డిమాండ్

భారతరత్నమా నువ్వింత చీపా??


ఈ దేశ అత్యున్నత పద్మా అవార్డు భారత రత్న నిన్న మరికొద్ది నెలలో ముగిసిపోతున్న ప్రధాని సలహాదారుకు నిన్నటి వరకు ఆడి రిటైర్ అవుతున్న సచిన్ కు ప్రకటించారు. ఆ శాస్త్ర సాంకేతిక సలహాదారు ఏం సలహాలిచ్చారో కానీ ప్రధాని గారు తనకెక్కడా మసి అంటలేదని సర్ఫ్ ఎక్సెల్ ఏడ్ లా మాటి మాటికి ప్రకటించుకొని అప్పుడప్పుడు తమ కాళ్ళకు అడ్డం పడుతున్న తమ కుక్క పిల్ల సిబిఐ, కాగ్ లపై ఆగ్రహం వెళ్ళగక్కుతున్నారు ఈమద్య.

యింక క్రికెట్ అన్న జెంటిల్ మెన్ క్రీడను చెడ్డీలతో డాన్సులు చేసి బెట్టింగు వ్యాపారాలకు హద్దులు చెరిపేసి ఫిక్సింగ్ లతో పరువు పోయిన క్రీడగా మార్చిన శుభ తరుణంలో వున్న ఆ క్రీడాకారునికి ఈ రత్నాన్ని అలంకరించడం నాకు నచ్చలేదు. అలా అని ఈ రత్నాలు అలంకరించబడ్డ వారందరు గొప్పోళ్ళనీ ఒప్పుకోలేను.

హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్, ఒలింపిక్ వీరులు మిల్కాసింగ్, పి.టి.ఉష లాంటి వారు ఈయనకంటే మిన్న కాదా?

వీటికి రాజకీయపు నిరోధ్ లు తొడగబడుతున్న ఈ సమయంలో మరింతగా అంతా ఆహా ఓహో అని మీడియా అంతా తెగ గగ్గోలు పెట్టేస్తూ వుండడం యిదంతా ఆ క్రీడ ద్వారా లబ్ధిపొందుతున్న చానళ్ళు, తమ సమస్యలకంటే గెలుపోటములపైనే దృష్టి మళ్ళించే యిటువంటి వాటిని ప్రచారం చేయడంలో ముందుండే రాజకీయ పార్టీలు వీళ్ళకు కొమ్ము కాయడం మనం వంతపాడడం దురదృష్టకరం.

సంక్షేమం క్షామం అవుతున్నది…


రాష్ట్రంలో గత కొన్నేళ్ళూగా వసతి గృహాలలో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి అతి దయనీయంగా మారుతున్నది. హాస్టల్ విద్యార్థులకు రోజుకు 17/- లు మాత్రమే భోజనానికి ఇస్తున్నారు. దీనిలో సంక్షేమాధికారుల వాటాలు పోను వారికి కనిష్టంగా పది రూపాయలతోనే పెడుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి కనిష్ట ప్రమాణాలకు దిగజారుతూ ఎంతో మంది విద్యార్థులు మరణాలకు గురవుతున్నారు ప్రతి యేడూ.

గిరిజన ఆశ్రమ విద్యార్థులది మరీ దారుణమైన పరిస్థితి. వీరికి ఎక్కువగా మలేరియా వ్యాధి సోకి అనారోగ్యానికి గురైతే వీరిని ఆసుపత్రులలో చేర్చక తల్లిదండ్రులతో ఇంటికి పంపించి చేతులు దులుపుకుంటారు. దీంతో వీరు కనీస రహదారి సదుపాయం లేని గ్రామాలకు వలసలకు చేరుకొని అక్కడ చావుతో పోరాడి ఓడిపోతున్నారు. ఇలా ప్రతి ఏటా వందలాది విద్యార్థులు మరణిస్తున్నారు. దీనిపై సర్వేలు చేసి ఏవో ప్రకటనలు ఇచ్చి ఆచరణ శూన్యమైన పథకాలతో చేతులు విదిలిస్తున్నారు. వీరికి ప్రాధమికి వైద్యం అందుబాటులో వుండదు. మలేరియా డ్రగ్స్ వాడితే పోషక విలువలువున్న అహారం అవసరం. కానీ అది వీళ్ళకు అందుబాటులో వుండ ఈ మందుల ప్రబావంతో జాండిస్ ఇతర సైడ్ ఎఫెక్ట్సుతో చావుకు లోనవుతున్నారు. ఇటీవల మా ITDA పరిధిలోని గ్రామాల పర్యటన సందర్భంగ నేను గమనించింది ఇది.

