పోరాటాలు

తొడ చరిచిన విజయనగరం..


clock tower-viziznagaram 1
గత ఆరు రోజులుగా విజయనగరం కడుపులో దాచుకున్న బిడ్డనుకున్న వాడే కాలితో తంతే తొడ చరిచి నిలబడింది ఈ రోజు. కళ్ళ ముందు నీవు ఆక్రమించుకుంటూ పోతున్న తన భాగాలన్నీ పోయినా బాధపడని విజయనగరం నువ్వు పాలు తాగే రొమ్మునే గుద్దుతా వుంటే చూస్తూ వూరుకోలేక మంటలతో సమాధానం చెప్పింది. కావిడితో సారా అమ్ముకొని పెరిగిన బాబు వారసుడు ఈ రోజు ఇంతింతై అంతై రక్కసిలా మీదపడి పీక నులుముతుంటే చూస్తూ ఊరుకోలేకపోయింది. పసివాడని పిల్లలపై కంట్లో కారం చల్లి చావు దెబ్బలు కొట్టిన వాడి పునాదులు పెకిలించే గునపంగా మారింది.

ఇదంతా ఇక్కడ పోలీసు బాసుగా పని చేసి ప్రమోషనిచ్చి పంపి అదుపు చేయమని అంటే వారికి మేమంతా దొంగలుగా, సంఘ విద్రోహ శక్తులుగా కనబడటంలో ఆశ్చర్యం లేదు. గాలిని బంధించి ఊపిరాడకుండా శక్తిని హరించేద్దామని విఱవీగే వాడికి తొడ చరిచి ఎదురొడ్డి సవాల్ విసురుతోంది మా గున్నమ్మ వారసురాలు.

పాలపేకెట్టు 50 రూపాయలు గుడ్డు 10 రూపాయలుకు కొనుక్కునే స్థితికి నెట్టి ఆకలితో మండించి అదుపు చేద్దామని చూస్తున్నాడు.

బావ్ నువ్విప్పుడు మా తూరుపు కాపోడివి కాదురా బావ్. మాకెప్పుడో తెలిసిపోనాది. నీ మూతివీడని ఇసపు నవ్వులో డబ్బు దర్పంతో కాలెగరేసే దొరతనంతో నువ్వో ఇసప్పురుగువని. నువ్వింక నీ నోట్ల కట్టలలో కాలి పోవాలి తప్ప నీకు మా కంట తడి దూరమైపోనాది.