తొడ చరిచిన విజయనగరం..


clock tower-viziznagaram 1
గత ఆరు రోజులుగా విజయనగరం కడుపులో దాచుకున్న బిడ్డనుకున్న వాడే కాలితో తంతే తొడ చరిచి నిలబడింది ఈ రోజు. కళ్ళ ముందు నీవు ఆక్రమించుకుంటూ పోతున్న తన భాగాలన్నీ పోయినా బాధపడని విజయనగరం నువ్వు పాలు తాగే రొమ్మునే గుద్దుతా వుంటే చూస్తూ వూరుకోలేక మంటలతో సమాధానం చెప్పింది. కావిడితో సారా అమ్ముకొని పెరిగిన బాబు వారసుడు ఈ రోజు ఇంతింతై అంతై రక్కసిలా మీదపడి పీక నులుముతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది. పసివాడని పిల్లలపై కంట్లో కారం చల్లి చావు దెబ్బలు కొట్టిన వాడి పునాదులు పెకిలించే గునపంగా మారింది.

ఇదంతా ఇక్కడ పోలీసు బాసుగా పని చేసి ప్రమోషనిచ్చి పంపి అదుపు చేయమని అంటే వారికి మేమంతా దొంగలుగా, సంఘ విద్రోహ శక్తులుగా కనబడటంలో ఆశ్చర్యం లేదు. గాలిని బంధించి ఊపిరాడకుండా శక్తిని హరించేద్దామని విఱవీగే వాడికి తొడ చరిచి ఎదురొడ్డి సవాల్ విసురుతోంది మా గున్నమ్మ వారసురాలు.

పాలపేకెట్టు 50 రూపాయలు గుడ్డు 10 రూపాయలుకు కొనుక్కునే స్థితికి నెట్టి ఆకలితో మండించి అదుపు చేద్దామని చూస్తున్నాడు.

బావ్ నువ్విప్పుడు మా తూరుపు కాపోడివి కాదురా బావ్. మాకెప్పుడో తెలిసిపోనాది. నీ మూతివీడని ఇసపు నవ్వులో డబ్బు దర్పంతో కాలెగరేసే దొరతనంతో నువ్వో ఇసప్పురుగువని. నువ్వింక నీ నోట్ల కట్టలలో కాలి పోవాలి తప్ప నీకు మా కంట తడి దూరమైపోనాది.

ప్రకటనలు

వీళ్ళంతా ప్రజలే మరి??


నిన్న జగన్ విడుదల అయిన తరువాత ముప్పావు గంటలోపు చేరుకోవాల్సిన వాడు ఆరు గంటలు రాజు వెడలె అన్నట్టు తన కాన్వాయ్ సాఫీగా తాపీగా పోనిచ్చి సాయంత్రం ఇంటికి చేరుకోవాల్సిన జనాల్ని నానా ఇబ్బందుల పాల్జేసి అదనంగా మరో లీటరు పెట్రోలు ఖర్చుకు గురిచేసిన వైనం ఆయన వెంట పడ్డ ఈ మీడియా హంగామా లైవ్ షోలు చూస్తుంటే జైలు కెళ్ళి రావడంలో ఇంత గొప్పదనముందా అనిపిస్తోంది.

కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అటు ఐ.ఏ.ఎస్. అధికారులను అనారోగ్యాలకు గురి చేసి వారి పరువు ప్రతిష్ట మంటగలిపి వారేదో దొంగలులా ఇన్నాళ్ళు చూపి తప్పని సరి పరిస్థితులలో బలవంతపు సంతకాలు చేయించుకున్న రాజకీయ అధికార రాకాసులను వదిలి పెట్టి వారిని జైళ్ళలో ముగ్గబెడుతు ఏ-1 గా వున్నవాడ్ని బెయిలిచ్చి ఇంత హంగామాగా ఇంటికి సాగనంపిన ప్రభుత్వాధికారులు పోలీసు అధికారులు మీ గులాంగిరికి జోహార్లు. ఇదంతా అధికార దుర్వినియోగం కాదా?

