నిర్లక్ష్యం

విద్వ్హంసకర అభివృద్ధికి ప్రతిఫలం – హిమవిలయం


Uttarakhand-rescue-AFP

Kedarnath shrine floods _0

Siva_Statue_RAin_PTI

మనిషి ప్రకృతితో పాటు జీవిస్తే అది తనను కాపాడుతుంది. ప్రకృతికి విరుద్ధంగా ఏదో సాధించేసామన్న గర్వంతో వినాశకరమని అంతా చెప్తున్నా వినకుండా విధ్వంసకర అభివృద్ధికి బాటలు వేసుకుంటూ పోతే ఇలా తానున్న కొమ్మనే నరుక్కున్నట్టు తన వినాశనానికే దారితీస్తుంది. కేదారినాథ్, బదరీనాథ్, చార్ దామ్ లలో జరిగిన ప్రళయ గంగా విస్ఫోటనానికి మన గుడ్డి ప్రభుత్వాల అభివృద్ధి నమూనాలే కారణం. లెక్కకు మిక్కిలి జలవిద్యుత్ ప్రాజెక్టులు కట్టి, నదుల గమనాన్ని మార్చడానికి పర్వత సానువులను తొలచి రక రకాలుగా వాటి గమనాన్ని మార్చడంతోపాటు టూరిజమొక్కటే తమ ఆదాయ వనరుగా అక్కడికి అడ్డూ అదుపూ లేకుండా యాత్రికులను తోలడం కూడా ఈ మానవ వినాశనానికి సజీవ సాక్ష్యం. ఇలాంటి అభివృద్ధి మన వినాశనానికి నాందిగా పర్యావరణ శాస్త్రవేత్తలు, మేధావులు ఎన్ని మార్లు ఎన్ని రకాలుగా చెప్పినా రాబడి ఒక్కటే లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలే వీటికి బాధ్యత వహించాలి. అంత ఇరుకు రహదారుల మధ్య వేలాది వాహనాలను పోనివ్వడం ముందు చూపులేని ఘోర తప్పిదం. హిమాలయ ప్రాంతంలో ముందుగా వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు చేయలేదని వింటున్నాం. ఈ శాఖ ఇచ్చే నివేదికలు మామూలు రోజులలోనే సాధారణ ప్రదేశాలలోనే తారుమారు అవుతుంటాయి. అలాంటిది ఇంత ఎత్తైన ప్రదేశాలకు అన్ని వేలమంది యాత్రికులను అనుమతించడం తప్పిదం. ఇలా ఈ ప్రళయానికి మన అత్యాశే కారణం.

ఇలా ప్రకృతి వినాశనానికి కారణభూతమయ్యే అణువిద్యుత్ ప్రాజెక్టులు, థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణాలకు అడ్డగోలు అనుమతిలిస్తున్న ఈ గుడ్డి ప్రభుత్వాల దాష్టీకాన్ని ఇకనైనా ప్రజలంతా కలిసి ఎదుర్కోక పోతే ఇలాంటి ప్రళయాలు సాధారణమై భారతదేశ చిత్రపటంలో మనిషి లేకుండా పోతాడు. వుంటే గింటే రోగిష్టి మానవులుంటారన్నది సత్యం.

ఈ ఆపదలో చిక్కుకుని మరణించిన వారి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజెద్దాం.

ఈ ఆపత్సమయంలో నిస్వార్థంగా సేవలందిస్తున్న త్రివిధ దళాల సైనికులకు వందనం.

ఇక్కడ కూడా రాజకీయ యాత్రలు చేసే నాయకులకు శతకోటి వందనాలు.

అత్యవసర ఉగ్రవాద వ్యతిరేక చర్యలు..


cycle
రాష్ట్ర ప్రభుత్వం అత్యవసరంగా చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్యలుః-

మీరేమైనా మీ పిల్లలకు స్కూల్ కు వెళ్ళేందుకు సైకిల్ కొనాలనుకుంటే రాష్ట్ర డి.జి.పి.గారికి దరఖాస్తు చేసుకొని వీలయితే మీ ఎం.ఎల్.ఏ. లేక ఎం.పీ.గారి సిఫారసు లెటర్ తీసుకుని వస్తే పర్మిషన్ ఇస్తూ లైసెన్స్ కింద కొంత మొత్తాన్ని మరికొంత మొత్తాన్ని ఖర్చుల నిమిత్తం చెల్లించాలని ఆర్డర్ జారీ చేసారు.

మీరు టిఫిన్ బాక్సు కొనాలనుకున్నా ఇకపై పై విధమైన పద్ధతులు పాటించాలని సర్కారు వారి ఆర్డర్.

ఎందుచేతనంటే సైకిల్ ఇప్పుడొక బాంబ్ బ్లాస్టింగ్ సాధనం కాబట్టి. అలాగే టిఫిన్ బాక్స్ కూడా.

