స్మృతిలో

టెలిగ్రాం..


teligram
టెలిగ్రాం

టెలిగ్రాం సార్
సార్ టెలిగ్రాం

ఈ పిలుపు మరి వినబడదు
అందుకునేందుకు చేతులు వణకవు

శుభమైన అశుభమైనా
ముందుగా గుండె దడ పుట్టే
ఆ పిలుపు మరి వినబడదు

మూడు ఏభై వసంతాలు దాటి
కట్ కటా కట్ కటా కట్
అంటు డాట్ డాష్ లతో
సుదూర తీరాలు కలిపిన
టెలిగ్రాఫ్ తంత్రులు
మూగబోతున్నాయి

దశాబ్ధాల నిరామయ
సేవలకు స్వస్థి

మా జ్నాపకాల
దొంతరల మధ్య ఒదిగిపోతున్న వేళ
చివరి వీడ్కోలు నీకిది
మిత్రమా…

(జూలై 15నుంచి టెలిగ్రాం సేవలను నిలిపివేస్తున్న వార్త చదివి)

అల్లూరి వారసులేనా?


అల్లూరి ఈ పేరు వింటేనే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. నరాలలో లావా ప్రవహిస్తుంది. అన్యాయం పట్ల తీవ్రమైన ఆగ్రహం కలుగుతుంది. తను పూరించిన విప్లవ శంఖారావం చెవులలో గింగుర్లెత్తుతుంది. తను పంపిన మిరపకాయ టపా ఘాటు నేటికీ పరిమళిస్తుంది. తను ఎత్తిపట్టిన విల్లు నాటి గాండీరావాన్ని తలపిస్తుంది. తన రూపమే ఒక ఉత్తేజం. నేటికీ తెలుగు వారి మదిలో ఓ గొప్ప ధీరోదాత్తత కలిగిన విప్లవ యోధుడిగా చిరస్మరణీయుడయిన విప్లవ తేజం, స్ఫూర్తి. ఆయన మార్గంలో లక్షలాది మంది గిరిజనులు నేటికీ పోరాట మార్గంలో వున్నారు. తమ ఉనికికి ముప్పు తెస్తున్న రాజ్యానికి వ్యతిరేకంగా నిజమైన అవతార్ పోరాటాన్ని చేస్తున్నారు. 

అలాంటిది నిన్న ఆయన 86 వ వర్థంతి సందర్భంగా బూరుగుపూడిలో జరిగిన కార్యక్రమంలో ఆయన సోదరుల కుమారులు, కుమార్తెలు, ఇతర కుటుంబ సభ్యులు తమకు ఆయన వారసులుగా ప్రభుత్వం ఆదరించడం లేదని వాపోవడం సిగ్గుచేటు. వై.ఎస్.ఇస్తామన్న లక్ష రూపాయల విరాళం అందలేదని ఆవేదన వ్యక్తం చేయడం ఆయనను అవమానించడమే. ఆయన పోరాట స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధం. ఆయనకు వారసులమని చెప్పుకొని, ప్రభుత్వాన్ని వేడుకోవడం భావ్యంకాదు. సామాన్యుని నడ్డివిరుస్తూ, ఏ ఆదివాసీ తెగల స్వయంపాలన కోసమైతే సీతారామరాజు పోరాడారో ఆ ఆదివాసీ ప్రజలపై తీవ్రమైన దాడులు చేస్తూ, అత్యాచారాలు చేస్తూ, సహజ సంపదను హరిస్తూ, వారిని నిర్వాసితులను చేస్తూ, సాంస్కృతికంగా అణచివేస్తూ మొత్తంగా వారిని వారి భూభాగం నుండి తరిమే కార్యక్రమాన్ని అమలు చేస్తున్న రాజ్యం మోచేతి నీళ్ళకు ఆశ పడటం ఆత్మహత్యాసదృశ్యం.

యిది ముమ్మాటికి ఆయన పోరాట  వారసత్వానికి అవమానం.

నవ్వుతెరల మాటున దాచుకున్న విషాదం


నవ్వుతెరల మాటున దాచుకున్న విషాదం

(ప్రపంచ ప్రఖ్యాత నటుడు చార్లీ చాప్లిన్ జయంతి సందర్భంగా ఆయనకు యిదే నా నివాళి..)