కాబోయే ముఖ్యమంత్రి అంటూ అరుపులు పెడబొబ్బల లైవ్ చూస్తుంటే వీళ్ళంతా ప్రజలే మరి?? వీళ్ళకోసం ఆలోచిస్తూ ఏదో మంచి జరుగుద్ది భవిష్యత్ తరానికి అని
ఆశించడం మన వెఱితనమే కదా?? రాష్ట్రాన్ని ఆర్థికంగా అథఃపాతాళానికి తొక్కిన ఒక రాచకురుపు వెంట ఇంత మందీ మార్బలం వెళ్ళడం ఎంత దౌర్భాగ్యం. ఒక్కో టీవీ ఒక్కో వ్యాఖ్యానంతో బేక్ గ్రౌండ్ మ్యూజిక్ తో జనాల మెదళ్ళను పాలిష్ చేసే పనిలో పడ్డాయి. ఇదా వీటి సామాజిక బాద్యత? వీళ్ళంతా రాజకీయ సామాజిక కుళ్ళును కడిగేయమని మళ్ళీ స్లోగన్స్.

దీనమ్మా బతుకు చీ.. థూ అని రిక్షా రాం బీడీ ముక్క కొరుకుతూ ఊస్తుంటే ఆశ్చర్యమేసింది…

ఖాళీలను పూరింపుము..


ఇంతకీ ఈ ఆరాట పోరాటమంతా హైదరాబాద్ కే పరిమితమవుతున్నట్టుంది..

రోజుకో లక్ష గళార్చన పేరుతో సాగుతున్న అరణ్య రోదనంతా ఈ ఒక్క తీరని కోరిక కోసమేనా?

క్లారిటీ లేని ఉద్యమ ప్రస్థానం జన దైనందిన జీవితాన్ని సంక్షుభితం చేస్తోంది..

రోజుకో వాయిదాతో నెట్టుకొస్తున్న హైకోర్టు వారినీ మేనేజ్ చేసే శక్తులకు జోహార్లు..

ఈ సూపర్ హీరో చివరి మజిలీ ఏ పార్టీలోకో సూచాయగా తెరముందుకు వస్తోంది..

తిరగడం మరచిన బస్సు టైర్లు చివరికి కాలే కడుపుల రబ్బరు వాసనతో కుదేలవుతున్నాయి..

సర్కారీ బళ్ళకు దూరమైన పలక బలపం మాస్టారి గారి కొడుకు కార్పొరేట్ కాన్సెప్ట్ స్కూళ్ళలో భద్రం..

రాజకీయ తోలుబొమ్మలాటల తైతక్కలతో విమానయాన సర్వీసులకు ఢిల్లీ హోటళ్ళకు గిరాకీ బాగుంది..

సిగ్గులేని ముఖాలను గొట్టాలముందు ఊదరగొట్టే రోజు వారీ పాచి డైలాగులను వినలేక మా టీవీ బంద్..

కాళ్ళు బార్లా చాపుకొని ఈజీ చైర్లో వాలి కళ్ళపై తడి గుడ్డ వేసుకొని రిలాక్సవ్వు తమ్మూ..

మరికాసేపట్లో రక్షణ మంత్రి గారూ గృహమంత్రి గారూ ఆసుపత్రినుంచి రిలీజయి వస్తారు…

జయహో………………… ఖాళీలను పూరింపుము….

ఏ మొగుడూ దొరకనప్పుడూ…


ఏ మొగుడూ దొరకనప్పుడు అక్క మొగుడే గతిలా ఈ రాష్ట్రానికి రోజుకో మొగుడొస్తుంటాడు, కాళ్ళూ చేతులూ, కళ్ళు కూడా లేని వికలాంగులులా వాడి చుట్టూ చేరి నవ్వులు చిందిస్తారు. మన ఖర్మకి ఇలాంటి స్థితి దాపురించింది. రోజుకో కొత్త పథకం ప్రకటించి మూడు రోజులకొకసారి ఢిల్లీ పరుగెత్తి తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటి అధికారాన్ని అధిష్టానం కాళ్ళు మొక్కుతూ కాపాడుకుంటేనే సరిపోతొంది. వీళ్ళ వలన జనానికి ఒరిగిందీలేదు.

సామాన్యుడా నీ ఓపికకు వేన వేల వందనాలు..

ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే..


ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్ట కాల్చుకుందుకు నిప్పు తీసుకున్నాడంట ఒకడు. అలా ప్రాణాలు పోతూ ఒకవైపు గంగ ముంచెత్తుతూంటే శవాల దగ్గరున్న డబ్బు కోసం పరుగెత్తే మనుషులు మన మద్య వున్నారు. 5 కోట్ల రూపాయల బాంకు డబ్బు మాయం. అందులో 80 లక్షలు ఒక బాధితుడి మూటలో దొరకడం. కొట్టుకు పోతున్న శవాలను ఒడ్డుకు లాగి ముక్కూ చెవుల బంగారం దోపిడీ.

