నివాళి

విద్వ్హంసకర అభివృద్ధికి ప్రతిఫలం – హిమవిలయం


Uttarakhand-rescue-AFP

Kedarnath shrine floods _0

Siva_Statue_RAin_PTI

మనిషి ప్రకృతితో పాటు జీవిస్తే అది తనను కాపాడుతుంది. ప్రకృతికి విరుద్ధంగా ఏదో సాధించేసామన్న గర్వంతో వినాశకరమని అంతా చెప్తున్నా వినకుండా విధ్వంసకర అభివృద్ధికి బాటలు వేసుకుంటూ పోతే ఇలా తానున్న కొమ్మనే నరుక్కున్నట్టు తన వినాశనానికే దారితీస్తుంది. కేదారినాథ్, బదరీనాథ్, చార్ దామ్ లలో జరిగిన ప్రళయ గంగా విస్ఫోటనానికి మన గుడ్డి ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలే కారణం. లెక్కకు మిక్కిలి జలవిద్యుత్ ప్రాజెక్టులు కట్టి, నదుల గమనాన్ని మార్చడానికి పర్వత సానువులను తొలచి రక రకాలుగా వాటి గమనాన్ని మార్చడంతోపాటు టూరిజమొక్కటే తమ ఆదాయ వనరుగా అక్కడికి అడ్డూ అదుపూ లేకుండా యాత్రికులను తోలడం కూడా ఈ మానవ వినాశనానికి సజీవ సాక్ష్యం. ఇలాంటి అభివృద్ధి మన వినాశనానికి నాందిగా పర్యావరణ శాస్త్రవేత్తలు, మేధావులు ఎన్ని మార్లు ఎన్ని రకాలుగా చెప్పినా రాబడి ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలే వీటికి బాధ్యత వహించాలి. అంత ఇరుకు రహదారుల మధ్య వేలాది వాహనాలను పోనివ్వడం ముందు చూపులేని ఘోర తప్పిదం. హిమాలయ ప్రాంతంలో ముందుగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు చేయలేదని వింటున్నాం. ఈ శాఖ ఇచ్చే నివేదికలు మామూలు రోజులలోనే సాధారణ ప్రదేశాలలోనే తారుమారు అవుతుంటాయి. అలాంటిది ఇంత ఎత్తైన ప్రదేశాలకు అన్ని వేలమంది యాత్రికులను అనుమతించడం తప్పిదం. ఇలా ఈ ప్రళయానికి మన అత్యాశే కారణం.

ఇలా ప్రకృతి వినాశనానికి కారణభూతమయ్యే అణువిద్యుత్ ప్రాజెక్టులు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డగోలు అనుమతిలిస్తున్న ఈ గుడ్డి ప్రభుత్వాల దాష్టీకాన్ని ఇకనైనా ప్రజలంతా కలిసి ఎదుర్కోక పోతే ఇలాంటి ప్రళయాలు సాధారణమై భారతదేశ చిత్రపటంలో మనిషి లేకుండా పోతాడు. వుంటే గింటే రోగిష్టి మానవులుంటారన్నది సత్యం.

ఈ ఆపదలో చిక్కుకుని మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజెద్దాం.

ఈ ఆపత్సమయంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న త్రివిధ దళాల సైనికులకు వందనం.

ఇక్కడ కూడా రాజకీయ యాత్రలు చేసే నాయకులకు శతకోటి వందనాలు.

నిబద్ధతకు నిలువెత్తు ఆకారం కా. గోరు మాధవరావు..కొంత మందినే ఎందుకు గుర్తుంచుకుంటాం?
వాళ్ళనే అలా ఎందుకు గుర్తుంచుకోవాలి??
మిగతా వారికంటే వారెందుకు ప్రత్యేకం??
వారు విడిచి వెళ్ళిన గుర్తులేమున్నాయి??
యిలా ప్రశ్నల మీద ప్రశ్నలు మదిలో దొలుస్తుంటాయి…

