సోంపేట

ఉత్తరాంధ్ర ఉసురు తీస్తున్న బొగ్గు కుంపట్లు..


బొగ్గు కుంపటి

ప్లాంటు చుట్టూ నిర్మిస్తున్న గట్టు

ఈ రోజు కాకరాపల్లి ధర్మల్ ప్రోజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న పల్లె ప్రజలపై పోలీసు కాల్పులలో ఇద్దరు మరణించారు. బీల ప్రాంతంలో నిర్మిస్తున్న ఈ ప్లాంటు వలన మొత్తం ఆ ప్రాంతమంతా జలమయమై ప్రజలు కూడూ గూడుకు దూరమైపోతున్నందుకు నిరసనగా చేపట్టిన ఉద్యమాన్ని అణచివేయడానికి శతృ దేశంపై దండయాత్రకు వెళ్ళినట్లుగా వందలాదిమంది పోలీసులను మోహరించి భయభ్రాంతులను చేస్తున్నా ప్రజలకు చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవడంతో గత్యంతరం లేక తిరగబడుతున్న వారిపై సాయుధ మూకలు కాల్పులు జరపడం, ఈ కాల్పులలో మరణించిన వారిని ఆకాశలక్కవరం గ్రామానికి చెందిన నాగేశ్వర రావు, బీరపువానిపేట గ్రామానికి చెందిన ఎర్రయ్యలుగా గుర్తించారు. అనేక మంది తీవ్ర గాయాలకు గురయ్యారు. పోలీసు ఫైరింగ్ తో వారి గుడిసెలన్నీ తగలబడుతున్నాయి.

ఇంతగా ప్రజలు తిరగబడుతున్నా ప్రైవేటు కంపెనీలకు అమ్ముడు పోయిన పాలక వర్గం వారి విన్నపాలను వినేందుకు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. గత ఆరు నెలలుగా వడ్డితాండ్ర గ్రామస్తులు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా కనీసం స్పందించలేదు. ఆ ప్లాంటు చుట్టూ నిర్మించిన గట్టు వలన వందలాది ఎకరాల వరి పంట మునిగిపోయింది. ఆ ఫోటోలతో కూడిన పోస్ట్ గతంలో ప్రత్యక్ష్జంగా చూసి ఈ బ్లాగులో వుంచాను. ఎంతసేపూ వారికి మద్ధతుగా ఎవరెవరు వస్తున్నారు, ప్రతిదినం ఎవరు కూచుంటున్నారు అన్న విషయ సేకరణ పట్ల వున్న ఆసక్తి తప్ప వారి గోడును వినే నాధుడు లేకపోవడం, మునిగిపోతున్న తమ బతుకులను కాపాడుకోవడానికి తిరగబడ్డం తప్ప ప్రత్యామ్నాయం లేకపోయిన ఆ మత్స్యకార, సన్నకారు రైతు కుటుంబాల ప్రాణాలను తీయడం ఎంతవరకు సమంజసం. ఇలా ప్రజల ప్రాణాలను హరించి ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు?, ఇంత ఘోరమైన నీచమైన పనులు చేస్తూ ప్రజల పట్ల బాధ్యతలేని పాలకులు తమ ఆస్తులను కూడబెట్టుకోవడానికి అధికార ప్రతిపక్ష నాయకులు ఒకటై పోయారన్న చేదు నిజం ఇక్కడ సత్యదూరం కాదు. ఇక్కడ నిర్మిస్తున్న ప్రోజెక్టు ప్రతిపక్ష భారీ విగ్రహానిదేనన్న సత్యం అందరికీ తెలుసు. వీడు మైకు దొరికితే గొంతు చించుకొని అవినీతి గురించి మాటాడుతాడు ముద్ద ముద్దగా. ఇక్కడి జనం నోట్లో మట్టి గొట్టడానికి తయారైన వీళ్ళని ఇలాగే వదిలేస్తే ఉత్తరాంధ్ర బొగ్గుకాక తప్పదు. దీనిని ప్రజాస్వామ్య వాదులు, మేధావులు తప్పక ఖండించి ప్రజల పక్షాన నిలిచి పోరాడాలని కోరుకుంటున్నాం..