ఇంకో ముఖ్య విషయం రోజుకు ఖైదీకి భోజన ఖర్చు 50/-లు, ప్రభుత్వాసుపత్రులలో రోగికి 40/-లు (ఇందులో కమీషన్లు పోనూ రోగికి 25/-లు కూడా అందడంలేదన్నది వేరే విషయం) కానీ విద్యార్థికి రోజుకు 17/-లు మాత్రమే మంజూరు చేస్తున్నారు. ఇందులో సంక్షేమాధికారుల వాటా అధికం. ఇలా సరైన పర్యవేక్షణ లేక హాస్టళ్ళలో అతి దారుణ పరిస్థితులలో మగ్గుతూ SC, ST, BC విద్యార్థులు మరో గత్యంతరం లేక చదువులు కొనసాగిస్తున్నారు. కోట్లాది రూపాయలు విద్యకు ఖర్చు చేస్తున్నామని ప్రకటనలకే పరిమితమవుతున్నది ప్రభుత్వం. కింది స్థాయికి వచ్చేసరికి రూపాయికి తక్కువవుతున్న వైనం అందరికీ ఎరుకలో వున్నదే. సంక్షేమం నుండి ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న ప్రభుత్వం కార్పొరేట్ విద్యను ప్రోత్సహిస్తూ పేదలకు విద్యను అందని ద్రాక్షను చేస్తున్నది. పేద విద్యార్థులు హాస్టళ్ళలో కూడా తమ దారిద్ర్యాన్నే అనుభవిస్తూ అవమానాలు పడుతూ విద్యాభ్యాసం చేస్తున్నారు. దీంతో హైస్కూలు విద్యకు వచ్చేవారు సగానికి పైగా తరిగిపోతున్నారు. ఆ తరువాత కొనసాగినా అతి తక్కువ మందే చివరి వరకు ఉంటున్నారు. కూలి కొడుకు మరల కూలిగానే మిగిలిపోతున్నాడు…

భర్తల కోసం భార్యల ఆక్రోశం..ఏ కారడవిలో వున్నాడో, ఎప్పుడొస్తాడో, ఎలా వస్తాడో, బతికి వస్తే సంతోషం లేకపోతే నుదుట కుంకుమ చెరిగిపోయి తను పిల్లలు అనాథలయి బతకాలని, ప్రతి క్షణం తన కోసం కల కంటూ బతక లేక, చేస్తున్న ఉద్యోగం ఎవరికోసమో అర్థం కాక, తను ఏం తిన్నాడో ఎలా వున్నాడో తెలీని అగమ్యగోచరంలో ఓ భయానక వాతావరణంలో ఒంటరితనం భరించలేక గత మూడు రోజులుగా రోడ్లపై కొచ్చి తామూ మనుషులమేనని గుర్తించాలని పిల్లా పాపలతో ఓ ఆడ మంత్రి వున్న శాఖలోని మహిళలంతా ఆక్రోశిస్తే అదే శాఖలోని మరో సుఖం మరిగిన దున్నలు వెటకారం చేస్తే చెప్పే ఆయుధంగా తిరగబడి పిల్లినైనా గదిలో బంధిస్తే ఏం చేస్తుందో చేసి చూపారు స్పెషల్ పోలీసు బెటాలియన్ సాయుధ పోలీసుల భార్యలు…

