిపోరాదు!


ఈ స్ఫూర్తి చిరకాలం వర్థిల్లాలి

కలిసిన యీ చేతులగుండా ప్రవహించిన

విద్యుత్ తెలంగాణా తల్లి నుదుట

నక్షత్రమై మెరవాలి!


ఉప్పొంగిన ఈ మానవ సంద్రం

సునామీ కాకముందే

అందరి మదిలో అమృతం వర్షించాలి…

మొయిలీ ఫత్వా వెనక చిత్రగుప్తుడు


రాష్ట్ర పార్టీ ఇంచార్జిగా వై.ఎస్.బతికున్నంతకాలం ఆయనకు అనుకూలంగా కేంద్రంలో చక్రం తిప్పిన వీరప్ప’న్’ మొయిలీ ఆయన మరణానంతరం ముడుపులందక కొంత తగ్గి మరల ఆయన ఆత్మీయ అనుచరుని అడుగుజాడలలో తన ఉనికిని చాటుకునే ప్రయత్నంగా జె.ఏ.సీ,నుండి బయటకు రావాలని, కమిటీలపై మాటాడరాదని ఆంతరంగిక మంత్రి గారు సెలవిచ్చిన దానికి భిన్నంగా ఫత్వా జారీ చేసారు. కానీ దాని వెనకున్న కుట్రపూరిత ఆలోచనను గ్రహించిన తెలంగాణా కాంగీయులు కక్కలేక మింగలేక సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పటికే తెలంగాణా ఉద్యమం ఏదో ఒక నాయకుడి అరుపులకు లొంగనంత దూరం పోయింది. ప్రజల చేతుల్లోకి పోయిన ఉద్యమం నుండి మధ్యలో వెనక్కు మరలితే రేప్పొద్దున ఓట్ల బిచ్చకు ఏ మొఖం పెట్టుకు వెళ్తాం అన్న ధర్మ సందేహంలో పడిపోయారు అధికార గణం. దాంతో ఫత్వా వేడి నిన్నటికన్నా సాయంత్రానికి చల్లారిపోవడం జరిగింది. ఈ గూడుపుఠానీ వెనక వున్నది చిత్రగుప్తుడే అని అర్థమవుతోంది. వ్యాపార సంబంధాలు ఏ పనైనా చేయిస్తాయి. ప్రజలు అప్రమత్తంగా వుండాలి. వీళ్ళ పిలకబట్టి జాడించాలి.

సారూ ఈ మంచు తెరను తొలగించరా?


మొదలు పెట్టిన యుద్ధం పూర్తికాకముందే
ఒరలోంచి  దూచాల్సిన కత్తులు విసిరేయబడుతున్నాయి

బలయిన ఆత్మలు ఇంకా ఉస్మానియా గేటుకు
దుఃఖంతో వేలాడుతున్నాయి

ఏదో యింతమంది వీరులు తెగువతో
తమ సంకెళ్ళను తెంచి వేస్తారన్న కలలు
కల్లలు అవుతుంటే జంపన్న వాగులో
రెండోసారి దుంకినారు ఆ అక్కాచెల్లెల్లు..

యింత అద్దంలా కనబడుతున్న మా బతుకుకు
మరల ఈ కమిటీలేంది సారూ…
కొలతల లెక్కలు వేయడానికా?
లేక మరల మా బొక్కలిరగదీయడానికా?

ఈ మంచు తెరను మీ ధగధగలాడే టూత్ పేస్టు చిరునవ్వుల

యికిలింపులమాటునుండి తొలగించర సారూ…