మేల్కొలుపు

సినిమా వాళ్ళ చీప్ ట్రిక్స్..


సినిమాలో సత్తా లేక ఆడుతుందో లేదో అన్న సందేహం వచ్చిన వెంటనే ఏదో ఒక వివాదాన్ని ముందుకు తెస్తూ ప్రచారం కల్పించుకునే చీప్ ట్రిక్స్ కు పాల్పడుతున్నారు. ఇటీవల విడుదలైన రాంబాబు, దేనికైనా రెడీ దీనికి తార్కాణాలు. రాంబాబుకు తెలంగాణా సెగ తగిలి డీలా పడ్డాడు. అలాగే గత కొణ్ణేళ్ళుగా హిట్ లు లేక ఆవురావురుమంటున్న మోహన్ బాబు సంతానం ఈ సినిమాతో ఎలాగైనా కనీస పెట్టుబడి తిరిగి రాబట్టుకోవాలన్న ఆశతో మూడో రోజు నుండి బ్రాహ్మణ వ్యతిరేక సీన్లపై రగడ మొదలయ్యేట్టు చేసారు. నోటి దురద మోహన్ బాబు కాస్తా అతిగా మాటాడి అభాసు పాలయ్యాడు. మొదట సెన్సార్ బోర్డ్ మెంబరు పై దాడి నుండి యిలా ఈ వర్గంపై వరకు కొనసాగించాడు.

అసలు వీళ్ళకు ఈ వారసత్వపు జవసత్వాలు లేకపోతే వీళ్ళతో ఎవడైనా సినిమాలు తీసేవాడా??
వెధవ ట్రిక్కులాపి మంచిగా సినిమా తీసి జనంలోకి రండిరా బాబూ…

వొట వృచ్చం..


మా బావ్ పాత బండి

అయ్యా, మా బొత్స బావ్ అంటే అంత ఈర్ష్య పడిపోతుంటారయ్యా అందరూను. ఇంతింతై వటుడింతై అన్నట్లు  మా వోడు మఱిసెట్టు నెక్క ఊడలు దిగబారించేసినాడు మా జిల్లాలో..

మరొకడెవుడూ జిల్లాలో అడుగుపెట్టనీకుండా తన సామ్రాజ్యం ఇస్తరించేసినాడంటే నమ్ము.. ఇంకొకడెవుడు బ్రాందీ, సారా వేపారానికి రానీయక ఓల్ సేల్ మొత్తం సిండికేట్ తనసేతుల్లోనే..

జిల్లా కేంద్రంలో పెబుత్వ జాగాలల్లో తన మల్టిప్లెక్స్ లు కట్టించేత్తున్నాడు బావ్..ఎప్పుడైనా మా ఇజీనగరం వొత్తే బస్సుల కాంప్లెక్సుకాడాగి ఒకమారు ఎదురుగుండా సూడండయా బావ్.. అక్కడ వున్న పెభుత్వ జాగా మొత్తం లీజుకు తీసుకున్న అంబికా కంపెనీ వోడ్ని బయపెట్టి ఈయన గారు దొబ్బేసి పెద్ద మల్టీప్లెక్స్ కట్టేత్తున్నాడంతారయ్యా. నిజం ఆ పెరుమాల్లకే తెలియాలయ్యా.  అలాగే మరి ఆ సుట్టుపక్కలెక్కడా జాగాలు మిగలనీయలేదు.. అటు గోదారమ్మ జిల్లాల్లో కూడా పాగా ఏసీనాడని ఇనికిడి..

జిల్లాలో అంగన్వాడి నుండి  కలెక్టర్ పోస్టు దాకా మా బావ్ మేనల్లుడు బావ్ సూసుకుంతాడని మావోడు ఎక్కడున్నా గుండెమీద సెయ్యేసి ఆయిగా నిద్రపోతాడునెండి. ఎందుకంటే ఆబావ్ అలాపిలాటి బావ్ కాదు మరి. ఆ బావ్ సెల్లెత్తినాడంతె పనైపోయిందన్నలెక్కే.. ఎవురికైనా ఏటి కావాలి బావ్ ఇంతకమ్టే.. ఇలపింటి మనుసులు ఎందరు కావాలి..ఒక్కల్జారా…

బావ్ ఈ పాలి ఎలచ్చన్లొత్తే   మొత్తం   నియోజకవర్గాలన్నీ మా బావే   (అంటే తమ్ముళ్ళు, బావా బామ్మర్దులు, మేనళ్ళుల్లు) పోటీ సేస్సెనా ఆచ్చర్యపోనక్కర్లేదు బావ్. 