వారి ఆవేదన వెనక దాగి వున్న ఎన్నో కఠోర సత్యాలు నేటికి మీడియా ముందుకొచ్చి అందరికీ తెలిసాయి. నిజానికి యిలా తమ దోపిడీ పాలనకు వత్తాసుగా తమకు రక్షణగా పనిచేస్తున్న వారి పట్ల యింత నిర్దయగా వ్యవహరించే ప్రభుత్వం వారి పై అధికారులకు యివన్నీ తెలియనివా? బ్రిటిష్ కాలం నాటి ఆర్డర్లీ వ్యవస్థను ఈనాటి ప్రజాస్వామ్యమని చెప్పుకొనే పాలనలో కూడా అమలు చేస్తూ కింది స్థాయి పోలీసును బానిసగా చూస్తూ దొర పెత్తనం చెలాయించే వీళ్ళకు నడి బజారులో కాలర్ పట్టుకోవద్దా. వారికి లేని హక్కును వారి భార్యలు చేసి చూపారు. ఇదే విధంగా ఆ పోలీసులే స్వయంగా చేసి వుంటే వారిపై క్రమశిక్షణా చర్యలంటూ భయపెట్టే వారు. అలాగే ఇక్కడ మరో విషయం ఇన్ని లక్షల మంది పోలీసులలో చాలా వరకు ఎస్.ఐ.కంటే దిగివ స్థాయి సిబ్బందంతా దిగువ మధ్య తరగతి, బీద కుటుంబాలనుంచి వచ్చినవారే. ఈ ఉద్యోగమూ లేకపోతే బతకలేమని చేస్తున్న వారే. ఈ విషయమెరిగిన పాలకులు వీరిపట్ల ఇంత నిర్దయగా వ్యవహరిస్తున్నారు.

కావున వీరి డిమాండ్లన్నీ సహేతుకమైనవి కాబట్టి వీరిని మనుషులుగా సంసారులుగా గుర్తిస్తూ అంగీకరించేందుకు పాలక వర్గంపై అన్ని వర్గాల ప్రజలు వత్తిడి తేవాల్సిన అవసరముంది.

జూడాలకు మద్దతు తెలుపుదాం…


రాష్ట్రంలో గత నెలరోజులుగా కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె పట్ల ప్రభుత్వం రక రకాల వ్యాఖ్యానాలు చేస్తూ వైద్య విద్యార్థుల పట్ల ద్వేష భావాన్ని పెంపొందింప జేయడమే తప్ప వారి డిమాండ్ల పట్ల సముచిత వైఖరిని అవలంబించి సమస్య పరిష్కారానికి కృషి చేయకుండా మొన్నటికి మొన్న 108 సిబ్బంది సమ్మె చేస్తే RTC డ్రైవర్ల తో నడుపుతామన్నట్టుగా ఆసుపత్రులను కూడా ఇష్తమొచ్చిన వారితో నడిపి ప్రజల ప్రాణాల పట్ల చులకన భావం చూపుతోంది.

జూడా ల డిమాండ్లలో మొదటిది రూరల్ సర్వీసు పట్ల వ్యతిరేకత. దీనిని సాకుగా చూపి ఒక్కో వైద్య విద్యార్థికి పాతిక లక్షలు ఖర్చు పెడుతున్నట్టుగా చెబుతోంది పాలక వర్గం. కానీ ఇది నిజం కాదు. ప్రభుత్వాసుపత్రులలోని రోగులపైన, ఆసుపత్రుల నిర్వహణ ఖర్చును కలిపి వైద్య విద్యార్థి ఖర్చులో కలిపి చూపుతున్నారు. గ్రామీణ ఆసుపత్రులలో నేడు రిటైర్మెంటుకు దగ్గరగా వున్న వైద్యులు తప్ప మిగిలిన పోస్టులన్నీ అప్పుడే రిలీవైన విద్యార్థులతో నింపి గ్రామీణ ప్రజల ఆరోగ్యం పట్ల చులకన చూపు చూస్తున్నది ప్రభుత్వం. ఎక్కడ ఏ ఆసుపత్రులలోను గ్రామీణ పిహెచ్ సిలలో ఎవ్వరూ స్థానికంగా వుండి లేక శ్రద్ధతో వైద్యం చేస్తున్న వారే కరవయ్యారు. అప్పటికే ఓ ఆరేడేళ్ళు కాలేజీలలో చదువు ముగించుకొని వచ్చిన వార్ని బలవంతంగా వారికి ఇష్టంలేని ఉద్యోగం చేయమంటే శ్రద్ధ వుంటుందా? ఈ విధంగా రెగ్యులర్ ప్రభుత్వ వైద్య ఉద్యోగాలను తగ్గిస్తూ పోతున్నది. తద్వారా వైద్య రంగాన్ని సంక్షేమ రంగం నుండి తప్పించే యత్నంలో భాగంగా గుర్తించాల్సిన అవసరముంది.