కానీ ఒకే నిబద్ధతతో నిర్మలంగా మచ్చ లేకుండా తమ జీవిత కాలం అదే పట్టుదల అదే దీక్షతో ఇరవైలలో మొదలైన ఉత్తేజం, తన్నుకొచ్చిన ఉద్వేగం, ఆవేశం ఎనభైవ పడిలో కూడా ఆ నెత్తురు చల్లబడక రగులుతున్న అగ్ని పర్వతంలా మరింత ప్రకాశిస్తూ తన చుట్టూ మరింత వెలుతురును పోగేస్తూ జ్వాల ఆరకుండా ఊపిరిలూదుతూ సెగతో దుర్వ్యవస్థ పట్ల అదే కసి, ప్రతీకారంతో రగిలిపోయే రగల్ జెండాగా బతకడం ఆషామాషీ కాదు. నిప్పుల కొలిమిలాంటి నిర్బంధంలోనూ తొణకని బెణకని తన నైజం, మంటలు కురిపించే తన మాటలు ఇవేవీ ఊరికే గొప్పలు చెప్పుకునే మామూలు మనిషిలా కాకుండా అతి సామాన్యంగా నిబ్బరంగా నిలబడి చెప్పగలిగిన మనిషి కా.గోరు మాధవరావు.

తన జీవిత కాలమంతా పోరు బాటలోనే సాగించిన పోరాటయోధుడు. తను నమ్మిన సిద్ధాంతం కోసం, ఎత్తి పట్టిన జెండా కోసం అహర్నిశలూ కృషి చేసిన వాడు. కలుపు మొక్కలను ఏరుతూ పంటను కాపాడే రైతులా, ఒక్కో పోగునూ కలుపుతూ పేనుతూ మగ్గంపై నేసే చేనేత కార్మికునిలా ఇటు ఉద్దానం నుండి అటు కలకత్తా వరకు సాగించిన విప్లవ యానం మరువ లేనిది. అజ్నాతంలో వున్నా, అరెస్టై జైలు గోడల మధ్య వున్నా, అఖిల భారత రైతు కూలీ సంఘం బాధ్యతలు, అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక జాతీయ అధ్యక్షునిగా, అమరవీరుల బంధు మిత్రుల కమిటీ బాధ్యునిగా ఏ పని చేసినా నిబద్ధతతో నిర్వర్తించిన కామ్రేడ్. సోంపేట కాకరాపల్లి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడపడంలో ప్రముఖ పాత్ర వహించినవారు మాధవరావు.

తనకంటూ వున్న పేరును ఏనాడూ తన కోసం, కుటుంబం కోసం వాడుకోని పవిత్ర కమ్యూనిస్ట్ మాధవరావు. ఎందుకంటే తాను వృధ్దాప్యంలో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు పడినా తానో నక్సలైట్ నాయకునిగా, కార్మిక నాయకునిగా ఎవరినీ భయపెట్టో, ప్రలోభపెట్టో దండుకోని నిస్వార్థ జీవి కా.మాధవ రావు.

ఈ మనిషి ఉత్తరాంధ్ర వాడు కావడం, చేనేత కులానికి చెందిన వాడవడం పేరు ప్రఖ్యాతులు రాలేదని ఎవరూ గొప్ప నివాళి కూడా రాయలేదని మిత్రులు కొంత మంది అంటున్నారు. కానీ అది ఆయన ఆశయానికి నడవడికకు విరుద్ధమైన భావం. ఏ పని చేసినా దాని వెనక ఉద్యమానికి సాయమందించాలనే ఆయన పట్టుదల, అతి సామాన్యంగా నిరాడంబరంగా జీవించి ఆచరించి చూపిన ఆయన ప్రజా మార్గం మనకు అనుసరణీయం. ఇదే ఆయనకు గొప్ప నివాళి కదా? ఆఖరి శ్వాశ వరకు తను కలలు కన్న విప్లవ ప్రజాస్వామిక సమాజ నిర్మాణం పట్ల ఆయనకున్న ప్రేమను విడవనితనం మనకాదర్శం కావాలి. ఉద్యమ దిక్సూచిగా ఆయన నిర్వర్తించిన కార్యాన్ని కొనసాగించడం మన బాధ్యత.

కా.గోరు మాధవ రావు అమర్ రహే…

మరో సామాన్యుని పక్షపాతి (K.G.కన్నాభిరాన్) ఇకలేరు


హక్కుల వాది


ఆయనను
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
మానవహక్కుల కొరకు ఉద్విగ్నంగా పోరాడే న్యాయవాది’
అంది..

నక్సల్బరీ తరం నాయకుడు
సత్యనారాయణసింగ్
‘ప్రాసిక్యూటర్లకు ప్రాసిక్యూటర్’ అన్నాడు..

ఒకప్పటి మానవహక్కుల నేత, జర్నలిస్టు,
ఇప్పుడు సంఘపరివార్ సిద్ధాంతకర్త
అరుణ్ శౌరి
‘లోకాధివక్త’ అన్నాడు..