రిజర్వుడు వంతారా ఆయన సెప్పులు మోసినోల్లూ ఇప్పుడు సానా మంది వున్నార్లెండి. 

రానున్న పంచాయతీ ఎన్నికల్జూడండి మా సెడ్డ రంజుగుంతాయి మరి. ఇంక తన ఇస్వరూపం సూడాల్సిందే.. 

ఈ దెబ్బతో బీసీ వోట్లన్నీ ఆయనకే..ఆయన పార్టీకే ఏసేత్తారని అమ్మగారు సా సెడ్డ నమ్మకంతో ఈజీగా కుర్సీలో సారగిలబడ్డారని తేలుతోంది. మరి మా వోడు అలాపింటిలాపింటి ప్లాన్లేత్తాడనుకున్నారేటి.. ఈ దెబ్బతో ఎగస్పార్టీవోల్లందర్నీవోల్ మొత్తం సాపలో సుట్టేసి మా పెదచెరువులో ఇసిరేత్తాడు సూడండి…

ఒకపాలి తీరిక జేసుకొని  మీరొచ్చి సూసి ఈ వట  వ్రుచ్చం కింద గానోదయం పొంద ఇన్నపం.. మా సెడ్డ మనోవికాసం పొందుతారని ఆమీ..ఉండండి మరి నా బీడీ ఐపోవచ్చింది…

352 – స్వేచ్చపై చీకటి తెర..


ఈ రోజుకు సరిగ్గా 35 ఏళ్ళ కిందట అర్థరాత్రి నాడు ఈ దేశాన్ని చీకటి గదుల్లోకి నెట్టిన ఒక నియంత పాలనలో మగ్గిన దినాలను గుర్తుచేసుకోవడమంటే మనిషి సంఘజీవిగా మారిన తరువాత తనకు తాను నియంత్రించుకునే క్రమంలో ఒక నిబద్ధ పౌరుడిగా సాంఘిక బాధ్యతలను నిర్వర్తించేందుకు ఏర్పరచుకున్న చట్రాలలో తన కళ్ళపై తానే తారు పూసుకునేట్టు చేయగల ప్రభువుల పాలనలోకి బలవంతంగా తోసివేయబడతానని ఊహించని సామాన్య జీవి ఈ దేశంలో ఓ మహారాజ్ని పరిపాలనలో కొనసాగడానికి తనకున్న (లేని) అధికారంతో  352 అన్న ఈ అధికరణంలోని రాకాసి కోరలతో  ఏమైనా చేయగలనని నిరూపించిన చీకటి రోజు.  ఓ ఆడ హిట్లర్ పాలన కొనసాగిన దుర్దినాలు. నాజీల వారసులేం చేయగలరో ప్రజలకు ప్రత్యక్షంగా అనుభవమైన 19 నెలలు…

ఆనాటి సాంఘిక పరిస్థితులను మరల చదువుతుంటే ఈ దేశంలో అధికారంలో వున్న వాడి చంక నాకడానికి అటు అత్యున్నత పదవిలో వున్నవాడి దగ్గరనుంచి న్యాయమూర్తుల దాకా ఎంతగా బరితెగిస్తారో నన్నది ఒళ్ళు గగుర్పొడిచే పచ్చి నిజం. ప్రతి నిమిషం తనను తాను కాపాడుకునేందుకు రాజ్యాంగానికి చేయాల్సిన అక్రమ సవరణలన్నీ చేస్తూ న్యాయాన్ని, ధర్మాన్ని అపహాస్యం చేసిన ఓ ప్రధానికి అడుగులుకు మడుగులొత్తిన నాటి అధికార గణం ఆ తరువాత తమ కార్యకలాపాలపై కనీసం ప్రజలకు వివరణనిచ్చుకునే నైతికత నేటికీ ఈ దేశంలో లేదు. ఆమె పుత్ర రత్నాన్ని రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆ రోజుల్లో ‘సూర్యోదయమయ్యింది’ అని న్యాయమూర్తులు ఉత్తరాలు రాసారంటే ఈ దేశ న్యాయస్థానాలు ఎవరికోసం పనిచేస్తున్నాయో అర్థమవుతుంది. ఈ కాలంలో లక్షలాదిమందిని డిటెన్యూలపేరుతో జైళ్ళలో కుక్కారు. ఎవరికీ ప్రభుత్వ చర్యలకు  వ్యతిరేకంగ మాటాడే అవకాశం లేకుండా చెసారు. పౌరుల ప్రాధమిక హక్కులను హరించారు. ఇక్కడ మరో విషాదం భారత కమ్యూనిస్టు పార్టీ ఇందిరా గాంధీని సమర్థించింది.

