వార్తలు-వ్యాఖ్యలు

వీళ్ళంతా ప్రజలే మరి??


నిన్న జగన్ విడుదల అయిన తరువాత ముప్పావు గంటలోపు చేరుకోవాల్సిన వాడు ఆరు గంటలు రాజు వెడలె అన్నట్టు తన కాన్వాయ్ సాఫీగా తాపీగా పోనిచ్చి సాయంత్రం ఇంటికి చేరుకోవాల్సిన జనాల్ని నానా ఇబ్బందుల పాల్జేసి అదనంగా మరో లీటరు పెట్రోలు ఖర్చుకు గురిచేసిన వైనం ఆయన వెంట పడ్డ ఈ మీడియా హంగామా లైవ్ షోలు చూస్తుంటే జైలు కెళ్ళి రావడంలో ఇంత గొప్పదనముందా అనిపిస్తోంది.

కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు అటు ఐ.ఏ.ఎస్. అధికారులను అనారోగ్యాలకు గురి చేసి వారి పరువు ప్రతిష్ట మంటగలిపి వారేదో దొంగలులా ఇన్నాళ్ళు చూపి తప్పని సరి పరిస్థితులలో బలవంతపు సంతకాలు చేయించుకున్న రాజకీయ అధికార రాకాసులను వదిలి పెట్టి వారిని జైళ్ళలో ముగ్గబెడుతు ఏ-1 గా వున్నవాడ్ని బెయిలిచ్చి ఇంత హంగామాగా ఇంటికి సాగనంపిన ప్రభుత్వాధికారులు పోలీసు అధికారులు మీ గులాంగిరికి జోహార్లు. ఇదంతా అధికార దుర్వినియోగం కాదా?

కాబోయే ముఖ్యమంత్రి అంటూ అరుపులు పెడబొబ్బల లైవ్ చూస్తుంటే వీళ్ళంతా ప్రజలే మరి?? వీళ్ళకోసం ఆలోచిస్తూ ఏదో మంచి జరుగుద్ది భవిష్యత్ తరానికి అని
ఆశించడం మన వెఱితనమే కదా?? రాష్ట్రాన్ని ఆర్థికంగా అథఃపాతాళానికి తొక్కిన ఒక రాచకురుపు వెంట ఇంత మందీ మార్బలం వెళ్ళడం ఎంత దౌర్భాగ్యం. ఒక్కో టీవీ ఒక్కో వ్యాఖ్యానంతో బేక్ గ్రౌండ్ మ్యూజిక్ తో జనాల మెదళ్ళను పాలిష్ చేసే పనిలో పడ్డాయి. ఇదా వీటి సామాజిక బాద్యత? వీళ్ళంతా రాజకీయ సామాజిక కుళ్ళును కడిగేయమని మళ్ళీ స్లోగన్స్.

దీనమ్మా బతుకు చీ.. థూ అని రిక్షా రాం బీడీ ముక్క కొరుకుతూ ఊస్తుంటే ఆశ్చర్యమేసింది…

బాబాల బూతు భాగోతం..


మొన్న కల్కి బాబా, నిన్న నిత్యానంద, నేడు పత్రి గురూజీలు. ఇలా ఎన్ని జరిగినా వీళ్ళ వెంట పడడం జనం మానరు. ఇది ఏదో జనాన్ని వాళ్ళు

మోసం చేస్తున్నట్టుగా మీడియా ప్రచారం. కానీ వీళ్ళేమైనా చదువు సంధ్యా లేని వారా?? కావాలని వెళ్ళి అర్పించుకుంటున్న వారితో జరిగే నష్టమేంటి. దీనివలన

సమాజానికి ఏమాత్రమూ నష్టమ్ లేదనుకుంటా.. కుతి తీరని వెధవరాయుల్లే కదా వెళ్ళేది. ఏదో వచ్చి పడుతుందనో లేక అడ్డదిడ్డంగా సంపాదించిన దాంట్లో కొంత

ఇలా పారెస్తే పాపశాతం తగ్గిపోతుందనో కదా? వాళ్ళకి దీనివలన మరింత ప్రచారమే తప్ప ఈ జనం మారరు. ఇదో పెద్ద సామాజిక చైతన్యం తెచ్చేసే వార్తలా ప్రింట్

ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు వీళ్ళ వెంట పడడం. అసలైన సమస్యలను వదిలేసి. వీళ్ళకు బేరసారాలు కుదిరితే వదిలేసే వారే కదా ఎక్కువ.