ఇలా మనిషి అర చేతుల్లో ప్రాణాలు ఉగ్గబట్టుకున్నా పాము నోట్లో వున్న కప్ప కళ్ళెదుట ఈగను నాలుక చాచి మింగిన చందాన మనిషి స్వార్థం బట్ట బయలు కావడం విషాదం.

బాటిల్ మంచినీళ్ళు వంద రూపాయలుకు అమ్మడం, బిస్కట్ పేకెట్ రెండు వందలు, తలదాచుకోవడానికి పూటకు వేల రూపాయలు వసూలు చేయడం మనుషుల వ్యాపార మనస్తత్వానికి పరాకాష్ట,

తెలుగు వాడు మనిషి కానట్టు నెట్టేయడం మన భారతీయ తత్వాన్ని ప్రశ్నించలేదా?

ఆపన్న హస్తాల మద్య రాజకీయ రంగు వేసుకోవడం విషాదం.

మానవత్వమా నీవెక్కడా??kedarnaath

విద్వ్హంసకర అభివృద్ధికి ప్రతిఫలం – హిమవిలయం


Uttarakhand-rescue-AFP

Kedarnath shrine floods _0

Siva_Statue_RAin_PTI

మనిషి ప్రకృతితో పాటు జీవిస్తే అది తనను కాపాడుతుంది. ప్రకృతికి విరుద్ధంగా ఏదో సాధించేసామన్న గర్వంతో వినాశకరమని అంతా చెప్తున్నా వినకుండా విధ్వంసకర అభివృద్ధికి బాటలు వేసుకుంటూ పోతే ఇలా తానున్న కొమ్మనే నరుక్కున్నట్టు తన వినాశనానికే దారితీస్తుంది. కేదారినాథ్, బదరీనాథ్, చార్ దామ్ లలో జరిగిన ప్రళయ గంగా విస్ఫోటనానికి మన గుడ్డి ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలే కారణం. లెక్కకు మిక్కిలి జలవిద్యుత్ ప్రాజెక్టులు కట్టి, నదుల గమనాన్ని మార్చడానికి పర్వత సానువులను తొలచి రక రకాలుగా వాటి గమనాన్ని మార్చడంతోపాటు టూరిజమొక్కటే తమ ఆదాయ వనరుగా అక్కడికి అడ్డూ అదుపూ లేకుండా యాత్రికులను తోలడం కూడా ఈ మానవ వినాశనానికి సజీవ సాక్ష్యం. ఇలాంటి అభివృద్ధి మన వినాశనానికి నాందిగా పర్యావరణ శాస్త్రవేత్తలు, మేధావులు ఎన్ని మార్లు ఎన్ని రకాలుగా చెప్పినా రాబడి ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలే వీటికి బాధ్యత వహించాలి. అంత ఇరుకు రహదారుల మధ్య వేలాది వాహనాలను పోనివ్వడం ముందు చూపులేని ఘోర తప్పిదం. హిమాలయ ప్రాంతంలో ముందుగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు చేయలేదని వింటున్నాం. ఈ శాఖ ఇచ్చే నివేదికలు మామూలు రోజులలోనే సాధారణ ప్రదేశాలలోనే తారుమారు అవుతుంటాయి. అలాంటిది ఇంత ఎత్తైన ప్రదేశాలకు అన్ని వేలమంది యాత్రికులను అనుమతించడం తప్పిదం. ఇలా ఈ ప్రళయానికి మన అత్యాశే కారణం.

ఇలా ప్రకృతి వినాశనానికి కారణభూతమయ్యే అణువిద్యుత్ ప్రాజెక్టులు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డగోలు అనుమతిలిస్తున్న ఈ గుడ్డి ప్రభుత్వాల దాష్టీకాన్ని ఇకనైనా ప్రజలంతా కలిసి ఎదుర్కోక పోతే ఇలాంటి ప్రళయాలు సాధారణమై భారతదేశ చిత్రపటంలో మనిషి లేకుండా పోతాడు. వుంటే గింటే రోగిష్టి మానవులుంటారన్నది సత్యం.

ఈ ఆపదలో చిక్కుకుని మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజెద్దాం.

ఈ ఆపత్సమయంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న త్రివిధ దళాల సైనికులకు వందనం.

ఇక్కడ కూడా రాజకీయ యాత్రలు చేసే నాయకులకు శతకోటి వందనాలు.