అలాగే స్టైపెండు పెంచమనడంలోనూ వారి డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందించడంలేదు. వెనకబడిన ఉత్తరప్రదేశ్ కంటే తక్కువగా చెల్లిస్తూ ప్రభుత్వ కాలేజీలలో చదువుకునే విద్యార్థులకు ఆర్నెల్లకోసారి నిధులు విడుదలచేస్తూ వారి చధువునకవసరమయ్యే వసతి సౌకర్యాల పట్ల శ్రద్ధ చూపకుండా వ్యవహరిస్తున్నారు. ఏ కళాశాలలోనూ గ్రంధాలయాలలో ఎప్పటివో పాత పుస్తకాలు తప్ప కొత్తగా వస్తున్న జర్నల్స్ కానీ వైద్య గ్రంధాలు కానీ లేని నిజం అందరికీ తెలిసినదే. ఒక్కో జర్నల్ సుమారు వెయ్యి రూపాయలు విలువగలవి ప్రతి నెలా కొనుక్కొని చదివే స్థోమత ఎంతమంది విద్యార్థులకు వుంటుంది. ప్రభుత్వ కళాశాలలలో చదివే విద్యార్థులలో అధిక శాతం మంది పేద మధ్యతరగతి బడుగు జీవుల పిల్లలే అయివుంటారన్నది నిజం కాదా..

వీళ్ళ సమ్మె జరిగే కాలంలో ఆసుపత్రులలో జరిగే సాధారణ మరణాలన్నీ లెక్కకట్టి వీళ్ళ ఖాతాలో జమచేయడం ఎంతవరకు సమంజసం?

ప్రతీ ఆర్నెల్లకోసారి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు, సౌకర్యాలు పెంచుకుంటున్న పాలక వర్గం నిజానికి వైద్య విద్య పట్ల ఎంత శాతం నిధులు ఖర్చు చేస్తున్నదో బహిరంగ పరచగలరా? విడుదలైన నిధులలో ఎంత శాతం కళాశాలల అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారు? ఎంత పెద్ద మొత్తంలో అధికారులు, రాజకీయ గణం బొక్కుతున్నారో బహిరంగంగా చెప్పగలరా?

ప్రజల డిమాండ్ల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించే ముఖ్యమంత్రి మరో నీరో గా తన్ను తాను ఋజువు పరచుకోవడానికి తప్ప పాలన పట్ల శ్రద్ధలేదన్నది ప్రజలకు ఎరుకైనది. అలాగే వైద్యం పట్ల ఏమాత్రం అవగాహన లేని వారికి ఆ శాఖను అప్పగించి రౌడీలులా మాటాడిస్తున్నారు తప్ప సమస్యను సానుకూలంగా పరిష్కరించే కృషి జరగడంలేదు. ఈ విధంగా చేస్తూ చెంచా లాయర్లతో ప్రజా వ్యాజ్యాల ద్వారా కోర్తుల ద్వారా సమస్యను పక్కదారి పట్టించే యత్నం చేస్తూ నియంతలా వ్యవహరిస్తు వైద్య విద్యార్థులపట్ల ప్రజలలో ఏహ్యభావాన్ని తెచ్చే ప్రభుత్వ ధోరణిని ఖండిస్తూ జూ.డా.లకు మద్దతు తెలుపుదాం.