వార్తనిక్కడ చదవండి

సోంపేట డాక్టర్ గారి ఆసుపత్రిలో బాంబు పేలుడుసోంపేట థర్మల్ పవర్ ప్లాంట్ కు వ్యతిరేకంగా స్థానిక ప్రజలలో చైతన్యాన్ని కలిగించి, పర్యావరణ పరిరక్షణ సమితిని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీల అండ లేకుండా ప్రజలను కూడగట్టి ఉద్యమాన్ని చేపట్టిన డా.వై.కృష్ణమూర్తిగారి ఆసుపత్రి రెండో అంతస్తులో నిన్న బాంబు పేలుడు సంభవించింది. ఎవరికీ ప్రాణాపాయం లేకపోయినా ఆ సమయంలో డాక్టరుగారు వైద్యం అందిస్తు వున్నారు. ఆ పేలుడువలన ఆసుపత్రి టాయిలెట్స్, ఓ గది దెబ్బతిన్నాయి. యిలా ప్రజలను చైతన్యం చేసే వారిపై దాడి చేయడానికి ఉపక్రమిస్తున్నారంటే వీళ్ళు ఎంతకైనా తెగించి ఫ్యాక్టరీ వాడి కొమ్ము కాస్తున్నారని అర్థమవుతోంది. ప్రజలంతా నేడు స్వచ్చందంగా బంద్ పాటించారు. స్థానిక కాంగ్రెస్ నాయకునిపై అనుమానముందని డాక్టరుగారు రిపోర్ట్ యిచ్చారు. డాక్టరు గారిని భయపెట్టడం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చొచ్చునన్న భ్రమలలో వున్నారు. సోంపేట కాల్పుల సంఘటన జరిగిన రోజు కూడా పోలీసులు, NCC గూండాలు ఆసుపత్రిపై దాడి చేసి, రోగులను కూడా కొట్టారు. ఐనా ప్రజల సహకారంతో డాక్టరుగారు ధైర్యంగా నిలబడ్డారు. ఆయన చేస్తున్న కృషికి, మొక్కవోని ధైర్యానికి మనమంతా చేయూతనివ్వాలని కోరుకుంటూ..

డాక్టర్ గారి సెల్ నెం.ః9440347548, H.No.08947 234588

http://ibnlive.in.com/generalnewsfeed/news/bandh-in-sompeta-to-protest-explosion-at-nursing-home/347214.html
http://expressbuzz.com/states/andhrapradesh/blast-rocks-sompeta-whistleblower%E2%80%99s-hospital/209307.html

సోంపేట దారిలో..