కిషోర్ చంద్ర దేవ్ లేఖ పొగ బాంబా లేక డైనమెట్టా??ఈ రోజు రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలలో పెద్ద కుదుపు కుదిపిన, కేంద్ర మంత్రి నిజాయితీపరుడు అయిన కిషోర్ చంద్ర దేవ్ అధిష్టానానికి రాసిన లేఖ మా బొత్స బావ్ కు కోపమొచ్చేట్టు చేసింది. మాఫియా డాన్ బొత్స గారిని, అసమర్థ సి.ఎం. కిరణ్ గారిని మారిస్తే కాని నిలువ నీడ లేదని లేఖ రాసినట్టుగా మీడియాలో ప్రచారంతో బొత్స బావ్ అగ్గి మీద గుగ్గిలమై పోయి రాసిన పత్రికపైనా కోర్టుకు వెళతానని స్క్రోలింగ్ ఆపక పోతే మీడియాపై కూడా కోర్టుకు పోతానని రుసరుసలు విసవిసలు మధ్య దూసుకుపోయాడు.

అయినా బావ్ నువ్వు మాఫియా డాన్ అంటే చంకలు గుద్దాల్సింది పోయి అలా గరం అవుతావేంటి బావ్.. ఇప్పటికే నీవైపు కన్నెత్తి చూడడానికి భయ పడుతున్నారాయె.. ఇంక నీ పేరు కూడా తలవరు కదా.. నువ్వు చేస్తున్నన్ని కబ్జాలు, ఈ నాలుగు జిల్లాల్లో నీ మేనల్లుడు షాడొ లీడర్ చేస్తున్న దాదాగిరీ తెల్దా పెద్దాయనకు. అందుకే కూసింత గట్టిగా సెప్పినాడు ఆ గట్టి పిండం. మద్యం మాఫియా బట్టబయలు చేయబోతే ఆ ACP ని శంకరగిరి మాన్యాలు పట్టించేసి కిరణ్ ముడ్డికిందకి చిరు చాపను లాగి భయపెట్టి ఆ ACB కేసులను మాఫీ చేయించీసి తెల్ల కార్డుయ్ గాల్లని పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరిగేట్టు చేసిన మహానుభావుడివి. ఇవన్నీ దగ్గరగా ఎరిగిన పెద్ద మనిషికి ఒళ్ళు మండి రాసీసాడు. మరేటి సేత్తావేంటి. అయినా సూట్ కేసులున్న నీకు భయమేటి. కాళ్ళ బేరంలో నీకు సాటిరారు కదా..

మరింక కిరణ్ గారి గురించి ఎంత తక్కువ మాటాడుకుంటే అంత మంచిది.. అదంతా పెద్దాయన సూసుకుంతాడు..

‘అ’ధర్మాన నీ చిలుక పలుకులు కట్టిపెట్టు…


'అ' ధర్మాన

ఒక్కో మాట చిలుకలా పలుకుతూ గత కొన్నేళ్ళుగా రాష్ట్ర కేబినెట్ లో చక్రం తిప్పుతున్న ‘అ’ధర్మాన ప్రసాద రావు A5 ముద్దాయిగా సి.బి.ఐ. వాన్ పిక్ కేసులో చార్జిషీట్ దాఖలు చేసిన తరువాత కూడా ఇంకా తనేమీ ఎరుగనట్టు ముఖం పెట్టి (పాలిపోయిందిలెండి) ఇంకా తాను చార్జిషీట్ చదవలేదని చదివాక స్పందిస్తానని చెప్తూ ఢిల్లీకి తుఱుమన్నారు మన మంత్రివర్యులు.

అధికారంలోకొచ్చిన దగ్గర నుండి మాటల బుకాయింపుతో మేక వన్నె పులిలా ప్రవర్తిస్తూ శ్రీకాకుళం జిల్లాలో తిరుగులేని నాయకుడిగా చలామణీ అవుతూ దాదాగిరి చేస్తూ తన కొడుకు పేర కన్నెదార కొండ గ్రానైట్ రాయి నిక్షేపాలున్న దానిని వ్రాయించి అడుగులకు మడుగులొత్తే అధికారగణంతో స్థానిక గిరిజనులను భయభ్రాంతులకు గురి చేస్తూ వస్తున్న వీరి భాగోతం నేటితో బయటపడింది. యిలా తనకున్న పలుకుబడిని అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ థర్మల్ పవర్ ప్లాంటులను నెలకొల్పుతాను ఎవడు అడ్డం వస్తాడో వాడి అంతు తేలుస్తానని ప్రకటించి స్థానిక పర్యావరణ ఉద్యమకారులను బాంబులతో బెదిరించిన నయా ఫాక్షనిస్టు నాయకుడు ‘అ’ధర్మాన.

