సందేహం

ఠాగూర్ తరహా వైద్యంలో బాబా???


సాయిబాబా పరిస్థితి చూస్తుంటే బాధగా వుంది..

8౦ సం.ల వృద్ధాప్యంలో ఇంత నరకానికి గురిచేయడం దారుణం..

లక్షల కోట్ల ఆస్తులను ఎలా దొంగిలించుకు పోవాలోనన్న కుతంత్రాలకు ప్రస్తుతం అక్కడ జరుగుతున్న తంతు సాక్ష్యం కావచ్చు. ఇంత మంది భక్తుల వీరావేశం నీరుగారిపోయి ఇన్నాళ్ళు భజన చేసిన వాళ్ళు కిమ్మనకుండా ఊరకుండిపోయారంటే ఆయనింక లేకపోయుండొచ్చు అన్నది అందరికీ అర్థమైపోయుండాల. డా.సఫా మొత్తం వ్యవహారాన్ని ఓ గూడుపుఠానీలా నడుపుతూ దానికి సర్కారు వారి తానా తందానా తోడు కావడం వెనక ఎవరి లాభాలు వాళ్ళకుండొచ్చు. ధనం మూలం ఇదం జగత్ అన్న సూక్తి అక్షరాలా నిజమౌతున్నదిక్కడ.  భక్తి ముసుగులో అక్కడ పోగుపడ్డ ధనం ఇప్పుడు ఎవరెవరి ఖాతాల్లోకి మార్చుకోవాలోనన్న ప్రయత్నంలో అంతా భాగస్వాములై ఠాగూర్ సినిమాలోని కార్పొరేట్ వైద్యం అందిస్తున్నట్లు అనుమానంగా వుంది. ఇదంతా పూర్తయ్యాక బాబా ఈ క్షణమే వైకుంఠానికి చేరుకున్నారు తొందర్లో మళ్ళీ దర్శనమిస్తారని సెలవిస్తారు డా.సఫా గారు. అంత దాకా ఈ మూగ భక్తులు పక్కన పెట్టిన తాళాలు అలా పడి వుంటాయి. నిజంగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఇన్నాళ్ళు వేచి చూడాలా…ఐ.సి.యు.లో వున్నవారి విజువల్స్ చూపకూదదా? ఇదంతా మన చెవిలో పెద్ద కాబేజీ పెట్టే ప్రయత్నం కాదా? అయినా మనకెందుకులే… శాంతి..శాంతి..శాంతిః

దాయాది పోరు??


రాబోయే ఉపఎన్నికలు ఓ కొత్త ఒరవడికి తెరలేపుతున్నాయా?

మొన్న మీసం మెలేసి తొడ చరిచినప్పుడు, నిన్న ప్రతిపక్షం వారి చొక్కా పట్టుకొని తాను రాములోరి లక్ష్మణుడినని జీర గొంతుతో పలికిన పలుకులు ఉత్తుత్తినే అని కొద్ది గంటల్లోనే నిరూపించి తాను విభీషణున్నే అని చెప్పకనే చెపుతున్న పులివెందుల పులిబిడ్డ (సీనియర్-2) రాజకీయాలలో బంధుత్వంకు ఎటువంటి సెంటిమెంటు లేదని నిరూపించి అమ్మ విసిరే పాచికలో పావు కాబోతున్నారా?

ఇదేదో ఓ గొప్ప ప్రజాస్వామ్య పద్ధతిగా మనం కీర్తించుకుంటూ బుల్లి తెరముందు కూచుండిపోతాం… ఆహా మనమెంత ఆశపోతులం…

ఈ పొట్టేళ్ళ పందెంలో బలికాబోయే మూగజీవులెన్నో….

హతవిధీ…  ఇది మరో రావణకాష్టం కాబోదు కదా?

వి.హెచ్.గారూ అద్దంలో చూసుకున్నారా-2?