వడ్డితాండ్ర వద్ద ధర్నాచేస్తున్న వేదిక


బీలమధ్యలో నిర్మాణమవుతున్న ప్లాంటు
సైబీరియా పక్శుల విహారకేంద్రం ముఖద్వారం


ఈ రోజు సంతబొమ్మాలి మండలం కాకరాపల్లి ప్రాంతంలో నిర్మాణమవుతున్న థర్మల్ పవర్ ప్రోజెక్టు ప్రాంతాన్ని పరిశీలించడానికి తోటి ప్రజా సంఘాలతో కలిసి వెళ్ళాం. ఆ ప్రాంతానికి దగ్గర గత పదిహేను దినాలుగా మత్స్యకార కుటుంబాలు ధర్నా చేస్తున్నాయి. వారిని భయపెట్టజూడడానికి పోలీసు వాహనాలు అలా తిరుగాడుతూనే వున్నాయి. వచ్చి ఫోటోలు తీయడం, వారికి ఏదో ఒక మాట విసురుతూ వారిని రెచ్చగొట్టజూస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు ఇప్పటికి ఈ వేసవిలో రెండు వందల ట్రాక్టర్ల ద్వారా రోజుల తరబడి ఆ చుట్టుపక్కల చెరువులనుండి, ఎత్తు పొలాలనుండి పెరిగిన మన్నుతో ప్రోజెక్టు చుట్టు పోసిన గట్టు వలన బీల నుండి సముద్రంలోకి చేరాల్సిన నీరు ఆ చుట్టుపక్కల వందల ఎకరాల ప్రాంతాన్ని, పంట పొలాలను ముంచి వేసింది. ఇప్పుడున్న గట్టు సుమారు ఐదారు అడుగులకే ఇలా అయితే తరువాత్తరువాత ఏమి జరుగుతుందోనని చుట్టూ వున్న గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పొలాలను మాయ మాటలతో అమ్మివేయించిన రాజకీయ దళారులు ఇప్పుడు తప్పుకు తిరుగుతున్నారని, తమ భవిష్యత్ ఏమవుతుందోనని తీవ్ర భయానికి గురవుతున్నారు. అసలు బీల ప్రాంతాన్ని పోరంబోకుగా, మెట్టు ప్రాంతంగా రెవెన్యూ అధికారులు ఎలా రిపోర్టునిచ్చారో ఆశ్చర్యానికి గురిచేస్తుందెవరికైనా. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు నెమ్మదిగా నడుస్తున్నాయి. తమ డిమాండును అంగీకరించి నిలిపివేయక పోతే మాదీ సోంపేట దారి కాకతప్పదని ప్రజలు ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈ ప్రాంతానికి అతి దగ్గర్లో వున్న సైబీరియా పక్షుల విహార కేంద్రం కనుమరుగుకాక తప్పదు. బీలలో దొరికే చేపలాహారంగ జీవిస్తాయి ఈ పక్షులు. బీలను బొగ్గు బీడుగా మార్చి అటు పంటపొలాలకు నీరందక, మత్స్య సంపద నాశనంకావడం, చుట్టుపక్కల ప్రాంతం ఎడారిగా మారితే ఈ ప్రజలకు దిక్కెవరు? ఈ వినాశకర అభివృద్ధి ఎవరికోసం?ప్రజల పట్ల ఇంత నిర్దయగా పాలకవర్గం వ్యవహరించడాన్ని అడ్డుకొనేందుకు పర్యావరణవాదులు, ప్రజాస్వామ్య మేధావి వర్గం కదలిరావాల్సిన అవసరం ఎంతైనా వుంది.
మొత్తం ఫోటోలను ఈ లింక్ లో చూడొచ్చు..

Thermal Power Projects planted places

నెత్తుటి తడి ఆరకముందే..సోంపెటలో జరిగిన కాల్పుల సంఘటన నుండి ప్రజలు తేరుకొనకముందే పాలక వర్గం థర్మల్ ప్రాజెక్టులకు అనుమతి కొరకు మంత్రివర్గ ఉప సంఘాన్ని నియమించింది. దీనిని కోరిన (అ)ధర్మాన ప్రసాద్ తనను మాత్రం ఈ ఉపసంఘంలో వేయొద్దని తప్పించుకొని వెనక నుండి మంత్రాంగం సాగించడానికి ముందుకు వచ్చాడు.

అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ప్రజల నిరసన వెనక ప్రతిపక్షాల కుట్ర వుందని ఉక్రోశం వెళ్ళగక్కుతున్నారు. కేంద్ర పర్యావరణ నిపుణులు పర్యటించి అక్కడ వున్నవి సారవంతమైన వ్యవసాయ భూములని, విలువైన నీటి నిల్వలు కలిగిన బీల భూములని, వాటిని ధ్వంసం చేయడం వలన మనిషి మనుగడకే ప్రమాదమని రిపోర్ట్ ఇచ్చినాయి. మరి ఇవేవీ పట్టనట్లు, తమ పెట్టుబడులకే ప్రాధాన్యతనిస్తూ ప్రజల నిరసనను తక్కువ చేసి చూపడానికి ప్రయత్నిస్తున్నారు.

