శుభాకాంక్షలు

సింగ్ ఈజ్ కింగ్…


Singh is King


అతిరథ మహారథులంతా ౦,1,2,3 లు తో తమ పాడ్ లు కట్టిన సమయమైనా క్రీజులో లేకుండా వెనుదిరిగి భారత అభిమానుల గుండెల్లో గుబులు పుట్టిస్తే సింగ్ ఈజ్ కింగ్ అని తన తొలి సెంచరీ తో భారత్ పరువు నిలబెట్టిన హర్భజన్ కు కృతజ్నతలు తెలుపకుండా ఎవరైనా వుండగలరా? మొదటి ఇన్నింగ్స్ లో తాను చేసిన 69 పరుగులే కెరీర్ బెస్ట్ అని అనుకున్నంతలో సెంచరీతో మోత మోగించాడు. భారత గడ్డపై తమ కుఱాల్ల స్పీడు చూసి పొంగిపోయిన కివీస్ కెప్టెన్ వెటోరీ ఆశలపై నీళ్ళు చల్లాడు. So, once again Singh is King..

హైదరాబాదీ స్టైలిష్ బ్యాటింగ్ వీరుడు వి.వి.ఎస్.లక్ష్మణ్ ఇన్నింగ్స్ కూడా అంతే విలువైనవి. కానీ లక్ కు ఎప్పుడూ దూరంగా వుండే మన వాడు సెంచరీ మిస్ అవ్వడం పాపం..

ఏదేమైనా ధోనీ అదృష్టవంతుడు….

నవ్వుల రేడు రాజబాబు గారి జయంతి నేడు..


నవ్వులరేడు


తెలుగు సినీ వినీలాకాశంలో తన హాస్య నటనతో అలరారించి తన దైన శైలిలో ఓ ప్రత్యేక ముద్రను వేసి మనందరి మదిలో చిరకాలం గుర్తుండిపోయే తన నటనా వైదుష్యంతో, సమాజంలో తోటి మనుషులకు సాయపడే ధర్మగుణంతో తన జీవితాన్ని సార్థకం చేసుకొన్న హాస్యనట చక్రవర్తి రాజబాబు గారి జయంతి సందర్భంగా నేడు ఆయన నటనను మరో మారు పునఃస్మరించుకుంటూ ఓ మారు మనసారా నవ్వుకుంటూ ఆయనకు నివాళినర్పిద్దాం.

నవ్వుల రేడుగా వరుసగా 7 మార్లు ఫిలిం ఫేర్ అవార్డులు తీసుకున్న మొదటి కమెడియన్ మన హాస్యరస రాజబాబు. మహాకవి శ్రీశ్రీకి తోడల్లుడు మన రాజబాబు. చిన్న వయసులోనే చనిపోయి మనందరినీ విషాదంలో ముంచిన హాస్యరాజును మరోమారు పలవరిద్దాం..

పూల బుట్టెత్తిన చేతులలో నేడు CWG కాంస్య పతకం


మా విజీనగరం వస్తాదు


మట్టిలో మాణిక్యం మా వల్లూరి శ్రీనివాస రావు. చిన్నతనంలో తన సొంత వూరు విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం లోని కొండ వేలగాడ గ్రామం నుండి ప్రతిదినం పులు అమ్ముకునేందుకు పట్టణానికి వస్తు మార్కెట్ ప్రక్కన వున్నకోడి రామమూర్తి వ్యాయామ శాలలో అంతా కసరత్తులు చేయడం చూస్తూ తను కూడా ఆశక్తి కనబరచడంతో అక్కడ వున్న శిక్షకుని ప్రోత్సాహంతో మొదలైన తన ప్రస్థానం మొన్నటి డిల్లీ కామన్ వెల్త్ వేదికపై 56 కేజీల విభాగం నందు కాంస్య పతాక విజేతగా అటు దేశానికి, రాష్ట్రానికి, మా విజయనగరం జిల్లాకు, తన పుట్టినూరుకు కీర్తిని సాధించారు. ప్రస్తుతం పూణేలో ఆర్మీ లో ఉద్యోగం చేస్తూ వారి సహకారంతోనే తానూ ఈ పోటీలలో పాల్గొంటున్నట్లు చెప్పారు. కేంద్రం కొంత సహకారమిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏమీ సాయమది౦చడ౦ లేదంటూన్నారు.

