సినిమా రివ్యూ

మన టాకీ సినిమాకు 80 ఏళ్ళు


నేటికి 80 ఏళ్ళ క్రితం మన మొదటి టాకీ సినిమా ఆలం ఆరా రిలీజయ్యింది. నాటి సాంకేతిక విలువలతో మనకు మొదటి టాకీ సినిమాను అందించిన నాటి సాంకేతిక నిపుణులను మరొక్కమారు తలచుకొని సినిమా ఇంత పురోభివృద్ధి చెందడానికి వేసిన ఆ తొలి అడుగును గుర్తుచేసుకుందాం..

ఈ లింక్ లో మరిన్ని వివరాలు

రక్తచరిత్ర2 – సాఫీగా చప్పగా ఓ సందేశంతో…


ఎంతో ఉద్వేగానికి లోనవుతూ ఏం చెప్పాడోనని ఆశగా ఈ రోజునుండి మా ఊళ్ళో రిలీజైన మోర్నింగ్ షోకు వెళ్ళాను. కానీ సినిమాలో కాంట్రవర్సీగా చెప్పుకోదగ్గ సీను లేకపోవడం, సమకాలీన రాజకీయ నాయకులెవరినీ ప్రొజెక్ట్ చేయకపోవడంతో సాదాసీదాగా, చప్పగా, సాఫీగా సాగిపోయింది.

చెప్పుకోదగ్గ విషయమేమంటే వివేక్ ఒబెరాయ్ కు పోటీగా సూర్య నటించాడు. మొదటి సీనులోనే మందుపాతరతో ఎంటరై అక్కడ చూపిన భావాలు ఓ యువకుడి పగ, ప్రతీకారాలకు దర్పణం పట్టాయి. ఎక్కడా తగ్గకుండా మొఖంలో భావోద్వేగాలను పలికించారిద్దరూ.. సునీత పాత్రధారికి కొంత అవకాశమిచ్చాడిందులో, ప్రియమణి నటనకూడా బాగుంది. సమకాలీన రాజకీయ నాయకుల పాత్రలను చూపకపోవడం, డైలాగులు సైలెంటయిపోవడంతో వర్మకూడా సినిమా ఆడనివ్వరని భయపడ్డాడని తెలుస్తోంది. దాంతో రెండో భాగంలో తెలిసిన కథనే తెరమీద మరో మారు చూడడంతో అంత ఫీల్ కలగలేదు. నటీ నటులు పాత్రోచితంగా నటించి మెప్పించారనొచ్చు. అంతవరకు అనుకొని చూడొచ్చు. టేకింగ్ కెమెరా తలకిందులుగా తిప్పడం, అడ్డదిడ్డంగా తిప్పుతుండడం తిక్కశంకరయ్యలా అనిపిస్తాడు. నాగేంద్ర హరాయా అన్న బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ఆ సీనుకు అవసరమా అనిపిస్తుంది. ఈ తిక్క లేకపోతే చాన్నాళ్ళకి మొఖంపై కెమెరా ప్రతిఫలించి, కళ్ళలో నటన చూపే నటులను చూస్తున్నామన్న ఫీలింగ్ మిగులుతుంది..

చివర్లో శుభలేఖ సుధాకర్ అవకాశ వాద రాజకీయనాయకుల ఫీలింగ్ బయటపెట్టాడు. అలాగే ఆఖర్లో ప్రతాప్ రవి కొడుకు మొఖం చూపించి ముగించడంతో మరో పదేళ్ళకో, పదిహేనోళ్ళకో ముసలి వర్మ రక్తచరిత్ర-3 భాగంకోసం వేచిచూడమన్నట్లుంది..

కత్తులతో సావాసం పాట మంచి సందేశాత్మకంగా వుండి వర్మ గొంతులో వినసొంపుగా వుండి Heart touching వుంది…

మొత్తమ్మీద తీసినదాంట్లో మనకు సగమే చూపించగలిగిన వర్మను అభినందిద్దాం..

రజినీ అమితాభ్ కు భయపడి..


నిన్న మా వూళ్ళో రోబో ఆఖరు అంటే రాత్రి ఫస్ట్ షో చూసాను. ఇప్పటి వరకు చూద్దాం అనుకుంటూ వాయిదా వేసి సి.డీ.లో చూస్తే అంత ఎఫెక్టివ్ గా వుండదని చివరి రోజు చూసాను. రజిని ఇంటర్వ్యూలో అన్నది నిజమైంది. ఐష్ తో చేసిన మొదటి సాంగ్ లో గ్రూప్ డాన్సర్స్ లేకుండా చేసేటప్పుడు ఆమెకు దగ్గరగా వెళ్ళేటప్పుడు అమితాభ్ గుర్తొచ్చేవారని చెప్పాడు. సినిమా అంతా ఆమెకు ఆమడ దూరంలోనే పాపం యాక్ట్ చేసాడు. ప్రేమ సన్నివేశాలు కూడా డైలాగ్ కు పరిమితమై పోయాడు. దగ్గరగా హత్తుకొని చేసిన సన్నివేశమే లేదు. పాపం రజినీ.

సినిమా మధ్యలో కొంత బోర్ కొట్టినా ఫస్ట్ హాఫ్, క్లైమాక్స్ సూపర్. నిజమే భారతీయ వెండితెరపై ఇంత గ్రాఫిక్స్ తో చేసిన సినిమా లేదు. రజినీ స్టైల్, మేకప్, రోబో నటనలో చేసిన విలనీ చాలా బాగున్నాయి. ఐష్ నలభయ్యో పడిలో కూడా అందంగా కనువిందు చేసింది..నిజమే ఓ పాటలో అన్నట్లు ఇంత అందం పచ్చిక అయితే పులి కూడా గడ్డే తినేది..
థాంక్స్ టు శంకర్..