ఈ కాలంలోనే  1976 డిసెంబరులో తీసుకువచ్చిన 42 వ రాజ్యాంగ సవరణ. రాజ్యాంగ ప్రవేశికలో కొత్తగా సోషలిస్టు, సెక్యులర్ అనే మాటలను చేర్చింది. దానితో పాటు భాగం IV Aఅనే పేరుతో, అధికరణం 51 ఎ గా ప్రాధమిక విధులు అనే పరిచ్చేదాన్ని చేర్చింది.  దీనిపై కన్నాభిరాన్ ఏమంటారంటే ‘ రాజ్యాంగంలోకి మీరు ఒక వైపు బాధ్యతలు ప్రవేశపెట్టి, మరోవైపు సోషలిజం ప్రవేశపెడుతున్నారంటే ఇవి రెండూ కలిస్తే నేషనల్ సోషలిజం అవుతుంది అని’ అంటే నేషనల్ సోషలిజం అంటే నాజీజం. హిట్లర్ అధికారాన్ని కైవసం చేసుకోవడానికి ఉపయోగించే నినాదం అది. దాన్ని అవలంబించడం అంత మంచిపనికాదంటారాయన.

అలాగే వ్యక్తుల నిర్భంధం విషయంలో రాజ్యాంగం మౌలిక నిర్మాణం దెబ్బతినడం లేదని న్యాయస్తానం తీర్పునిచ్చిందీకాలంలో. అంటే ప్రభుత్వం హక్కులు ఇస్తుంది, రాజ్యాంగం హక్కులు ఇస్తుంది. అందువల్ల ఆ హక్కులను ప్రభుత్వం. రాజ్యాంగం వెనక్కి తీసుకోవచ్చని దాని అభిప్రాయం. కాని ఇది సామాజిక ఒడంబడిక సూత్రానికే వ్యతిరేకమని కన్నాభిరాన్ అభిప్రాయం. ప్రజలు పాలకులకు, ప్రభుత్వానికి కొన్ని అధికారాలివ్వడానికి ఒడంబడిక చేసుకుంటారు. దానిని తుంగలో తొక్కి ప్రజలపై సర్వాధికారాలు తమవే అని, తాము ప్రజలకు రక్షకులుగా వారిని పూర్తిగా తమ కాలికింద అణచివేయడానికి ప్రయత్నిస్తున్నాయి నేటి రాజ్యాంగ యంత్రం.

ఈ చీకటి రోజుల అణచివేత నాటితో అంతం కాలేదు. దానికి కొనసాగింపుగా నేడు కొత్త కొత్త చట్టాలను ప్రజలను కాపాడే పేరుతో తమ అధికారాన్ని ప్రశ్నించే వీలులేకుండా అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నారు. దీనికి రాజకీయ పక్షాలన్నీ వంతపాడుతున్నాయి. మరింతగా ప్రజలపై విరుచుకుపడే చట్టాలకోసం, అధికారాల కోసం అఱులు చాస్తున్న నేటి పాలకవర్గం ఎవరి పక్షమో బహిరంగ రహస్యం. కాబట్టి ఎవరికి వారు తమకెందుకులే అనుకునే స్థితినుండి నిజమైన ప్రజాస్వామ్యం, శాంతి నెలకొనేందుకు మేల్కొనాల్సిన ఆవశ్యకతను ఈ దినం గుర్తుచేసుకోవాలని….