పద్మ అవార్డులలో కూడా మన వాటా ఇంతేనా??


ఈ రోజు ప్రకటించిన 109 పద్మా అవార్డులలో మన రాష్ట్రానికి కేవలం రెండు మాత్రమే వచ్చాయి..ఇందులో ఓ సోషల్ వర్కర్ డా.జి.మునిరత్నం, బాడ్మింటన్ క్రీడాకారుడు సయ్యద్ మహమ్మద్ ఆరిఫ్ లకు
పద్మశ్రీలు దక్కాయి. మిగిలిన కేతగిరీలలో ఎక్కడా మనవాళ్ళు లేరు భారత రత్న ఈ ఏడాది లేదని తేల్చేసారు… సచిన్ కు వయసు కాస్తా ముదిరేంతవరకు ఆగుతారేమో..ఇంకెవరూ భారతరత్నలు
ప్రస్తుతానికి లేరు…మన వాళ్ళకు లాబీయింగ్ చేయడానికి సమయం లేదు ఈ విషయంలోననుకుంటా…వీళ్ళ పదవులు కాపాడుకోవడానికె కాల్మొక్త బాంచెన్ అంటూ ఢిల్లీ యాత్రలు చేస్తేనే సరిపోతుంది
కదా??
http://ibnlive.in.com/news/full-list-2012-padma-awards/224135-53.html

ఏనుగును కప్పి ఏమార్చగలవా??


ఎన్నికల సంఘం నిర్నయాలు ఒక్కోసారి హాస్యాస్పదంగా అనిపిస్తాయి..
యూపీ ఎన్నికల సందర్భంగా మాయావతి పెట్టిన ఏనుగు బొమ్మలను కప్పి వుంచాలని ఆదేశాలు జారి చేసారు. అసలు ఆ ఏనుగుల బొమ్మలు కప్పడానికి ఎంత ఖర్చవుతుంది? కప్పినా అవి ఏనుగులవి అని జనానికి తెలియకుండా వుంటుందా?? మరి కప్పి ఎవరిని మభ్యపెట్టడానికి? వాటిని పూర్తిగా తొలగించే పని ముందుగా చేపట్టి వుండాల్సింది.
అసలు ఈ దేశంలో ఏ పార్టీ అధికారంలో వుంటే వారి నాయకుల పేర్లను పథకాలకు, వీదులు, నగరాలకు, ప్రభుత్వ భవనాలకు నామకరణం చేస్తూ ప్రభుత్వ వాహనాలపై ముద్రిస్తూ పోతూ ఆ తరువాత ఎన్నికలప్పుడు వాటిని కప్పి వుంచమనడం కంటే ప్రజా ధనంతో చేపట్టే కార్యక్రమాలకు రాజకీయ ప్రేరేపిత పేర్లను పెట్టడం నిషేధిస్తూ చట్టాన్ని చేసి అమలు చేయించాల్సిన బాధ్యత  ముందుగా చేపట్టాలి. లేకపోతే పిచ్చి కుదిరింది రోకలి తలకు చుట్టమన్నట్టుగా వుంటుంది..

అంతా నేరస్తులే..