అధికారంలో వుండగా కన్నూ మిన్నూ కానక వేలాది ఎకరాల పంట భూములను పారిశ్రామికీకరణ పేరుతో ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేసిన ‘అ’ధర్మాన నేడు అది తన శాఖకు సంబంధం లేని వ్యవహారంగా బుకాయింపజూస్తున్నాడు.

రైతులు, ఆదివాసులను నిర్వాశితులుగా మార్చి కూడూ గూడూ గుడ్డకు దూరం చేసిన యిలాంటి దుర్యోధనులను వీరి అధికార గణాన్ని తీవ్రంగా శిక్షించితేనే రేపటి తరం కాస్తా పచ్చదనమైనా మిగిలి ఊపిరి పీల్చుకుంటుంది. కావున తక్షణమే వీరిని మంత్రివర్గం నుండి బహిష్కరించి నైతిక విలువలను పాటించాల్సిన అవసరముంది. ఇంకా సన్నాయి నొక్కులు నొక్కి ప్రజలలో అభాసుపాలు కాకూడదని ఆశిస్తున్నా…

అమ్మకానికి న్యాయం…


ఇదేమైనా మనకు కొత్త వార్తా…

లేక మనకు మింగుడు పడనిదా…

గాలి జనార్థన రెడ్డికి ఐదు కోట్లు లంచం తీసుకొని బైల్ ఇచ్చారంట న్యాయమూర్తిగారు..

ఏదో కక్కుర్తిపడ్డారు ఆయన గారు..దానికి ఇంత పెద్ద వార్త చేసి బిల్డప్ ఇచ్చాయి ఈ రోజు వార్తా పత్రికలు..దీనిని సామాన్య జనం ఏమైనా చదివి రోడ్లెక్కి అబ్బో ఆ న్యాయమూర్తిగార్ని శిక్షించి న్యాయ దేవత శీలాన్ని కాపాడండి అని గగ్గోలు పెడతారా ఎక్కడైనా ఎప్పుడైనా..

నీకు వ్యతిరేకంగా వున్న వాడి గురించి ఇంతింత బాక్స్ ఐటంలు కట్టి రాస్తావే కానీ అదే నీ దగ్గరివాడో లేక నీ పార్టీవాడో చేసినప్పుడు అశ్వథ్థామ హతః అన్న స్టైల్లో ఎక్కడో ఆరో పేజీలో రాస్తున్నావే..మరి నీకెక్కడి బాధ్యత వుంది.. అందుకే ఇలాంటివి ఎవడూ పట్టించుకోవడం మానేసాడు..

వాడికి డబ్బు ఎక్కువుంది..అమ్ముడుపోయే వాడు దొరికినప్పుడూ వీజీగా కొనుక్కున్నాడు.. అసలు ఇలా మేనేజ్ చేయడం కొత్తనా…ఎవడికి అవకాశమున్నంత మేరా వాడు ఈ దేశంలో చేసుకు పోతూనే వున్నాడు కదా..

మన దేశ ప్రధానమంత్రివర్యుల పాలనా కాలంలో ఎన్ని కోట్ల రూపాయల కుంభకోణాలు వెలుగులోకొచ్చినా వారు మాత్రం నాకే మసి అంటనేలేదు.. నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటానంటారు..అంటే ఆయన రాజకీయం చేస్తున్నట్టే కదా..మరి ఆయనెన్నడైనా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారా?? అసలు ఆయన రాజకీయాలలో వుంటే ఏంటి లేక పోతే మనకేంటి..దమ్ముంటే ఏ శిక్షకైనా సిద్దమే అనాలి.. తనకు తెలీకుండా ఇన్ని లక్షలకోట్లు దారి మళ్ళుతాయా.. అయినా ఆయన గురించి పరిశోధించి నిరూపించే కాలానికి ఆయనా పదవిలో వుంటాడా? లేక ఆయనేమైనా యుక్త వయసులో నవనవలాడుతున్నారా?? అసలు మన దర్యాప్తు సంస్థల స్పీడు తెలీనిదా మనకి..