పల్లెటూరి పిలగాడా.. బడిబాటనెక్కని పిలగాడా


మొన్న పాఠశాలలు మొదలైనప్పటినుండి బడిబాట వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. నేను పనిచేస్తున్న గ్రామం జనాబా 800 వుంటుంది. అక్కడ వున్న ప్రాథమిక పాఠశాలలో తరగతికి ప్రస్తుతం 10 నుండి  15 మంది విద్యార్థులున్నారు. ఇందులో మొన్న 12 మంది ఐదో తరగతి వాళ్ళకు టీసీ లివ్వడమైంది. అలాగే ఈరోజుకు ఒకటో తరగతికి పిల్లలను చేర్పించమని ఇంటింటికి తిరిగినా ఎవరూ కొత్తగా చేరలేదు. కారణం మాకు దగ్గరలో 2 కి.మీ.లలో కొత్తగా ఒక ఇంగ్లీషు మీడియం పాఠశాల ప్రారంభమైంది. ఈ పాఠశాల నిర్వాహకులు ఈ మధ్య పదవీ విరమణ చేసిన వారు, చేయబోతున్న వారూ. వాళ్ళే చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్ర.పాఠశాలలో చదువు చెప్పరు మా కాన్వెంటులో చేర్పించండని ప్రచారం చేస్తున్నారు. వీళ్ళనేమనాలి. నిన్నటి వరకు అదే స్కూళ్ళలో ఉద్యోగాలు చేసి సుమారుగా 30 ఏళ్ళకు పైగా అదే బతుకు తెరువుగా వుండి, తాము పనిచేసినప్పుడు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డులకు సిఫారసులు చేయించుకొని నేడు ఇలా దుష్ప్రచారం చేస్తున్నారు. మా ఊరి ప్రధానోపాఢ్యాయుడు ఇదంతా చెబుతుంటే నిజంగా వాళ్ళని చెప్పుతీసి కొట్టాలనిపించింది. ఎందుకంటే ఈ పరిస్థితులలో వున్న ఈ రెండు పోస్టులలో ఒక పోస్టు తప్పక కొత్తగా వచ్చిన రేషనలైజెషన్ లో త్వరలో ఎగిరిపోతుంది. వున్న 5 క్లాసులకు ఒక్కరే టీచరై, విద్యార్థులెందరైనా పాఠాలు చెప్పక తప్పని పరిస్థితి ఎదురై, అటు నెల నెలా రిపోర్టులు రాసుకోవడానికి సమయం చాలక, న్యాయం చేయలేని పరిస్థితులలో ఏడుపొక్కటే తక్కువవుతుంది. ఇలా తలా ఒక చేయేసి ప్రభుత్వం నిర్వహిస్తున్న పాఠశాలలు మూసివేసే స్థితికి చేరితే వున్న ఈ ఒక్క అవకాశమూ కోల్పోతే పేద విద్యార్థులకు సరైన విద్య లభించని పరిస్థితులలో మరల పాలేళ్ళుగా మారని స్థితి తప్పదు…


దీపాలు ఆర్పితే (Earth hour) కర్బనం పోదంట!


ఈ రోజు రాత్రి 8.30 ని.ల నుండి ఒక గంట పాటు సుమారు 125 దేశాలలో అన్ని విద్యుత్ పరికరాలను స్విచ్ ఆఫ్ చేయడం వలన గ్లోబల్ వార్మింగ్ కాపాడవచ్చునని World Wildlife Fund (WWF) వాళ్ళు ఒక కార్యక్రమాన్ని రూపొందించి విస్తృత ప్రచారం చేస్తున్నారు. కానీ విద్యుత్ రంగ నిపుణులు మాత్రం దీని వలన అంత వుపయోగంలేదని చెపుతున్నారు. అన్ని విద్త్యుత్ లైట్లు ఆపి వేసినా, సప్లై కట్ చేసినా సరే ఆ తరువాత పునఃప్రారంభ సమయంలో విపరీతమైన లోడ్ పడి అంతకు రెట్టింపు కర్బనం ఉత్పత్తి జరుగుతుందని తెలియజేస్తున్నారు.  దీని బదులు విద్యుత్ పరికరాల పట్ల సరైన అవగాహన కలిగించి, మామూలు బల్బుల వాడకం నుంచి సిఎఫ్ ఎల్ వంటి విద్యుత్ తక్కువ అవసరపడే వాటిపట్ల ప్రచారం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

చూడండి http://www.telegraph.co.uk/earth/environment/climatechange/7527469/Earth-Hour-will-not-cut-carbon-emissions.html

కానీ WWF వాళ్ళు మాత్రం ఈ Earth hour పాటించడంవలన ప్రజలలో విద్యుత్ వినియోగంపట్ల, పర్యావరణం  పట్ల  ఎరుక కలుగజేయవచ్చునని ఆశపడుతుంది.  ఏదేమైనా మన ఆలోచనలలో మార్పు రానంతవరకు ఏదీ అమలు కాదు. మన అస్తిత్వం ప్రశ్నార్థకం కాబడేంతవరకు దానిపట్ల ఎరుక వుండదు. Empire State of Building (New York), Big Ben (London), Eiffel Tower (Paris) ల దగ్గర కూడా మొత్తం చీకటే ఆ గంట.