భోపాల్ దుర్ఘటననుండి తప్పించుకో జూసే వర్గం ఒకటి, దానిని సొమ్ము చేసుకొనే వర్గం ఒకటిగా ప్రస్తుతం రాజకీయ పక్షాలు విడిపోయి దుర్ఘటన బాధితుల పట్ల తమ బాధ్యతా రాహిత్యాన్ని కప్పిపుచ్చుకోజూస్తున్నాయి. అసలు నేరస్తున్ని తప్పించడంలో కీలకపాత్ర పోషించిన నాటి ప్రధాని, ముఖ్యమంతులు ను ఇందులో తప్పించడానికి కాంగ్రెస్ వారు ఎన్ని పిల్లిమొగ్గలు వేయాలో అన్ని వేస్తున్నారు. అలాగే ఈ సంఘటన ద్వారా తామేదో సామాజిక న్యాయానికి బాధ్యులం కానట్లు అధికారంలో వున్నప్పుడు అమెరికా వాడి చెప్పులు మోసిన తీరును మరిచి పాలక పక్షంపై దాడి చేస్తోంది బి.జె.పి. కానీ ఈ రెండు పక్షాలు ఆ రాష్ట్రాన్ని ఏలినవే. అలాగే కేంద్రంలోనూ కీలక పాత్ర కలిగినవి. తీర్పు వచ్చాక ఎవరికి వారు శవ రాజకీయాలు చేస్తూ బాధితులకు మరింత కన్నీళ్ళు మిగులుస్తున్నారు.

అసలు ఈ నేరాన్ని అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసి దోషులను శిక్షార్హులను చేయాలి. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ నగరాలైన హిరోషిమా-నాగసాకీలపై జరిగిన అణుబాంబు దాడిలాగానే ఈ దుర్ఘటనను చూడాలి. పాతికవేలమందికి పైగా అమానుషంగా చనిపోతే ఒక్కొక్కరికి  పాతికవేల రూపాయల నష్టపరిహారంతో సరిపెట్టమని చెప్పిన  ఆనాటి సుప్రీం న్యాయమూర్తిని మరల విచారించాలి. ఏ ప్రలోభాలకు లోనై దీనిని ప్రైవేటు వ్యవహారంగా సెట్ ల్మెంటు చేసుకోమని తీర్పునిచ్చారో తేల్చాలి.  అర్జున్ సింగ్ కొడుకు నడిపే NGO కు అందిన ముడుపుల వ్యవహారం తేల్చాలి.  ఇందులో రాజీవ్ పాత్ర మరుగునపెట్టే ప్రయత్నం ముమ్మరంగా జరుగుతోంది. కానీ భారీ స్కాంలకు ఆధ్యుడైన కుఱ ప్రధాని చనిపోయి తప్పించుకున్నా ఈ పాపం వెంటాడక తప్పదు.  ఇంతజరిగినా నవ్వుతూ టాటా చెప్పిపోయిన  ఆండర్సన్ గాడిని విచారిస్తామన్న మాట మాత్రం ఇప్పటికీ ఈ పాలకుల నోట రావడంలేదు. లక్షమందికిపైగా అవిటి జీవనం గడుపుతున్నా వీళ్ళకు రాజకీయాలే తప్ప వారి గోడు వినబడుటలేదు. దారుణం…

పెద్దలసభకు అందరూ బాగా ఉన్నోళ్ళేనా?


ఇటీవల రాజ్యసభకు జరిగిన ఉపఎన్నికలలో అన్ని పార్టీల వారూ బాగా ధనవంతులనే పంపడానికి మొగ్గుచూపారు. పెద్దల సభ ఉద్దేశాన్నే కోల్పోయి అంతా ధనవంతులు, ప్రత్యక్ష ఎన్నికలలో నెగ్గలేని ప్రజా తిరస్కృతుల సభగా మార్చారు. దీనిని బిలియనీర్ల సభగా పేరు మారిస్తే పోద్ది.

మేధావులను, ప్రజల గురించి పాటుపడే వాళ్ళను, ప్రత్యేకంగా ప్రజల బాధల పట్ల, సమస్యల పట్ల అవగాహన కలవారిని, చట్టాల రూపకల్పనలో అనుభవజ్నులను ఈ సభకు ఎన్నుకుంటే దిగువ సభలో చట్టాలు రూపొందించినప్పుడు జరిగే పొరపాట్లను సరిదిద్దేదిగా ఈ సభ పార్లమెంటు గౌరవాన్ని నిలిపేదిగా ఉండేది. కానీ అన్ని పక్షాలు తమకు నిధులను, ఓట్లను కూడబెట్టే వర్గాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. అందరికంటే కాస్తా మెరుగయిన వాడనుకుంటున్న బాబు కూడా ఇద్దరు ధనవంతులను ఎంచుకున్నారు. వీళ్ళు ఈ పదవిలోకి వెళ్ళి జనంకు ఏం ఒరగబెడతారు.