అందుకే ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా?? పాలక వర్గమే భ్రష్టు పట్టి పోయుంటే ఇంక దాని నాలుగు కాళ్ళలో ఒకటి కుంటిదని బాధ పడడం మన వెఱితనం కదా…

తారలు ఈ సమాజపు నిలువెత్తు ప్రశ్నలు కారా??ఇటీవల ఆంధ్రజ్యోతి వారి టీవి చానల్ ద్వారా పత్రిక ద్వారా ఏదో ఓ పెద్ద నేరస్తురాలిని పట్టుకున్నట్టు, తన ఒక్క దాని వల్లనే ఈ తెలుగునేలంతా కుళ్ళిపోతున్నట్టు రోజంతా ఊదరగొట్టి రోజూ కథనాలు ప్రచురిస్తూంది. ఈరోజుకు రాజకీయ నాయకులు, వారి తాబేదార్లు, పోలీసులకు తనతో లింకులు వున్నాయని వాటిని బయటపెట్టుతూ తనను తాను రక్షించుకోజూస్తున్నట్టు కథనం రాసింది. అలాగే కొంతమంది రా.నా.ల వలన తనకు బెదిరింపులొస్తున్నట్టుగా కూడా.. ఒంటరిగా వున్న ఆడదానిని చంపేయడం అదీ ఇలా ముద్ర పడ్డ వాళ్ళని ఏం చేసినా ఈ సమాజం హర్షిస్తుందిలే ఆన్న ధీమా వున్న వాళ్ళు ఏమైనా చేయొచ్చు..

అసలు మీడియా అంత పవిత్రంగా ఏడిసిందా ఈ దేశంలో???

అసలు ఇది తారా చౌదరితోనే మొదలయ్యిందా? లేక అమ్మె ఒక్క దానితోనే అంతమయిపోతుందా.. ఇలాంటి వారు ఈ సమాజంలోంచి వస్తున్న వారే కాదా?? ఎంతమంది జీవితాలను ఈ సమాజం నాశనం చేస్తూ వాళ్ళని ఇలా పెడదోవ పట్టడానికి దోహదం చేయడంలేదు. రాజకీయనాయకులు, అధికార గణం వీరిని ఇలా తయారు కావడంలో పాత్ర వహించడం లేదా.. వ్యభిచార వృత్తి మన సమాజంలో అంతర్లీనంగా అంగీకరింప బడుతూ శతాబ్ధాలుగా వస్తున్నదే కదా… మరి తారా చౌదరి వలన నష్టమెవరికి జరిగింది. ఏదో పెద్ద స్టింగ్ ఆపరేషన్ తో పట్టుకున్నటు బిల్డప్ ఇచ్చి అదో దేశ ద్రోహ నేరంలా మీడియా చూపుతోంది.. వారిని సంస్కరించాల్సింది పోయి వాళ్ళ ఫోటోలు వేసి వాళ్ళను మరింత కుంగిపోయేట్టు చేయడం ద్వారా ఉపయోగముంటుందా…లేదంటే వాళ్ళు మరింత మొరటుగా తయారవ్వడానికి ఈ ప్రచారం ద్వారా మరింత పెరగడానికైనా ఉపయోగపడుతుంది ఇలాంటి కథనాలు.

కుళ్ళిన సమాజంలో వుంటూ ముక్కు మూసుకున్నామనడం హాస్యాస్పదం కాదా.. ఈ వ్యవస్థలో తారాచౌదరిలు వస్తూనే వుంటారు… వారిని వెంటాడి వేటాడకండి.. వారి తప్పు తెలుసుకొని మారే అవకాశమిద్దాం…

సోనియా ……..చాటున దాగిన చిరు..