రక్తచరిత్ర గురించి నాదో మాట…నేనీ మధ్య కాలంలో ఉత్కంఠకు లోనై చూసిన సినిమా ఇదొక్కటే. ఎందుకంటే సినిమా తీస్తానని ప్రకటించిన నాటి నుంచి పబ్లిసిటీ మొదలైన సినిమాగాను, మరల రిలీజ్ కు ముందు నుండి అనేక విమర్శలు, బెదిరింపులెదుర్కొన్న దర్శకుడిగా వర్మపై ఎందుకో ప్రత్యేక అభిమానమేర్పడి తరువాత తెదెపా వాళ్ళు తాము చంపుకున్న ఎన్టీవోడిపై ఏదో తీస్సాడని, వాటిని తీయకపోతే వర్మను బూడిద చేస్తామన్న దగ్గరనుంచి చండాలుడుగా తిట్టించుకోవడంతో తప్పక కత్తిరింపుకు ముందే చూడాలని నిన్న చూసాను. దీనిపై రాయడం అవసరమా, మానేద్దాంలే అనుకుంటున్నా రోజూ ఎవరో ఒకరు రాయడం, పత్రికలలో రావడంతో నాలుగు ముక్కలు పంచుకుందామని ఇలా..

ముఖ్యంగా మీడియాలో టీ.వీ.9కు, ఏబీఎన్ వారి మధ్యనెలకొన్న పోటీమూలంగా వారు ప్రతిదాన్ని రచ్చ చేయడంతో అవసరానికి మించి ప్రచారం లభిస్తోంది. అలాగే పనిలేని వాళ్ళ చర్చలతో మనల్ని విసుగ్గొడుతున్నారు. తీరా వీరు సాధించేదేమీ లేకపోగా సినిమా వసూళ్ళు పెరిగి వర్మకు ఫలితం దక్కింది.

మనినిషిని మనిషిగా చూడకుండా దేవుళ్ళని చేసి నెత్తికెక్కించుకోవడం తెలుగుదేశాన ఎక్కువైంది. ఎన్టీవోడు బతికున్నప్పుడు పాలనాకాలంలో ఎన్ని చేసాడో అవన్నీ మరిచిపోయి చచ్చాక ఆ బూడిద రాసుకోవడానికి వీళ్ళు పడుతున్న పాట్లు చూస్తే నవ్వొస్తుంది. అధికారంలో వుండగా ఆయన వేసిన వేషాలు, తీవ్ర మానసిక నియంతృత్వంతో చూపిన అధికార దర్పం. పాదాభివందనాలు, నా దగ్గర ఏమీ లేదు బూడిద డైలాగులకు విసిగిన జనమే తనను అధికారం నుండి దించారు కదా? నక్సలైట్లే నిజమైన దేశభక్తులని ఎన్నికలలో మాటాడి అధికారం చేపట్టాక తీవ్ర నిర్బంధంతో బూటకపు ఎదురుకాల్పులు, విద్యార్థి యువజనులను మాయంచేయడం, కరెంటు ట్రాన్స్ ఫార్మర్ కి వేలాడదీయడం జరిపారు. ఇవన్నీ జనం మరిచిపోతారా? ఈ సినిమాలో వర్మ బ్యాక్ గ్రౌండ్ లో చెప్పిన మాటలు సత్యదూరం కావు, అలాగే ఆయన ఏమీ ఋషిపుంగవుడు కాదు. దీనిపై చంద్రబాబు, లక్ష్మీ పార్వతులు మాటాడకుండా వుంటే వాళ్ళ గౌరవం నిలబడేది. వాళ్ళు అది నిలుపుకోలేరన్నది రుజువయ్యింది.

ఇంక సినిమా గురించి పరిటాల రాములు కారెక్టర్ ఇంకొద్దిగా ఆయన చేసిన పనులను చూపితే బాగుండేది. అంత సమయం లేకపోయుండొచ్చు. రవి మారిన తీరును చాలా బాగా చూపగలిగాడు వర్మ. అంతకు మించి ఆ రాక్షస రాజ్యంలో ఎవరికైనా గత్యంతరం వుండదు. తద్వారా ప్రజలలో తనకు పెరిగిన ఇమేజిని రాజకీయాలలో చేరడంతో ఆయన తన పరిథిని విస్తరించుకోగలిగాడన్నది కూడా చక్కగా చూపాడు. హింసను హింసగా చూపడంతో కొంత భయానక దృశ్యాలు చోటుచేసుకున్నాయి. కానీ వాటికి మనం ఎప్పుడో మానసికంగా రాటుదేలిపోయాం. ఎందుకంటే భోజనం చేస్తూ టీవీలో చూపే క్రైం దృశ్యాలను ఆశ్వాదిస్తున్నాం, మరుగుదొడ్ల యాడ్ లను కూడా అతిమామూలుగా చూసే మన రెటీనాలు స్పందన తీగల కత్తిరింపుకేనాడో గురయ్యాయి. కావున అది కామన్ గా తీసుకున్నా.

పాటలుపై కొంత శ్రద్ధ తీసుకొని గోల లేకుండా వుంటే బాగుండేదింకా..

ఇలా రక్తచరిత్ర తీసి రాంగోపాల్ వర్మ తెలుగువాడి వాడిని చూపాడన్నది నా అభిప్రాయం..