అందుకే కా.తరిమెల నాగిరెడ్డి పార్లమెంటును పందులదొడ్డిగా అభివర్ణించారు. కాదంటారా?

రాజీనామాలు కోరడం ప్రజల ప్రజాస్వామిక హక్కు


తమకోసం ఏదో చేస్తారని తమ అమూల్యమైన ఓటు హక్కును వేసి గెలిపించిన ప్రజలకు, వారి ఆకాంక్షలు తీరేందుకు రాజీనామాను ఒక ఆయుధంగా ఎంచుకున్నప్పుడు, ప్రజా ప్రతినిధిగా వారి కోరికను మన్నించాల్సిన బాధ్యత వీళ్ళపై లేదా? ఎంతసేపు మేడమ్ ఏదో అంటారని, తాము పెట్టిన పెట్టుబడులు తిరిగి రాలేదన్నది  లోపల వుండి బయటకు ఏవో సాకులు చెపుతున్న వీళ్ళని ఏమనాలి? శాంతియుత మార్గంగా, ప్రజాస్వామిక హక్కుగా తమ డిమాండు సాధన రూపంగా ప్రజలు  ఎంచుకున్న అస్త్రాన్ని అంతే ప్రజాస్వామికంగా చేపట్టాల్సిన కనీస నైతిక బాధ్యత ప్రజా ప్రతినిధులుగా వీరందరిపై వుంది. ప్రజల ఆశలు నెరవేరిన నాడు వీళ్ళనే ఆజన్మాంతం ఎన్నుకొని తమ ఏలికలుగా సింహాసనంపై ప్రజలే కూచుండ బెడతారు. కావున రాజీనామా అస్త్రాన్ని కింది స్తాయి నుండి పార్లమెంటు వరకు అందరు ప్రజా ప్రతినిధులు ప్రజలపై గౌరవం, నమ్మకముంచి బాధ్యతగా, తమ ధీరోదాత్తతకు గుర్తుగా ప్రయోగించాలని అందరి కోరిక.

విద్యార్థి గర్జనను అడ్డుకోవడం పౌరహక్కుల ఉల్లంఘనే..


రేపు ఉస్మానియాలో విద్యార్థులు తలపెట్టిన ‘తెలంగాణా విద్యార్థి గర్జన’ సభను అడ్డుకోవడం పౌరహక్కుల ఉల్లంఘనే.

వ్యక్తుల స్వేచ్చా, స్వాతంత్ర్యాలను హరించడమే.

రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, ఎవరి హక్కులకు భంగం కలుగనీయకుండా తమ వాణిని వినిపించుకునే హక్కు ప్రతి పౌరునికి రాజ్యాంగం కల్పించింది.

విద్యార్థిలోకం తమ ప్రాంతంపై జరుగుతున్న వివక్షా, విస్మృతలను బహిరంగంగా తెలియపర్చుకునే అవకాశం వారికి కల్పించినందువలన పరిపాలనా పరమైన అసౌకర్యం ఎందుకుంటుంది?

తాము గత నెలరోజులుగా చేస్తున్న దీక్షల వెనక వున్న తమ ఆలోచనను పదుగురితో పంచుకునేందుకు విద్యార్థి గర్జన పేరుతో సభ జరుపుకుంటామంటే అనుమతి నిరాకరించడం వారి హక్కులను కాలరాయడమే.

కావున ప్రతి ఒక్కరు వారు తలపెట్టిన ఈ సభను జరుపుకునేందుకు అనుమతి కొరకు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి.

తక్షనమే అరెస్టు చేసిన విద్యార్థి నాయకులను బేషరతుగా విడుదల చేయాలి.

యూనివర్శిటీలనుంచి పోలీసు, మిలటరీ బలగాలను ఉపసంహరించుకోవాలి.