జనపథ్ భజనపరుల సంఘంలో ముందుండి దొడ్డిదారిన పదవులనుభవిస్తున్న ఈయనగారికి ఎందుకో జగన్ పై ఇంత అక్కసు. వై.ఎస్.బతికున్నంతవరకు తోక కరచుకొని పడుకున్న వీరు మాటి మాటికీ ఏదో ఒక వ్యాఖ్యానంతో టీ.వీ.లముందు వాలిపోయి సోనియా మేడం చూస్తున్నారని బొంగురు గొంతుతో అరుస్తుంటారు. మీ జీవితం మొత్తం ప్రొఫైల్ లో ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నికైనది ఒకే ఒక్కసారి. సామాజిక సేవ నిల్. పోనీ ప్రస్తుతం మీకున్న కమిటీ పదవుల ద్వారానైనా రాష్ట్రానికి చేస్తున్నది నిల్. పోనీ రాజ్యసభలో తన మేథావితనంతో ఊదరగొట్టిన ఉపన్యాసం లేకపోయే. తెలంగాణా గురించి ఏమైనా చేస్తున్నారా అంటే అదీ లేదు. రాజీవ్ బతికున్న కాలంలో మొదలైన భజన కొనసాగిస్తూ ఢిల్లీ గల్లీలలో సేవ చేసుకొని తరించక తమరికి తాజా రాజకీయాలెందుకు సార్. తమరి మొఖం మరో మారు అద్దంలో చూసుకోరాదా? వార్తలేమీ లేకపోయేసరికి ఈ మీడియా వాళ్ళకు తమరే దిక్కులా వుంది. తమ ముందు గొట్టాలతో ఉరికింది చాలక బ్రేకింగ్ న్యూస్ లు మళ్ళీ.

Detailed Profile: Shri V. Hanumantha Rao
http://india.gov.in/govt/rajyasabhampbiodata.php?mpcode=1004

రాజుగోరి వై’భోగం’


సింహాచలం మేడ

మా విజయనగరం పూసపాటివారి పాలనలో అలరారిందని మీకందరికీ ఎరుకేకదా? రాజుల వైభోగం ఎంతలా విరాజిల్లేదో ఈ ఫోటోలోని మేడ చూస్తే తెలుస్తుంది. సింహాచలం అన్న భోగం స్త్రీకి ఈ మేడను అప్పట్లో రాజుగారు కట్టించి ఇచ్చారంటారు. ఇప్పటికీ ఈ మేడను సింహాచలం మేడ అంటారు. ప్రస్తుతం ఇందులో ఓ ప్రభుత్వ వసతి గృహం నడుస్తోంది. కానీ ఈ మేడను చూడగానే రాజుగారి వై ‘భోగం’ గుర్తుకువస్తుందిక్కడి వారికి..

ఇంకా కొనసాగుతూ..న్న పెళ్ళి సాంప్రదాయాలు…


ఈ మద్య  జరిగిన పెళ్ళిళ్ళలో పల్లెల్లో ఇంకా ఈ పల్లకీ ఎక్కి ఊరేగే సాంప్రదాయం కొనసాగుతూనే వుంది. పట్టణంలో జరిగే వాటిలో ఎక్కడా కనబడకపోయినా పల్లెటూళ్ళలో ఇలా పల్లకీపై పెళ్ళికూతురు పెళ్ళికొడుకులను వివాహానంతరం మోస్తూ ఊరేగించడం అక్కడక్కడా కనబడుతోంది. ఇప్పుడంతా కార్లలో ఊరేగింపే కనబడుతూ ఇలా ఒక్కసారిగా చూసే సరికి ఇంకా వదల్లేదా అనిపించింది. ఈ పల్లకీలను ఈ ప్రాంతంలో చాకలి కులస్తులే మోస్తుంటారు. దీనికి గాను వాళ్ళకూ అధికంగానే ఇవ్వాలి. దీనిని ఇక్కడ సవ్వారి అంటారు. ఇంకా ఒక ఊరి నుండి వేరే వూరికి తీసుకు పోయేటప్పుడయితే పాటకూడా పాడుతూ తీసుకుపోతారు. ఆ పాటలో కాస్తా బూతు కలిపి ఉషారుగా నడుస్తూంటారు. కొద్ది సం.ల క్రితమైతే చాలా డెకరేట్ చేసే వారు. ఇప్పుడు అది తగ్గింది.  ఏమైనా ఇంకా సాంప్రదాయం వదలకపోవడం, ఇలా మనుషులు మోయడం వాళ్ళకు ఉపాధిగా అనుకుంటే ఒకలా వుంది, సామాజికంగా ఆలోచిస్తే ఈ భూస్వామ్య మనఃస్తత్వం వదలదా అనిపిస్తుంది.