ఒక్క థర్మల్ ప్రాజెక్టులు నెలకొల్పడమే అభివృద్ధికి నమూనానా? ఇవేమీ లక్షలాదిమందికి ఉపాథి కల్పించే పరిశ్రమలా? మరి వీటిని స్థాపించడం వలన ఎవరికి ఉపయోగం? దీనిలో ధర్మాన వాటా ఎంతో తేల్చాలి. ఎంతమంది చచ్చినా వీటిని నెలకొల్పుతానని భీషణ ప్రతిజ్నలు చేయడంలో ఆంతర్యమేమిటో? ఒక్కసారిగా వీళ్ళకి ఉత్తరాంధ్ర మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో తేల్చాల్సిన అవసరం వుంది?

నేటికి ఒక్క మంత్రి కూడా చనిపోయిన వారిని పరామర్శించే సాహసం చేయలేక పోయాడు. గత సం.కాలం నుండి ప్రజలు స్వచ్చందంగా చేస్తున్న నిరసనల వెనక రాజకీయ ప్రోద్భలం వుందనడం కుట్ర. అంత పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైన ప్రాంతాన్ని ముఖ్యమంత్రి కానీ, హోం మంత్రి కానీ సందర్శించలేదంటే వీళ్ళకి ఉత్తరాంధ్రపై వున్న ప్రేమ ఏపాటిదో తెలుస్తోంది. మంత్రులంతా ఎవడి ప్రాంతానికి వాడే పరిమితమయి పోయారు. తమ పదవులను కాపాడుకోవడంలో వున్న శ్రద్ధ ప్రజల ఆకాంక్షలను, అవసరాలను తెలుసుకోవడంలో లేకపోయింది. నెపం ఎవడి మీదకో ఒకడి మీదకి నెట్టి వేయడం తప్ప మరోటి కాదు.

కాల్పులలో మరణించిన వారి నెత్తుటి తడి ఆరకముందే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరం. ప్రజల సహనాన్ని పరీక్షిస్తే పరిణామాలు వేరే మార్గం పట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు..

ఉద్యమాల వనంరా…


అదిగదిగో ఉద్దానం..

ఉద్దానం కాదురా

ఉద్యమాల వనంరా…

ఈ పాట ఇంకా సజీవంగానే వుంది. సోంపేట ఉద్దానంలో భాగమే. మొన్నటి వరకు పాలకుల గుండెల్లో రైళ్ళు పరుగెత్తించిన పోరాటాల పురిటిగడ్డ. జమీందారీ పాలకులను ఎదిరించి పోరాడిన పోరుగడ్డ. ఉద్యమం వారికి ఉగ్గుపాలతో పెట్టిన విద్య. ఉప్పెనకు ఎదురొడ్డే గుండె ధైర్యం కలవారు.

కోస్టల్ కారిడార్ పేరిట నెల్లూరు నుండి ఇచ్చాపురం వరకు వున్న 1000 కి.మీ. తీర ప్రాంతాన్ని ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పనంగా దానం చేయబూనిన పాలకులు ఇక్కడి ప్రజల అభిప్రాయాలను గౌరవించాల్సిన కనీస ప్రజాస్వామిక దృక్పధాన్ని విస్మరించారు. ఒకే ప్రాంతంలో ఉత్తరాంధ్రలో 10 వరకు థర్మల్ ప్లాంటులు అవి కూడా వ్యాపార నిమిత్తం నిర్మించబూనడం, అలాగే రణస్థలం దగ్గర అణు విద్యుత్ ప్లాంటు నిర్మాణం చేబూనడం ఎంతవరకు సమంజసం?

ఉత్తరాంధ్ర ప్రజలు అంబలి గాళ్ళు, వారేమి చేస్తారులే, వారి నాయకులు మన కాలికింద చెప్పులై వున్నారు కదా అన్న ఫాసిస్టు ఆలోచనతో తప్పుడు అవగాహనతో ఈ ప్రాంత వినాశనానికి పూనుకున్నారు. బీల ప్రాంతమంతా సారవంతమైన భూములతో, నీటి వనరులతో, కొబ్బరి చెట్లతో గోదావరి తీర ప్రాంతాన్ని తలపించే వ్యవసాయ భూములతో పచ్చగా కళ కళలాడే ప్రాంతం. అలాగే తీరప్రాంతం అంతా మత్స్య సంపదతో నిండి వేలాది మంది మత్స్యకార కుటుంబాలు ఆధారపడిన జీవగడ్డ. అటువంటి ప్రాణాధారమైన ప్రాంతంపై ప్రజల అమాయకత్వాన్ని సొమ్ముచేసుకుందామన్న కుటిల ఆలోచనతో ఈ ప్రాంతాన్ని కబళించ చూడడం మూర్ఖత్వం.