ఏమైనా నేడు రాష్ట్ర విద్యుత్ పరిస్థితి మన వాతావరణాన్ని కాపాడే విధంగానే వుంది కదా సారూ..

యువతరానికి రాజకీయాలు అవసరం లేదా?


విద్యార్థులపై ఉక్కుపాదం పోస్టులో ఒక మిత్రుడు కామెంటు రాస్తూ విద్యార్థులు చదువుకోవాలి కానీ రాజకీయాలులో పాల్గొనరాదన్న అర్థంతో కుక్క గాడిద కథ చెప్పారు.

దీనికి నా సమాధానమిక్కడ రాద్దామనిః

యూనివర్శిటీలలో మన చదువులు అకడమిక్ సిలబస్ లకు మాత్రమే పరిమితం కావడం వలన అవి మార్కులు, పనికిమాలిన డాక్టరేట్లకు పరిమితమయిపోయాయి. సమాజానికి ఏమాత్రం ఉపయోగం లేని, ఉద్యోగ బానిసలను తయారు చేయడానికే పనికి వచ్చి, కుల, మత, వర్గ, వర్ణాలతో కుళ్ళీపోయాయి.  యూనివర్శిటీ విద్యార్థులంటే 18 ఏళ్ళకు పైబడ్డవారే వుంటారు. వారికి సమాబంలో జరుగుతున్న పరిణామాలకణుగుణంగా స్పందించే హృదయం వుండడం తప్పా?

ఓటు హక్కు వచ్చే వయసును 21 నుండి 18 ఏళ్ళకు మన దివంగత యువ ప్రధాని మార్చి, ఎన్నికల రంగంలోకి దించలేదా? మరి ఓటు వేసే వారికి రాజకీయ అవగాహన, సమాజంలోని మార్పులను చూసే విజన్ కావాలి కదా? ఇది మరి ఆకాశం నుండి ఊడిపడుతుందా?

అలాఅయితే ఓటు హక్కు 30 ఏళ్ళు నిండి జీవితంలో స్థిరపడ్డవారికి మాత్రమే కలిగించాలి. తద్వారా మన సమాజంలో కీలక మార్పుకూడా చోటు చేసుకుంటుంది. మంచి నాయకత్వాన్ని ఎన్నుకునే అవకాశం కూడా కలగవచ్చు.

ఎన్నికలొస్తే తమ ఝెండాలు మోయడానికి, జేజేలు కొట్టడానికి,  దొంగ ఓట్లు వేసేందుకు యువకులు కావాలి. కానీ తమ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం రాజకీయాలొద్దు చదువుకోవాలని సుద్దులు చెబుతారు.  ఇది మోసపూరితం కాదా?

ఆత్మ బలిదానం పోరాటమార్గం కాదు..


ఈ రోజు తెలంగాణా కోసం  ఆత్మార్పణ చేసిన వేణుగోపల్ రెడ్డి త్యాగం ఒక నిరాశా, నిస్పృహ వాతావరణం కారణంగా జరిగినది.  కానీ ఇది పోరాట రూపం కాదు.

విద్యార్థి, యువజనుల బలిదానాలు వృధా కాకుండా వుండాలంటే నిస్వార్థ రాజకీయ నాయకులు ముందుకు రావాలి.

కళ్ళముందు ఒక మోసపూరిత వాతావరణం ఆవరించుకుంటున్న క్రమంలో తమను తాము ఒక దుఃఖపూరిత మేఘం కమ్ముకొని, చీకట్లు ఆవరించగా జరుగుతున్న ఈ బలిదానాలను ఆపే ప్రయత్నాలను ముమ్మరం చేయాలి.

పేదింటి బిడ్డలు యిలా తమ తల్లిదండ్రుల కలలను కల్లలు చేయ బూనుకోవడాన్ని నిరోధించాలి.

పోరాటమంటే ఎదుటివాడి కాలర్ పట్టుకు నిలదేసేలా వుండాలి.