చీలిక దిశగా కాంగ్రెస్?


కాంగ్రెస్ అధిష్టానం మాటను ధిక్కరించి కొద్ది సేపటి క్రితం ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ లో వరంగల్ జిల్లా ఓదార్పు యాత్రకు బయల్దేరిన జగన్ కాంగ్రెస్ నుండి వేరు కుంపటికి శ్రీకారం చుట్టినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే రోజుకో కొత్త తలనొప్పితో సతమతమవుతున్న సి.ఎం.రోశయ్య ఎంతలా ప్రయత్నించినా జగన్ యాత్రను అడ్డుకోలేకపోవడం అధిష్టాన వైఫల్యమే.  జగన్ తన మొండితనాన్ని, తద్వారా తన తండ్రి వారసత్వాన్ని ప్రతిష్ఠించాలన్న పట్టుదలతో ముందుకుపోవడం ఈ సమయంలో అంత మంచిది కాదేమో.

ఇన్ని కోట్ల రూపాయల ఖర్చుతో ఉద్రిక్త పరిస్థితులను సృష్టించడం ద్వారా జగన్ అనుకున్నది సాధించగలరా?

ఇదంతా తనకు భవిష్యత్ లో ఓట్ల రూపంలో కలిసి రాగలదా?

దీని ద్వారా తెలంగాణా ఉద్యమం మరల ఊపందుకోనుందా?

తద్వారా ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ద్వారా కాంగ్రెస్ జగన్ వర్గానికి చెక్ పెట్టనుందా?

చిరంజీవి మంతనాలతో ప్రరాపా మునిగిపోనుందా?

సమైక్యాంధ్ర మద్దతుదారు చిరుతో బేరసారాలాడడానికి తయారవ్వడం ద్వారా రాష్ట్ర చీలికకు మొగ్గుచూపుతున్నారా?

ఇవన్నీ నా సందేహాలు.

కాళ్ళూ చేతులు కదపలేకపోయినా ‘సత్యం’ పరార్?


ఆయేషా మీరా హత్య కేసులో నిందితునిగా నేరారోపణ చేయబడ్డ సత్యంబాబు వాయిదాలకు వచ్చేటప్పుడు పోలీసు కానిస్టేబుళ్ళ చేతులమీదో, కాళ్ళీడ్చుకుంటూనో వస్తున్నది అందరికీ తెలిసినదే. నిమ్స్ నుండి విజయవాడకు వాయిదాకు తీసుకు వస్తుండగా 11 మంది సాయుధ పోలీసుల పహరా నుండి ఎలా తప్పిపోయాడో అని అందరికీ ఇప్పుడు భేతాళ ప్రశ్న. సత్యం బాబు తల్లి మరియమ్మ తన కుమారుడ్ని చంపేసే ఉద్దేశ్యంతోనే యిలా కాకమ్మ కథలు అల్లుతున్నారని ఏడుస్తోంది. అటు ఆయేషా తల్లి కూడా కేసును మూసివేసే ఉద్దేశ్యంతో సత్యంను చంపే పథకంలో భాగంగానే ఇలా చేసారని ఆవేదనగా ఆగ్రహంగా తిడుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పోలీసులే టెఱరిస్టులని ధర్మాగ్రహం (TV5లో) వెల్లగక్కారు.

ఈ కేసులో ముందునుండీ సామాన్యజనానికి ఎన్నో సందేహాలను మిగిల్చారు. అసలు నిందితులను దాచే ఉద్దేశ్యంతోనే మొదట లడ్డూ అని, తరువాత ఈ సత్యంబాబును తెరపైకి తెచ్చారు. సత్యంబాబు నోటితో కూడా తానే నిందితుడ్ని అని చెప్పించారు. తరువాత కోర్టులో తనకు ఈ కేసులో ఇరికించారని చెప్పాడు. దాంతో ఆయనకు కాళ్ళూ చేతులు పడిపోయిన జబ్బు వచ్చింది.