భారీకాయం కలిగిన ఏనుగు ఎంత గట్టిగా గాలి వెనక వదులుతుందో అని మునుపుటికి ఒకడు తిరగ్గా తిరగ్గా తుస్ మని వదిలేసిందన్నట్లు పాపం చిరు తన ప్రరాపా సూరీడుని కొంగుచాటున కుంగదీసి నవ్వలేక నవ్వు రాక ఏడ్వలేక కాంగీ కండువాతో చీదుకుంటూ ఈరోజు మాటాడిన మాటలు వింటుంటే ఎంత నవ్వుతాం.. మాటాడితే సోనియమ్మ ఎంత ఆదరించారో అంటాడు. అంతే కానీ ఎంతకు అమ్ముడుపోయానో చెప్పడు. ఇంతా చేస్తే బహిరంగ సభ లేదు కదా ఓ చిన్న గదిలో ఓ రజస్వల కార్యక్రమంలా ముగించేసారు పాపం.. రాహుల్జీ మొఖంలో నవ్వు కూడా లేకపాయే,. అక్కడ అన్నా తలనొప్పితో ఏ మీడియా వాడు ఏమడిగేస్తాడో అని హడావిడిగా ఓ పోజిచ్చి వెళ్ళిపోయినాడు. ఆ తరువాత తెచ్చిన కండువాలు కప్పితే దారితప్పిన నవ్వుతో వేయించుకొని మైకు ముందు ఐదు నిమిషాలు మాటాడి చిరు ముగించేసాడు. ఇంక ఈ తీర్థంతో తానేదో సాధించేస్తానన్న భ్రమలలో జనం లేరని గ్రహింపుకొస్తే మంచిది. సొంత లాభం చూసుకోవడంలో అరవింద్ చేయూత ఎలానూ వుంది కదా….

మరో డ్రామాకు తెరతీసిన నాయకులు


మన రాష్ట్ర రాజకీయ నాయకులు ముఖ్యంగా అధికార పార్టీ వాళ్ళు మరో హైడ్రామాకు తెరతీసారు. రాష్ట్ర పాలనా వ్యవహారంలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, రైతాంగం నుండి విద్యార్థులు, నిరుద్యోగులు అంతా తీవ్ర సంక్షోభంలో పడిపోయిన సందర్భంలో కేంద్రం కూడా మితిమీరిన పెట్రో ధరలు, నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సందర్భం, పీకల్లోతు అవినీతి ఊబిలో కూరుకుపోయి ఊపిరాడక మరో మారు తెలంగాణా పేరుతో ఏదో ఒక రకంగా ప్రజల దృష్టిని మళ్ళించేందుకు వారి సభ్యుల రాజీనామా ఎత్తుగడలను చూపుతూ ఏదో జరిగిపోతుందన్న గాభరా సృష్టించి ప్రజలను అయోమయంలో పడేసి, రెచ్చగొట్టి ఊరికే తిని కూచునే తమ బలగాలను ఉసిగొలిపి మంట రేపే ప్రయత్నమే జరుగుతోందనిపిస్తోంది.. ఈ హైడ్రామాకు ప్రజలే తెరదించాల్సిన సమయం ఆసన్నమైంది. బీ వేర్ ఆఫ్ దీస్ ఆలీబాబా నలబై ఒక్క దొంగలు…

ఏదో ఒక బొమ్మే కదా సారూ…


నేను తోలుబొమ్మను కాను.. మన్మోహన్జీ…

కాకపోతే

పిండిబొమ్మో, రబ్బరు బొమ్మో, చెక్క బొమ్మో…

మొత్తానికి ఏదో ఒక బొమ్మేనని ఒప్పుకున్నారు కదా సారూ….

నాయకుడు కాని వాడా? కాలేని వాడా?


కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆజాద్ గారు కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా నాయకుడు కాడని, నాయకుడుగా ఎదిగేందుకు సమయం పడుతుందని, అంతదాకా అలా వుండనివ్వండని సెలవిచ్చారు.. వై.ఎస్.కు నాయకుడు కావడానికి నలభై ఏళ్ళు పట్టిందన్నారు.. మరి ఈయనకు ఎన్నేళ్ళు టైమ్ ఇవ్వాల్సింది?  

మరి అటు పార్టీ నాయకుడు కాక, ప్రజలభీష్టం మేరకు ఎన్నిక కాని వాడ్ని సి.ఎం. చేసిన అధిష్టానం బుద్దిలేనితనమా? ఆయన గుండు గీయించాడు సరే..కానీ పాలనా వ్యవహారాలలో కూడా గుండు సున్నాగా మిగిలిపోతున్నారు..

ఇంక పులి మీద పుట్రలా మా బొత్స బావ్ అధికార పగ్గాలు చేపట్టాడు.. ఇప్పటికే ఇద్దరి మధ్య అనురాగం అంతంత మాత్రమే.. త్వరలో ఈ సీను అటూ ఇటూ మారనుందా?