మోసపూరిత ముఖాలపై కాండ్రించి వుమ్మే చేవతో ముందుకురావాలి.

శతృవుని దిమ్మతిరిగే దెబ్బ తీయాలి.

గొంతెత్తి బిగ్గరగా నినదిస్తే ఢిల్లీ పీఠం అదిరేలా వుండాలి.

మన ఒక్కో అడుగు శతృవు గుండెలపై పిడుగులు  పడేలా వుండాలి.

అంతే కానీ మనకు మనం చంపుకుంటే, శవాలపై గుడ్డలు అమ్ముకునే నాయకులున్న నేటి కాలంలో ఏమీ సాధించలేము.

ఈ ఆత్మ బలిదానాలకు నేటి రాజకీయ పరిపాలనా  వ్యవస్థనే బాధ్యులను చేయాలి. ప్రజలంతా ఈ డిమాండ్ తో కదలాల్సిన అవసరం వుంది.

చివరిగా వేణుగోపాల్ రెడ్డి కి కన్నీటి వందనాలు..

మనం సినిమాలు చూడడం మానేస్తే తప్పేంటి?


ఈ రోజుల్లో వస్తున్న సినిమాలను జనం చూడడం మానేస్తే తప్పేంటి?

ఏ సినిమా అయినా ప్రజల జీవన ప్రమాణాలకు దగ్గరగా వుందా?

ప్రజల ఆలోచనలను మెరుగుపరిచేవిగా ఉంటున్నాయా?

భారీ సెట్టింగులతో, హీరోయిన్ల గోచిపాతల డ్రెస్సులతో,డాన్సులతో  హీరోగారి బూతు డైలాగులతో, వీర విహారాలతో సమాజానికి ఏమాత్రం సంబంధంలేని కథ(?) లతో, హింసా, రక్తపాత దృశ్యాలతో తెల్లని వెండితెర నిండా కప్పి జనం ఆలోచనలను పక్కదారి పట్టించేవిగా తయారయాయి.

కోట్లాది రూపాయల వ్యాపారం జరుపుకోవడానికి లేనిపోని ఫీలింగ్స్ ను జనం మెదళ్ళలో చొప్పించే ప్రయత్నం చేస్తూ మన బలహీనతలతో ఆడుకుంటున్నారు. ప్రపంచీకరణ పేరుతో డబ్బింగ్ సినిమాలు వచ్చి ఏదో జరిగిపోతుందని, అందులో తామే తెలివైన వారిగా గుర్తింపు పొందేందుకు తమ self డబ్బాగా తీస్తున్న అమెరికా వాడి సినిమాల ప్రభంజనం ఎక్కువయి మరింత భయాందోళనలకు గురిచేస్తున్నారు.

ఈ వ్యాపారాల ద్వారా సాధించిన లాభాలతో తిరిగి మన పై స్వారీ చేయడానికి రాజకీయాలలో చేరి తమ ప్రాభవాన్ని నిలుపుకోవాలని చూస్తున్నారు.

కావున కొద్ది రోజులు ఈ బూతు, రక్త పిపాస డ్రాక్యులాగాల్లను నిషేధించడం మంచిదే కదా?

సైనిక పరిపాలనా దిక్కుగా రాష్ట్రాన్ని నెడుతున్నారా?


అవుననే అనిపిస్తోంది. సైన్యంలో పనిచేసిన వాణ్ణి, కేంద్రంలో రక్షణశాఖకు సలహాదారుగా పనిచేసి అనేక ప్రజా ఉద్యమాలను కరకుగా అణచివేసిన వాణ్ణి, ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో చత్తీస్ ఘడ్ లో ఆదివాసీ ప్రాంతాలలో అల్లకల్లోలాన్ని సృష్టించేందుకు నియమించబడిన నారాయన్ లాంటి కరకు వ్యక్తిని ఈ రాష్ట్రానికి తాత్కాలిక గవర్నర్ గా నియమించడంద్వారా రాష్ట్రంలో జరుగుతున్న ప్రజాస్వామిక ఆకాంక్షతో కూడిన ఉద్యమాన్ని అణచివేయడానికి కేంద్రం సమాయత్తమవుతోంది. ప్రజాస్వామిక వాదులు, మేథావులు, మానవహక్కుల కార్యకర్తలు అప్రమత్తంగా వుండి పౌరహక్కులను పరిరక్షించేందుకు సమాయత్తంకావాల్సిన అవసరముంది.