టెలిగ్రాం..


teligram
టెలిగ్రాం

టెలిగ్రాం సార్
సార్ టెలిగ్రాం

ఈ పిలుపు మరి వినబడదు
అందుకునేందుకు చేతులు వణకవు

శుభమైన అశుభమైనా
ముందుగా గుండె దడ పుట్టే
ఆ పిలుపు మరి వినబడదు

మూడు ఏభై వసంతాలు దాటి
కట్ కటా కట్ కటా కట్
అంటు డాట్ డాష్ లతో
సుదూర తీరాలు కలిపిన
టెలిగ్రాఫ్ తంత్రులు
మూగబోతున్నాయి

దశాబ్ధాల నిరామయ
సేవలకు స్వస్థి

మా జ్నాపకాల
దొంతరల మధ్య ఒదిగిపోతున్న వేళ
చివరి వీడ్కోలు నీకిది
మిత్రమా…

(జూలై 15నుంచి టెలిగ్రాం సేవలను నిలిపివేస్తున్న వార్త చదివి)

బొగ్గు – సి.బి.ఐ. – జగన్ – ధర్మాన


ప్రపంచంలోనే అతిపెద్ద స్కాంగా అనుమానింపబడుతున్న బొగ్గు స్కాం పై దర్యాప్తు నివేదికను ముందుగా అధికార పార్టీ మంత్రులకు చూపించి ప్రతిపక్షం వారిని ఇరికించే ప్రయత్నాలు చేస్తూ దేశంలో అతిపెద్ద దర్యాప్తు సంస్థ సుప్రీంకోర్టు వారి మొట్టికాయలు తిన్నా తన అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే తీరును సిగ్గు లేకుండా ప్రపంచానికి చాటి చెప్తూ వుంది.

అధికార పార్టీలో వున్న వారిని అరెస్టు చేయాలంటే గడువులిస్తూ వారు తప్పించుకునేందుకు అనుకూలిస్తూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక్క చర్య జరిగినా వారి ఇంటిపై సిబిఐ విరుచుకుపడుతోందనడానికి మొన్న తమిళనాడులో స్టాలిన్ ఇంటిపై జరిగిన దాడి తార్కాణం. ఇలా వ్యక్తుల స్వేచ్చను హరించే కుట్రకు అధికార పార్టీకి ఆయుధంగా మారింది ఈ ప్రభుత్వ శాఖ. ధర్మానకో న్యాయం మోపిదేవికో న్యాయం. జగన్ కో న్యాయం రాజాకో న్యాయం. ఈ పక్షపాత ధోరణి ఖండిద్దాం.

సరబ్ జిత్ పై దాడి – పాక్ కుట్ర


సరబ్జిత్ సింగ్ పై పాకిస్తాన్ జైల్లో దాడి జరిగి ఆయన కోమాలోకి వెళ్ళిపోవడం మెరుగైన వైద్యం కోసం భారత్ కు పంపించమని ప్రాధేయపడ్డా తిరస్కరించడం చూస్తుంటే ఈ దాడి కావాలనే చేసి ఉరి తీస్తే వచ్చే పరిణామాలనుండి తెలివిగా తప్పించుకునేందుకు ఆయనపై తీవ్రంగా దాడి చేసి కొన ఊపిరితో వున్న వాడిని ఆసుపత్రిలో చేర్చడం ద్వారా కసబ్ ఉరికి పాక్ ఇలా పగ తీర్చుకుంటోందనిపిస్తోంది.. కాదంటారా?? మన మీన మేషాలు లెక్కించే ప్రభుత్వం దీనిపై సరిగా స్పందించక పోవడం శోచనీయం.

చట్టాలు భయపెడతాయా??


నిన్న మరల ఢిల్లీలో ఐదేళ్ళ బాలికపై దారుణమైన అత్యాచారం జరిగింది.

ఫిర్యాదు చేయడానికి వెళ్తే పోలీసులు కౌన్సిలింగ్ చేసి తిరిగి వారిని బెదిరించబోయారంట.

మన ప్రధాని గారు బాధ పడ్డారంట.

ఇదీ నిన్నటి వార్త అయిపోయింది అప్పుడే.

నిర్భయ చట్టం తెచ్చాం అని ఆర్భాటంగా ప్రకటనలే తప్ప అందులోనూ తూట్లు పొడిచి తమకనుకూలంగా మార్చుకోగల రాజకీయులు ధనమదాంధులు వున్నారు.

వీళ్ళకి తక్షణ పరిష్కారాలే తప్ప విచారణలు, న్యాయస్థానాలు చట్టాలు భయపెడతాయా??