స్వగతం

సిగ్గు పడడం మావంతు బావ్..


జగన్ ఓదార్పు జాతరను సూసి సిగ్గుపడాలో, ఆనందపడాలో అని మా బొత్సబావ్ ఈ రోజు అనేసినాడని ఇప్పుడే సూసినాన్ బావ్. మరేటంతే, సెప్పనేకపోతున్నాను కాని బావ్ యీళ్ళ యవ్వారమంతా సూసి మనకు మనం సిగ్గుపడిపోతున్నామన్న ఇసయం ఎరుకనేదా బావ్ యీళ్ళకి. ఇలపింటి రాజకీయ రంగులరాట్నం ఎక్కించేసి మనల్ని గిరగిర తిప్పేసి కొడుతున్న యీల ఏసకాలకి మూలనున్న మా నాయనమ్మ దగ్గరినించి అంతా తుపుక్కున కాండ్రించి ఉమ్మేత్తుంటే మా బొత్సబావ్ కొత్తగా సిగ్గుపడిపోతున్నాడంట. ఓర్నాయినో, ఇదేదో కొత్త సినిమా  డవిలాగ్ నాగుంది. బావ్, మనల్ని జూసి జనం సిగ్గుపడుతున్నారన్న యిసయం తమరు ఎంత గభీల్న ఎరిగితే అంత మంచిది బావ్. నేకపోతే జనం మరింత సిగ్గుతో సచ్చిపోతార్ బావ్.

అటు సంద్రబావ్ నాయుడు రాజకీయాల్లో యిలువల్లేవ్ అనీసి తెగ గింజుకుపోతున్నాడ్ బావ్, అది ఎలగుందంటే పెరట్లో పెనక్కి అగ్గెట్టేసి, మునోట అత్తా నా ఒళ్ళు వొణుకుపోతుందే అన్న కోడలు యవ్వారం నాగుంది బావ్.

సీ, దీ… మ్మా రాజకీయాలు, పేపరు తిరగెయ్యనేకపోతున్నాం, టీవీ ఎయ్యనేకపోతున్నాం..

వార్త ఆధారం(దట్స్ తెలుగు)

Are poets perverted?


నాకీ సందేహం ఎప్పటినుంచో వుంది. ఇది కవులను అవమానించాలని కాదు. నేనూ అప్పుడప్పుడు రాస్తుంటాను. కానీ సందేహ నివృత్తి చేసుకుందామని.

కవి మామూలుగా అందరిలా చూడడు, అందరిలా ఆలోచించ లేడు. ఏదో తెలిసీ తెలియని సంఘర్షణ వెన్నంటి వేటాడుతుంటే కాగితంపై అక్షరంగా బలవుతాడు. ఇది కవి ప్రత్యేకత. అదే అదే నాకనిపిస్తుంది ఎందుకిలా అని. ఇది మానసిక దుర్భలత్వమా? ధీరోదాత్తతా? అందరిలా వుండలేనితనమా? ఉక్కపోతను భరించలేనితనాన్ని అందరిలా లౌక్యంగా, కపటంగా దాచుకోలేనితనమా? ………

ఇలా నా సందేహాన్ని మీ ముందుంచాను. మీ జవాబు కోసం… మీకు కోపమొచ్చినా…

లైలా చేసిన మేలు


లైలా ఒక్కమారుగా కోస్తా తీరప్రాంతాన్ని అతలాకుతలం చేసి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసి 3 రాత్రులుగా కంటిమీద కునుకులేకుండా చేసినా  కొన్ని మంచి కార్యాలు కూడా చేసింది….

అవిః

1. ఎన్నడూ ఎరగని అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయిన కాలంగా చెప్పుకుంటున్న వేళ, వడదెబ్బలకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 80మందికి పైగా మరణాలు సంభవించి జనం అట్టుడుకుతున్న వేళ ఒక్కసారిగా వాతావరణం చల్లబరిచింది.

2. అలాగే చిరు పోలవరం యాత్ర, చంద్రబాబు రైతు యాత్ర, రోశయ్య ప్రజాపథంలతో వేడెక్కిన రాజకీయ వాతావరణంకు తోడుగా యువరాజ వారి వరంగల్ ఓదార్పు యాత్రతో ప్రధాన రాజకీయ పక్షాలులోనే చీలిక ఏర్పడే విధంగా సాగిన తీవ్ర వాగ్యుద్ధాలతో ఒక్కసారిగా 50 డిగ్రీలు దాటిన రాజకీయ వేడి నిట్టూర్పులను కాగల కార్యం గంధర్వులు తీర్చారన్నట్లుగా లైలా ఒక్క విసురుతో వాయిదా వేయించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

3. గొంతెడ్డి మంచినీళ్ళకోసం మైళ్ళకొద్దీ దూరం నడిచి వస్తున్న ఆడపడుచులకు కాసింత ఓదార్పు నిచ్చింది లైలా. కాస్తా బోర్లలో, బావులలో నీటి ఊట చేరితే అదే పది వేలు. రక్షిత మంచినీటి పథకాలకంటే తాగుడు పథకాలకే ప్రాధాన్యమిస్తున్న పాలక, అధికార గణం నిర్లక్ష్య, నిర్లజ్జ వైఖరికి ప్రకృతిమాత కన్నెఱ చేసి తన ఆడపడుచుల ఆవేదనను తీర్చిందిలా..