యిలా ప్రత్యూషలు, ఆయేషాలు అమానుషంగా బలయిపోయినా పట్టించుకునే నాధుడే లేడు. మొదటి దానిలో ప్రస్తుత ప్రతిపక్షం వాళ్ళూ అధికారంలో వుండగా జరగగా, రెండోది జరిగి అప్పుడే మూడేళ్ళూ దాటిపోయాయి. దివంగత వైఎస్ గారి పాదాలమీద పడి వేడుకున్నా చిరునవ్వుతో ఆశీర్వదించారే తప్ప నేరస్తులు బయటపడలేదు.  పేదవాడు, దళితుడు అయిన సత్యంబాబు పై ఇది రుద్దబడిందిగానే అన్నం తిన్న ఎవరికైనా అర్థమౌతుంది. పాపముపశమించుగాక…


ఎవరి పాత్రా లేదా?


నవంబర్ 26, 2008 ముంబయి దాడిలో 166 మంది హత్యకు కారణంగా అజ్మల్ కసబ్ ను నిందితుడిగా ఈ రోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పునిచ్చింది. రేపు శిక్షను ప్రకటించవచ్చు.  మరో యిద్దరు నిందితులను నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ సందర్బంగా వారు ముంబయి మాప్ లను తీవ్రవాదులకు అందజేసారన్న అబియోగంపై జడ్జి గారు వారిచ్చారన్న మాప్ లకంటే గూగుల్ యింకా క్లియర్ గా వున్నాయని వ్యాఖ్యానించారు. సరే. యివన్నీ పక్కన పెడదాం. చాలా వేగవంతంగా నడిచిన కేసుగా కూడా గుర్తిద్దాం.. కానీ నాకు కొన్ని సందేహాలున్నాయి..

అంత మంది తీవ్రవాదులు ఒక వ్యాపార నౌకపై దాడి చేసి అందులోని 5 గురిని హత్యచేసి, ఆ నౌకను స్వాధీనం చేసుకొని భారత తీర ప్రాంతానికి చేరుకొని,  సుమారు అరవై గం.లు తుపాకులతో వీర విహారం చేసారంటే దీని వెనక మన దేశవాసుల సహాయ సహకారాలు లేకుండా సాధ్యమా?

తీర ప్రాంత రక్షక దళం విదేశీ మందు మత్తులో జోగుతోందా? మన వాళ్ళ లెన్సులకందనంత వేగంగా చొరబడ్డారా?

లేక యిదంతా ఒక పథకం ప్రకారం కక్కుర్తి  స్థానిక రాజకీయ నాయకులు, పోలీసు, మిలటరీ బాసులు (సినిమాలలో లాగ) సహకరించకుండా సాధ్యమా?

కావాలని కసబ్ గాడిని పట్టుకొని ఓ డ్రామా ఆడటంగా అనిపిస్తోంది.కసబ్కు డ్రైవింగ్ లైసెన్సు యిప్పించిన వాడేవడో తెలియలేదంటే ఎంత పెద్ద చేయో వాడిది కాదా?

కర్కరే గారి బులెట్ ప్రూఫ్ జాకెట్ లోకి బులెట్ లు దూసుకుపోయాయంటే ఆ జాకెట్ కొనుగోలు వ్యవహారంలో చేతులు మారిన ముడుపులెవ్వరికి వెళ్ళాయి?

పరిశోధన ఏకపక్షంగా సాగి కసబ్ ను హీరోను చేసారు తప్ప వెనక వున్న విలన్ ల గుట్టు విప్పే జేమ్స్ బాండ్ మనకు లేకుండా పోయాడు.

వీణ్ణి ఉరితీస్తే జరిగిన ఘోరకలి మరిచిపోతారా? అసలు నేరస్తులు ఎవరో అంతటితో సరిపెట్టే కుట్ర దాగివుందనిపిస్తోంది నాకు.

అయినా సామాన్యులకెప్పుడూ మిగిలేవి అసంపూర్ణ తీర్పులు, తీరని సందేహాలే.. కాదంటారా?