ఇలా మారు మూల గ్రామాలలో వున్న క్రీడాకారులు తమ ఆశక్తితో పైకి రావడమే తప్ప మన క్రీడాధికారులు గుర్తించి ప్రోత్సహించడం గగగన కుసుమమమే అవుతోంది. కోట్లాది రూపాయలు మాత్రం జలకడుగుతున్నారు. తాను పేదరికంతో పూలమ్మే పనిలో భాగంగా వచ్చి వ్యాయామ శాలను చూడడం వలన ప్రేరణ పొంది తనంతట తానుగా శ్రమించి పైకి వచ్చిన వల్లూరి వంటి క్రీడాకారులు ఇంకెంతమంది మూలన పడి వున్నారో! రాజకీయ అండదండలు కలిగిన వారు, ధనికుల బిడ్డలకు మాత్రమే జట్ల ఎ౦పికలో అవకాశాలు పొందుతున్నారన్నది జగమెరిగిన సత్యం. సైనిక విభాగం లో వుండడంతో ఈ అవకాశమైనా దక్కింది.

క్రికెట్ వ్యాపారం తప్ప మరేమీ పట్టని మన వారికి అంతర్జాతీయ స్థాయిలో పతకాల కొరత తీర్చి దేశం పరువును నిలబెట్టే ఇలాంటి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం వుంది. ఏమైనా మా విజీనగరం శీను అభినందనీయుడు.

call 108 – ధన్యవాదాలు తెలుపుదాం


భాగ్య నగరం కర్ఫ్యూ పడగ నీడలో వున్న సమయంలో ఆపదలో వున్నవారికి, గర్భిణీ స్త్రీలకు, గుండెనొప్పి వంటి అత్యవసర కేసులకు ధైర్యంగా సమయానికి వచ్చి వారికి వైద్య సేవలకు తరలించిన 108 సిబ్బందిని తప్పక అందరం అభినందించాలి. నిత్యం అప్రమత్తమై అల్లరిమూకల దాడులకు వెరవక ప్రజలకు అపత్సమయంలో సేవలందించిన 108 సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుదాం.

నిఝంగా యిది మహిళలకు మోక్షమా?


గత నాలుగైదు రోజులనుండి టీవీ చానళ్ళు, దినపత్రికలలో మహిళా బిల్లుకు మోక్షం అంటున్నారు. మోక్షం అంటే చావే కదా అర్థం.  చివరికి ఏదేతేనేం రాజ్యసభలో బిల్లు 166 మంది సభ్యులు ఆమోద ముద్రతో విముక్తి పొంది, అన్సారీ గారి తలబొప్పికట్టించినా నెగ్గుకొచ్చింది. యింక రేపు లోక్ సభలో ఆమోదంతో చట్టరూపానికి వస్తుంది. దీనితో సుమారు 182 మంది మహిళా సభ్యులతో లోక్ సభ, 81 మంది సభ్యులతో  రాజ్యసభ రంగులమయం అవుతుంది. దీని వలన మహిళలకు రాజకీయంగా ఎదిగే అవకాశాలు మెరుగుపడతాయని తద్వారా వారి జీవితాలలో వికాశం వస్తుందని అన్ని రాజకీయపక్షాలు ఏకరవుపెడుతున్నాయి. కానీ నిఝంగా అది సాధ్యమా? ఈనాడు గ్రామపంచాయతీలలో, మండలపరిషత్ లలో, మున్సిపాలిటీ పాలక వర్గాలలో అమలవుతున్న మహిళా రిజర్వేషన్ లవలన వాళ్ళ గొంతు వినబడుతుందా? ఎన్నికయ్యాక వారు మరల ఇంటికే పరిమితం. వాళ్ళ భర్తలో,  కొడుకులో వీళ్ళ అధికారాన్ని చెలాయిస్తుంటారు.  అయినా ఈ కాలం ఎలచ్చన్లలో పోటీ చేయాలంటే కోటీశ్వరులకు తప్ప సామాన్యజనానికి అంత అవకాశముందా? రాజకీయ అవకాశాలతో అందలమెక్కి ఏమైనా జనాన్ని ఉధ్ధరించగలిగారా? మహిళా హోం మంత్రి యిలాకాలోనే మహిళలపై, విద్యార్థినులపై దాడులు జరుగుతుంటే, దానికి రాజకీయ రంగుపులిమి తప్పించుకోజూడడం అనుభవమే కాదా? యిదంతా సమస్యలనుండి పక్కదారిపట్టించే యత్నమేనని నా భావం.

పై ఫోటోలోని వారిని మినహాయించి, వివరించగోరుతూ..

ఆమె గెలిచింది – అతను ఓడాడు


82 వ ఆస్కార్ అవార్డు పోటీలలో తన మాజీ భర్తపై దర్శకత్వ శాఖతో పాటు ఉత్తమ చిత్రం అవార్డును కూడా సొంతం చేసుకొని ఆరు విభాగాలలో తన చిత్రం ది హర్ట్ లాకర్  జయకేతనం ఎగరవేయగా మహిళా దినోత్సవం రోజున మొట్టమొదటిసారిగా మహిళా దర్శకురాలిగా కేథరిన్ బిగెలో అవార్డు గెలుచుకోవడం ఎంతైనా అభినందనీయం. ఈ సందర్భంగా కెమరూన్ కూడా చప్పట్లతో ఆమెను అభినందించడం ముదావహం.