కరప్షన్ వెల్త్ గేమ్స్ (CWG)..


corruption tiger


కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణ ఎంత లోపభూయిష్టంగా వుందో రోజూ చూస్తున్న వార్తలు ద్వారా తెలుస్తూనే వున్నాయి. దీని వలన మన దేశం పరువు పోతున్నదన్న బాధ ఎక్కువగా వుంది. అసలు క్రీడల మంత్రే దీనిని ముందునుండి వ్యతిరేకిస్తున్నాడు. గేమ్స్ జరిగిన రోజుల్లో భారత్ లోనే వుండనన్నాడు. నిన్నటికి నిన్న ఓ బ్రిడ్జి కూలిపోయింది. ఇప్పటికె 17.2 మేర బిడ్ రేట్ ఎక్కువ చేయబడిందని ఆయన పార్లమెంట్లోనే ప్రకటించారు. అవినీతిలో కూరుకుపోయిందని తీవ్రంగా విమర్శలనెదుర్కొంటున్న ఈ క్రీడల నిర్వహణ మన అవినీతి పతాకను ఆకాశన్నంటినట్లుగా ఎగరవేస్తున్న ప్రయత్నాలలో అంతా తలమునకలై వున్నారు. కానీ ప్రభుత్వ అధికారులు, నిర్వహణ బాధ్యతలు చేపడుతున్న సురేష్ కల్మాడీ గార్లు వట్టిదే ఇదంతా అంటూ తమ వాదనతో నెట్టుకు రావడానికి చూస్తున్నా నిన్నటి సంఘటనతో అది తేట తెల్లమైంది. మన బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా కూడా ఏర్పాట్లన్ని అధ్వాన్నంగా వున్నాయని ప్రకటించింది. అయినా పాలక వర్గానికి చీమకుట్టిన్ట్లయినా లేకపోవడం విచారించదగ్గ విషయం. ఆర్థిక పరిస్థితి తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఈ క్రీడల నిర్వహణ చేపట్టి ఏం సాధిస్తారు? తడి ఆరని పునాదులతో ఎవరి ప్రాణాలు తీద్దామని? ఏడేళ్ళుగా పూర్తిగానివి ఇప్పటికిప్పుడు చేస్తే కూలిపోవా?

అయినా వలస పాలనకు దూరమై షష్ఠి పూర్తయినా ఇంకా బ్రిటిష్ రాజరిక అంశగా మిగిలిన ఈ కామన్ వెల్త్ సభ్యత్వం ద్వారా సాధించేదేమిటి? దాని నుండి తప్పుకుంటే వచ్చే నష్టమేమిటి?

మలేరియా మహమ్మారి..ఇక్కడ నేను మలేరియా ఎలా వస్తుందో దాని పుట్టు పూర్వోత్తరాలు చెప్పడానికి కాదు. అందరికీ తెలిసిన విషయమే. అందునా ఏదో ఒక సారి ఈ మహమ్మారి మహత్యం ఎరిగిన వారు చాలా మందే వుంటారు.

గ్రామీణం, పట్టణం తేడా లేకుండా ఇప్పుడు ఈ మహమ్మారి బారిన పడని ప్రాంతం లేదు. ఏజెన్సీ గ్రామాలలో ఈ వ్యాధి తీవ్రత చాలా అతిగా వుంది. ప్రతి ఏటా సుమారు 2,000 నుండి 3,000 మంది దీని కారణంగా మృత్యువాత పడుతున్నారు. కారణం అక్కడ వైద్య సౌకర్యాలు దూరం కావడం. మొక్కుబడి మెడికల్ కాంపుల నిర్వహణ, అధికారుల బాధ్యతా రాహిత్యం, పోషకాహార లోపం కారణంగా మరణాలు ఏ ఏటికాయేడు పెరుగుతున్నాయే తప్ప తరగడంలేదు. పోయేది గిరిజనులు కాబట్టి వారి గురించి పట్టించుకునే నాధుడు లేడు. సంక్షేమ హాస్టళ్ళ నిర్వహణా లోపం, పర్యవేక్షణలో అవినీతి కారణంగా విద్యార్థుల మరణాలు అధికంగా వుంటున్నాయి. ఏమైనా అంటే గిరిజనుల మూర్ఖత్వాన్ని ఎత్తి చూపుతూ తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం, PHC ల లో వారి హాజరు అంతంత మాత్రం. ఎవరైనా అధికారి గట్టిగా నిలదీస్తే రాజకీయ పైరవీలతో వారి నోరుమూయించడం జరుగుతోంది.

గ్రామాలలో పారిశుధ్యం నిర్వహణ రాజకీయ ప్రమేయంతో అట్టడుగున వుంటోంది. ప్రజలు ఈ సీజన్లో అత్యధికంగా వైరల్ జ్వరాల బారిన పడతారని ముందుగానే తెలిసినా పట్టించుకునే వారు లేరు. వచ్చిన నిధులన్నీ ఫలహారంగా మారుతున్నాయి. ప్రతి పల్లె ఓ జ్వర కుంపటిగా మండుతోంది. ఇందుకు మున్సిపాలిటీలు కూడా మినహాయింపు కాదు.

గత వారంగా నన్ను మలేరియా, టైఫాయిడ్ పట్టి పీడుస్తోంది. మందులు వాడుతున్నా దాని ప్రభావం తగ్గడంలేదు. కాస్తా మంచి వైద్యం అందుతున్న నాకే ఇలా వుంటే ఏ ఆధారమూ లేని గిరిజన ఆవాసాలలో వాళ్ళు ఎలా భరిస్తున్నారో…

దీనికి నివారణ మనలో నిలదీసే చైతన్యం వృద్ధి కావాలి.