ఆయన
నాలుగు దశాబ్ధాలుగా
న్యాయవాద వృత్తిలో
పోరాడే ప్రజల హక్కుల
పరిరక్షణ కోసం
అహర్నిశలు శ్రమిస్తున్న
అసాధారణ మేధావి

ఆంధ్రదేశంలోనే కాదు
దేశం మొత్తానికే
పౌర, ప్రజాతంత్ర హక్కుల స్ఫూర్తికి
పర్యాయ పదంగా ఎదిగినవాడు

మనిషిగా సామాన్యుడు
వాదనా పటిమలో అసామాన్యుడు
తోటి మనిషి హక్కులను కాపాడడంలో అనితర సాధ్యుడు

పై వాక్యాలన్నీ చదవగానే ఈ తెలుగునేలపై వున్న ఆ అసామాన్యుడు ఎవరో ఇప్పటికే అర్థమై వుంటుంది. ఈ వాక్యాలు 24 గంటలు అన్న ఆయన ఆత్మకథాత్మక సామాజిక చిత్రం అనే పుస్తకం వెనక అట్టమీదున్నవి. ఆయనే మనందరి హక్కుల న్యాయవాది కె.జీ.కన్నాభిరాన్. ఆయన ఈ సాయంత్రం 5.00 గం.ల ప్రాంతంలో అమరులయ్యారన్న వార్త సామాన్యులకు, నిరంతరం నిర్బంధాన్ని ఎదుర్కొంటున్న వారికి అశనిపాతం. ఆయన లాంటి మరో న్యాయవాది పేదలకు, తాడిత, పీడిత వర్గాలకు ఇప్పట్లో మరల లభ్యంకావడం దుర్లభం. ఈ రోజుల్లో మనుషులలో పెరిగిపోతున్న నిర్లిప్తత, నిర్లక్ష్యం, వ్యక్తివాద ధోరణి, స్వార్థం మానవత్వాన్ని చంపేస్తున్న వేళ అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న తీవ్ర సంక్షోభం కాలంలో ఇది అశనిపాతం..

జోహార్ కన్నాభిరాన్ జోహార్ జోహార్..

సా ‘మాన్యుని’ కి వందనం..


భారతరత్న


ప్రజా నాయకుడంటే యిలా వుండాలని జీవించి చూపించిన మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారిని తన 107వ జన్మదినం సందర్భంగా తలచుకోవడం ఈ కాలం చాలా అవసరం. చిన్ననాటినుండి నిరాడంబర జీవితాన్ని గడిపిన శాస్త్రి తనకు వరకట్నంగా ఓ చరఖాను, కొంత నూలును తీసుకున్నారంటే ఆయన తన జీవన శైలిని ఎంతగా రూపుదిద్దుకున్నారో ఆశ్చర్యం. జీవితమంతా తను నమ్మిన విలువలకు కట్టుబడి మంత్రిపదవిని కూడా తృణప్రాయంగా త్యజించిన మానధనుడు. తను ప్రధానిగా ఎన్నికైన క్లిష్టకాలంలో దేశాన్ని ఏకతాటిపై నిలబెట్టిన జైజవాన్ జైకిసాన్ నినాదాన్ని అందించిన స్ఫూర్తిప్రదాత శాస్త్రీజీ. ఈ నినాదాంతో ఆయన పాకిస్తాన్ తో జరిగిన యుద్ధాన్నే గెలిపించి చూపించిన ధీశాలి. మఱిమాను కింద మరో వృక్షం మొలవదన్నట్లు ప్రముఖుల భజనలలో అసలు సిసలు భారతీయుడైన శాస్త్రీని గుర్తుపెట్టుకోవడం కష్టమే. జీవితమంతా ఓ నులకమంచంపైనే సాగించిన రాజకీయ నాయకున్ని ఈ కాలం ఊహించగలమా? మిస్టరీగా మిగిలిన ఆయన మరణం ఎప్పటికీ జవాబులేని ప్రశ్నలా మిగిలిపోవడం విషాదం..

ఇప్పటికీ ఇలా ఇంకా నినదించాల్సిన అవసరముందన్నది అంతా గుర్తుచేసుకుందామా??

జైజవాన్
జైకిసాన్

రేపు ఫీనిక్స్ పక్షిలా ఎగిరివస్తాం..