ఉద్దానం ప్రాంత ప్రజలు ఎంత సాధారణంగా సౌమ్యంగా జీవనం సాగిస్తారో, తెగిస్తే ఉవ్వెత్తున ఉప్పెనలా విరుచుకుపడగలరని ఇక్కడి చరిత్ర తెలిసిన వారికి అవగతమౌతుంది. కొన్ని నెలలుగా ఈ ప్లాంట్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్వచ్చందంగా ఏ రాజకీయ పార్టీ నేతృత్వంలో లేకుండానే గాంధేయ మార్గంలో తమ వ్యతిరేకతను తెలియజేస్తూ నిరవధిక నిరాహార దీక్షలు చేస్తున్నారు. తమ ఉనికికి ముప్పు వస్తుందని గ్రహించిన కొన్ని రాజకీయ పార్టీల నేతలు వారికి మద్ధతుగా మాటాడారు.

ఇటీవలే నర్మదా బచావో ఆందోళన్ నాయకురాలు, ప్రముహ పర్యావరణ వేత్త మేధాపాట్కర్ కూడా సందర్శించి వీరి ఆందోళనకు మద్ధతు పలికి, ప్రాజెక్టుల నిర్మాణం వలన ఈ ప్రాంతం ఎడారిగా మారిపోతుందని, లక్షలాది ప్రజలు నిర్వాసితులౌతారని, కావున వీటిని ఉపసంహరించుకోవాలని విజ్నప్తి చేసారు.

దీంతో ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు మద్ధతుగా వేలాది పోలీసు బలగాలను తరలించి అక్కడ నిరాహార దీక్షా శిబిరాలను తొలగించే ప్రయత్నం చేసింది. అలాగే నిన్నటికి నాగార్జున కన్స్ట్రక్షన్స్ వారు చేపట్టిన నిర్మాణకార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వచ్చిన నిరాయుధులైన ప్రజలపై కంపెనీ ప్రైవేటు గూండాలతో పాటు 3000 మంది సాయుధ పోలీసులను వారిపైకి ఉసిగొల్పి నలుగురు మత్స్యకారుల ప్రాణాలు తీసారు.

అలాగే ఇక్కడి ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉన్న డా.రామారావుగారి క్లినిక్ పై దాడి చేసి, రోగులను తరిమి వేసారు. సమీప గ్రామాలపై పడి ప్రజలను చితకబాదుతున్నారు.

ఇదంతా చూస్తుంటే మళ్ళీ శ్రీకాకుళం మొదలయ్యే క్రమానికి ప్రభుత్వమే ప్రజలను తోస్తుందనిపిస్తుంది. ఏమీ తెలీనట్లు మాట్లాడుతున్న ముఖ్యమంత్రిగారు, పోలీసులను వెనకేసుకొస్తున్న హోంమంత్రిగారి మాటలు తీవ్ర వేదనకు లోనైన ప్రజలకు పుండుమీద కారం చల్లినట్లుగా వున్నాయి.

వేల ఎకరాల పంట భూములను, తీర ప్రాంతాన్ని నాశనం చేసే థర్మల్ ప్లాంట్ల వలన ఎవరికి ఉపయోగం? అక్కడ ఉత్తత్తైన విద్యుత్ లో ఒక్క యూనిట్ కూడా ప్రభుత్వానికి చెందదు. మరి వారికి ఇంత చౌకగా భూములను కట్టబెట్టి, అనుమతులే లేని వారికి వత్తాసుగా నిలబడి ప్రజల ప్రాణాలను హరించే వీరిని ఏమనాలి?

మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే ఉద్దానం ఒట్టి బీల ప్రాంతమే కాదు ఉద్యామాల వనం..