వీడియోలో ఆమె విజయదరహాసం..http://oscar.go.com/video/index?playlistId=167479&clipId=253278

జయ జయహో సచిన్..


  • తన చిరకాల స్వప్నం వన్డేల్లో డబుల్ ను సౌతాఫ్రికా వంటి గట్టి ప్రత్యర్థిపై సాధించిన సచిన్ అభినందనీయుడు.
  • తన డబుల్ ను భారత అభిమానులకు అంకితమిస్తూ తన కెరీర్ లోని ఎత్తు పల్లాలలో తనకు అండగా నిలబడిన అభిమానులకు వినయంగా అంకితమిస్తూ చేసిన ప్రకటన ఆదర్శప్రాయం.
  • తన కెరీర్ లో సాధించిన రికార్డులు ఆకాశమంత ఎత్తు వున్నా తాను గర్వపడని అతని వినమ్రత ఆచరణీయం.
  • తన రికార్డులను తానే అధిగమిస్తూ ఎవరెస్టు శిఖర సమానుడైన సచిన్ కు జయజయధ్వానాలు పలుకుదాం.

తెలుగు చాప్లిన్ కు జన్మదిన శుభాకాంక్షలు


హాస్య బ్రహ్మ, నవ్వుల హరివిల్లు, పన్  డా. పద్మశ్రీ బ్రహ్మానందం గారికి జన్మ దిన శుభాకాంక్షలు తెలియజేసుకుందాం.

తన ముఖ కవళికలతో మన ఎదలో చక్కిలి గిలి పెట్టి, ఎంత విషాదంలో వున్న వారికైనా తనని చూడగానే నవ్వు పుట్టించే హాస్యబ్రహ్మకు తెలుగు ప్రజలు ఋణపడివుంటారు.

హాస్యానికి మించిన గుండె వైద్యమేముంటుంది. ఎద భారాన్ని తగ్గించుకోవాలంటే ఈ ముఖం చూస్తే చాలు.

కత్తిరాందాస్ కత్తిపోటుతో మదిలోని విషాదపుకుత్తి తెగి అవతల పడని వారుంటారా?

జీవితంలో పేదరికపు లోతులను చూసిన వ్యక్తి.

తెలుగు చాప్లిన్ గా పిలుచుకుంటే తప్పేంటి?

గిన్నీస్ బుక్ లో కెక్కిన మన నవ్వుల రేడుకు జన్మదిన శుభాకాంక్షలు.

ఉస్మానియా ఉద్యమ గర్జన విజయవంతం


నేడు ఉస్మానియాలో విద్యార్థుల గర్జన విజయవంతమయి తెలంగాణా గుండెచప్పుడుని నేల నాలుగు చెరలా వినిపించింది.

అవకాశవాద రాజకీయ నాయకులను తన గర్జనతో హెచ్చరించింది.

ఉద్యమానికి దిశానిర్దేశాన్నిస్తూ ఈ నెల 5న గుజ్జర్ల తరహా రైలురోకో అందోళనకు పిలుపునిచ్చింది.

ఢిల్లీ పెద్దల ఊగిసలాటను కట్టిపెట్టాలని వెంటనే రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ను వినియోగిస్తూ తెలంగాణా ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసింది.

ఈ రోజు సభకు తెలంగాణా నలుదిశలనుండి కదిలివచ్చిన విద్యార్థి ప్రభంజనాన్ని రాజ్యం సైనికంగా ఆడ్డుకోజూస్తూ అక్రమ అరెస్టులు చేసింది. వారినందరినీ బేషరతుగా హైకోర్టు ఉత్తర్వుల మేరకు విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

నక్కజిత్తుల చంద్రబాబు కొత్తగా ఆలపిస్తున్న సమైక్య రాగాన్ని ఖండిస్తూ తీవ్రంగా హెచ్చరించింది.

ఏకాభిప్రాయ సాధన పేరుతో ఉద్యమంపై నీళ్ళు చల్లే కార్యక్రమంగా 5/01 సమావేశం ముగిస్తే శంషాబాద్ విమానాశ్రయం నుండి చెప్పులతో తరిమికొడతామని రాజకీయ బేహారులను హెచ్చరించింది.

ఫ్రెంచి విప్లవం నాటి విద్యార్థుల పోరాట స్ఫూర్తిని నేడు ఉస్మానియా పుణికిపుచ్చుకొని తెలంగాణా సాధనకు కృషి చేస్తున్నందుకు ఆలంబనగా నేడు లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణా విద్యార్థి లోకానికి సామాన్యుడిగ వినమ్రంగా జేజేలు పలుకుతున్నా.