గాడుపు వీచిన ప్రతిసారీ
తొలకరి జల్లు కురుస్తు౦ది
భూమ్మీద పడ్డ విత్తనం
మొలకెత్తి మానవ్వక మానదు

నేడు నువ్వు తగలబెట్టిన బూడిదలోని౦చి
రేపు ఫీనిక్స్ పక్షిలా ఎగిరివస్తాం
ఓడి గెలవడమే చరిత్ర
వెనకడుగు వేసినది
అడ్డుగా వున్న దానిమీ౦చి ఎగిరి రావడానికే…

వీరజవానులు-హిమపాశంమనం రోజూ యింత ధైర్యంగా గుండెలపై చేయేసుకొని నిదురపోతున్నామంటే

రేపటి సూర్యోదయం చూస్తున్నామంటే ..

మన రోజువారీ  వ్యాపారాలు, వ్యవహారాలు

ప్రేమలు, పెళ్ళిళ్ళు, పురుడులు, చావులు,

ఎన్నికలు-రాజకీయాలు, ఉద్యమాలు, ధర్నాలు,

వంటలూ-వార్పులూ,

సినిమా రిలీజులు, గలీజులు,

పబ్ లూ-బార్లూ , తాగుడూ-తూలుడూ..

కుట్రలూ-కుహకాలు,

అంతా సాఫీగా, సాదాగా, భారీగా

ఎవరికి వారి పరిమాణంలో

జరిగిపోతున్నాయంటే

వీటి వెనక ఓ అదృశ్య శక్తి అదే మన

వీరజవానుల రెప్పవేయని కాపలా

వారినే కప్పిన హిమపాతం యమపాశమయి

వారి కలలను కల్లలు చేయడం పెను విషాదం

వారి అమరత్వానికి నా గుండెలనిండిన  నిలువెత్తు SALUET

(కాశ్మీర్ దగ్గర్లోని గుల్బర్గా వద్ద హిమతుఫాన్ లో చిక్కుకొని అమరులైన 17 మంది వీరజవానుల స్మృతిలో)

ఉద్యమాల సంద్రమే


గుండె గుండెంతా

గాయాల కూడలైనప్పుడు

జీవితం

పోరాటాలకేంద్రమే

ఉప్పొంగే

ఉద్యమాల సంద్రమే.

..అలిశెట్టి ప్రభాకర్  (12.01.1954-12.01.1993)

(అంతిమ శ్వాసదాకా విప్లవోద్యమ అభిమానీ, కవితా చిత్రశిల్పీ, ఫోటో చిత్రకారుడూ అయిన ప్రభాకర్ స్మృతిలో ఆయన పదునైన కవితా పాదం)

కాలరెత్తిన దళితుడు


ఒంటినిండా బట్టా

కడుపునిండా తిండే కాదు

మనిషిగా గుర్తింపుకోసం

నీ యుగాల ఆక్రందనను

ఎలుగెత్తి చాటిన

దళిత జాతి సింహగర్జన

జై భీం

అందుకో మా ఆత్మగౌరవ

పోరాట వందనాలు

శ్రీకాంత్ అమర్ రహే..


ఒక ఆవేదనా పూరిత
ఆవేశ క్షణాన
ఇన్నినాళ్ళు నీ నేల తల్లిని చెరబట్టిన
వారికి కొరివి పెట్టాలన్న నీ
కోరికను బిగ్గరగా నినదించేందుకు
నీవే కొవ్వొత్తివై
భవిష్యత్ తరాల జీవితాలకు
దివిటీగా మారే నీ
స్వచ్చమైన గొంతును
ఇలా బలిదానం చేసి
మా వెన్నులోని చలిని పటాపంచలు
చేసిన నీ త్యాగం
నూతన తెలంగాణా  చరిత్ర పుటల్లో
నెత్తుటి తడి అక్షరాల మద్య
సజీవం మిత్రమా…
నీ ఆశయం నెరవేరేందుకు
నేడు లక్షలాది పాదాలు కదులుతున్నాయి..

జయహో ముంబై


ముంబై – ఇది  ఒక గాయపడ్డ నగరం

నెత్తురోడుతున్న నగరం

సామాన్యుడి నెత్తురితో హోళీ ఆడుతున్న నగరం

గత్యంతరం లేక డబ్బావాలా సాగిపోతున్న నగరం

 

మీ నవ్వు వెనకాల దాగిన దుఖం

బిగబట్టిన మీ పెదవి వెనకాల దాగిన దృశ్యం

మా గుండెల్లో పదిలం…