4. అధికారగణం అక్టోబరు, నవంబరు నెలల వరకు ఆర్తిగా ఎప్పుడు తుఫానులు వస్తాయా, ఆ సాయంపేరుతో ఆడిట్ లేని నిధులను మింగేద్దామా అని ఎదురుచూసే శ్రమ లేకుండా మేనెలలోనే వారిని కనికరించిందీ లైలా…

ఇంకా ఏమైనా వుంటే పంచుకోండి…

ఆదిమరాగంనిన్నటి ఎత్తైన కొండ పైకి ఆయాసపడుతూ

సాగిన నా ప్రయాణపు బడలిక

నీ వెన్నెలంటి  నవ్వుతో మాయమయ్యింది

నీ స్వచ్చమైన మమకారం

ఇవాల్టికివాల ఈ పల్లపు

ప్రాంతంలో సరుకుగా మారిన

సత్యం నీకు తెలియకపోవడమే

నీ ఆరోగ్య రహస్యం


తొలిసారిగా చూస్తున్నా

ఈ హడావిడీ జీవన గమనంలో

ఆకురాలిన కాలంలో

లేలేత చిగురు మృధుత్వాన్ని

జలపాతాల హోరులో సన్నని

నీ గొంతులోంచి ఆదిమ రాగాన్ని

నీ నుదుటి ముడతల మధ్య దాగిన

చారిత్రక సత్యాన్ని….


(ఆదివాసీ గూడెంలో ఎదురైన గిరిజన వారసత్వాన్ని గుర్తుచేసుకుంటూ)

అంతర్ముఖం


ఒంటరితనం మనిషిని ఏదేదో చేస్తుందన్నది అందరికీ అనుభవైకమే అనుకుంటా?

సమూహంలో కూడా ఒంటరితనం ఫీలవుతుంటాను నేను. అందరితో మాటాడుతున్నట్లే వున్నా అదేదో జారుడుబల్లమీద జారిపోతున్నట్లుగానే వుంటుంది. ఎదురుగా వున్నవాళ్ళలో మనలా ఆలోచించే వాళ్ళు లేకపోవడం, మానసికంగా దగ్గరితనం కలిగినవారు వుండకపోవడం ఈ వెలితికి కారణంగా ప్రతి క్షణం అనిపిస్తుంది. కానీ ఏవో మాటల్లో పడి కొద్ది సేపు అలా బయటపడినా మరల అంతర్ముఖుడినయిపోతుంటాను. ఇది చదువుకున్న రోజుల నుండి తక్కువగా వుండేది.  స్నేహితులు కూడా అతితక్కువమందిగానే వుండి కొన్ని అంశాలలోనే దగ్గరితనం వుండడంతో  మరల ప్యూపా దశకు చేరేవాడిని. అలాగని నాతో స్నేహం చేసేవాళ్ళు మరిచిపోయేవాళ్ళుకాదు. వారికి నాతో మాటాడడం రిలీఫ్ గా ఫీలవుతున్నాం అనేవారు. కానీ నాకు ఆ ఫీల్ కలగలేదు.

వివాహితుడనయినా, పిల్లలు మరల చదువులకు పై వూళ్ళకుపోవడంతో మరల అది ఎక్కువయింది. దానినుండి బయటపడడానికి శక్తికి మించినదయినా ఇలా ఈ అంతర్జాలలోకంలో నా మనసుకు నచ్చిన వాక్యాలను వెతుక్కుంటూ గడిపేస్తున్నా. అయినా మరల ఏదో గిల్టీ ఫీలింగ్ వెంటాడుతుంటుంది.  ఏమీ చేయలేకపోతున్నామే అని మదనపడడమే. మరల ఉపకారం పొందినవారు చేసిన ద్రోహం గుర్తొచ్చి అది కూడా మంచిది కాదన్న అభిప్రాయం ఏర్పడింది. అయినా చేతనయినంతలో మంచి చేయడానికే మొగ్గు చూపుతుంటాను. ఎవరికైనా కష్టం కలిగితే ఓర్చుకోలేనితనం (ఇది గొప్పకోసంకాదు). వెంటనే స్పందిస్తాను. కానీ అది ఒక్కోసారి నాకే అపకారంగా మారుతుంటుంది.  అయినా సగటు మానవుడిగా బయటపడలేకపోతున్నా.  ఈ బలహీనతవలన ఎదుటివారికి చేతకాని దద్దమ్మలా, అమాయకుడిలా కనిపిస్తుంటాను.  వెటకారమాడేవాళ్ళని అలా చూస్తూ వుండిపోతుంటాను.  అది వారి తెలివితక్కువతనమేలే అని నన్ను నేను సమర్థించుకుంటాను. కానీ మరల నాలో మదనం మొదలు. వెంటనే నువ్వెందుకు రియాక్ట్ కాలేకపోయావు అని. వదిలేయిలే అని కొద్దిసేపు కనులు మూసుకుంటాను.  ఇది చేతకానితనమా?

అందరిలా తుళ్ళుతూ తిరగలేనితనం ఎలా ఒంటబట్టిందో? ఇంక మారదేమో? మా అమ్మ అంటూ వుంటుంది ‘పుట్టుకతో వచ్చింది పుడకలతోనే పోతుందిరా’ అని. నిజమేనేమో.